Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 11

                                                            7
    
    ఆ రోజు సంక్రాంతి పండుగ. తలంటుకుని, విరబోసుకున్న జుట్టుతో, నుదుట కుంకుమాతో, అత్తగారి పూజ సామాను శుభ్రం చేస్తోంది విమల. పూజా మందిరం గడప దగ్గిర నిలబడ్డాడు శర్మ.    
    గుమ్మానికి ఆనుకుని వంగి నిలబడి, "ఆ దేవున్ని ఎంత వేడుకున్న ఏం లాభంలేదు. వరాలిచ్చేది ఈ దేవుడే" అన్నాడు.    
    విమల తెల్ట్టి చూసింది ఆ ప్రభాత సమయంలో అతడెంతో స్వచ్చంగా ఉన్నాడు. ఠీవి, ఔదార్యం, గాంభీర్యం అన్నీ కలగలసిపోయిన గమ్మత్తు ఆకర్షణ ఆ కళ్ళలో!    
    అతని మాటలు నిజమని విమల మనసు వెంటనే ఒప్పుకొంది. కానీ అల్లరిగా నవ్వుతూ, ఈ దేవుడు ఏం వరలిస్తారేమిటి?" అంది.    
    "చూపిస్తానురా!" అని విమల చెయ్యి పట్టుకు లాగాడు.    
    విమల__"అయ్యో! అయ్యో?" అని వదిలించుకోబోతున్నా వదలకుండా ఆమెను తనగదిలో బట్టల బీరువా ముందు నిలబెట్టాడు బీరువాలోంచి ఒక చీరాల కత్తా తీసి ఆమె ముందు పడేసి, "ఏ చీర కావాలో ఎంచుకో!" అన్నాడు.    
    విమల ఆశ్చర్యంతో చూసింది. ఆ చీరలన్నీ తనుపనిచేసే షాపులో కొన్నవే. తను సెలక్ట్ చేసి ఇచ్చినవే! అయితే అతడు వారం వారం పని కట్టుకొని కొన్న చీరలన్నీ__    
    శర్మ నవ్వుతూ, "అర్ధమయిందా ఎందుకు కొన్నానో! ఏదికావాలో ఎంచుకో!" అన్నాడు.    
    విమల కళ్ళు చెమ్మగిల్లాయి ఆ చీరలు జాగ్రత్తగా తీసి మళ్ళీ బీరువాలో పెట్టింది.    
    "ఓహ్! నేనీ చీరలు కట్టుకోను మన ప్రణయానికి గుర్తుగా అపురూపంగా దాచుకొంటాను."    
    విమల మనసులో తనకున్న స్థానానికి శర్మకు ఆనందాశ్చర్యాలు కలిగాయి! "యూ సిల్లీ" అంటూ ఆమెను తన దగ్గరికి లక్కున్నాడు. "విమలా!" అంటూ అక్కడికి వచ్చిన ఈశ్వరి అదిచూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.    
    పండుగ సంబరమంతా శకుంతలదే అన్నట్లు తిరుగుతోంది. ఆ ఇంట్లో సేతాపతి శకుంతలకు పట్టు పరికిణి కుట్టించాడు. ఈశ్వరి బంగారు జడగంటలు చేయించింది.    
    "బామ్మా!" అంటూ ఈశ్వరి వెనకే వెండి పట్టాల మువ్వలు ఘల్లు ఘల్లుమనిపిస్తూ తిరుగుతోంది ఆ చిన్నారి శకుంతలకు ఈశ్వరి రోజుకు రెండుసార్లు దిష్టి తీస్తూంది.    
    పోస్ట్ మేన్ కేకవిని శర్మ వెళ్ళి ఉత్తరాలు అందుకున్నాడు. అందులో ఒక ఉత్తరం అనసూయ పేరుమీద ఉంది పాత అడ్రస్ కొట్టేసి ఈ అడ్రస్ కి రీడైరక్ట్ చేశారు. ఆ ఉత్తరం విమలకిచ్చాడు. ఉత్తరం పైన చిరునామా చూడగానే విమల కళ్ళు నిండుకున్నాయి.    
    శర్మ ఓదార్పుగా భుజం తట్టి, "ఉత్తరం విప్పి చదివి చూడు" అన్నాడు విమల ఉత్తరం తెరిచింది.    
    "చి||సౌ|| అనసూయమ్మకు!    
    రాణి రాజవల్లి ఆశీర్వదించి వ్రాయు విషయములు. మేము లోగడ మీకు రెండు ఉత్తరములు వ్రాయించినాము. మీ దగ్గిర నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. మాకు చాలా వ్యధగా ఉన్నది. అబ్బాయి మరణించినాడని తెలియపరచిన దగ్గిర నుంచీ మా ఆరోగ్యము పాడగుచున్నది. మీరు మా మనవరాలిని తీసుకొని తక్షణమే రావలసింది. ఎన్ని రోజులు బ్రతుకుదునో, ఆ స్వామి పిలుపు ఏనాడు వచ్చునో! తెలియలేకుండా ఉంటిని. ప్రాణములు పోవులోగా ఒకసారి మా మనవరాలిని చూడవలయునని ఉన్నది. ఈ ఉత్తరము అందిన వెంటనే మీరు అమ్మాయిని తీసుకుని రావలసినది. ఈ వృద్దురాలిని హింస పెట్టవద్దు. విషయములు తెలియపరచవలెను.
    
                                                                                                   ఆశీర్వచనము
                                                                                                         ఇట్లు,
                                                                                                 రాణీ రాజవల్లి వ్రాలు__"
    
    ఉత్తరం చదివి విమల తెల్లబోయి చూసింది. ఆమెకు ఈ రాజవల్లి ఎవరో తెలియదు. ఉత్తరాన్నిబట్టి తన నాయనమ్మ అని ఊహించుకొగలిగింది కాని, ఆవిడ తన తల్లికి ఉత్తరాలు వ్రాస్తున్నట్లు తెలియదు.    
    విమల బిత్తర చూపులు చూసి, ఆమె చేతిలోంచి ఉత్తరం అందుకొని చదివాడు శర్మ. అతనికి విషయం అర్ధమయింది.
    
    ఉత్తరం మళ్ళీ విమల చేతికి ఇచ్చాడు. మరోసారి చదువుకుంది. ఆమె చూపులు 'రాణి రాజవల్లి" అనే అక్షరాల మీద నిలిచిపోయాయి. ఉత్తరమంతా ఆ రాణీత్వం కనబడుతూనే ఉంది.    
    ఆ రాణీత్వంతోపాటు తనకు వచ్చీరాని వయసులో తండ్రి అనారోగ్యంతో మంచాన పడటం అటు తండ్రికి మందులు కొనటానికీ, ఇటు ఇల్లు గడపదానికీ తల్లిపడ్డ అవస్థలు, తండ్రి మరణం, ఆ తర్వాత తనను పెంచి పెద్దచెయ్యడానికి తల్లిపడ్డ అవస్థలు, చివరకు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూనే ప్రాణాలు వదిలిన తల్లి అచేతన శరీరం..... అన్నీ కళ్ళముందు కదిలాయి. చేతిలో ఉత్తరం కసిగా సలపసాగింది.    
    "ఏమిటాపని?" అని ఉత్తరం లాక్కున్నాడు శర్మ. ఆ రోజంతా విమల మనసు చికాగ్గానే ఉంది. ఆ రాత్రి శ్రీధర్ హృదయంమీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాత్రమే స్థిమితపడగలిగింది. శర్మ అనునయపూర్వకంగా "విమలా! ఒక్క విషయం అర్ధం చేసుకుంటావా?" అన్నాడు.     
    "ఏమిటది?"    
    "ఆ ఉత్తరంలో మీ నాయనమ్మగారు వృద్దాప్యంలో అనుభవిస్తున్న క్షోభ తెలుస్తోంది కదూ?"    
    విమల దిగ్గున లేచి కూచుంది. ఆమె ముఖం రోషంతో ఎర్రబడింది.    
    "క్షోభ! అడవికా క్షోభ? ఆవిడకేం, రాణీగారు__హాయిగాసకల భోగాలూ అనుభవిస్తోంది. క్షోభలన్నీ అనుభవించింది, మా అమ్మా, నేనూ!"    
    విమల ముఖాన్ని తన చేతులలోకి తీసుకుని ఆ చెక్కిళ్ళు ఆప్యాయంగా నిమిరాడు. విమల చాలావరకూ శాంతించింది.    
    "విమలా; నీకు ఇదివరలో చాలాసార్లు చెప్పాను - పెద్దవాళ్ళను మనం సానుభూతితో అర్ధం చేసుకోవాలని. సంఘం ఒక్కసారిగా అమాంతంగా మారిపోదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన సాంప్రదాయాలను మనుష్యులు అంత తేలిగ్గా వదిలించుకోలేరు. అసలు వదిలించుకోవాలని కూడా అనుకోరు. మనలో చాలా మంది యాంత్రికంగా సంఘంతోపాటు కొట్టుకుపోతూ సంఘం ఏది గొప్పగా భావిస్తే అదే గొప్ప అనుకొంటారు. అందుకేమన పైతరం వాళ్ళకు సంప్రదాయాలు పాటించటం.... కాదు.....పాటిస్తున్నామని చెప్పుకోవటం ఎంతో గొప్ప ఇప్పటికీ మనుష్యులంతా తమ సొంత వ్యక్తిత్వంతో తమకేది మంచిదో గుర్తించలేకుండా ఉన్నారే! పై తరం వాళ్ళను తప్పుపట్టవచ్చా చెప్పు?"

 Previous Page Next Page