Previous Page Next Page 
రీవెంజ్ పేజి 10

    అక్కడి వాళ్ళందరికీ తెలుసు మిత్రా గురించి అతను అన్వితని ఎంత ఘోరంగా ప్రేమిస్తున్నాడో ఆమెకోసమే జీవిస్తున్నట్లు కనిపిస్తాడు. ఎప్పడు హాస్టలు ముందే దూరంగా చెట్టు దగ్గర నిలబడి చూస్తుంటాడు అన్విత కనిపిస్తుందేమోనని. మిగతా ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఏం మాట్లాడడు. ఎవరివైపూ చూడడు. అతనిదో ప్రత్యేకమైన తరహా. అన్విత మాత్రం అతనితో ఎప్పుడు పలకరించడం గాని నవ్వటం గాని చేయదు. అతని ముందు తలవంచుకొని వెళ్ళిపోతుంది. అతను నాలుగైదుసార్లు మాట్లాడాలని ప్రయత్నించాడుగాని కుదరలేదు. ఇప్పటికి సంవత్సరం కావస్తోంది. అయినా అతను పట్టువదలని విక్రమార్కుడిలా రేయింబవళ్ళు అన్విత కోసం కృషి చేస్తూనే వున్నాడు .... దీనితో వీళ్ళందరికీ అతనంటే అదో రకమైన జాలి ఏర్పడింది.

    "మిత్రా అయినా మిధన్ చక్రవర్తి అయినా నా దృష్టిలో ఒకటే.....

    ప్రేమ అనే ముసుగుతో మగవాళ్ళు ఆడుకునే ఆట. నా ఉద్దేశ్యంలో వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అనేకంటే నా అందంవల్ల వాళ్లు నాచుట్టూ తిరుగుతున్నారు అని చెప్పవచ్చు. ప్రేమకి ఆకర్షణకీ తేడా వుంది. వీళ్ళు ఏక కాలంలో నలుగురిని ప్రేమించగల సమర్ధులు. నలుగురులోను నన్ను మాత్రమే పెళ్ళిచేసుకోవాలి అనుకొన్నాడనుకోండి. అప్పుడు మిగతా వాళ్ళకన్నా నేనెక్కువగా ఆకర్షించానన్న మాట. అయినా మీకు తెలిసే వుంటుంది. ప్రేమ కన్నా ఆకర్షణే బలంగా కనిపిస్తుంది. అది ఎంత త్వరగా మొదలవుతుందో అంతత్వరగా కోల్పోతుంది. ప్రేమ అనేది శాశ్వితం. అది రెండు మనసుల కలయిక. ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదనుకుంటాను..."

    "ఏమో నువ్ చాలాసేపు కష్టపడి చెప్పావు గాని మాకు ఒక ముక్క కూడా అర్ధం కాలేదు." అని రిమి చెప్పడంతో మిగతా అందరూ కూడా తలలు వూపారు అర్ధంకాలేదన్నట్లు.

    "ఇంతకీ నీ వుద్దేశ్యంలో మిత్రా ప్రేమిస్తున్నట్లా కాదా....?" ప్రశ్నించింది సుజిత.

    "ప్రస్తుతం అతను కూడా అదే భ్రమలో వున్నాడు ఆకర్షణే - ప్రేమ అనుకొంటున్నాడు. నేనొకటి చెప్పనా? ఆకర్షణ కలిగేందుకు ఆలోచించకుండా చేస్తాడు. సపోజ్ అతన్ని స్పీడ్ గా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ఫీట్స్ చెయ్యమన్నా చేస్తాడు. నేనెందులోనైనా దూకమన్నాననుకో వెంటనే దూకేస్తాడు. దెబ్బలు తగిలిన తరువాత ఆలోచిస్తాడు ఎందుకు ఫీట్స్ చేశాను, ఎందుకు దూకాను - దూకవలసిన అవసరమేమిటి అని. ప్రేమలో అలా బాధపడే ప్రశక్తి వుండదు. ఒకరికోసం ఏదో చేస్తున్నామన్న ఆలోచన ఉండదు."

    "సరే అతన్నెందులో దూకమందాం....?" రిమి అన్నమాటకి నవ్వారందరు.

    "మీకలా నవ్వులాటగా వుంటే అదేదో నేను నిజమని చూపిస్తా మీ కళ్ళముందే....?"

    "మరైతే మిత్రాని తీసుకురమ్మంటావా" ప్రశ్నించింది సుజిత.

    "నీకంతగా చూడాలనుకుంటే అలాగే కానియ్, కాని పందెం మీరు ఓడిపోతే ఏం చేస్తారు...? అడిగింది అన్విత.

    "ఏం చేస్తాం.... నీకో మంచి వరుడ్ని వెతికి ప్రెజెంట్ చేస్తాం." చెప్పింది సుజిత.

    "అదేదో మీరే ఉంచుకోండి? మనమెప్పుడు నుంచో కాశ్మీర్ వెళదామనుకుంటున్నాం. నేను ఓడిపోతే మీ ఖర్చులు నేను భరిస్తాను. మీరు ఓడిపోతే నా ఖర్చులు మీరు భరించాలి."

    "ఓకే" అన్నారందరు.

    ఇంతలో!

    జరగబోయేది యాదృచ్చికమే అయినా ఒక సంఘటన జరిగింది. బయట మోటార్ సైకిల్ ని పార్క్ చేసి వచ్చాడు మిత్రా. వర్షానికి తడవటం వల్ల చొక్కావంటికి బాగా అతుక్కుపోయింది. జుట్టు నుంచి నీరు ధారాపాతంగా కారుతుంది. అతను వీళ్ళను చూసి దగ్గరికి వచ్చాడు. స్టైల్ గా కుర్చీని ముందుకు జరిపి కూర్చున్నాడు.

    మోటార్ సైకిల్ శబ్దానికి తల తిప్పి జూసిన వాళ్లకి కలో నిజమో అర్ధం కాలేదు క్షణం. వాళ్లంతవరకు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అతనే వాళ్ళ ముందున్నాడు.

    వాళ్ళకి తెలియని విషయం ఒకటుంది అతను రోజు అన్విత ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తుంది లాంటివి వెంటనే చెప్పడం కోసం హాస్టల్ పరిసరాల్లో కొంతమంది రిక్షావాళ్ళని కిళ్ళీషాపుల వాళ్ళని అతను సి.ఐ.డీ లుగా నియమించాడు. అందువల్లే అతను అక్కడికి రాగలిగాడు కూడా! "మీలో ఎవ్వరితోను ఎప్పుడూ మాట్లాడని వాడిని ఇలా హటాత్తుగా విష్ చేస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు. బట్ ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్. ఒక్కక్షణం ఆగాడు, నాపేరు మిత్రా, అభిమిత్రా. అందరూ మిత్రా అంటారు. మీ అందరికి నేను బాగా తెలుసు. అయినా నేను ఇలా వచ్చి మీ టైంని స్పాయిల్ చేయదలచుకోలేదు. ఒక విషయాన్ని తెలుసుకుందామని వచ్చాను." చెప్పాడు తను. ఎవ్వరు సమాధానం ఇవ్వకపోవడంతో అతనే తిరిగి ప్రారంభించాడు.

    "మిస్ అన్విత! మీకభ్యంతరం లేకపోతే ఒక విషయాన్ని ముఖాముఖి తేల్చుకుందామని వచ్చాను. ఇలా అందరిముందూ మాట్లాడనా....? లేక ప్రక్కకు వస్తారా....?"

    అతని ధైర్యానికి విస్తుబోయింది అన్విత. కాస్సేపటి తరువాత అంది. ఇతన్నా తను ఇన్నాళ్ళు పిరికివాడనుకుంది. పర్వాలేదు మాట్లాడగలడు.

 

 Previous Page Next Page