Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 11

 

    ఎక్కడి కెళ్ళి వుంటారు?
    బాత్రూమ్ కా? గది తలుపు ఎందుకు మూసివున్నట్లు? ఎప్పుడూ తెరిచే వుంటుంది కదా! ఎందుకు మనసంతా ఆందోళనతో నిండిపోయింది. లేచి గది తలుపు తెరిచింది.
    హల్లో ఉయ్యాల మీద కూర్చుని వున్నాడు రామచంద్రమూర్తి. ఎదురుగ్గా గ్రామ ఫోన్ పక్కన నిలబడి రికార్డ్ డాన్స్ చేస్తున్నాడు నటరాజ్. గ్రామ ఫోన్ లో నుంచి సినిమా పాట వినబడుతోంది.
    ఆమెను చూసి ఇద్దరూ కొంచెం కంగారు పడ్డారు. నటరాజ్ స్టెప్పులు తడబడ్డాయి.
    "ఏమిటి లేచావ్? సౌండ్ నీకు వినపడకుండా గది తలుపులు వేసేశాము కదా!"
    డేఫిన్సివ్ గా అన్నాడు రామచంద్రమూర్తి.
    "అర్ధరాత్రిళ్ళు ఏమిటిదంతా?" భయం నుంచి కోలుకుంటూ అడిగింది.
    "మరేం లేదు! రేపు పండక్కి నటరాజ్ దేవుడి పందిట్లో డాన్స్ చేయాలని భక్త సమాజంవాళ్ళు అడిగారట. ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నన్ను జడ్జ్ గా వుండమంటేనూ...."
    "చేయమంటే చేసుకోనీయండి. మీరెందుకలా మేలుకుని కూర్చోవటం? మీ ఆరోగ్యం ఏమవుతుంది?"
    "ఇంకా రఫ్ గా తయారవుతుంది" నవ్వుతూ అన్నాడు. "దాంతో జబ్బులు చస్తే మనజోలికి రాలేవు."
    సీత నటరాజ్ వేపు కోపంగా చూసింది.
    "నటరాజ్! ఇంక ఆ గంతులు ఆపేయ్. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనీ......"
    'అమ్మగారూ! కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. నేను బై బర్త్ వంటవాడిని కాదు. గ్రహచారం బావుండక ఈ బ్రతుకు అఘోరిస్తున్నాను చిన్నప్పుడు అమ్మానాన్న చెప్పిన మాటలు వినకుండా అడ్డమయిన సినిమాలు చూసి సినిమాల్లో వేషాలేయాలని ఆ డాన్స్ లన్నీ నేర్చుకుని చదువు గాలికొదిలేయ బట్టి నా ఖర్మ ఇలా కాలింది. లేకపోతే నాకూ గవర్నమెంట్ వుద్యోగం తేలిగ్గా దొరికి ఉండేది."
    "ఆ దొరుకుతుంది! నీలాంటోడిని తీసుకుంటే మొత్తం గవర్నమెంటు అంటా డాన్స్ చేస్తుంది. రికార్డ్ డాన్స్" అని రామచంద్రమూర్తి వేపు చూసింది. "మీరు పదండి ఇంక"
    రామచంద్రమూర్తి లేచి గ్రామ ఫోన్ ఆపేసి ఆమె వెనుకే గదిలోకి నడిచాడు.
    "నటరాజ్ మిగతా పాటలు రేపు చూస్తాన్లె! నువ్ కూడా పడుకో" అన్నాడతను. నటరాజ్ కూడా లైటార్పి తనగదివేపు వెళ్ళిపోయాడు.
    "ఏమిటి? ఎప్పుడూ లేంది నీకింత రాత్రివేళ మెలకువ వచ్చింది?" సీత నడిగాడు రామచంద్రమూర్తి.
    "పీడకల వచ్చింది! భయపడి మీకోసం చూస్తే మీరులేరు."
    "ఏమిటది?"
    "నువ్ భయపడుతుండగా చూడటం!' సీత అతని చెవి పట్టుకుంది.
    "నన్నాటలు పట్టిస్తున్నారా? నేనే రాక్షసినా భయం అనేది లేకుండా వుండటానికి?"
    "రాక్షసివి కాదు గానీ ఓ చిన్న దేవతవి" ఆమెను దగ్గరకు తీసుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడతను. ఆమె నవ్వేసింది.
    "అది సరే నా దగ్గర అబద్దాలు చెప్పటం ఎప్పుడు నేర్చుకున్నారు!"
    "నీతో పెళ్ళవగానే! అంతకుముందు అబద్డమంటే తెలీదు."
    "వుండండి! అంతా హాస్యమే మీకు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నారు కదూ?"
    "ఒకే ఒక్క విషయం దాస్తున్నాను ప్రామిస్"
    "ఏమిటది?"
    "నా కింతకు ముందే ఇంకో పెళ్లి అయింది. అయిదుగురు పిల్లలు. వాళ్ళు బాంబేలో వుంటారు. అప్పుడప్పుడు నేను రెండు రోజుల పాటు టూర్ అని చెప్పి వెళ్ళేవాడిని చూడు! బాంబేలో నా భార్య బిడ్డలను చూడ్డానికే వెళ్ళేవాడిని."
    సీతకు కోపం ముంచుకొచ్చింది.\
    "మళ్ళీ పరాచికాలు."
    రామచంద్రమూర్తి ఆమెను తన వేపుకి తిప్పుకుని చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు.
    'అల్ రైట్! ఒకే ఒక్క విషయం ఈ దేవకన్యకి అబద్దం చెప్పాను. ఆఫ్ కోర్స్ దేవకన్య అంటే మరీ 'టిన్స్ లో ఉన్న దేవకన్య అని కాదు కొంచెం ఏజ్ డ్ అన్నమాట. నలబై మూడేళ్ళు. ఆ అబద్దం ఏమిటంటే మనకి అప్పులు పెరిగి పోతున్న విషయం. ఆ విషయం ఈ దేవకన్య దగ్గర దాచడానికి కారణం ఏమిటంటే మా దేవకన్యకున్న బాధలు చాలదనట్లు ఇది కూడా ఆమె కెందుకు చికాకు కలిగించాలి అని. ఇంక కోపం పోయినట్టేనా?"
    సీత మనసంతా తేలికయిపోయింది. లేచి అతని గుండె మీద తల వాల్చింది.

 Previous Page Next Page