అది అభినవ్ చిత్రించిన పెయింటింగ్ మమత....
పది నిమిషాల వేపు స్పర్శే తెలియనిదానిలా నిలబడిపోయింది.
అదొక పెయింటింగ్ లా లేదు. సజీవ దృశ్యం కళ్ళెదుట నిలిచినట్టుగా వుంది.
అక్కడో తల్లి...... ఆ పక్క పసిపిల్లాడు.... మోడల్స్ ని తెచ్చి కూర్చోబెట్టిననట్టుగా వుంది.
పక్కనున్న ఆర్టిస్టు పేరు వేపు చూసింది....... అభినవ్.
ఆ చిత్రాన్ని అదే పనిగా తన్మయత్వంతో చూస్తున్న చీనాంబర చూపులు పెయింటింగ్ లోని అమ్మాయి నుదురు మీద నిలిచాయి.
ఆ పెయింటింగ్ లో ఏదో తెలీని లోపం.....
ఏదో నిండుతనం కోల్పోయినట్టుగా వుంది.
ఆ లోపం ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తోంది చీనాంబర.
ఆ లోపాన్ని గుర్తించటానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు..... అవును.
ఆర్టిస్టు ఆ అమ్మాయి నుదుటిమీద బొట్టును దిద్దలేదు. మరిచిపోయాడా? కావాలనే వదిలేశాడా?
సహజంగా చిత్రాన్ని మలచిన ఆర్టిస్టు ఆ ఒక్క పొరపాటు చేశాడు. ఎందుకు.
బొట్టులో వుండే బొమ్మను ఊహించుకుంది చీనాంబర.
నిర్వాహకుల్లో ఒకర్ని పిలిచి ఆర్టిస్టు గురించి అడిగింది.
"ఇక్కడే ఎక్కడో వుంటారు. ఆయన ఎలా వుంటారో నాకూ తెలీదు" చెప్పేసి వెళ్ళిపోయాడు నిర్వాహకుడు.
"ఏం చెయ్యాలి?
అటూ ఇటూ చూసింది చీనాంబర.
ఆ దగ్గరలో ఎవరూ లేకపోవడంతో హేండ్ బ్యాగ్ ను గబుక్కున ఓపెన్ చేసి హేయిర్ పిన్నుని తీసుకుని వేలుకి చటుక్కున గుచ్చుకుంది.
రక్తం జేవ్వున్ ఎగజిమ్మింది.
వెంటనే ఆ రక్తాన్ని ఆ పెయింటింగ్ లో అమ్మాయి నుదుటి మీద గుండ్రంగా బొట్టుగా దిద్దింది. దూరానికి వెళ్ళి చూసింది. ఇప్పుడా చిత్రానికి కొండంత నిండుదానం వచ్చింది. చీనాంబర హృదయంలో ఏదో తెలీనిసంతృప్తీ ఆనందం, పురులు విప్పుకున్న సంతోషం.
అప్పటికప్పుడే-
ఆ పెయింటింగ్ కొనాలని నిర్ణయించుకుని నిర్వాహకుడ్ని అడిగింది.
"అవార్డ్స్ ఎన్ని గంటలకు ప్రకటిస్తారు?"
"ఈవెనింగ్ ఫైవ్ థర్టీకి."
చీనాంబర హాల్లోంచి బయటికొచ్చింది. అవార్డ్స్ ప్రకటించడానికి అప్పటికి నలభై నిమిషాల సమయమే వుంది.
ఆ చిత్రం దగ్గర్నించి చీనాంబర పక్కకు కదిలిన పది నిమిషాల తర్వాత న్యాయనిర్ణేతల బృందం ఆ పెయింటింగ్ దగ్గరకొచ్చింది.
అందరూ ఏకగ్రీవంగా ఆ పెయింటింగ్ నే ఫస్ట్ ప్రయిజ్ కి సెలెక్ట్ చేసారు.
కానీ అది ఫస్ట్ ప్రయిజ్ కి పనికిరాదని నిర్ణయించిన వ్యక్తి ఎమ్. ఎఫ్ హుస్సేన్.
కారణం......
పెయింటింగ్స్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆర్టిస్టు ఆమె నుదుట మీద రక్తంతో బొట్టు పెట్టాడు- అది తప్ప-
మిగతా న్యాయనిర్దేతలు హుస్సేన్ తో ఏకీభావించారు.
* * *
సాయంత్రం సరిగ్గా ఆరు గంటలు....
హాల్ కి పక్కనే వున్న ఆడిటోరియంలో మీటింగ్...... మరో ఐదు నిమిషాల్లో అవార్డ్స్ ని ప్రకటిస్తారు. కావ్య ఇంకా రాకపోవడంతో......
కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు అభినవ్.
అవార్డ్ తనకే వస్తుందని సిక్త్ సెన్స్ చెపుతున్నా ఏదో గజిబిజి నాటకం వెయ్యడానికి ముందు నటుని మనసులో రోదలా మరో అరగంట గడిచింది.
* * *
ఆటో దిగి చేతిలో ఫ్లవర్ బొకేతో హాల్లోకి ప్రవేశించింది కావ్య.
ఆమె కళ్ళు అభినవ్ కోసం చూశాయి.
ఎక్కడా అభినవ్ కనిపించలేదు.
ఏమయ్యాడు..........?
ఎక్కడికెళ్ళాడు......నాలుగు వేపులా చూసింది. దూరంగా మెట్లమీద కాంతంగా కూర్చున్నాడు అన్యమనస్కంగా.
గబుక్కున పరుగెత్తి......
"హలో గురూజీ! కంగ్రాచ్యులేషన్స్" అతని కుడిచేతిని అందుకుని ఆ పూలగుచ్ఛాన్ని చేతిలో వుంచి అతని కళ్ళవేపు చూసింది.
ఆ కళ్ళనిండా కన్నీళ్ళు.
కళాకారుడెప్పుడూ పసివాడే. పసితనాన్ని కోల్పోయిన వ్యక్తి కళాకారుడు కాలేడు. ఆ కళలో పరిపక్వత కూడా సిద్ధించదు.
అభినవ్ కళ్ళవేపు చూసి నివ్వెరపోయింది కావ్య.
"వాట్ గురూజీ! ఏమైంది?" అతనిలో అంత సున్నిత మనస్తత్వం వుంటుందని వూహించని కావ్యకు అదొక షాక్!
"పదండి. ఢిల్లీ నుండి అర్జంటుగా వెళ్ళిపోదాం. ఇక్కడ నేనుండలేను. నా మనసేం బాగోలేదు" విసురుగా లేచి హల్లోకెళ్ళి గోడకున్న పెయింటింగ్ ని తీసుకుని గబగబా బయటికొచ్చాడు అభినవ్.
అప్పటికి ఏం జరిగిందో తెలుసుకున్న కావ్యకు ఎలా అతన్ని ఓదార్చాలో తెలీలేదు.
ఆటోని కేకేసింది. ఇద్దరూ కూర్చున్నాక ఆటో కదిలింది. అదే సమయంలో హాల్లోంచి పెయింటింగ్ ని తీసుకుని విసురుగా బయటికెళ్ళి పోతున్న వ్యక్తిని చూసి అతడే అభినవ్ అనో గుర్తించి అతన్ని కలుసుకోవాలని వరండాలో ఎదురుచూస్తున్న
చీనాంబర-
"హలో" అని కేకేసి అతని వెనక పరుగెత్తింది.
ఆ కేక వాళ్ళకు వినబడలేదు. ఆటో ముందుకు దూసుకెళ్ళిపోవడంలో వెంటనే.
పార్కింగ్ వేపు నడిచి కారెక్కింది చీనాంబర.
ఆటోని ఫాలో అయింది.
ఆటో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న ఓ హొటల్ ముందు ఆగింది. అభినవ్ ని, కావ్యను డ్రాప్ చేసేసి ఆటో వెళ్ళిపోయింది.
కారుని పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తుండగా హోటల్ కౌంటర్లో రూమ్ బిల్ సెటిల్ చేసేసి సూట్ కేసులు పట్టుకుని లోన్నించి కావ్య, అభినవ్ వచ్చారు.
ఓ టాక్సీ పోర్టికోలో ఆగడం ముందు కావ్య, వెనక అతను ఎక్కడం ఆ టాక్సీ అక్కడ నుంచి కదలడంతో వేగంగావచ్చి మళ్ళీ కారులో కూర్చుంది చీనాంబర.