ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎయిర్ పోర్ట్ కా? రైల్వేస్టేషన్ కా? ఎలాగైనా ఆ ఆర్టిస్టును తను కలుసుకోవాలి. నిర్ణయించుకుంది చీనాంబర.
* * *
"ఎక్కడికి వెళ్తున్నాం మనం? అరగంట తర్వాత అనుమానంగా అడిగాడు అభినవ్.
"మీరు మార్చిపోయారేమో. నేను మీకు ప్రామిస్ చేశాను" అతని మూడ్ ని మార్చడానికి హుశారును నటిస్తూ అంది కావ్య.
తాజ్ మహల్ నిఒకసారైనా చూడాలని అతని కోరిక. కానీ ప్రస్తుతము ఆ మూడ్ లేదు.
ఏం మాట్లాడలేదు అభినవ్. ఫ్రంట్ సీట్లో పడేసిన పెయింటింగ్ సగభాగం వైపు చూస్తున్నాడు.
"నా పెయింటింగ్ ను పూర్తిగా రిజెక్ట్ చేస్తారని నేననుకోలేదు. డానికి జడ్డీలు చెపుతున్న కారణం కూడా విచిత్రంగా వుంది. రక్తంతో బొట్టు పెట్టడం అబ్జక్షన్. కానీ నేనా బొట్టును పెట్టలేదు."
"మరెవరు పెట్టారు?" వెంటనే అడిగింది కావ్య.
"తెలీదు."
"వాళ్ళ రూల్స్ కి అనుగుణంగా ఉంటే మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకేనేమో ఫస్ట్ ప్రైజ్ ని కేన్సిల్ చేశారు నిర్వాహకులు. ఫస్ట్ ప్రైజ్ కి అర్హమైన పెయింటింగ్ రాలేదని....."
"ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది" బాధగా అన్నాడు. ప్రైజ్ ద్వారా వచ్చే లక్ష రూపాయల మీదే కాదు...... ఆ పెయింటింగ్ మీద చెప్పలేని మమకారం ఏర్పడిందతనికి.
కలర్ కాంబినేషన్ లో గానీ , ఎక్స్ ప్రెషన్ కి తను ఇచ్చిన ట్రీట్ మెంటు అంతా వృథా అయిపోయింది. శిల్పం చెక్కిన వాడికీ, ఆ శిల్పంలో ఏవుందో తెలుస్తుంది!
మరో మూడు గంటల తర్వాత......
మంచు ముక్కలతో చేసినట్టుగా వున్న తాజ్ మహాల్ని , దూరం నుంచి చూశాడు అభినవ్.
యమునా నది ఒడ్డున ఇసక తిన్నెల మీద కూర్చున్నాడతను. లాంగ్ షాట్లో తాజ్ మహల్ ఫోటోలు తీస్తోంది కావ్య.
అతనికి కొంచెం దూరంలో న్యూస్ పేపర్స్ లో చుట్టిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ వైపు చూస్తే అతనికి ఒళ్ళు మండిపోయింది.
ఏదో తెలియని కసి, ఆవేదన, బాధ..
ఆ బాధకు కారణం..... అది కళ్ళెదుట కనబడడమే. లేచి ఆ పెయింటింగ్ ని అందుకుని దానికి చుట్టి ఉన్న న్యూస్ పేపర్లని పరపరా చించేశాడు. తను సృష్టించిన "మమత"ను ప్రేమగా చివరిసారి చూసుకుని ముందుకు నడిచాడు.
ఎదురుగా పరిగెడుతున్న యమునా నది. ఆ అలలు కూడా ఆ ఆర్టిస్టు కళ్లకు ఆర్టిస్టిగ్గా వున్నాయి.
మరో రెండు నిమిషాల్లో ఆ పెయింటింగ్ ఆ అలల మీద తేలిపోయేదే
అభినవ్ కుడి చెయ్యి గాలిలోకి లేచింది.
సరిగ్గా.....
సరిగ్గా అదే సమయంలో అతని చేతిని ఇంకో చేయి బలంగా పట్టుకోవడంతో గిరుక్కున తల తిప్పి చూశాడు.
ఎదురుగా....
ఆకృతి దాల్చిన ప్రకృతిగా అపరిచిత యువతి!
ఆ పెదవుల మీద అందమైన నవ్వు.
విశాలమైన ఆ కళ్ళలో దోబూచులాడుతున్న అనాంతాబరపు నీలి నీడలు.....
"ఏం చేస్తున్నారు మీరు? రక్తంతో బొట్టు పెట్టింది నేనే.
ఎందుకో తెలుసా? మమతను, మాతృత్వాన్ని మీరు చిత్రిస్తున్నప్పుడు బొట్టు లేకపోవడం విషాదానికి గుర్తు.....
ఆ చిత్రంలో పరమానందమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆవిష్కరించిన మీరు నుదుట మీద బొట్టును మార్చిపోయారు..... అవునా?"
అవును. తన చిత్రంలో వున్న కప్పిపుచ్చలేని లోపం గురించి స్పష్టంగా తెలుసుకున్న అభినవ్ రెండు క్షణాలసేపు మూగవాడైపోయాడు.
"అవు....ను" నెమ్మదిగా అన్నాడు కాసేపయ్యాక.
"ఆ బొట్టును పెట్టి అమూల్యమైన చిత్రానికి ఏ మాత్రం విలువలేకుండా చేసిందాన్ని నేను...... లేకపోతే మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదన్న విషయం నాలు తెలుసు. అందుకు" అంటూ వెంటనే అతని చేతిలోంచి ఆ పెయింటింగ్ ను తీసుకుంది చీనాంబర. ఆపైన తన హేండ్ బ్యాగ్ లోంచి ఒక చిన్న ఎన్వలప్ ని తీసి అతని చేతికందించింది.
"ఎప్పుడైనా ఎక్కడైనా కల్సుకుందాం" చేతిలోని పెయింటింగ్ తో వెనుదిరిగింది.
ఒక అప్సరసను చూస్తున్నట్టుగా ఆమె వైపు చూస్తున్నాడతను అయోమయంగా, అమాయకంగా. ఇసక మీద చీనంబర ప్రాణం వచ్చిన పగడాళ శిల్పంగా వెళ్ళిపోతోంది. ఎవరామె?
గబుక్కున ముందుకు కదిలాడు. అప్పటికే ఆ అమ్మాయి రోడ్డు మీదకెళ్ళి కార్లో కూర్చుంది.
పరుగెత్తాడతను. కారు స్టార్టయింది. రోడ్డు మీద కారు నల్లటి బిందువులా మారే వరకు చూశాడు ఆశ్చర్యంగా.
ఆ తర్వాత....
తన చేతిలోని ఎన్వలప్ ని నెమ్మదిగా విప్పాడు.
అతని కళ్ళనిండా భరించలేని వుద్వేగం.... నమ్మలేని నిజాన్ని నమ్మలేక నమ్మినట్లుగా వుందతని పరిస్థితి.
ఆ చెక్ లీఫ్ లోని అంకెను చూడగానే మూర్చబోయిననట్టయింది అతనికి.
రెండు లక్షలు....
ఆ చెక్ పక్కన మడత పెట్టిన లైట్ బ్లూ కలర్ పేపరు. ఆ మడతల్ని నెమ్మదిగా విప్పాడు.
వంకర టింకర తెలుగు అక్షరాలు.
ఒక లక్ష మీకు కలిగించిన దుఃఖానికి జరిమానా. రెండో లక్ష మీ పెయింటింగ్ నాలో కలిగించిన ఆనందానికి నజరానా-
డియర్ ఫ్రెండ్.....
ఎప్పుడైనా కల్సుకుందాం. ఏదో ఒక సాయంత్రం నిర్జనమైన ఏకాంత శిఖరం పక్కన , మంచు వర్షం కురుస్తున్న వేళ...... కల్సుకుందాం. వాస్తవంగా పొయినా కలలలోనైనా. నా పేరు చీనాంబర. మళ్ళీ మళ్ళీ చదివాడు ఆ వుత్తరాన్ని.