Previous Page Next Page 
అసావేరి పేజి 12

    "ఇది నా...నా..." ముళ్ళరిగిన గ్రామఫోన్ రికార్డులా 'న'కి దీర్ఘమిస్తూ న గుణింతం చెబుతూ నీళ్ళు నమిలేస్తున్న వెంకట్ ఇక పదాల జోలికి వెళ్ళలేదు.
   
    శంకూ చూపుల్ని గమనించాడు.
   
    ఆ చూపులు అరక్షణంలో తూపులై కుడిదిక్కుగ్ పయనిస్తుంటే అక్కడ చూపుల్ని అందుకుంటున్న అమ్ములపొది ఎవరా అన్నట్టు చూశాడు.
   
    వెంకట్ గొంతు తడారిపోయింది.
   
    ఇక్కడ శంకూ....అక్కడ కారిడార్ లో ఓ స్తంభం వారన సగం చెక్కిన శిల్పంలా కనిపిస్తున్న సావేరి.
   
    కళ్ళు నులుముకున్నాడు. ఇది కలా అన్నంత దీక్షగా చూశాడు.
   
    శంకూ కనురెప్పలు గుండెల్లో గుర్రపు డెక్కల్లా మోగేస్తుంటే కవిత గుండెని చేరింది. గుండె గొంతు పలికింది.
   
    "ఏమీ ఏమేమీ...ఏమని పొగుడుతు నిన్ను....
   
    ఇది ఏమీ ఇది ఏమేమీ ఏమని ఇంకా ఏమని....
   
    హయ్యో ఏమని....అబ్బో ఏమని...." వెంకట నేత్రాలు అరమోడ్పులై అతడి కవిత వడగాడ్పులై ధ్వంస రచనై హింసవచనమై రకరకాలుగా రూపుదిద్దుకుంటుండగా శంకూ నడిచాడు...కాదు పరుగెత్తబోయాడు.
   
    అప్పటికే బలంగా శంకూ చేతిని పట్టుకున్నాడు.
   
    విడిపించుకున్న శంకూ అరక్షణంలో అక్కడినుంచి అదృశ్యమయ్యాడు.
   
    అయినా ఆగలేదు వెంకట్.
   
    ఒక అనూహ్యమైన దృశ్యాన్ని చూసిన ఉన్మాదంలో కవితని కక్కేస్తున్నాడు.
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    ఆఘమేఘాలపై క్లాస్ రూంని చేరుకున్న శంకూ అప్పటికే కెమిస్ట్రీ క్లాసు మొదలుకావడంతో టక్కున ద్వారం దగ్గర ఆగిపోయాడు.
   
    "కుదరదు....నాతో అస్సలు కుదర్దు" లెక్చరర్ అప్పారావు రోషంగా చిందులు తొక్కుతున్నాడు.
   
    ఏది కుదరదో అర్ధంగాని శంకూ బిత్తరపోయి చూస్తున్నాడు.
   
    "అలా బిత్తరపోయినా అసలే కుదరదు. కుదరంటే కుదరదు."
   
    "సర్...." శంకూ నీళ్ళు నమిలాడు ఆలస్యానికి క్షమార్పణలు చెప్పుకుంటున్నట్టుగా.
   
    "సర్ అంటే కుదరదు...సరేనంటాననుకుంటే కుదరదు. అసలు నా క్లాసుకి ఆలస్యంగా రావడమే కుదరదు...ఈ అనకాపల్లి అప్పారావుతో అసలు కుదరదు."
   
    "ఇంకెప్పుడూ ఆలస్యం చేయను సర్....." బిక్క మొహం వేసుకుని నెమ్మదిగా అన్నాడు.
   
    "షటప్....కమిన్ అండ్ స్టేండప్."
   
    శంకూ నెమ్మదిగా నడిచి తన సీటుని చేరుకున్నాడు. దిగులుగా చూస్తూ నిలబడ్డాడు.
   
    క్లాసు రూంనంతా ఓమారు కలియచూసిన అప్పారావు ఆవేశంగా తల పంకించాడు. ఆనక గొంతు సవరించుకున్నాడు.
   
    "పంక్చువాలిటీ లేకపోతే నాతో కుదరదు చెప్పింది సరిగ్గా చదవకపోతే అసలే కుదరదు యూనో...." దీర్ఘంలాతీసి టేబుల్ పై చేతులానించి "ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా....నిన్ను నిన్న నేను చెప్పిన లెసన్ లోని ప్రశ్న అడగబోతున్నాను. చెప్పకపోతే కుదరదని చెప్పి నిన్ను బయటికి సాగనంపబోతున్నాను."
   
    విద్యార్దులంతా గుండె లుగ్గపట్టుకొని చూస్తున్నారు. సన్నగా వణుకుతున్న శంకూని, ఛాన్సు దొరికిందని అలవాటుగా స్వైర విహారం చేస్తున్న అప్పారావునీ....
   
    "సో...వాట్ డిడ్ వియ్ లెర్న్ ఎస్టర్ డే?" మరోసారి దీర్ఘంలా అన్నాడు.
   
    శంకూ గుర్తుచేసుకుంటున్నాడు.
   
    "అంతసేపు ఆలోచిస్తుంటే అస్సలు కుదరదు." కళ్ళు మూసేసుకొని సీరియస్ గా అన్నాడు. "వాట్స్ మెంట్ బై కెమికల్ బాండ్....నాట్ జేమ్స్ బాండ్....బాండ్....కెమికల్ బాండ్...ప్రొసీడ్."
   
    "ర....రసాయనికబంధం..."
   
    "వ్వాట్?"
   
    "కెమికల్ బాండ్ అనగా రసాయనిక బంధం."
   
    క్లాస్ ఘొల్లుమంది.
   
    అప్పారావు రోషం తారాస్థాయికి చేరుకుంది. "కుదరదు. ఇంగ్లీషుకి తెలుగులో అర్ధం చెబితే అసలు కుదరదు."
   
    "నేను....నేను తెలుగు మీడియం టెన్త్" గుటకలు వేస్తున్నాడు శంకూ వద్దని చెప్పినా బామ్మ బలవంతంగా ఇంగ్లీషు మీడియం తీసుకోమన్నందుకు ఇప్పుడు నిజంగా కోపం, దుఃఖం ముంచుకొస్తున్నాయి.
   
    "మా బామ్మ....ఇంటర్....ఇంగ్లీషు మీడియం"
   
    "కుదరదు" అరిచాడు అప్పారావు. "మీ బామ్మ ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా కుదరదు నువ్వు ఇంగ్లీషులో చెప్పాలి నౌ..." ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు. "టెల్ మీ....వాట్స్ మెంట్ బై అయానిక్ బాండ్...."
   
    శంకూ క్షణం నిశ్శబ్దంగా వుండిపోయాడు. టెన్త్ శలవుల్లో తెలుగు మీడియంలో చదివిన జవాబు గుర్తుంది. కానీ చెప్పడానికి భయమేస్తూంది.
   
    "స్పీక్...." అప్పారావు అరుపుతో ఆ రూం ప్రతిధ్వనించిపోయింది.
   
    ఇప్పుడు శంకూకి కాదు అంతా నిశ్శబ్దంగా గమనిస్తున్న సావేరి నుదుట స్వేదం పేరుకుంటూంది.
   
    "స్పీక్ ఐ సెడ్" మరోకేక....
   
    "ఒక పరమాణువునుంచి వేరొక పరమాణువుణు ఎలక్ట్రాన్ల బదిలీ వలనగాని...." కళ్ళు మూసుకొని గడగడా చెప్పుకుపోతున్నాడు శంకూ "లేదా....రెండు పరమాణువులు ఎలక్ట్రానులను సమిష్టిగా..."
   
    "స్టా...ప్" టేబుల్ పై వాలి తల పట్టుకుని తన జుట్టును స్వహస్తాలతో పీక్కొనే కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. "కుదర్దు. ఆంగ్లంలో చెప్పకపోతే అస్సలు కుదర్దు....సో...."
   
    అతడింకా తలపైకెత్తనే లేదు. సావేరి లేచింది ఉక్రోషంగా.
   
    "ది ఎలక్ట్రోసేటిక్ ఫోర్స్ దట్ బైండ్స్ ది ఆపోజిట్లీ చార్టెడ్ అయాన్స్...."
   
    "యస్..." కళ్ళు మూసుకునే పులకిన్తగా తలూపుతున్నాడు అప్పారావు.
   
    "విచ్ ఆర్ ఫార్మ్ డ్ బై ది ట్రాన్స్ ఫరాఫ్ ఎలక్ట్రాన్స్....ఫ్రమ్ వన్ ఎటమ్ టు ది అధర్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్."
   
    "వెరీగుడ్... అప్పుడు కళ్ళు తెరిచిన అప్పారావు అక్కడ ఎదురుగా సావేరి నిలబడి వుండటాన్ని, అంతసేపూ జవాబు చెప్పింది ఆమేనన్న వాస్తవాన్ని గ్రహించినవాడై వెంటనే ఆవేశాన్ని నింపుకున్నాడు. "నువ్వు....నువ్వెందుకు చెప్పావ్?"
   
    "చెప్పకపోతే కుదర్దు కాబట్టి" నిర్లక్ష్యంగా అంది.
   
    ఘొల్లుమన్నారు క్లాసంతా.
   
    "శంకూని అడిగితే నువ్వెందుకు చెప్పావూ అంటున్నాను. ఏమిటో మీ మధ్య ఆ రసాయనిక బంధం!"
   
    "చంపుతా" అసంకల్పితంగా నోరు జారింది సావేరి.
   
    అటూ ఇటూ దిక్కులు చూశాడు.
   
    "ఎవర్నో కాదు! మిమ్మల్నే..."
   
    "నన్నే...."
   
    "యా...."
   
    "కుదరదు...."
   
    "కుదురుతుంది...."
   
    "ఎలా?" ఈసారి మళ్ళీ గట్టిగా జుట్టు పీక్కున్నాడు.
   
    "నేనెవరో ఎంక్వయిరీ చేసుకుంటే అర్ధమౌతుంది" ఆవేశంగా బయటికి నడిచింది.
   
    శంకూ నివ్వెరపోయి చూస్తున్నాడు.

 Previous Page Next Page