Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 10

    1. దక్షిణమార్గ  మనగా, ఒక్కొక్క తాళాక్షరమునకు యెనిమిది మాత్రలతో  నడచుట.
    2. వార్తికమనగా          __ 4 మాత్రలతో నడచుట.
    3. చిత్రమార్గ మనగా     __ 2 మాత్రలతో నడచుట.
    4. చిత్రతమ మార్గమనగా __ 1 మాత్రతో నడచుట.
    5. చిత్రతరు మనగా     __ అర మాత్రతో నడచుట.
    6. అతిచిత్రతమ యనగా __ పావు మాత్రతో నడచుట.

    క్రియ :- కాలమును యెంచెడి విధానము "క్రియ" యనబడును, ఘాతవేయుట, వ్రేళ్ళను యెంచుట, చేతిని వెనుకకు విసరుట  మొదలైనవి క్రియలనబడును. కొన్ని క్రియలుచేరి ఒక అంగమగును.

    మార్గక్రియలనియు, దేశ్యక్రియలనియు  రెండు విధములు. ఆ రెండు విధములగు క్రియలు, తిరిగి సశ్శబ్ద క్రియలనియు, నిశ్శబ్ద క్రియలనియు రెండు రకములు. తాళాంగములు వాడునప్పుడు, శబ్దముతో  కూడినవి సశ్శబ్ద  క్రియలనియు. శబ్దరహితమైనవి, నిశ్శబ్ద క్రియలనియు అనబడును.
   
    ఘాత, చిటిక  మొదలైనవి సశ్శబ్ద  క్రియలు, వ్రేళ్ళను యెంచుట, చెయ్యి వెనుకకు విసరుట మొదలైనవి నిశ్శబ్ద క్రియలు.
   
    మార్గక్రియలు :- ధృవము, శమ్యము. తాళము, సన్నిపాతము అను నాలుగు సశ్శబ్ద క్రియలును. అవాపము, విక్షేపము, నిష్క్రమము, ప్రవేశము అను నాలుగు నిశ్శబ్ద క్రియలును మార్గక్రియ లనబడును.

    సశ్శబ్ద క్రియలు :- 1. ధృవము _ శబ్దపూర్వకమగు  చిటిక.
    2.శమ్యము:- కుడి హస్తమునందు, ఎడమ హస్తముతో ఘాత వేయుట.  
    3. తాళము :- ఎడమ హస్తమునందు కుడి హస్తముతో ఘాతవేయుట.
    4. సన్నిపాతము :- రెండు హస్తములతో  సమముగా తూతవేయుట.

    నిశ్శబ్ద క్రియలు :- 1. ఆవాపము _ ఎత్తబడిన  చేయియొక్క నాలుగు వ్రేళ్ళను ముణుచుట.
    2. విక్షేపము :- అటుల ముడువబడిన వ్రేళ్ళను విప్పుట.
    3. నిష్క్రమము :- హస్తము కుడివైపుకు విసరుట.
    4. ప్రవేశము :- ఆ హస్తమును అప్రదక్షణముగ  ముందరకు తీసుకొనుట.

    దేశ్యక్రియలు :- దృవక్రియను సశ్శబ్ద  క్రియయును, సర్పిణి, కృష్య, పద్మిని, విసర్జితము, విక్షిప్తము, పతాకము, పతిత యను నిశ్శబ్ద క్రియలును, దేశ్యక్రియ లనబడును.

    సశ్శబ్దక్రియ :- ధృవక _ శబ్దముతో  కూడిన కుడిశూ స్తముయొక్క  ఘాత, లేక చిటిక.

                                   నిశ్శబ్ద క్రియ :-

    1. సర్పిణి :- చేతిని యెడమవైపుకు విసరుట.
    2. కృష్య :- ఎడమవైపున ఉన్న చేతిని కుడివైపుకు విసరుట.
    3. పద్మిని :- అరచేయిని క్రిందుగాచేసి  అధోముఖముగా  చేయిజాచుట.
    4. విసర్జితము :- పైన చెప్పబడిన అథోముఖ హస్తమును, వెలుపలికి విసరుట.
    5. విక్షిప్తము :- అటుల విసరబడిన  హస్తము యొక్క వ్రేళ్ళను మణుచుట.
    6. చేతిని పైకి విసరుట _ పతాకము.     
    7. పతిత :- పైకి విసరబడిన చేతిని క్రిందకు తెచ్చుట.

    (ధృవక యనునది  నిశ్శబ్ద క్రియయని  అభిప్రాయ భేదము గలదు.)

    అంగము :- తాళముయొక్క  భాగములు అంగము లనబడును. ఆయా తాళములందు దాయా అంగములు వచ్చుటచేతనే  ఆయా తాళములు మొత్తము లయస్వరూపమునందు భేదములు చెందుటయు, తద్రీత్యా  అయా తాళములు ఒకదానితో మరియొకటి భేదించుటయు  తటస్థించుచున్నది. ఆయా తాళములం  దేర్పడిన అంగములవలననే, ఆయా తాళములను యెంచుటకు, వీలగుచున్నది. ఇందువలన అంగములు మారినప్పుడు మాత్రమే తాళములు ఒకదానితో మరియొకటి  భేదించును. అనుధృతము, ధృతము, లఘువు, గురువు, ప్లుతము ,కాకపాదము  అని ఆరు అంగములు గలవు. ఈ ఆరు అంగములే  "షడంగముల"ని చెప్పబడుచున్నవి.


                   ష డం గ ము ల ప ట్టి క

    అంగముల పేర్లు           గుర్తులు          అక్షరకాలం            మాత్రకాలము
    అనుధృతము                 U                       1                       1/4 
    ధృతము                        O                       2                       1/2
    లఘువు                         I                        4                       1
    గురువు                          S                      8                        2
    ప్లుతము                         3                      12                      3
    కాకపాదము                   +                      16                      4 

 Previous Page Next Page