Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 11

వర్కుషాప్ లో అలసిపోయి వచ్చి ఇంటిదగ్గర తల్లి గొడవకి తట్టుకోలేని జీవన్ భార్య మీద విసుక్కున్నాడు. ఎవర్ని ఏమనాలో తెలియక, ఏం చెయ్యాలో అర్ధంకాక ఏడుస్తున్న పసిపాపని చేతుల్లోకి తీసుకోని తనని తనే ఒదార్చుకుంది అణువేద.
గోరుచుట్టూ మీద రోకటి పోటులా ఆ యింట్లోకి సుడిగాలిలా వొచ్చిపడింది జీవన్ అక్క సులభ. వస్తూనే తల్లిని వాటేసుకుని "తమ్ముడూ నా బతుకు సర్వనాసనం చేసేశాడే అమ్మా!" అని బావురుమంది.
"ఏంటే అమ్మా! ఏం జరిగింది?" గాభరాగా అడిగింది తల్లి.
"తమ్ముడు డాన్సు లాడేదాన్ని పెళ్ళి చేసుకున్నాడట. అది వాళ్ళ వంశమర్యాదకి భంగమట మా వాళ్ళంతా నన్ను తెగ సతాయించారు. తమ్ముడూ ఆస్తులన్నీ అమ్మేశాడట. ఇంటల్లుడైన తనతో చెప్పకుండా ఆస్తులమ్మేసుకున్నందుకు మీ అల్లుడిగారికి కోపం వచ్చింది. నీ దిక్కున్న చోటికి ఫో!" అని యింట్లోంచి తరిమేశారు.
 రవిని కూడా వాళ్ళ దగ్గిరే వుంచేసుకున్నారు." తల కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సులభ. అచ్చయ్యమ్మాదేవి, "ఈ యింటికేదో శని పట్టిందే" అంది కోడల్ని గుర్రుగా చూస్తూ.
స్థాణువై నిలబడిపోయింది అణువేద.
సులభ వచ్చాక జీవితం మరి పల్లేరు మీద నడకలా తయారైంది అణువేదకి. చదువుకున్న ఆధునికత సులభలో నైలాన్ చీరల్లోను, హైహిల్స్ షూల్లోనూ, లిప్ స్టిక్ లోను కనిపిస్తున్నాయి మానసికమైన సంస్కారంలో ఆమె తల్లి కంటే ఏ మాత్రం ముందుకు పోలేదు. తల్లి నిష్కారణంగా అణువేదని దెప్పిపొడుపుగా మాటల్లాంటివి అణువేద అంతగా లక్ష్యపెట్టేది కాదు గానీ వీళ్ళ ప్రభావం కూతురు రాగమాల మీదకి కూడా ప్రసరించేసరికి భరించలేకపోయింది. తన సంసారం పాడు చేసుకుని తమ్మునింటిలో అడుగు పెట్టిన ఆడబిడ్డ మరదల్ని యెన్ని రకాలుగా ఏడిపించగలదో అనుభవించే వాళ్ళకి తప్ప అర్ధం కాదు.
జీవన్, అణువేద కాస్త సరదాగా నవుతూ కబుర్లు చెప్పుకోవడం కంటబడితే చాలు ఏదో పెద్ద రోగం వచ్చినట్లు మూలుగుతూ గొడవచేసేది. ఇద్దరూ ఎక్కడికైనా బయటికి వెళ్లబోతుంటే చటుక్కున తనూ తయారై వాళ్లతో బయలుదేరేది. తల్లి కూతుళ్ళు యిద్దరూ జమిందారీ దివాణంలో వున్నట్లే వ్యవహరిస్తూ అణువేదని దాసీలాగ చేసేవారు. తను కష్టపడి సంపాదించింది తిని కూర్చుని తననే ఈసడిస్తూ దాసీలాగా మాట్లాడడం అణువేద భరించలేకపోయింది.
పాప రాగమాల కోసం ప్రత్యేకించి పెట్టిన ఆయా చేత వాళ్ళ స్వంత పనులన్నీ చేయించుకుని ఏడ్చే పసిపాపకి అడ్డమైన గడ్డి పెట్టేసేవారు. ఇంట్లో ఏముందో ఏం లేదో పట్టించుకునేవారు కాదు. పాలు పెరుగు మొదలయినవి మిగిలిన వాళ్ళకి వున్నాయా లేవా అన్న ఆలోచన లేకుండా వాడేవారు. రాత్రి ప్రొద్దుపోయి భోజనానికి వచ్చిన జీవన్ వేసుకోవడానికి పెరుగు లేకపోతే అణువేదని తిట్టేవాడు.
"మీ అమ్మ, అక్కయ్యగారు పోసేసుకున్నారు." అని అణువేద చెప్పినా, "నువ్వు నా భార్యవి. నాకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళని వీళ్ళని అంటావే?" అని ఎగిరి పడేవాడు. ఇంట్లో బోలెడు చాకిరీ, అటు డాన్సు టీచరుగా డాన్సు కాలేజిలో కూడా ఫిజికల్ గా శ్రమ, యింట్లో ఏ ఒక్కరికి జాగర్త లేకపోవడం వల్ల, యిష్టం వచ్చినట్లు దుబారా చేసేయడం వల్ల, అంచనాలకి అందకుండా పెరిగిపోతున్న ఖర్చు తట్టుకోలేకపోయేది అణువేద.
 అటు తాతల నాటి నుంచి జీవన్ కుటుంబం ఆస్తుల మీద చేసిన అప్పులు తిర్చవలసినవి ఇంకా వున్నాయి. వాటి విషయం ఎవరూ పట్టించుకోక పోగా చీటికి మాటికి , "మా ఆస్తులన్నీ కరిగించేసి అద్దె కొంపలో పదేశావు." అని ఆమెనే దెప్పి పొడుస్తారు. అలసిపోయింది అణువేద. ఖర్చులు భరించడం కోసం మరో నాలుగైదు డాన్సు ట్యుషన్లు వోప్పుకుంది. వాళ్ళంతా పెద్దింటి పిల్లలు. ఈ తల్లి కూతుళ్ళు వాళ్ళ ముందే, "తైతక్కలు నేర్చుకుని ఆడపిల్లలు పాడైపోతారని" వ్యాఖ్యానాలు చేసేవారు. ఆ పిల్లలు కోపాలు తెచ్చుకుని డాన్సులు నేర్చుకోవడం మనేసేవారు. ఈ రకంగా అణు తన పలుకుబడి నంటా ఉపయోగించి కుదుర్చుకున్న ట్యుషన్లు యెగిరిపోయేవి.
ఇన్ని భరించింది. కాని సులభ జీవన్ కి జలజతో సాన్నిహిత్యం కల్పించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం భరించలేకపోయింది. జలజ కూడా జమిందారీ వంశానికి చెందినదే జీవన్ కుటుంబానికి దూరపు బంధువు. బాబ్డ్ హెయిర్, స్లివ్ లెస్ జాకెట్టు జారిపోతున్న జార్జేట్ పైట మొదలైన షోకాల్డ్ ఫాషనబుల్ హంగులన్నీ వున్నాయి.
నలుగురు కూర్చుని వుండగా సులభ, "ఒకప్పుడు జలజనే మా తమ్ముడికి ఇస్తామన్నారు. అదే జరిగి వుంటే మా ఆస్తిపాస్తులు మాకే వుండేవి. ఇలా అద్దెకొంపలు పట్టుకుని పాకులాడవలసిన అవసరం వుండేది కాదు" అనేసింది. గతుక్కుమంది అణువేద.
ఒకసారి పెళ్ళైన తరువాత స్రీ గాని పురుషుడు గానీ మరోకరి నుద్దేశించి ఆ రకంగా మాట్లాడకూడదని కనీస సంస్కారం లేని వాళ్ళని మనస్సులో అసహ్యించుకుంది అణువేద. కనీసం జలజైనా సులభని మందలించకపోగా గర్వంగా నవ్వి, "అవునులే చాన్సు పోగొట్టుకున్నాడు బావ, మహారాజులా  వెలిగి పోవలసిన వాడు వర్క్ షాప్ నడుపుకుంటున్నాడు పాపం" అని పెదవి విరిచింది.
అక్కడే వున్న జీవన్ ఎవరిని మందలించకపోగా అదేదో జోక్ అయినట్లు, "ఏం చేస్తాం నా ఖర్మ" అని నుదురు కొట్టుకున్నాడు. మంటలో ఆజ్యం పోసినట్లయింది.
అణువేద ఆ ఇంటి యజమానురాలని, ఇంటి ఖర్చు అంతా ప్రధానంగా ఆమె సంపాదన మీదే నడుస్తోందని యింట్లో ఎవరూ గమనించినట్లుగా ప్రవర్తిస్తున్నారు అందరి కందరు. అణువేదకి పూచికపుల్లంత గౌరవం లేదు. ఆమె చేసే పనిపాటలకి మెప్పులేకపోగా "ఎవడి కోసం చేస్తుంది" అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అణువేద యింట్లో వుండదు. ఉద్యోగానికి వెళ్ళవలసిందే.
ఆమెని వెళ్ళనిచ్చి యింట్లో అందరూ సుఖంగా యెవరిక్కావలసినది వాళ్ళు చేసుకుంటున్నారు. జీవన్ కూడా ఇంటికొచ్చేస్తున్నాడు. మొదట్నించి వేళాకొళాలతో కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా గడపడానికి అలావాటు పడ్డ వాడతను వర్కు షాప్ లో కష్టపడి పనిచేయడం కంటే జలజతో వినోదంగా కాలక్షేపం చేయడమే బాగుందతనికి. చివరికి ఓరోజు జలజ విషయంలో జీవన్, అత్త, ఆడబిడ్డలతో పెద్ద గోడవైంది. ఆ రోజతడు జలజతో సినిమా కెళ్ళాడు. అత్త ఆడబిడ్డలు జీవన్ నే వెనకేసుకొచ్చారు.
అప్పటివరకూ అత్తా, ఆడబిడ్డల నిందల్ని, అబద్దాల ఆరోపణల్ని , ఎన్నింటినో సహించి అణువేద మనసు ఆ గొడవ జరిగిన రోజు అగ్ని పర్వతంకా కుతకుత ఉడికిపోయింది అప్పుడామే. ఎంత చిన్నమాటైనా సహించేదశలో లేదు.
తనతో సినిమాకు వచ్చినందుకు జరిగిన ఆ గొడవతో జలజ జీవన్ ని చూసి, "ఇంత రాద్ద్దాంతం జరుగుతుందని తెలిస్తే నీతో సినిమాకి రాకనే పోదును. ఇంతగా భార్య చెప్పుచేతల్లో మసిలేవాడివి నన్నెందుకు సినిమాకి రమ్మన్నావు జీవన్" అంది. తనకే ఏదో అవమానం జరిగినట్లు బాధ పడిపోతూ రెచ్చిపోయాడు జీవన్.
ఏమాత్రం వెనక్కి తగ్గే మూడ్ లో లేదు అణువేద.
నాయింట్లో చేరి ఎవరి యిష్టం వచ్చినట్లు వాళ్ళు వేషాలేస్తే నేనూరుకొను" అని అంది అణువేద.
"నీ ఇల్లు....ఇది నీ ఇల్లా?"
"అవును అది నా ఇల్లు ఈ యింటి అద్దె కడుతున్నదాన్ని నేను. ఈ యింట్లో ప్రతి చిన్న ఖర్చు భరిస్తున్న దాన్ని నేను."
"ఎంత అహంకారం! అక్కయ్య అన్నట్లు జమిందారీ వంశంలో పుట్టిన నేను మాములు డాన్సరునైన నిన్ను పెళ్ళి చేసుకోవడం పెద్ద పోరాపాటైపోయింది."

 Previous Page Next Page