స్నానం చేసేటప్పుడు తల తడిసిపోకుండా పెట్టుకున్న నైలాన్ కవర్ ని తీసేసింది సుదీర. ఒత్తుగా పొడుగ్గా వున్న జుట్టు చీకటి జలపాతంలా పిరుదుల మీదికి జారింది.
టవల్ తో తుడుచుకుంటూ నిస్సంకోచంగా తన రూమ్ లోకి వచ్చేసి, వార్డ్ రోబ్ ముందు నిలబడింది సుదీర. యధాలాపంగా టి.వి. వైపు చూసింది.
స్క్రీన్ మీద క్లోజప్ లో భరత్ ముఖం కనబడుతోంది.
"గుట్టు తెలిసిందిలే- చెట్టు చాటుందిలే!"
చటుక్కున చేతులతో గుండెని కవర్ చేసుకుంది సుదీర. ఆ హడావుడిలో టవల్ జారిపోయింది. వంగిపోయి చేతులు జాచి టవల్ అందుకుంది. ఆ కొద్ది క్షణాలు వక్షం నగ్నంగా కనబడింది. కంగారుగా టవల్ చుట్టేసుకుంది.
అప్పుడు అనిపించింది.
తను ఉత్త ఫూల్ లాగా ప్రవర్తిస్తుంది! టి.వి. స్క్రీన్ మీద అతని బొమ్మ కనబడితే , అతనే నిజంగా వచ్చి ఎదురుగుండా నిలబడినట్లు తడబడి పొయిందేమిటి తను? నాన్సెన్స్!
టి.వి. లో భరత్ మందహాసం చేస్తూ డాన్స్ చేస్తున్నాడు. అతనికి జతగా ఓ అమ్మాయి.
ఆ అమ్మాయిని పరీక్షగా చూసింది. మంచి డాన్సర్ గానీ, మనిషి తన అంత అందగత్తె కాదు.
తనంత అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఉండబోరు. తనకు జోడి అనిపించేటంత అందగాడు కూడా ఇంతవరకూ కనబడలేదు.
"నీ ఎదురుగుండా టి.వి. లో కనబడటం లెదూ? అంది మనసు.
'ఇతనా? ఈ డాన్సరా?" అనుకుంది తేలిగ్గా. తర్వాత తనకు తెలియకుండానే అతణ్ణి తదేకంగా చూడటం మొదలు పెట్టింది.
తన కోసమే అన్నట్లు అతణ్ణి రకరకాల యాంగిల్స్ లో నుంచి చూపిస్తున్నారు టి.వి. వాళ్ళు. కళ్ళార్పకుండా చూసింది సుదీర.
నిజమే! మొగాళ్ళలో ఇంత అందం ఎప్పుడూ చూడలేదు తను!
టివి లో కనబడుతున్నది బొమ్మే అని తెలిసినా భరత్ మొహం కనబడకుండా పక్కకు తిరిగి చీర కట్టుకోవడం మొదలెట్టింది.
దగ్గరలోనే పంజరం ఉంది. అందులో చిలక ఉంది.
సుదీర చిలక సంగతి గుర్తు లేదు. కానీ చిలకకి సుదీర మీది కోపం గుర్తు వుంది.
అది అదను కోసం చూసి చూసి ఆ అమ్మాయి బ్రా తొడుక్కోబోతుండగా ముక్కు బయటకి పెట్టి చటుక్కున కొరికింది.
"ఆ.....బ్బ!" అంది సుదీర ప్రాణం జిలర్చకు పోయింది తనకి. నొప్పికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అంతే.
వడగళ్ళు పడుతున్నట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా పావుగంట సేపు దాన్ని తిట్టింది సుదీర.
"అలక ఎందుకే చెలి - ఉలుకు ఎందుకే!"
అని పాడుతున్నాడు భరత్. విసురుగా టివి ఆఫ్ చేసేసింది సుదీర.
భరత్ , చిలకా, దూరదర్శన్ వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా తనమీద కుట్రపన్ని ఏడిపించడానికి తీర్మానించుకున్నట్లు అనిపించి ఒళ్ళు మండిపోయింది సుదీరకి.
చిలక హడలిపోయి, నోరు ముసుకు కూర్చుంది.
"సుదీ!" అంటూ తలుపు తట్టి లోపలికి వచ్చింది సీత.
"మోర్నింగ్ మమ్మీ! కమ్!"
"సుదీ! నీ జీన్సు గానీ, షర్టు గానీ నాకు సరిపోతాయా?"
"ఎందుకు మమ్మీ, నీకు హఠాత్తుగా మోడ్ డ్రెసెస్ మీద మోజు పుట్టిందేమిటి?"
"మోజు కాదూ, నా మొహమూ కాదు! ఒక వారం రోజులపాటు నేను పాంటు, షర్టే వేసుకోవాలిట!"
"ఎందుకు?" అంది సుదీర ఆశ్చర్యంగా.
"వ్రతం" అనబోయి సకాలంలో ఆగి, గుంభనంగా నవ్వి ఊరుకుంది సీత.
"నావి నీకెలా సరిపోతాయి మమ్మీ! వెళ్ళి కొనుక్కుందాం పద!"
"నేను వస్తే బాగుండదు. నువ్వే వెళ్ళి తీసుకు రాకుడదూ?"
"ఒకే!" అంటూ బాత్ రూంలోకి వెళ్ళి టేపు తీసుకువచ్చి, సీత నడుమూ , భుజం కొలతలు తీసుకుంది సుదీర. " డన్ మమ్మీ! ఇవాళే తెచ్చేస్తాను."
"ఈ సంగతి ఇంకెవరికి చెప్పకు. బాగుండదు!" అని వెళ్ళబోతూ ఆగింది సీత. "మధ్యాహ్నం నాన్నగారు లంచ్ కి తీసుకేళతానన్నారు. రెడిగా వుండు" అని వెళ్ళిపోయింది.
ఒకసారి తనవైపు తాను చూసుకుని కుచ్చెళ్లు సరిచేసుకుని, టివి మళ్ళీ చేసింది సుదీర.
ఇంకా భరత్ నృత్యమే వస్తోంది.
ఎంత బాగా చేస్తున్నాడు, ఎంత లయబద్దంగా పడుతున్నాయి అడుగులు. ఎంత సమ్మోహనంగా ఉన్నాయి. అతని కదలికలు!
తనకి డాన్సు గురించి అసలేమి తెలియదు. అయినా కూడా, అతని డాన్సులో ఏదో గొప్పదనం ఉందని అర్ధమయిపోతోంది.
చాలా బావుంటాడు అతను! మన్మధుడిలా అందంగా , హేర్కులెస్ లా బలంగా , బర్డ్ రేనాల్డ్స్ లా సెక్సీగా......బాధ కాని బాధతో మొదటిసారిగా మూలిగింది సుదీర మనసు.
నృత్యం పూర్తయింది. టివి ఆఫ్ చేసేసింది సుదీర. గది ప్రశాంతంగా ఉంది. మౌన వ్రతం పట్టిన దానిలా సీరియస్ గా చూస్తోంది చిలక.
దాన్ని చూస్తే జాలేసింది సుదీరకి.
"ఏయ్ చిలకా!"
చిలక పలకలేదు.
"ఎందుకా అలక?"
చిలక ఉలకలేదు.
"పెద్ద గొప్పలే! ఎక్కడ కోరికావో తెలుసా?"
"గుట్టు తెలిసిందిలే - చెట్టు చాటుందిలే" అంది చిలక పాటని ఒప్పగిస్తూ.
"నువ్వుత్త రౌడి రాస్కెల్ వి" అంది సుదీర కళ్ళు పెద్దవి చేస్తూ.
----------------
స్టార్ హొటలది. లోపలికెళ్ళగానే లాబీ ఉంది. రిసేప్షన్ కౌంటర్లో స్మార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఇద్దరు డ్యూటీ లో వున్నారు. లిప్టులో రెండో అంతస్థుకెళితే అక్కడ ఉంది ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్లు.
వాళ్ళ కోసం టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. రత్నాకరరవూ, సీతా, సుదీరా, సారధి కూర్చున్నారు.
పెళ్ళి కేడుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్లు ఇతను గూడా ఎందుకు అనుకుంది సుదీర సారధిని చూసి చిరాగ్గా. అతను పక్కన లేకపోతే రత్నాకరరావు ఎక్కడికి కదలడు. ఎ పని చేయదు.
స్టివార్డ్ వచ్చి చిరునవ్వుతో విష్ చేసి వినయంగా మెనూ కార్డులు అందించాడు. లంచ్ ఆర్డర్ చేశాడు రత్నాకరరావు. పైనాపిల్ జ్యుసులతో మొదలయింది భోజనం. తర్వాత వేడి వేడి టొమాటో సూప్ వచ్చింది. ఆ వెంటనే కాశ్మీరి ఫ్రైడ్ రైస్, తందూరి రోటి , కొద్దిగా ప్లేయిన్ రైస్ , నవరతన్ కుర్మా, సిమ్లా మిర్చి మసాలా, మసాలా పాపడ్, రైతా అనే పెరుగు పచ్చడి, చక్రాలలా తరిగిన గ్రీన్ సలాడ్, గడ్డ పెరుగూ, గులాబ్ జామున్- చివరగా ఫ్రూట్ సలాడ్.
భోజనం పూర్తి అయ్యాక పెద్ద కప్పుల్లో కాఫీ వచ్చింది.
"ఇవాళ బిల్లు సుదీరే పే చేస్తుంది" అని నవ్వుతూ బేరర్ సైగ చేశాడు రత్నాకరరావు.
వినయంగా ఒక ఫోల్డరు తెచ్చి సుదీర ముందు ఉంచాడు బేరర్.
నిస్పృహ నటిస్తూ చూసింది సుదీర. "ఓహ్ డాడ్! ఇది చాలా అన్యాయం. అసలు అకేషన్ అంటూ ఏమి లేకుండానే........." అంటూ యాదాలాపంగా పోల్డారు తెరిచి, డబ్బు కోసం హ్యాండ్ బాగ్ లో చెయ్యి పెట్టింది సుదీర.
అప్పుడు కనబడ్డాయి ఫోల్డరు లో ఉన్న డాక్యుమెంట్లు . సందేహంగా అందుకుని వాటిని చదవడం మొదలెట్టింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
ఆ హొటల్ మొత్తం సుదీర పేర కొనేసినట్లు డాక్యుమెంట్లు అవి.
అరవిచ్చుకున్న పెదవుల మధ్య చిరునవ్వు మెరుస్తుండగా "థాంక్స్ ఏ లాట్ డాడీ!" అంది సుదీర.
సంతోషంగా తల పంకించాడు రత్నాకరరావు.
సీత చెప్పడం మొదలెట్టింది. "సుదీ! తెలిసిన సంగతులే మళ్ళీ చెబుతున్నాను. టూరిజం భవిష్యత్తులో బంగారు గుడ్లు పెట్టబోయే ఇండస్ట్రి. దానితోపాటే హోటల్సు కూడా పెరిగి విపరీతంగా లాభాలు సంపాదించి పెడతాయి. సుదీ! ఈ లైనులో నీకు ఎదురు ఉండకూడదు. ఇది ,మొదలు సంవత్సరం తిరిగే సరికి నువ్వు మహారాణిలాగా ఏకచత్రాదిపత్యంగా ఏలేయ్యాలి ఈ బిజినెస్ ని. హోటళ్ళ మీద హోటళ్ళు కట్టేస్తూ, పోటిగా ఉన్న వాటిని కొనేసి నీవాటితో కలిపేసుకుంటూ చకచక పైకి నాశనం చెయ్యడానికి సారధి ఉన్నాడు. రాజకీయంగా తోక్కేయ్యడానికి నేను ఉన్నాను. గుండాలని తీసుకొచ్చి తుక్కు రేగేలా కొట్టడానికి మీ డాడీ ఉన్నారు. హొటలు ఇండస్ట్రిలో దృవతారలాగా వెలిగిపోవడానికి తగిన చదువు చదివావు నువ్వు సుదీరా! నీకు బెస్ట్ ఆఫ్ లక్!"