వీధిలో కారు హరన్ ఆరోసారి మోగింది.
"మీ కోసం సాంబశివంగారి కారు చాలా సేపటినుండి వెయిట్ చేస్తోంది ." అన్నాడు మోహన్ లేచి .....
ప్రసూన మనసంతా ఏదో వెలితిగా అయింది. విధిలేక లేచి నిలబడింది. చేతులు జోడించి బయలుదేరి౦ది.
"మిస్ సునా!"
ఆ పిలుపుకోసమే ఎదురుచూస్తున్నట్లు చటుక్కున ఆగిపోయింది.
"స్నేహితుడిగా ఒక చిన్న సలహా చెప్పనా?"
"చెప్పండి."
"ఈసారి మీరు ఇలాంటి పనులమీద వచ్చినప్పుడు ఇలా రాకండి ..... పల్చని నైలాన్ చీర బొడ్డుకిందకు కట్టుకోవాలి. కళ్ళు చెదిరేలా లైఫ్ స్టిక్ వగైరాలు అలంకరించుకోవాలి. నవ్వుతూ తుళ్ళుతూ అవసరమయితే ఏదో వంకన తాకుతూ గారాలు పోతూ మాట్లాడాలి . అలా అయితేనేకాని పనులు జరగవు."
మోహన్ పిలవగానే ఆనందంతో ఆగిపోయి వికసించిన ముఖంతో చూసిన ప్రసూన, చూస్తూ ఉండగా కొయ్యబారిపోయినట్లయింది. సరిగ్గా అప్పుడు కారు హారన్ మళ్ళా మోగింది . ప్రసూన తలవంచుకుని గబగబా కారులో వెళ్ళి కూర్చుంది. కారు కదిలింది.
మోహన్ అంటే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. కదులుతొన్న కారును కాదు. ఆ కారులో కూర్చున్న ప్రసూన చెక్కిలిమీదుగా జారుతొన్న కన్నీళ్ళను ......
6
చమ్కాలు కుట్టిన నైలాన్ చీర మాసి పోకుండా పైకి తీసుకుని కిందకూచుని పేలు చూపించు కుంటోంది రాధమ్మ .... చెవులకు పెద్ద పెద్ద ఎఱ్ఱరాళ్ళ దుద్దులు __ ముక్కుకు రవ్వబేసరి , మేడలో నాలుగు వరసుల చంద్రహారం, పలకసరులు, ఆ పైన జిగినీ గొలుసు _ కాళ్ళకు మువ్వల పట్టాలు, ఆ పైన వెండి కడియాలు __ నడుముకు వడ్డాణం __ ఆ వడ్డాణం కింద వేలాడే మువ్వలు, మధ్యగా రాళ్ళు పొదిగిన రెండు నాగుపాములు ......
రాధమ్మ పచ్చని పసిమి __ పెద్ద కళ్ళూ, చక్కని ముక్కు _ అందమైన వాళ్ళలో లెక్క __ కానీ, ఆ అందంలో ఏదో పశుత్వం ఉంది, నవ్వినా మాట్లాడినా , మూర్ఖత్వామూ, వేకిలితనమూ ఒకదాని నొకటి తరుముకుంటూ కనిపిస్తాయి పేలు చూస్తోన్న రత్తమ్మ లోకాభి రామాయణమంతా వినిపిస్తోంది.
ఎవరు ఎవరితో లేచి పోయారో, .... ఎవరు ఎవరిని ఉంచుకున్నారో .... ఎవరు ఏయే కొత్తనగలు చేయించు కున్నారో వగైరా , వగైరా .....
ఎప్పుడూ చూసే దృశ్యమే అయినా ఆనాడు భరించలేకపోయింది. ప్రసూన .... తల్లి అలంకరణ , ఆ సంస్కారం ... ఎప్పుడు చికాకుగానే కలిగించినా, ఏమీ అనలేక పోయేది. ఆ రోజు రత్తమ్మ సీసాడు ఊరగాయ , డబ్బాడు పంచదార రెండు పాత చీరెలు , పట్టుకుని వెళ్ళిపోయాక తల్లి అడిగేసింది. "ఎందుకమ్మా ఈ అలాగా వాళ్ళందరినీ చేరదీస్తావ్ ?" అలాగా వాళ్ళు? రత్తమ్మ నాకు పినతల్లి తెలుసా"
రాధమ్మ ఎంత ప్రయత్నించినా యాసలేకుండా మాట్లాడలేదు.
ఆ రత్తమ్మ నీకు పినతల్లా? స్వయంగా నేనా?" "ఆ సోయనా!, నా తల్లికి తోడబుట్టినది . ఈనాడు నాలుగు డబ్బులోచ్చినయ్యని అయినొల్లని కాదు పోమ్మనడం నాయమేనా? నువ్వే సెప్పు ....."
ప్రసూనకు తల తిరుగుతోంది ..... ఓపిక కూడదీసుకుని అడిగింది .....
"అయితే మనింటికి వచ్చే ఆ అలాగా అదే వాళ్ళంతా నీకు __ మనకు బందువులేనా?"
"అందరూ అయినోళ్ళా! ఒకప్పుడు మంచికీ చెడ్డకు ఒకరి నోకరుకి అయినోల్లం కామా! ఇప్పుడు మన రోజులు బాగుండయి __ మనం పైకొచ్చినాం! మనోళ్ళకి కూసింత ఇదిపితే ఏం పోద్ది ? ఏమో! ఏటయిమ్ లో ఏ అవుసరం వస్తాదో ?"
"ఎక్కడుంటారు వీళ్ళంతా ?__"
"కూలిపేటలోనే ఉంటారు .... ఈ విషయాలన్నీ సాంబశివ౦గోరికి సేప్పబోకు ! ఆయనకి గిట్టదు ఈల్లంటే .... నేనే పెనం ఒప్పక ......"
ప్రసూన మాట్లాడలేదు.
తన ఇంటి వాతావరణాన్ని మరోసారి తలచుకోవటానికి కూడా కంపరం తోచింది.
తల్లిని మించిపోయినవాడు తండ్రి .... ఏ రోజూ తప్ప త్రాగి కాని ఇంటికి రాడు. పన్నెండు గంటలకి ముందు రాడు .... పగటివేళ వచ్చినా, తనను ఆప్యాయంగా పలకరించడు. ముఖంలో మొరటుతనం _ ఒకసారి ఎందుకో తండ్రికి తన మీద కోపమొచ్చింది. చెయ్యెత్తాడు __ ఎక్కడ్నుంచి వచ్చిందో, తల్లి భద్రకాళిలా విరుచుకుపడి౦ది.
"దొంగసచ్చినాదా! దానిమీద చెయ్యేసి నవంటే మక్కేలిరగదన్నిస్తా __"
తండ్రి పిల్లిలా జారుకుపోయాడు __ __
ఆనాటి తండ్రి కళ్ళలో కౌర్యమూ , తల్లి కసి _ _ అ మాటలూ _ - - ఆ సంఘటనా _ - _ చాలా రోజులవరకూ మరచి పోలేకపోయింది ప్రసూన _ _
ఛీ ! ఛీ ! అనుకునేది తనలో తానే _ _
సాధ్యమయినంత వరకు తండ్రిని తప్పుకు తిరిగేది ప్రసూన. హరి కూడా తనంతట తను ప్రసూనాను పలకరించే వాడు కాడు __ తండ్రీ కూతుళ్ళమధ్య ప్రేమానురాగాలు. పెంపొందించడానికి రాధమ్మ ఏ విధంగానూ ప్రయత్నించేది కాదు. సరికదా హరి ప్రసూన చాయలకు రాకుండా అడ్డుపేడిది.
సాంబశివ౦గారు తన తండ్రి స్నేహితులనీ, అయన సహాయం వల్లనే తన కుటుంబం బాగుపడిందనీ ప్రసూనకు తెలుసు.
కాని సాంబశివం గారూ తన తండ్రి ఎలా స్నేహితులయ్యారు? ఎంత స్నేహితులయితే మాత్రం అయన తమ కుటుంబానికి ఇంత సహాయం ఎందుకుచేస్తున్నారు? ఈ ప్రశ్న లకు సమాధానాలు మాత్రం తనకు తెలియవు, తల్లి నడిగింది.
"యేమో! అల్లకీ, అల్లకీ ఏ లావా దేవీలున్నాయో, నాకేటేరిక?" అని విసుక్కుంది.
తండ్రిని అడగలేదు అడిగే సాహసం లేదు __ సాంబశివం గారి వ్యాపారం గురించి తనకేం తెలియదంటే మోహన్ నమ్మలేదు. 'కామన్ సెన్స్ ఉన్నవాళ్ళేవరు నమ్మరు' అన్నాడు పైగా.
ఒక్కసారి ఏదో సందర్భంలో సాంబశివాన్ని "ఎవరా వచ్చినాయన? పేరు చెప్పనంటున్నాడు?" అని అడిగింది. సాంబశివం ముఖం చిట్లించుకుని "ఎవరిపరిధిలో వారుండటం మంచిది . అనవసరపు విషయాల్లో కలిగించుకోవద్దు __" అన్నాడు.