Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 12

    విమల కొంత మెత్తబడింది. శర్మ మళ్ళీ అన్నాడు. "మమతాను రాగాలు మనుసుల కందరికీ ఒకటే! పాపం, ఆ వృద్దురాలు ఏ నిస్సహాయ పరిస్థితిలో ఒక్కగా నొక్క కొడుకుని దూరం చేసుకోవలసి వచ్చిందో! ఇప్పుడు కనీసం కోడలినీ, మనవరాలినీ చూడాలని ఎంతగా కలవరిస్తుందో ఆలోచించు!"    
    విమల ఆశ్చర్యంగా చూసింది. ఎంత విశాలంగా ఆలోచించగలడు తన శర్మ! ఏ నిస్సహాయ పరిస్థితిలో ఉందో; అవును! ఆ విషయం అప్పటివరకూ తన మనసులోకే రాలేదు. నిజమే! ఆ ఉత్తరమంతా రాణీత్వం కనపడుతోంది. కానీ, దాని వెనుక తన వారిని చూడాలనుకొనే ఒక వృద్దురాలి ఆర్తికూడా ఉంది.    
    విమల ముఖం పరిశీలనగా చూస్తోన్న శర్మ ఆమెను తన హృదయానికి హత్తుకొని, "పాపం! ఒకసారి వెళ్లి చూసిరా!" అన్నాడు.    
    "మీరూ రండి" అంది విమల.    
    "అలాగే!" నవ్వాడు శర్మ__"తను ఆ వృద్దురాలికి ఏ రకపు బంధువా!" అని ఆలోచిస్తూ.
    
                                                          8
    
    విమలా శర్మలతో శకుంతల కూడా బయలుదేరుతోంటే పసిపిల్లలా అల్లాడి పోయింది ఈశ్వరి.    
    "పోనీ దాన్ని ఉంచెయ్యండర్రా! అది కూడా మీతో రాకపోతేనేం? అంది.    
    ఈశ్వరి ఇంతగా మమకారం చూపినప్పుడల్లా విమల ఏదో అపరాధ భావనతో తల దించేసుకుంటుంది.    
    "పోనీ ఉంచేద్దామా?" గొణిగింది.    
    శర్మ అది వినిపించుకోలేదు. "రెండు మూడు రోజుల్లో వచ్చేస్తామమ్మా!" అని సామాను ఆటోలో పెట్టేసాడు.    
    శకుంతల చెయ్యి ఊపుతూ నాయనమ్మకి 'టా-టా' చెప్పింది. ఆటో కనుమరుగయ్యేవరకూ ఈశ్వరి అక్కడే బొమ్మలా నిలబడిపోయి సీతాపతి హెచ్చరికతో లోపలికి కదిలింది.    
    ట్రైన్ లో కూర్చున్నాక, "మనం అక్కడికి చీటికీ, మాటికీ వెళ్ళబోవటం లేదు. ఒకసారి ఆవిడ మునిమనవరాలీని కూడా చూసుకోనీ!" అన్నాడు శర్మ.    
    రాజవల్లి నగరం ఒక రకంగా విమల తాతగారు గౌరీనాధ శ్రేష్టి నిర్మించినదే అనుకోవచ్చు, ఆ ప్రాంతాలకు వాళ్ళ పూర్వీకులలో ఎవరో వ్యాపారానికి వచ్చి చేరారట! క్రమంగా ఆ సంపద వామనమూర్తిలా పెరిగి, గౌరీనాధ శ్రేష్టి చేతుల్లో విరాట్ స్వరూపాన్ని ధరించింది.         
    ఆ చుట్టు ప్రక్కల అదొక్కటే టౌన్. మిగిలినవన్నీ చిన్న చిన్న పల్లెలు, అడవులమధ్య ఉండే గ్రామాలు ఒక గ్రామానికీ మరో గ్రామానికీ మధ్య అడవిలోంచే దారి.    
    ఒకప్పుడు రాజవల్లి నగరం కూడా అడవి ప్రాంతమేననీ, గౌరీ నాధశ్రేష్టి ఫ్యాక్టరీలు ప్రారంభించాక అది టౌన్ గా పెరిగిందనీ చెప్పు కుంటారు గౌరీనాధ శ్రేష్టి పేరిట ఆ టౌన్ లో ఒక ఎరువుల ఫ్యాక్టరీ మరొక స్టీలు ఫ్యాక్టరీ వున్నాయి.    
    స్టీల్ ఫ్యాక్టరీ ముందు నిలువెత్తు మనిషి విగ్రహం ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యంవారిచేత, రోజూ ఆ విగ్రహానికి పూజలు జరుగుతాయి. ఆ విగ్రహం క్రింద 'శ్రీ ఆదిశేషయ్య' అని వ్రాసిఉంటుంది. ఆ ఆదిశేషయ్య ఎవరో, అతని విగ్రహం ఫ్యాక్టరీముందు ఎందుకుందో పూజలు ఎందుకు జరుగుతున్నాయో - ఎవరికీ తెలియదు. కొందఱు పెద్ద వాళ్ళు మాత్రం ఆ విషయం కథగా చెప్పుకొంటారు.    
    గౌరీనాథ శ్రేష్టి ఫ్యాక్టరీ కట్టించిన ఆ స్థలం ఆదిశేషయ్యధి. ఆదిశేషయ్య ఆ కొండ ప్రాంతాల్లో నివసించే మామూలు రైతు. అక్కడి రైతులందరిలాగే చదువుసంధ్యలు లేనివాడు. నీటివసతిలేని ఆ కొండప్రాంతంలో అతడు ఏవో మెట్టపంటలు పండించుకొనేవాడు. గౌరీనాధశ్రేష్టి ఆ స్థలాన్ని తనకు అమ్మమని అడిగాడు ఆదిశేషయ్యను. ఆదిశేషయ్య అమ్మనని అన్నాడు. రైతులకూ, పొలాలకూ ఏదో ఆత్మీయబంధం ఉంటుంది అక్కడ.    
    ఆ తరువాత కొద్దిరోజుల్లోనే ఆదిశేషయ్య తనకు బాకీ ఉన్నట్లు ఒక నోటీస్ పుట్టించి తన గూండా అనుచరులతో ఆ స్థలాన్ని బలవంతంగా ఆక్రమించాడు. అది అన్యాయమని ఆక్రోసించాడు ఆదిశేషయ్య. కోర్టుకి వెళ్లమని సలహా ఇచ్చారు కొందరు. కానీ ఆ ప్రాంతాల్లో అందరికీ కోర్టులంటే భయం. పోలీసులంటే భయం, ఈ రెంటి నుండి వాళ్ళు ఎప్పుడూ దూరంగా ఉండాలనే చూస్తారు.    
    ఆ భయం నిరాధారంగా వచ్చినది కాదు. కోర్టులకెక్కిన ఒకరిద్దరు పోయిన ఆస్తి సంపాదించుకోలేకపోగా అప్పులపాలయి, అప్పుపెట్టిన ఖామందులకు బానిసలుగా మారిపోయారు, పోలీసుల చేతుల్లో చిక్కుకొన్న మరికొంతమంది ఏమయ్యారో ఎవరికీ ఈనాటివరకూ తెలియదు. వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.    
    అందుకే ఆదిశేషయ్య కోర్టు అంటే ఇష్టపడలేదు. కానీ ఆ అన్యాయాన్ని సహించి ఊరుకోలేక పోయాడు, కొడుకుల్తో అల్లుళ్ళతొ కర్రలు తీసుకొని గౌరీనాధ శ్రేష్టి ఇంటిమీదకి వచ్చాడు. ఆప్పటికే శ్రేష్టిధి పెంకుటిల్లే! ఇలాంటి  ఆపద ఊహించిన శ్రేష్టి తన యింట్లో ముందుగానే పోలీసులను కాపలా ఉంచుకొన్నాడు.    
    ఆదిశేషయ్య బలగం కర్రలతో మీదపడగానే, పోలీసులు తుపాకులు కాల్చారు. ఆదిశేషయ్య తల్లోంచి, గుండెల్లోంచి, తొడల్లోంచి గుళ్ళు దూసుకుపోయాయి. రక్తం ముద్దగా నేలకు ఒరిగిపోయాడు. కొడుకులు హాహాకారాలు చేసారు. పోలీసులు తుపాకులు చేతుల్లో పెట్టుకొని బెదిరిస్తున్నట్లుగా నిలబడి తాత్కాలికంగా కాల్పులు ఆపారు.    
    కొడుకులూ, అల్లుళ్ళూ - ఆదిశేషయ్య శవాన్ని ఇంటికి మోసుకు పోరారు. ఆ తరువాత వాళ్ళంతా ఏనాటికయినా శ్రేష్టి రక్తం కళ్ళ చూస్తామని శపధాలు చేశారు.    
    ఆ మరునాడు రాత్రికే ఆదిశేషయ్య జమ్ము ఇల్లు అంటుకొంది. ఇంట్లోంచి ఏ ఒక్కరూ బయటికి రాలేకపోయారు. కూతుళ్ళతొ, కోడళ్ళతో, కొడుకులతో, అల్లుళ్ళతో, మనవలతో - ఆదిశేషయ్య కుటుంబం సజీవంగా దహనమైపోయింది. శ్రేష్టి మనుషులు కాగడాలతో అటువైపుగా రాగా చూసిన వాళ్ళున్నారు. కానీ, వాళ్ళు తమలో తాము గుసగుసలాడుకొనేవాళ్ళే తప్ప ధైర్యంగా బయటపడి చెప్పేవాళ్ళు కారు.

 Previous Page Next Page