"అడిగితే చంపుతా."
"తప్పు లేదమ్మా ఈ వయసులో ఇది సహజమే..." మంగ స్టేట్ మెంట్ నిజంగా ఊరట కలిగించింది "చెప్పేయ్ చేతనైతే నేనూ సాయం చేస్తాను అవునూ వట్టిగా వస్తున్నాడా, వచ్చి ఏమన్నా అల్లరి చేస్తున్నాడా?"
"చేస్తే చంపనూ వూరికే వస్తున్నాడు."
"అలా వస్తుందనీ ఆనక హద్దులు దాటితే గట్టిగా బుద్ది చెప్పొచ్చు!"
"అయ్యో నీ కస్సలు అర్ధంకాదు."
"అబ్బాయెవరో చెప్పనేలేదు."
"అలా అడిగితే చంపుతానన్నాగా" సావేరి కనుపాపలు చేపపిల్లల్లా కదిలాయి!
"సరేలే అమ్మగారూ....ఆనక నన్ను పిలవకపోతారా అన్నీ నాకు చెప్పకపోతారా!" రహస్యంగా అంది "అవునూ...బాగుంటాడా?"
నవ్వింది సిగ్గుగా.
"మీ అంత అందంగా వుంటాడా?"
తలూపింది లజ్జగా.
"మీరంటే ఇష్టపడతాడా?"
పెదవి విరిచింది తెలియనట్టుగా!
"అయితే గడుగ్గాయిలానే వున్నాడమ్మా" అమంగ నవ్వుతూంది స్పటికంలా.
* * * *
శంకూ గడుగ్గాయిలా లేడు!
ప్రకృతిని పలకరించాలని పనిగట్టుకువచ్చిన పిల్లి రుషిలా వున్నాడు.
గాలి పులకరిస్తూంది. ఆరడు కాళ్ళుంచిన శారదానది తొలిస్పర్శకు సిగ్గుపడిన శోభనపు పెళ్ళికూతురిలా సాగిపోతూంది.
అతడిదో ప్రపంచం..అందులో అధో ధ్యానం. ఆ ధ్యానికి నిన్నటి దాకా గమ్యంలేదు. ఇప్పుడు చెప్పలేని రమ్యత వుంది.
అది అతనిలో చెలిమిచేసే ప్రకృతి!
ఆ లేత మనసు స్వయానా సృష్టించుకున్న ఆకృతి.
"అమ్మ ఎలా వుండేదే" బామ్మనడిగాడు నిన్నరాత్రి.
రాసిపోసిన గులాబీలకు రూపమోచ్చినట్టు అంది....సావేరి గుర్తుకొచ్చింది.
"అమ్మ ఎలా చూసేదీ" అన్నాడు అక్కడా ఉత్కంఠే.
తొలిపొద్దుకు ముందు రేఖల్లా అంటే అప్పుడూ సావేరి రూపమే మెదిలింది.
"మరి అమ్మ గొంతు...."
వేణుగానంలా, వీణానాదంలా అంటే చిత్రంగా సావేరిలానే అనిపించింది.
సావేరిని ఎందుకు యిష్టపడుతున్నట్టు?
అమ్మలా వుంధనా....అంత చిన్నవయసులో తనను వదిలి వెళ్ళిందని అమ్మని తిట్టుకుంటాడే. మరి అమ్మలా వుండే సావేరి గురించి ఎందుకాలోచిస్తున్నాడు. తను పోయినందుకు తను అందించని ప్రేమను ఇలా పంపేందుకు సావేరిని తన ఎద ప్రాంగణంలోకి సాగనంపిందనా!?
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"నీ రూపం సైతం తెలియకుండా పొత్తిళ్ళనుంచే నన్ను నేలకు విసిరి నీ దారి చూసుకున్న అమ్మా.... నువ్వంటే నాకెంత కోపమని....ఎందుకమ్మా...ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయావ్...? నేలకిరాలే తొలకరి చినుకుల్లోనూ నువ్వే కనిపిస్తావు. గాలికి తలలూపుతూ నా కళ్ళను తాకే గారిక పొదల్లోనూ నువ్వే ప్రత్యక్షమౌతుంటావు. ఇసుక తిన్నెల మీద నిలబడి నాతో మాట్లాడకుండా సాగే నదినీ అడిగాను. నాకు పళ్ళిచ్చే రేగిచెట్లనీ నెమ్మదిగా బుజ్జగించి నిలదీశాను. ఎవరూ చెప్పరేం. నీకు నేనంటే ప్రేమని....పాలరాతి చెక్కడాలూ, ఇంద్రనీలాల కట్టడాలూ, నేను కోరుకోవడంలేదే....నీ ఒడిని కావాలంటున్నాను. ఆ గుడిలో బ్రతకాలనుకుంటున్నాను. ఇదేమిటీ....నీకు బదులు మరెవరో కనిపిస్తున్నారు మరింతగా కలవరపెడుతున్నారు."
"శంకూ...."
భుజంపై చేయిపడింది.
చిన్న కదలిక....ఇంకా తేరుకోలేదు.
"ఒరేయ్ శంకూ...."
అప్పుడు చూశాడు వెనుక నిలబడ్డ సురేంద్రని.
"కబుర్లయ్యాయా...కాలేజీకి టైమవుతూంది" గుర్తుచేశాడు.
శంకూ లేచాడు.
"తెల్లవారగానే ఈ తపస్సేమిటి" సురేంద్ర గొంతులో చెక్కు చెదరని ఆత్మీయత "ఆ కబుర్లేవో నాతో చెప్పకూడదూ అదేమిట్రా ఆ కళ్ళల్లో నీళ్ళేంటీ?"
శంకూ చెప్పలేడు. చెప్పగలిగేదేమీ లేదు.
"సెక్యులియర్ ఫెలో....కమాన్!"
సురేంద్ర ఆప్యాయంగా నడిపించాడు.
* * * *
"చెబుతా-చెబుతా-కవిత-
కవితంటే ఏమిటో విప్పుతా....
ఈ వెంకట్ చెప్పేది వేదం
అది వేదం వేదం పాదం
మోదం మోదం ఖేదం" తర్వాత ఆశు కవితకి ఏదో అడ్డం వచ్చినట్లు యిక ముందుకు సాగలేక అర్జెంటుగా కళ్ళు తెరిచాడు వెంకట్.
ఆశ్చర్యం....కవిత చెప్పమని కొన్ని నిమిషాల క్రితందాకా గగ్గోలు పెట్టిన మిత్రబృందం జాడలేదు. ముందు క్షతగాత్రులై నేలపడ్డారేమో అని చూశాడు. కానీ కాలేజీ ఆవరణమంతా కర్ఫ్యూ విధించినట్టు ఖాళీగా వుంది.
ముందు క్లాసులు మొదలయ్యేమో అనుకున్నాడు. కానీ అక్కడ క్లాస్ రూంల్లోని కేకల్ని బట్టి యింకా అలాంటి ప్రమాదం వాటిల్లలేదని అర్ధం చేసుకున్నాడు.
ఇంత నిర్దాక్షిణ్యంగా తన పాండిత్యాన్ని పరాభవించిన మిత్రులు ఒక్కర్నీ పట్టుకుని తలుపులు వేసి చేత్తో కుదరదు కాబట్టి కవితలతో వాయించేద్దామన్న వూపొచ్చింది. కానీ అప్పటికి వాయిదా వేసుకున్నాడు.
కనీసం ఏ చెట్టుకో పుట్టకోనైనా వున్న ఉద్వేగం చల్లారేదాకా కవితాగానాన్ని వినిపించి కడుపుమంట చల్లార్చుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే విషపూరితమైన వేపచెట్టు ఒకటి ఎండి మోడైన విషయం గుర్తుకొచ్చింది...ఇది తన కవితల ప్రభావమే అని అవమానించే స్నేహితుల మాటలు జ్ఞప్తికొచ్చాయి.
ఇక ఉన్నదొకటే రావిచెట్టు....
దాని ముందు తన కవితని ఓ వెతల వినిపిద్దామనుకున్నాడు. కానీ పచ్చని చెట్టు చూసి ఎందుకో గుండె తరుక్కుపోయింది.
సరిగ్గా అప్పుడు వినిపించింది ఓ స్కూటర్ శబ్దం.
అదికాదు వెంకట్ ని అంత ఉత్సాహపరిచింది.
శంకూని దింపిన సురేంద్ర స్కూటర్ షెడ్డుకేం దూసుకుపోయాడు.
మూడురోజుల వ్యవధిలో శంకూ సహనం తెలిసిపోయిన వెంకట్ ఇంతకన్నా ఉత్తమ శ్రోత తనకు లభ్యం కావడం దుర్లభం అనుకున్న వాడై అర్జెంటుగా శంకూని చేరుకున్నాడు.
"నేస్తం....ఇప్పుడు చెబుతా కవిత్వం...."
శంకూ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. కానీ అది గమనించే స్థితిలోలేడు. కవిత్వాన్ని ధారాళంగా వాంతి చేసేస్తున్నాడు.
"కవిత్వం కాదు పైత్యం....
అది నిత్యం సత్యం మెదడుకి పత్యం
అందుకే కవిత్వం.
కాబట్టే కాదనకు నేస్తం.