నగర పొలిమేరల్లో వున్న ఓ అనాథాశ్రమపు గదిలో పడుకుని అటూ యిటూ పొర్లుతున్నాడు.
మనో ఆకాశంపై కదలాడుతున్న జ్ఞాపకాల మేఘాలు.....అబద్దాన్ని ఆశ్రయించిన సుఖాలవంటి ఆలోచనలు వూపిరాడక గిజగిజలాడుతున్న నిశ్శబ్దం నీరసం....సరుగుడు చెట్ల నీడలలో ఉల్లాసంగా తిరిగే వయసు మిగిల్చిన చేదు వాస్తవాలు అతడ్ని అనూహ్యమైన అసహనానికి గురిచేస్తుంటే పైకి లేచాడు.
పక్కన ఆదమరిచి నిద్రపోతున్నాడు సూరి. విస్సుకి స్నేహితుడు. ఆ రోజు కృషి వేలెట్ ని కాజేసిన వ్యక్తి.
సూరిని క్షణం పాటు తదేకంగా చూసి గదిదాటి బయటకి వచ్చాడు విస్సు.
శాటిన్ తెరలా కప్పిన చీకటి - సమాధిలో ముందొక పర్ణశాల లాంటి కుటీరం, దానికి ఆనుకుని వున్న అనాథ బాల శరణాలయం, దాని ప్రక్కన స్త్రీ సేవాసదన్.....ప్రపంచం నుంచి విడదీస్తున్న ఫెన్సింగ్ కి ఆవల దట్టంగా ఆవరించిన చెట్లు.
పిచ్చిగా తిరిగాడు తెల్లవారేదాకా.
ఎక్కడో మొదలైన జీవితం హఠాత్తుగా ఇక్కడ ముగిసి మరో ఆరంభానికో గుర్తుగా మారిపోయింది.
మధ్యలో ఆగిన చదువు సగంలో విరిగి స్వప్నమై ఇక్కడి అనాథలకి ఆసరా కమ్మని శాసిస్తే యిదే జీవితం అంటూ యిలా రాజీపడిపోతున్న విస్సూకి ఆ క్షణాన ఏం గుర్తుకొచ్చిందో స్త్రీ సేవాసదన్ దాకా నడిచాడు.
ముందు ఓ గది ఆ గది కిటికీ దగ్గరే నిలబడ్డ ఓ మధ్య వయస్కురాలు అతడ్ని గమనించలేదు. గమనించినా అతడెవరన్నదీ గుర్తుపట్టనట్టు బయటికి చూస్తోంది ఎవరి ఆగమనం కోసమో నిరీక్షిస్తున్నట్టు.
"అమ్మా" పిలిచాడు ఆర్తిగా.
జవాబు లేదు.
తన పిలుపుకి ఆమె స్పందించింది ఎన్ని నెలల క్రితమో అతడికి గుర్తులేదు. మరిన్ని యుగాల తర్వాత తనను గుర్తుపట్టి పరవశంగా దగ్గరకు తీసుకుంటుందో అంతకన్నా అర్ధం కాదు.
ఏ శూన్యం ఆమె మస్తిష్కపు పొరల్ని కప్పి ఆమెను మతిభ్రమించిన స్త్రీగా మార్చిందో గాని ఆమెను మళ్ళీ వాస్తవానికి రప్పించగలనన్న నమ్మకం లేదు.
అలాగే నిలబడ్డాడు ఓ తపస్సులోలా చలనం లేనట్టుగా.
ఎంతసేపు అలాగే వుండిపోయాడో అతడికి గుర్తులేదు.
భుజంపై చేయిపడటంతో తేరుకుని వెనక్కి చూశాడు.
తెల్లారిన సూచనగా దూరంగా చెట్లపై పక్షులు కిలకిలా రావాలు సమీపాన ఉదయ భానుడిలా అనిపించే బాబా చైతన్యానంద.
ఆజాను బాహుడైన చైతన్యానంద ఎక్కడివాడో తెలీదు. కాని అక్కడ ప్రతి అనాథకీ తండ్రి..... వయస్సు ఏభై దాటిందో లేదో కాని నూరేళ్ళ వృద్దుడిలా అనిపిస్తాడు. శరణాలయాన్ని నడుపుతున్నది అతడే అయినా అందరితో ఒకడిలా వుంటాడే తప్ప అందరికీ తను అధిపతినన్న ఆలోచన లేనివాడు.
శూన్యంలా నవ్వగలడు. అనంతలా అనిపిస్తాడు. నీరవంలా వుంటాడు. మనుషుల సమస్యల్ని గట్టెక్కించే తీరంగా దర్శనమిస్తాడు.
మొహంపై ముడతలు ఏ గతానికి చిహ్నాలో తెలీదు కాని ఆ ముడతల్ని కప్పిన గెడ్డం జీవిత సారానికి వచ్చిన వయసులా అనిపిస్తుంటే అందర్నీ అక్కున చేర్చుకుంటాడు. మక్కువతో మాటలాడి ఓదార్చగలడు.
"తెల్లవారింది వెలుగు రేకలు విచ్చుకుంటున్నాయి" మృదువుగా పలికాడాయన. "ఇంకా చీకటిలో వున్నట్టు ఆ నిర్వేదం ఏమిటి..."
నర్మగర్భంగా ఏ జీవిత సత్యాన్నో చెబుతున్నట్టుగా అన్నారు "పసిపిల్లల చేత ప్రార్ధనా గీతం పాడించాలి విస్సూ.... వెళ్ళిరా..."
తలవంచుకున్నాడు విస్సూ.
"రాత్రి నిద్రపోలేదు కదూ" పరామర్శగా అడిగాడాయన.
"చాలా రాత్రులుగా నిద్రపోవటం లేదు బాబా" విస్సు గొంతులో నిట్టూర్పు.
"అంటే ఇంకా గతంలోనే బ్రతుకుతున్నావన్న మాట" జవాబు చెప్పలేదు విస్సు.
"జీవితమంటే గతం కాదు. వర్తమానం."
"రాజీపడలేక పోతున్నాను."
"అంటే ప్రకృతికి భిన్నంగా ఆలోచిస్తున్నావన్నమాట" ఆప్యాయతగా విస్సు తల నిమిరాడు చైతన్యానంద. "మనిషి జీవితానికి అర్ధం గతమే అయితే నువ్వింకా అమ్మ పొత్తిళ్ళలో పసికందుగానే వుండిపోవాలి విశ్సూ. నడక నేర్చావు, నువ్వు నేర్చావు....ఇంత వాడివయ్యావు...మరి ఇంకా గతంలోనే బ్రతుకుతానంటే ఎలా.....బ్రతకాల్సింది వయసు మనసు పెరగని పసిబిడ్డలా కాదు. అహంకార అభిమాన రహితుడైన పసికందు ఆలోచనలతో..."
"బాబా..." ఉద్విగ్నంగా తలపైకెత్తాడు "మీ ఆధ్యాత్మిక చింతనల గురించి మీ కార్యాచరణ చర్చల గురించి నాకు అవగాహన లేదు. మీ దృష్టాంతాల లోతుల గురించి గాని వేదోపనిషత్తుల వితరణ గురించి తెలుసుకోగలిగే శక్తి నాకు లేదు. నాకు తెలిసింది ఒక్కటే...నాకు జన్మ నిచ్చే నేలరాలిన నా తండ్రి పిచ్చిదైన నా తల్లి పగిలిన నా స్వప్నాలు మిగిలిన శకలం లాంటి గతం....అంతే..."
స్వప్నంలో నిలబడి స్వప్నాన్ని ప్రశ్నిస్తున్న విస్సు ఆవేశాన్ని ప్రేక్షకుడిలా గమనిస్తూ వుండిపోయాడు చైతన్యానంద...
కాలం చెప్పాల్సిన జవాబులకి తను కర్త కాలేడు అనుకున్నాడు బాలల శరణాలయంవేపు నడుస్తున్న విస్సుని చూస్తూ.
సరిగ్గా అదే సమయానికి...
రామనాథచౌదరి తన భవంతిలో కూర్చుని ఆ రోజు దిన పత్రిక చదువుతున్నాడు.
అతడికి అభిముఖంగా వున్నాడు అతని కొడుకు రాజేంద్ర.
"క్విజ్ కిడ్ రాజేంద్ర పై ఛాలెంజ్...
రెండు లక్షల రూపాయల్ని వెచ్చించటానికి సిద్దపడుతూ మొన్న ఓడిన విశ్వనాథ్ మళ్ళీ విసిరిన సవాల్...
ఆదివారం సాయంకాలం ఆరు గంటలకి యూనివర్శిటీ ఆడిటోరియంలో నిర్వహించబడే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నది కృషి ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఉపాధ్యాయ..."
ఇదే వార్తని అప్పటికి చాలాసార్లు చదివాడు రామనాథ్ చౌదరి. అది కాదు చౌదరిని అంతగా కదిలించింది.
ఎక్కడో స్టేట్స్ లో చదువుకుంటూ యీ మధ్యనే ఇండియా వచ్చిన కృషి తన కొడుకుని అవమానించి తన వునికిని ప్రశ్నించింది.
తిరుగులేని తన సార్వభౌభౌమాధికారానికి ఓ ఆడపిల్ల విఘాతం కలిగిస్తానంటూంది.
పడకటింటికి పరిమితం కావాల్సిన ఓ అమ్మాయి తన కొడుకుపై కాదు తన మగతనంపై ఓ సవాల్ విసిరింది.
అధికార పార్టీకి ఆత్మీయుడిగా చాలా పరిశ్రమలకి అధిపతిగా నేర ప్రపంచాన్ని సైతం శాసించగల ప్రముఖుడిగా తనకున్న పరపతి తెలిసి వుండీ తాతయ్యకి బాసటగా నిలిచి తన ప్రత్యేకతని నిరూపించుకోవాలనుకుంటుంది.
చౌదరి ఆలోచనల్లో మునిగి వుండగానే లోపలికి దూసుకొచ్చాడు లాయరు రంగధాంతో పాటు ఎమ్మెల్యే రాజారావు...
సుమారు పాతికదాకా హత్యా నేరాల్తో సంబంధంగల రాజారావు యిప్పటికీ గూండాల నాయకుడిగానే చలామణీ అవుతున్న వాడైతే ఆ కూటమి చేసే ప్రతి హత్యాకాండకి చట్టబద్దమైన గైడెన్స్ యిచ్చే ప్రముఖ క్రిమినల్ లాయరు రంగధాం...
పేపరు చూడగానే తాను ఫోన్ చేయడంతో పది నిముషాలకల్లా అక్కడ ప్రత్యక్షమైపోయి స్నేహితుల్ని చూస్తూ అన్నాడు చౌదరి.
"ఇది నిజానికి ఓ పెద్ద సమస్యగా నేను భావించడం లేదు"
ప్రతి సమస్య గురించీ ఇలాగే చర్చించడం చౌదరికి అలవాటు. "అయితే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచన గలవాడ్ని కావడంతో మిమ్మల్ని పిలిచాను...."
చెప్పాడు క్లుప్తంగా...
అంతా నిన్న రాజారావు చాలా నీరస పడిపోయాడు హత్యలు చేయించడం గాని తను కార్మిక నాయకుడిగా వున్న ఫ్యాక్టరీ లో స్ట్రయిక్ చేయించడం గానీ అయితే ఉత్సాహంగా రియాక్టయ్యేవాడు కాని యిలాంటి పోటీల గురించి పెద్ద అవగాహన లేదు. లాయరు రంగధాం కేసి చూశాడు యీ వ్యవహారంలో తన బాధ్యతేమిటో సలహా యిమ్మన్నట్టుగా.
"అసలు ఈ సమస్య విషయంలో మీరెందుకింత ఆందోళన పడుతున్నదీ నాకు అర్ధం కావడం లేదు. ఎందుకంటే రాజేంద్రని ఐక్యూ పోటీలో ఓడించడం అంత సులభం కాదు కాబట్టి..." రంగధాం యధాలాపంగా అన్నాడు చర్చకి ఉపోద్ఘాతంలా.
"రంగధాం...నాకు గెలుపంటే చాలా యిష్టం" సాలోచనగా చూసాడు చౌదరి.
"కాబట్టే మొన్న గెలిచారుగా"
"కాని అది డబ్బుతో..." చాలా అయిష్టంగానే చెప్పాడు విస్సుని ఎలా కొనేసింది...
"ఈ సారి కూడా కొనేస్తే సరి."
"కాని అంత సులభం కాదు. ఎందుకంటే విస్సు డబ్బుకు అమ్ముడుపోయే మనిషిగా కృషి గుర్తించింది. కాబట్టి, ఏదో నమ్మకమే లేకపోతే పోటీకి అతడ్ని దింపే అవకాశం లేదు కాబట్టి"
"రాజేంద్ర గట్టిగా ప్రిపేరైతే బెటరనుకుంటాను"
"ఈ బోడి సలహాలు నాకు అక్కర్లేదు రంగధాం"
ఇంచుమించు కసురుకుంటున్నట్టుగా అన్నాడు చౌదరి "ఆ రోజు ఆ చివరి ప్రశ్నకి గాని విస్సు జవాబు చెప్పివుంటే రాజేంద్ర ఓడేవాడు.
"అసలు ఆ చివరి ప్రశ్న దాకా విస్సు తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు అంటే అర్ధం ఏమిటి....తను మేధావినని పరోక్షంగా తెలియచెప్పడమేగా. తెలియచెప్పడమే కాదు రంగధాం. విస్సు సామాన్యుడు కాడు. నిజంగా మేధావి. ఆ విషయంలో సందేహం లేదు. కాబట్టే కృషి కూడా పనిగట్టుకుని అతడ్ని రంగంలోకి దింపిందని నా అనుమానం."
ఆవేశాన్ని నిభాయించుకోలేనట్టు పచార్లు చేస్తూ అన్నాడు "ఇక్కడ నేను ఆలోచిస్తున్నది రెండు లక్షల రూపాయల గురించి కాదు...ఓటమి లేని నా ప్రతిష్ట గురించి. ఒకవేళ రాజేంద్ర ఓడితే నా ఉనిక్కి మాత్రమే కాదు రామనాథ చౌదరి కొడుగ్గా రాష్ట్రంలో ఏ ఒక్కడూ ఓడించలేని ఏకైక ఛాంపియన్ గా మూడేళ్ళనుంచి రాజేంద్రకున్న పేరు ప్రఖ్యాతులూ మంట కలిసిపోతాయి. అదొక్కటే కాదు రంగధాం....ఉపాధ్యాయ ముందు తల వంచుకోవటం ఈ చౌదరి కోరనిది, జరగకూడనిది..."
మరో గెలుపు కోసం ముఖ్యంగా ఉపాధ్యాయపై గెలుపు కోసం చౌదరి ఎంత కలవరపడుతున్నదీ అర్దమైంది రంగధాం ఏదో చెప్పబోతుండగానే అక్కడ ఫోన్ రింగయింది.
మామూలుగా అయితే చౌదరి ఆ క్షణంలో ఫోన్ గురించి పట్టుంచుకునేవాడు కాదు కాని రింగవుతున్నది తన పర్సనల్ ఫోన్ చాలా కొద్ది మంది మాత్రమే మాట్లాడే కాన్ఫిడెన్షియల్ నెంబరది.