పట్నం వెళ్ళగానే వికాస్ కి అడుగడుగునా ఎన్నో కార్లు కనిపించాయి. అన్ని కార్లవేపు, ఆశ్చర్యంగా చూడడం అలవాటయిందతనికి. ఏవో సందేహాలొస్తే, మేనమామని అడగటం తప్ప మరో వ్యాపకం లేదు.
ఆలోచనల్లో కారు.....
కలల్లో కారు.... కారు.... కారు... ఆ కారులో.... తను.
ఆగిన కారువేపు చూశాడు వికాస్.
ఆ కారుదిగిన ఆసామి..... ఠీవిగా నడుచుకుంటూ వచ్చి, చెప్పిన ధరకే చీరను కొనేసి...
వెళ్ళిపోబోతున్న సమయంలో.....
"ఒకటే చీరుందా... ఇంకా రెండుంటే బావుణ్ణు..... రేపిదే సమయానికి వస్తాను.... ఇస్తావా...." అని మేనమామని అడిగాడు. ఆ కారులోంచి దిగిన వ్యక్తి.
"అదెంత మాటండి. ఎడ్రస్ చెప్పండి..... నేనే తెచ్చిస్తాను...." మేనమామ అన్నాడు.
* * * * *
"ఎప్పుడైనా మంచి వెరైటీ చీరలొస్తే.... నీకు తోచినన్ని చీరలు తెచ్చిచ్చెయ్.... అడగక్కర్లేదు...." ఆ చీరలు తీసుకుని డబ్బులిస్తూ అన్నాడాయన.
"ఎంతమాట.... ఎంత మాట.... తమరా మాట సెలవివ్వాలేగానీ.....బొంబాయిలో షర్మిలా ఠాగూర్ కట్టిన చీరలు తేనూ...."
మేనమామ అన్న మాటకి నవ్వాడాయన.
"ఒకవేళ నేనిక్కడ లేకపోతే, మా కార్ మెకానిక్ షెడ్ కిరా."
ఆయన ఎడ్రస్ ఇచ్చాడు....
కారు మెకానిక్ షెడ్....
మూడోనాటికి వికాస్ ఆ కారు మెకానిక్ షెడ్ లో బోయ్ గా చేరాడు.
ఆ షెడ్ చాలా పెద్దది. దాని ఓనరు చాలా పలుకుబడి గల వ్యక్తి- రోజూ ఎన్నెన్నో కార్లు అక్కడకు వచ్చేవి.
రోజూ వచ్చే, రకరకాల కార్లవేపు ఆశ్చర్యంగా చూడడం, వాటిని ముట్టుకోవడం, ఖాళీగా వున్న ఆ కార్లలో కూర్చోవడం, హారన్ కొట్టడం, స్టీరింగ్ తిప్పడం..... పీ....పీ....అనటం...డ్రైవ్ చేస్తున్నట్లు ఫీలవ్వటం-సరదాగా వుంది వికాస్ కి.
ఒక పాత కారు కొత్త కారు ఎలా అవుతుందో ప్రతిక్షణం గమనించేవాడు వికాస్.
అప్పటికి వికాస్ కి పదేళ్ళొచ్చాయి.
జీవితం ఎన్నో లక్షల మలుపుల సమ్మేళనం...
ప్రతి మలుపు కాకపోయినా- వాటిలో కొన్నయినా అవకాశాల్ని అందించే హేతువులవుతాయి.
సోమరిపోతు అయిన దురదృష్టవంతుడు సరిగ్గా అలాంటి మలుపు దగ్గరే కళ్ళు మూసుకొని నడవగలనా అనే ప్రయోగం ఎలా చేస్తాడు? ఎందుకు చేస్తాడు?
* * * * *
హైదరాబాద్ నగరంలో-
జూబ్లీ హిల్స్ ప్రాంతం..... ఓ లక్ష్మీ నిలయం.
లక్షాధికార్లు, కోటీశ్వరులు, అదృష్టవంతులు వుండే ప్రదేశం అది.
ఆ ప్రదేశంలో-
ఓ పింక్ కలర్ రెండతస్తుల భవనం.
అందమైన మేన్ గేటు.... గేటుకి, పోర్టికోకి మధ్య విశాలమైన ప్రదేశంలో గార్డెన్.... గార్డెన్ మధ్య రెండు ఫౌంటెన్లు.....
పోర్టికో దాటాక ఎడం పక్కన ఆఫీస్ రూం.
లోనకెళ్తే విశాలమైన హాలు.
ఆ హాల్లో మధ్యన ఫ్రాన్స్ నుంచి తెప్పించిన లేటెస్ట్ మోడల్ సోఫాసెట్, కుర్చీలు... ఆ సోఫాసెట్ కు కుడిపక్కన కొంచెం దూరంలో పెద్ద ఎక్వేరియం. ఆ ఎక్వేరియం లో కదుల్తున్న రకరకాల రత్నాల్లా రంగు రంగుల చేపలు...
నేలంతా నిప్పుల వనంలా ఎర్రటి కార్పెట్.... వరసగా గదులు.....ఒకమూల విశాలమైన డైనింగ్ టేబిల్.... పక్కన మేడమీదకు నగిషీల ఇనపమెట్లు.
మేడమీద విశాలమైన, మూడు బెడ్ రూంలు.... మధ్యలో హాలు గెస్ట్ రూంలు.
రెండో అంతస్తులో కెళ్ళడానికి హాలు దగ్గర్నించి మెట్లు.... అక్కడ పైకి వెళ్ళగానే మనకు కన్పించేది రోమ్ నుంచి ఇటీవలే తెప్పించిన షాండెలీర్.
అద్భుతమైన ఇంటిరీయర్ డెకరేషన్.
అందులో ఒక గది చాలా విశాలంగా వుంది. చాలా కాస్టిలీగా వుంది. సాలార్ జంగ్ మ్యూజియంలోంచి ఒక భాగాన్ని తెచ్చి అక్కడ పెట్టినట్లుగా వుంది.
ఆ గదిలో విశాలమైన బెడ్ పక్కన, ఓ తూగుటుయ్యాల- దానిమీద కూర్చుని పేపరు తిరగేస్తున్నాడాయన.
ఆయనే ది గ్రేట్ భానోజీరావు.
అదే సమయంలో గది ముందు సన్నని వెండి పట్టీల శబ్ధమైంది.
లేఖిని.
భానోజీరావు దత్తకూతురు.
లేఖినికి ముఫ్ఫై అయిదేళ్ళుంటాయి- పాలకోవాతోనూ, సంపెంగ పువ్వులతోనూ తయారుచేసిన అపురూపమైన శిల్పసుందరిలా వుంటుంది లేఖిని.
చాలాకాలం పిల్లల్లేరు భానోజీరావుకి.
మరి పిల్లలు పుట్టరనుకున్నాడు.
"పదేళ్ళయింది... పెళ్ళయి. ఎవరిలోనూ లోపం లేదు. భగవంతుడు కరుణించలేదు. అంతే. దగ్గరివాళ్ళలో ఎవరి పిల్లల్నయినా పెంచుకుందామండి...." అప్పటికి అయిదారుసార్లు ఆ ప్రతిపాదన చేసింది భార్య భానుమతి.
ఆలోచనలో పడ్డాడు భానోజీరావు.
తెలిసినవాళ్ళ పిల్లల్ని పెంచుకుంటే, కొన్నేళ్ళయాక ఏదో రిస్క్ రావచ్చు. ఆ పరిస్థితుల్ని వూహించలేం కూడా.
అనాధాశ్రమం నుంచి ఎవర్నయినా తెచ్చుకుంటే! తన ఆలోచనను భార్యకు చెప్పాడు భానోజీరావు.
"మగపిల్లవాణ్ని తీసుకుందామా, ఆడపిల్లని తీసుకుందామా...."
"ఆడపిల్లనే తీసుకుందామండి.... ఇంటికి లక్ష్మీకళ...." భార్య ప్రపోజ్ చేసింది.
భానోజీరావుకి ఎవరైనా ఒకటే.
మరి ఆలస్యం చెయ్యలేదు.
తను స్వయంగా భార్యను తీసుకుని అనాధాశ్రమానికి వెళ్ళాడు.
ముగ్గురు పిల్లల్ని చూపించాడు వార్డెన్.
భార్యకు నచ్చిన పిల్ల కమల. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. తనకు తెల్సిన ఆ పిల్ల బేక్ గ్రౌండ్ ని చెప్పబోయాడు వార్డెన్.
"నో... వార్డెన్.... ఆ పిల్ల గతం తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా! ఇకనుంచీ ఆ బేబీ నా బేబీ కాబట్టి, గతం తెలిస్తే ఎప్పుడయినా ఆమెకు చెప్పాలని అన్పించొచ్చు.... వద్దు...." వారించాడు భానోజీరావు.
బారసాల మహోత్సవం, దత్తత స్వీకారం వైభవంగా జరిపింది భానుమతి.
అప్పుడే 'బిజినెస్ మాన్'గా స్థిరపడడానికి ప్రణాళికలు వేసుకున్నాడు భానోజీరావు. ఎంతోమంది గొప్ప అతిధుల మధ్య, వైభవంగా జరిగిపోయింది ఉత్సవం.
ఆనాటి నుంచి కమల పేరు 'లేఖిని' అయింది. లలాట లిఖితం లేనిదే ఏ పనీ జరగదు. ఇది భానోజీరావు నమ్మకం.
దానికి గుర్తుగా పెట్టిన పేరే 'లేఖిని'.
ఆ ఉత్సవం జరిగిన సాయంత్రమే, భానోజీరావు ఇంట్లో అనుకోని పరిణామం జరిగింది.
అతిధులందరూ వెళ్ళిపోయాక, నీరసంగా పడుకుండి పోయింది భానుమతి.
"ఏం భానూ.... నీరసంగా వుందా" పక్కన కూర్చుంటూ అడిగాడు భానోజీరావు.
"మధ్యాహ్నం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించిందండీ."
వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు.
లేడీ డాక్టర్ వచ్చి టెస్ట్ చేసింది.
"కంగ్రాచ్యులేషన్స్ భానోజీరావ్ గారూ మీరు తండ్రి కాబోతున్నారు."
నిజమా? కలా?
భానుమతి ఆనందానికి అవధులు లేవు. పక్కన పడుకున్న లేఖినిని ముద్దులతో ముంచెత్తేసింది.
రెండోపిల్ల పుట్టడంతో భానోజీరావు బిజినెస్ లో కీలకమైన మార్పు జరిగింది.
ఆ సంవత్సరంలోనే జింఖానా మోటార్స్ కంపెనీని ప్రమోట్ చేశాడాయన. అక్కడ నుంచి ఆయన మరి వెనక్కి తిరిగి చూడలేదు.