"అదే నీ ప్రవర్తన ఏమి బాగా లేదంటున్నాను?"
"ఏమిటి! మండిపోతూ అంది." నా ప్రవర్తన బావులేదు? ఎవరికి నీకా?"
"నాకే కాదు. అందరికి, బావ వాళ్ళనాన్నగారి పేరు పెట్టుకోవాలంటే నీవు కాదని యీ పేరు పెట్టించడం ఎవరికి బావులేదు.
తాపిగా బాబుని లాలిలో పడుకోబెట్టి నింపాదిగా మంచం మీద కూర్చుని తల కొంగు బిగించుకుంటూ అంది. "ఎందుకని? నా కిష్టం లేదని చెప్పాను.
రామసాయి కృష్ణసాయి--యిలాంటి పేర్లు నా కిష్టం లేదు. అదేమాట చెప్పాను. నాకిష్టమయిన పేరు చెప్పాను. అయన అదే వ్రాశారు. అయినా నీవు ఆయన్ని వెనకేసుకుని రావటమేమిటి? అలా అనమని నీతో ఎవరైనా చెప్పారా?"
సరోజ చిత్కారిస్తూ అంది "ఛి! చీ! బావని మరీ అంతగా నీచంగా వూహించి అంత తక్కువగా ఎస్టిమేట్ చెయ్యొద్దు. బావని నివింకా అర్ధం చేసుకోలేదక్కా!"
"ఒహొ నీవే బాగా అర్ధం చేసుకున్నవల్లె వుంది! కానిలే! అయితే నీవే వకాల్తా తీసుకున్నావామరి?"
ఛి! నీతో ఏది చెప్పినా యింతే. అసలు నీకు ఏదైనా చెప్పాలనుకోవటం నాదే తప్పు.
వెనుదిరిగిపోబోతున్న చెల్లెల్ని పిలిచి అంది శ్రీదేవి. "సరోజా! ప్రపంచంలో ఎప్పుడూ ఒకర్ని తప్పు పట్టటం పెద్ద తప్పు. అలాంటివాళ్ళు తమ తప్పుల్ని అసలు కనుక్కోలేరు. పెద్దదాన్ని నీవిలా చీ కొట్టటం తప్పు కాదా? అది నీకు తెలిసిందా? ఉహు! తెలియదు. అదే మనుషుల్లో గొప్ప తప్పు, పరుల విషయంలో అందునా భార్యాభర్తల విషయంలో విళ్ళెంత అక్కా బావా అయినా జోక్యం చేసుకోవటం చాలా అసహ్యం, ఇహ ముందు నించి అయినా మా విషయం జోక్యం కలిగించుకోవద్దు, ఇంగితజ్ఞానం లేని ప్రవర్తన ఎప్పుడూ చేటే"
అసహ్యమంతా వుట్టిపడేలా "చాల్లే అక్కా! పెద్దదానివి అయినంత మాత్రాన యిలా అనొద్దు. నీ తప్పు నీకు చూపాను. అయినా పంతాలకోసం పారబోసుకున్నపాలు తర్వాత ప్రియంగా ఎత్తుకుందామనుకొన్నా దొరకబోవనేది గుర్తుంచుకో, ఇప్పుడు నీ వన్నావే! ఆ మాటల్నే బాగా అర్ధం చేసుకుని అని వుంటే అలా అని వుండేదానివి కాదు. ఇప్పటికయినా మించిపోయింది లేదు బాగా ఆలోచించుకో. నీ తప్పేమిటో నీకు తెలుస్తుంది. అదయినా చెల్లిలిగా కాదు. ఓ శ్రేయోభిలాషిణిగా చెపుతున్నాను? అని విసవిసా వెళ్ళిపోయింది సరోజ!
సరోజ మాటలకి ఒళ్ళంతా మండిపోతున్నా ఏమి అనలేక నిలిచిపోయింది శ్రీదేవి.
5
బిలబిలమంటూ వచ్చేశారు అయిదారుగురు ఆడవాళ్ళు.
గదిలో రాసుకుమ్తున్న మాధవ్ బయటికి వచ్చి చూశాడు.
ఎవరో ఆడవాళ్లు!
అంతా అప్ టు డేట్ గా తయారైవచ్చారు. ఎత్తుసిగలవాళ్ళు, వాలు జడలవాళ్ళు, బుచ్చడల వాళ్ళు రెండు జడల అమ్మాయిలు. ఇంకా.....ఇంకా.......
అంతమంది ఆడవాళ్ళని చూచి కాస్త తబ్బిబ్బయ్యాడు మాధవ్, ఫ్రీగా పలకరించలేకపోయాడొక క్షణం. వెంటనే తెప్పరిల్లుకుని "ప్లీజ్ కూర్చోండి" అన్నాడు.
"థాంక్స్" అని చొరవగా వచ్చి సోఫాలో కూర్చుందో అమ్మాయ్. వెంటనే అందరూ తలా ఓ సిటు ఆక్రమించుకున్నారు. పదహారేళ్ళ అమ్మాయి మొదలుకొని ముప్పై ఏళ్ళు పైబడ్డవాళ్ళు కూడా వున్నారు వాళ్ళల్లో.
అయిదారు నిమిషాలు గడిచాయ్ మౌనంగా, కానీ వంట యింట్లోంచి బయటికి రాలేదు శ్రీదేవి. అలా వాళ్ళు ఎదురుగా వుండటం ఎబ్బెట్టుగా తోచి అన్నాడు "ప్లీజ్ మీరేం పనిమీద వచ్చారో చెప్పండి"
ముందుగా వచ్చి కూర్చున్న రెండు జడల అమ్మాయ్ అంది "దయచేసి మీ ఆవిడని పిలవండి కాస్త. మాకు ఆవిడతోనే పని"
"ఇదిగో ఒక్క క్షణంలో వస్తుంది. కాస్త వెయిట్ చెయ్యండి" అని వంటింట్లోకి వెళ్ళాడు.
అప్పుడే బాబుకి నీళ్ళు పోసి ఒళ్ళు తుడుచుతూ కూర్చుంది శ్రీదేవి. ఆప్యాయంగా కుమారుడి పోషణ చేస్తోన్న భార్యని చూచి ఒక్క క్షణం పాటు తన్మయుడయ్యాడు మాధవ్.
నిజంగా యింటినంతా ఓపికగా నేర్పిగా సర్ధుకుని పోయే ఆడవాళ్లుండబట్టి లోకం సజావుగా చక్కగా అందంగా సాగిపోతుంది గాని లేకపోతే ఎంత సంపదవున్నా ఆ సంసారంలో సారం ఎక్కడుంటుంది?
పిల్లవాడికి ఒళ్ళు తుడిచి పౌడరు వేసి చుక్కపెట్టి, చొక్కా వేసి భుజం మీద వేసుకుని యిటు తిరిగిన శ్రీదేవికి తదేకంగా చూస్తున్న మాధవ్ కనిపించాడు.
అతనలా చూస్తుండటం చూసి కాస్త సిగ్గుతో కోపంతో అంది "ఏమండీ అలా చూస్తున్నారు?"
తేరుకుని చిరునవ్వుతో అన్నాడు "శ్రీదూ! బాబుని యిలా యిచ్చేయ్, ఎవరో ఆడవాళ్ళు చాలామంది వచ్చారు నీకోసం వెళ్ళి మాట్లాడు"
కాస్త చిరాగ్గా అంది "ఎందుకట? ఇలా వేళా పాళా లేకుండా వస్తే ఎలా? పనిమీదున్నానని తీరిక లేదని చెప్పండి. పొద్దున్నే యిలా బయలుదేరి రావటానికి వాళ్ళకి సంసారాలు లేవేమో కాని నాకు భర్త పిల్లాడు వున్నారు. వాళ్ళ పోషణ చూచుకోవాలి నేను. ఇపుడు వాళ్ళతో బాతాఖాని వేయటానికి కాదు. వెళ్ళి చెప్పండి."
బిత్తరపోయి చూశాడు కాస్త ఆగి అన్నాడు మాధవ్! "అది కాదు శ్రీదూ, వాళ్లు అంతగా పనిగట్టుకుని నీ కోసం వస్తే నీవు యిలా అవమానించి ఎందుకోసం వచ్చారో కనుక్కుని రా, అంతమాత్రానికే నీ పనులేంచెడిపోవు. ఈలోగా నేను యిటు వెళ్లి హొటల్ నుంచి కాఫీ తెస్తాను."
అతని మాటలు పూర్తికాకుండానే అడ్డుకుని అంది "చాల్లెండి, మిదంతా అదో తరహా. ఈవేళ వాళ్ళకి కాఫీ, టీలు యివకుంటే మన మర్యదెం గంగలో కలవదు లెండి. అసలే కాదంటే రోలెక్కి తలంబ్రాలు పోస్తానన్నదట ఒహ ఆవిడ వీలుకాదు మొఱ్ఱో అంటుంటే యింకా కాఫీ టీలని మర్యాద చేస్తామంటారు వెళ్ళిరమ్మనండి. నే వెళుతున్నా."
బాత్ రూమ్ వైపు వెళ్ళబోతున్న భార్యని ఆపుతూ అన్నాడు బతిమాలుతున్నట్టుగా" చూడు శ్రీ ఇది మనకి మర్యాద కాదు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని మనింటికి పిలవకుండానే వచ్చిన వాళ్ళని అవమానించి పంపటం మంచిది కాదు. దయచేసి వెళ్ళు. వెళ్ళి ఒకమాట మాట్లాడిరా."
చిరాగ్గా చూసి ఇహ తప్పనిసరి అనుకుని అలాగే వెళ్ళబోయింది.
నివ్వేరబోయి అడిగాడు "ఇలాగే వెడుతున్నావా శ్రీ"
పోబోతున్నదల్లా ఆగి నుదురు చిట్లిస్తూ ప్రశ్నించింది శ్రీదేవి! "ఇలాగేనా అంటే ఇంకెలా వెళ్ళాలని మీ ఉద్దేశం? అచ్చు సినిమా స్టార్లా తయారవటానికి నా కిప్పుడు టైం లేదు. ఇలా వెళితే వాళ్లు నన్ను మీ భార్య కాదని అనుకోర్లెండి?"
బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు.
"పోనీ కాస్త ముఖం అయినా కడుక్కుని రారాదూ!"