Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 12


    "ముక్కు కారుతోంది నాన్నా! తుడవ్వా?"
    చక్కగా ముక్కుతుడిచి ఆచెయ్యి లుంగీకి రాసుకునేవాడు.
    ఆ కార్యక్రమం అయాక "చెప్పు. ఎక్కడున్నాం మనం?"
    మూర్తికి ఓర్పు నశించింది. తన భావాల్ని బయటకు వ్యక్తం చెయ్యలేదుగానీ చెప్పదలుచుకున్నంతా యీసారి యింకో పిల్లో పిల్లాడో వచ్చేలోపల పొడిగా గబగబ రెండు ముక్కల్లో తేల్చి చెప్పేశాడు.
    వసంత లోపల్నుంచి వచ్చి "యిహ వెడదామా?" అంది.
    మూర్తి లేచి నిల్చున్నాడు.
    చెప్పేసి బయటకు వచ్చాక చల్లగావుంది కాబట్టి యిద్దరూ నడవసాగారు.
    ఇద్దరి గుండెలూ బరువుగా వున్నాయి. ఇష్టంలేని దృశ్యాలన్ని చూసివచ్చి వాటి గురించి చర్చించుకోవటం యిష్టంలేని వారిలా మౌనంగా నడుస్తున్నారు.
    వసంతకు అతన్తో ఎంతో చెప్పాలని వుంది. ఇక్కడే కాదు, యిరుగు పొరుగులతో కూడా యీ విధమైన సున్నిత మైన సమస్యలే ఉత్పన్న మౌతూ వుంటాయి.
    ముక్తసరిగా వుంటే గర్వమంటారు. ఈవిడకు అహం భావం-తన మొగుడేకదా పెద్దపత్రిక నడుపుతున్నాడని. యిన్నిసార్లు పలకరిస్తామా? మనసువిప్పి మాట్లాడదు అని.
    పోనీ చనువుగా వుంటే వేళాపాళాలేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రాకపోకలు సాగిస్తారు.
    "వంటయిందా?" "ఈపూట ఏం చేశారు?" లేకపోతే "భోజనాలింకా కాలేదేమిటి? మీ వారింకా రాలేదా?" యిలా.
    కనబడ్డ పత్రికనుగానీ, పుస్తకాల్ని గానీ బ్రతకనివ్వరు.
    అంతేకాదు. యింట్లో కనబడే చిన్నచిన్న అందమైన వస్తువులు, లేకపోతే క్యాలెండర్లు లాంటివి, లేకపోతే కీచైన్స్, అలంకారంగా పెట్టుకునే బొమ్మలు చూసి "మీ కెందుకండీ యివి? అయినా బోలెడు వస్తూంటాయి కదా. మాకిలాంటివి సేకరించటం సరదా" అని చొరవగా వాటిని తీసుకెళ్ళి పోతూంటారు.
    షాపింగ్ కు తమతోబాటు రమ్మంటారు. అక్కడ నిర్మొహమాటంగా అప్పులు పెట్టేస్తూ వుంటారు.
    ఒక మంచి చీరె కొనుక్కుంటే "యిది మీకెందుకు? డబ్బిస్తాము యిచ్చెయ్యండి"అంటారు.
    వసంతకు మనసులో యివే మెదుల్తూ చికాగ్గావుంది. ఆమెకు లక్ష్మి చాలాకాలంనుంచి తెలుసు. అయినా యిద్దరూ ఒకరికొకరు దగ్గర కాలేకపోతున్నారు. కొందరివిషయంలో అంతేనేమో సంవత్సరాలతరబడి కలుసుకుంటున్నా మసకలనేవి పోనేపోవు.
    ఇద్దరూ మెయిన్ రోడ్డులో మసీదు దగ్గరకు వచ్చేశారు.
    "వసంతా!"
    "ఊ!"
    "ఏమిటి ఆలోచిస్తున్నావు."
    "అబ్బే ఏమీ లేదండీ."
    "వసంతా! యీవేళ అప్పుడే యింటికి పోవద్దు!"
    అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "ఉడిపి హోటల్లో భోంచెయ్యాలని వుంది. పెళ్ళికాక ముందు యింటికెళ్ళటం ఎప్పుడయినా కుదరకపోతే అక్కడ తింటూండేవాడిని. అక్కడినించి సినిమాకి వెడదాం."
    "మీ యిష్టం."
    భోజనం చేస్తూండగా మూర్తి అన్నాడు. "వెనకటికి కనకరాజుగారని ఒకాయన వుండేవారు ఆయన పెళ్ళాంతో దెబ్బలాడినప్పుడల్లా యిక్కడికి భోజనానికి వచ్చేస్తూ వుండేవాడు. ఆయనకు యిక్కడి భోజనమంటే చాలా యిష్టమట 'మా ఆవిడ రోజూ దెబ్బలాడితే బాగుండు. ఇక్కడికి వొచ్చే యచ్చు' అనేవాడు.
    అతని కాంప్లిమెంట్ నిజమేనని వసంత ఒప్పుకుంది. తర్వాత యిద్దరూ సినిమాకెళ్ళారు.
    
                                  * * *
    
    ఓరోజు రాఘవ చెమటలు గ్రక్కుకుంటూ మూర్తి ఆఫీసుకు వచ్చాడు. మనిషి వణికిపోతున్నాడు. కళ్ళు దుఃఖం తోనూ, ఆవేశంతోనూ ఎర్రబారి వున్నాయి. లోపలకు వస్తుంటే అడుగులు తడబడుతున్నాయి.
    "మూర్తీ! నీతో అర్జంటుగా ఒక విషయం మాట్లాడాలి" గొంతుకూడా సరిగ్గా రావటంలేదు.
    "ముందు కూర్చో ఆదుర్దాపడకు. కాపీ తెప్పించమంటావా?"
    రాఘవ అస్థిమితంగా కూర్చున్నాడు. "చాలా దారుణం జరిగిపోయింది" అన్నాడు.
    మూర్తి టేబుల్ మీది సిగరెట్ ప్యాకెట్ తీసి, సిగరెట్ వెలిగించుకున్నాడు.
    "చెప్పు."
    "మా పెద్దవాడు చెడిపోయాడు."
    రాఘవ పెద్దకొడుకు  రామానికి పదిహేనేళ్ళుంటాయి. నైన్త్ మొన్ననే తప్పాడు.
    "ఏం జరిగింది?" అన్నాడు అతను సిగరెట్ పొగవొదుల్తూ.
    "వాడు సిగరెట్లు తాగుతున్నాడు."
    "యింక?"
    "అంతే వాడు సిగరెట్లు తాగుతున్నాడు. విన్నావా? వాడు సిగరెట్లు కాలుస్తున్నాడయ్యా. అది చాలదా?"
    మూర్తి మెదలకుండా కూర్చుని తాపీగా సిగరెట్ కాలుస్తున్నాడు.
    "మాట్లాడవేం?"
    "ఏం మాట్లాడనా అని ఆలోచిస్తున్నాను."
    "అంటే? వాడు చెడిపోయాడంటే చీమకుట్టినట్లుగా లేదా? వాడ్ని చెక్ చెయ్యాల్సిన బాధ్యత మనకులేదా?
    "......నా పాతరోజులు గుర్తుచేసుకుంటున్నాను.
    "ఏమిటి నువ్వనేది?"
    "నా పన్నెండో ఏట నేను మొట్టమొదటి సిగరెట్టు త్రాగాను. కొంతమంది స్నేహితులు సామర్లకోటకు తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా తాగించారు. నాలోకూడా ప్రలోభం వుండబట్టే నేను తాగివుంటాననుకో-ఆ తర్వాత అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తూనే వచ్చాను. కొన్నాళ్ళకు మా నాన్నకు తెలిసి చచ్చేటట్లు బాదాడు. అయినా నాతో ఆ అలవాటు మాన్పించలేకపోయాడు."
    రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. "అందుకని....?
    "సృష్టిలో మనకిష్టంలేనివీ, బాధ కలిగించేవీ, మనసుకు గ్రుచ్చుథూ వుండేవీ అనేకం జరుగుతూ వుంటాయి! వాటిని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవటం కన్నా కాలమాన పరిస్థితులకు కొన్ని కొన్ని సహజంగా భావించి తేలిగ్గా తీసుకోవటం మంచిదికదా."
    "నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావ్?"
    "స్నేహితుడిగా ముందు హితబోధచేస్తాను. వినకపోతే ఆ సమస్యతో నా జీవితాన్ని ముడిపెట్టుకు కూర్చోను చూసీ చూడనట్లు ఊరుకుంటాను."
    "వాళ్ళలా మనకళ్ళముందు చెడిపోతూవుంటే చూస్తూ వూరుకోమంటావా?"

 Previous Page Next Page