"అంత దూరం వచ్చి డ్రాప్ చేస్తారా.... బస్సులో వెళ్తాలెండి."
"మర్చిపోయేను.... మీ రూం కెళ్ళాను"
"రూం కెళ్ళారా!" ఆశ్చర్యంగా అని-
"పోనీయండి.... నేను లేకపోవడం మంచిదైంది" అన్నాడు వికాస్-
"ఏం?" బుగ్గమీద వేలు పెట్టుకుని అడిగింది లిఖిత.
"ఆ రూం చూస్తే రెండోసారి మీరు వచ్చేవారు కారు"
"మీ కోసం నేనొచ్చింది.... మీ గది అందం కోసం కాదు"
కారు డోర్ తీసి కూర్చుంటూ అంది లిఖిత.
"థాంక్యూ.... లిఖిత గారూ"
లిఖిత నవ్వింది ఆ మాటకు.
"రూం కెళ్తారా....మళ్ళీ సిన్మాకెళ్తారా?"
ఆ మాటకు నిజంగానే నవ్వేశాడు వికాస్.
"సీయూ"
కారు ముందుకు దూసుకుపోయింది.
కారు కనుమరుగయ్యేవరకూ అలా చూస్తూ నించున్నాడు వికాస్.....మార్పులో మాధుర్యం ఉందా? ఉంటే ఏది జీవితాలకేనా? వ్యాపారానికి కూడానా?
* * * * *
"ఒరే ప్రపంచకం.... కట్టుబాట్లూ ఇవన్నీ వదిలెయ్యరోయ్. నువ్వు డబ్బున్నోడివైతే నీదే రైటంటుందిరా.... ప్రపంచకం...మాయదారి ప్రపంచకం....దగుల్బాజీ ప్రపంచకం. పెళ్ళి కాని ఆడది.... తల్లీ తండ్రీ చేతకాక పెళ్ళి చెయ్యలేని ఆడది.... మొగుణ్ణి వెతుక్కొని వెళ్ళిపోవడం తప్పేట్రా? నా మట్టుకు నాకు తప్పుకాదు. ఆడదన్నాక.... ఆ ఆడదానికో మగోడుండాలా.. అక్కర్లేదా.....ఒరే బాబీ! నోరూ వాయి లేని పశువులు జత కడుతున్నాయిరా.... అందుకోసం ఎక్కడికో వెళ్ళిపోతాయయి., మనుషులెళ్ళిపోతే ఏట్రా.... మీ యక్క వెళ్ళి పోయిందట. అదీ కులంగానోడితో ఎళ్ళి పోయిందట.... చస్తన్నాడు మీ నాన్న....మర్చిపోయేను.... మద్దేన్నం కాశీపట్నం సంతలో కలిశాడు.... నీ గురించి అడిగేడులే.... ఓరి ఎర్రి బావా! ఆడు గొప్పోడవుతడు... ఆన్ని మర్చిపో అని చెప్పేను. ప్రభావతి వెళ్ళిపోయిందిరా.... పెద్దదలా వెళ్ళిపోయింది. రెండోదిలా వెళ్ళిపోయింది. ఒరేయ్ బాబీ! పేదరికం మహాదగుల్భాజీదిరా! అది నిన్నూ, నన్నూ నమిలేస్తాదిరా. ఒరే బాబూ.... బాబీ! నేనెన్ని యాపారాలు చేసుంటాన్రా ఇప్పటికి? లెక్కా జమా! ఒక్కటీ కల్సిరావడం లేదురా! ఒరేయ్ నీ కళ్ళు బావుంటాయి. నీ మనసు బావుంటాది. నువ్వు నన్ను గుర్తుంచుకోరొరేయ్! బాగా సంపాదించు. బాగా అంటే.... అలా ఇలా కాదు. భగవంతుడికి కన్ను కుట్టాల. దేవుడనేవాడు రూపం కాదురా - శ్రమే దేవుడు. ఒరేయ్! మీ రెండో అక్క వెళ్ళిపోవడమే ఇంటికి అపశకునంరా! నీకు తెలీదురా.... అది మీ అమ్మమ్మలా ఉంటుందిరా- లక్ష్మీకళ మనిషంతా లక్ష్మేనురా!" మేనమామ కళ్ళంట కన్నీళ్ళొచ్చాయి.
రెండో అక్క ప్రభావతి ఎటో వెళ్ళిపోయింది.
అమాయకంగా, తనని ప్రేమించే అక్క... ఒరే బాబీ అని ప్రేమగా పిలిచే అక్క... ఎన్నో కలలు గన్న అక్క... వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది.
"అమ్మ.... బావుందా.... మావయ్య..." ఆ మాట అడిగేడు వికాస్.
"అమ్మ... బావుందా.... ఎలా వుంటుందిరా.... అలాంటి నాన్నని కట్టుకుని.... మహాలక్ష్మి.... ఈ బాధలు పడలేక.... అది కూడా.... ఏదో ఓ రోజు... అంతే..." మేనమామ విచారంగా అన్నాడు.
మరి మాట్లాడలేకపోయాడు వికాస్.
వికాస్ కి అప్పుడే, ఆ క్షణంలోనే ఏదో అర్ధమైంది.
ఇది జీవితం కాదు.
జీవితం పూరిళ్ళలో లేదు.
ఒక పేద గుడిసె భూమిలోకి వెళ్ళిపోయి, మేడ మొలవడం జీవితం...సైకిల్ మీద ప్రయాణించేవాడు, కారు మీద తిరగడం జీవితం.... కానీల్ని పోగు చేసుకునేవాడు, కరెన్సీ కాగితాల్ని విరజిమ్మడం జీవితం....
అప్పటికి మూడో రోజు నాడు-
"ఒరే.... బాబీ.... కనకారావు నాటకాల కంపెనీ వోళ్ళు... నూజివీడులో వారం రోజులు నాటకాలాడతారట్రా.... మైకు పట్టుకుని ఊరూ.... ఊరూ... తిరగాలా.... అదీ మన పని పద.... వెళ్తున్నాం.... మనం.... ఇద్దరికీ రెండేసి జతల బట్టలు పట్టుకో..." చెప్పాడు మేనమామ చయనులు.
నూజివీడులో చింతామణీ నాటక ప్రదర్శన.
తండోప తండాలుగా జనం వస్తున్నారు.
వారం రోజుల ప్రోగ్రాం పదిహేను రోజులకి మారింది.
మావయ్యకి బిజినెస్ లో ట్రిక్కులు తెల్సు.
మావయ్య మైకులో చెప్పడంవల్లే జనం వస్తున్నారని ఆ నాటకాల కంపెనీ ఓనర్ కి అపారమైన విశ్వాసం.
ఓ రోజు రాత్రి-
ఆ కంపెనీ ఓనరు-
"ఒరేయ్... చయనులూ.... మగోడి వంటే నువ్వురా.... నీవల్లే ఈ జనం... వస్తున్నార్రా.... చింతామణి.... చింతామణి..... అని పడి చస్తన్నార్రా.....నాటకం వేస్తున్నాం.... నాలుగు డబ్బులు చేసుకుంటున్నాం.... ఏదో కల్సి వస్తోంది.....ఇన్నాళ్ళూ.... ఆ సైకిల్ వ్యాపారం చేశానా..... ఒక్క పైసా వచ్చింద్రా.....రాలేదు..... ఒరేయ్... చైనులూ..... నువ్వు నాతో వుండిపోవాల్రా...."
"అలాగేనండి.... కానీ.... మావోడికి సైకిళ్ళంటే బలే సర్దా అండి..... మీ సైకిళ్ళ యాపారంలో ఆడ్ని పెట్టండి...." మేనమామ తన గురించి మాట్లాడేడు.
"నువ్వు నాతో ఓ నాలుగు నెలలుండు.... ఆన్ని నా సైకిల్ షాపులో పెడతాను..." ఓనరు ధీమాగా అన్నాడు.
ఇంకో వారం రోజులకి వికాస్ సైకిల్ షాపులో వున్నాడు.
* * * * *
ఫెడల్ వెయ్యగానే రెండు చక్రాలూ తిరగటం వికాస్ కి ఓ వింతాలా అన్పించింది.
అదే మేనమామని అడిగాడు.
"దాన్నే చైన్ అంటార్రా.... బడుద్దాయ్... అంటే.... నేనే....నా పేరేం పేరో తెల్సు కదా... చయనులు... అంటే ఇంగ్లీషులో చైయిన్-
ఆ చైయిన్ మీదే ప్రపంచం అంతా వుంది.
బ్రిటీషువాడు... రైలు పట్టాలు కనిపెట్టినా.... ఇంకోడు విమానం కనిపెట్టినా.... ఇంకోడు..... ట్రాం.....కనిపెట్టినా....అంతే....చైన్ మీదే వుంది.....అంటే.... నేనే..."
నవ్వాడు మేనమామ.
చైన్ అంటే ఏవిటో తెలీని ముఖం నిండా ఏదో వెల్తురు.
ఆ సైకిల్ షాప్ లో ఓ పదిహేను రోజులున్నాడు వికాస్.
అప్పటికి మేనమామని చూసి, వారం రోజులైంది.
ఓరోజు సడన్ గా వూడిపడ్డాడు.
"ఒరేయ్.... బాబీ.... పద...." సైకిల్ షాపులో వున్నవాడ్ని రెక్క బుచ్చుకుని బైటకు లాక్కొచ్చాడు.
ఎందుకు? ఏమిటి.... ఏమీ అడగలేదు వికాస్.
అలా అడగటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు చయనులు.
"పట్నం వెళ్తున్నాం.... మనం...."
బస్సులో వికాస్ కి చెప్పిన ఏకైక మాట అది.
* * * * *
"ఒరే బాబీ.... ఇది పట్నం.... జాగ్రత్తగా వుండాలి. ఇక్కడ మనుషులందరికీ.... డబ్బుంటుంది. డబ్బున్నవాడే ఇక్కడ రాజు. ఇక్కడ బ్రతికే ప్రతీ వాడికీ.... డబ్బు సంపాదించడమే సూత్రం. ఆ డబ్బు ఎలా వచ్చిందన్న ప్రశ్న వుండదు. ఎందుకంటే.... ఆ ప్రశ్న.... వేసుకుంటే.... వాడు బతకలేడు కాబట్టి....అన్యాయమో....న్యాయమో... డబ్బు సంపాదించు.... అదీ పట్నం... అర్ధమైందా.... నేనున్నా... నేను లేకపోయినా..... జాగ్రత్తగా వుండొరేయ్..."
పట్నంలోకి రాగానే మేనమామ చెప్పిన మొట్టమొదటి జీవిత సత్యం అది.
"అలాగే మావయ్య" అనడం తప్పించి వికాస్ ఏం బదులు చెప్పలేదు.
మావయ్య చాలా సులభంగా మనుషులతో స్నేహం చేస్తాడు.
ఆయన దృష్టిలో స్నేహం అంటే నమ్మడం కాదు, కలవడం, వ్యాపారంలో అదే చాలా అవసరం అంటాడు.
ఓ రోజు...
ఉదయాన్నే...
ఓ పెద్ద చీరల మూటతో వచ్చాడు.
"ఒరేయ్... బాబీ- ఆ ఎల్.విజయలక్ష్మి, అదేదో సిన్మాలో అరడజను చీరలు కట్టిందట్రా.... ఆ చీరలంటే.... జనం పడి ఛస్తన్నార్రా... అందుకే....రాజమండ్రినించి ఈ చీరల్ని తెచ్చాను.... పద.... అదృష్టం ఎలా వుందో...."
పూర్ణా మార్కెట్ జంక్షన్లో కూర్చున్నాడు మావయ్య.
రెండుగంటల్లో, వంద చీరలూ అమ్ముడైపోయాయి. ఆఖరి చీర అమ్ముడవడానికి ముందు....
అక్కడకు ఓ కారొచ్చి ఆగింది.