"అసలు ఆ రోజే అంతా ఓకె అయిపోయేదే! వాడెవడో అటో వాడు! ఊహు! జర్నలిస్ట్...."
ఇక్కడ మాట్లాడడం ఆపి రెండోసారి పరీక్షగా భవానీశంకర్ మొఖంలోకి చూసిందామె.
భవానీశంకర్ కూడా గుడ్లప్పగ్గించి ఆమె వంకే చూస్తుండిపోయాడు. ఆమె అందం ఎపప్తికప్పుడు వరదొచ్చిన నది నీటి మట్టంలా పెరిగిపోతున్నట్లనిపించిందతనికి. ఇంత అందమైన అమ్మాయి అయోమయం గుడ్లప్పగించి ఈ రచయిత పక్షిని ఎందుకు ప్రేమించిందో ఏ మాత్రం అర్ధం కావటం లేదు.
బహుశా దీన్నే "ఖర్మ" అంటారేమో స్వామీజీలు.
"నువ్వు ...." అంది అమ్మాయి భవానీశంకర్ ని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ.
"యస్ మైడియర్ గాళ్! నేనే! జర్నలిస్ట్ భవానీ శంకర్! గోల్డ్ మెడలిస్ట్!" ఆ అమ్మాయి కేమీ అర్ధం కాలేదు.
"వ్వాట్ మెడలిస్ట్!" అంది ఆశ్చర్యంగా.
"గోల్డ్ మెడలిస్ట్!"
"వాట్ గోల్డ్ మెడలిస్ట్?"
"జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్!"
"వ్వాట్ జర్నలిజం?"
భవానీశంకర్ కి తను అడ్డు పడకపోతే అదో 'ప్రశ్నలు - జవాబుల' శీర్షిక అయిపోతుందని నమ్మకం కలిగింది! అంచేత టక్కున అడ్డుపడి పోయాడు.
"అసలు సంగతేమిటంటే ఆరోజు నేను అటో జర్నలిస్ట్ అనుకుని - ఆహాహా! నేను అటో గోల్డ్.....ఊహు! నేనసలు జర్నలిస్ట్ అనుకోండి! కానీ మీ ఆటోవాడు నన్ను డాడీ అనుకుని.....ఊహు! లాంగ్వాజ్ కొంచెం మెలికలు పడింది! ఒక్క నిమిషంలో విప్పదీస్తానుండండి" అంటూ మళ్ళీ మాట్లాడబోయాడతను.
అయితే అతను చెప్పనవసరం లేకుండా జరిగినదంతా అమ్మాయికి ఆరోజు సీనంతా కూడా గుర్తు కొచ్చేసింది. "మీరేం చెప్పక్కర్లేదు! ఆరోజు మీమూలానే మా ప్రోగ్రామంతా నాశనమయింది!" అంది కోపంగా.
"ఆయామ్ సారీ మేడమ్! కానీ మీరు దయచేసి డోంట్ గెట్ ఎగ్జయిటెడ్! ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకుంటే మీరే హోరున పశ్చాత్తాపపడి "సారీ, మైడియర్ భవానీ శంకర్! ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోలేక కోపంలో మిమ్మల్ని ఏదో అనేశాను మిమ్మల్నాలా అపార్ధం చేసుకున్నందుకు నాకు నిష్కృతి లేదు- నిష్కృతి లేదు.....అంటూ హోరైజన్ లో కెళ్ళి పోతారు. ఆరోజు మీ ప్రోగ్రాం సంగతేమిటో నాకు తెలీదు గానీ - మీ కార్యక్రమానికి నావల్ల అంతరాయం కలిగిందని మాత్రం తెలిసింది. ఇదే మా రేడియో స్టేషన్లో అయితే 'అనివార్య కారణాల వల్ల కార్యక్రమం మధ్యలో పదకొండు గంటల పాటు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం" ని చెప్పేసేయవచ్చు. కానీ ఇక్కడి సమస్య వేరు కదా...."
అమ్మాయి కొంచెం శాంతించింది. దీప్ చంద్ కి మాత్రం వాళ్ళిద్దరి డైలాగులు ఏమాత్రం అర్ధం కావటం లేదు. అసలు జరిగిన కధ ఏమిటి? అని ఆలోచించసాగాడతను. ఏ సీరియల్ కయినా జరిగిన కధ ఎంత ముఖ్యమో అప్పుడు అర్ధమయిందతనికి! అమ్మాయ్ దీప్ చంద్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది.
"దీప్! డాడీ ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నారు! పద! వెళ్ళి మన పెళ్ళి విషయం అడుగుదాం!"
దీప్ కొంచెం వణికాడు. "మళ్ళీ అప్పటిలాగా తరిమి కొట్టడు కదా" అనుమానంగా అడిగాడు.
"ఏం తరమాడని నేను చెప్తున్నాగా! చాలా హాపీ మూడ్ లో ఉన్నారు డాడీ! ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా డాడీ నే నియమించాలని డిల్లీ లో అనుకుంటూన్నారట!"
"మైగాడ్!' ఆశ్చర్యపోతూ అన్నాడు దీప్ చంద్. భవానీశంకర్ చప్పున కల్పించుకున్నాడు.
"చూడండి! మిమ్మల్ని నిరుత్సాహపరచటం నాకిష్టం లేదు గానీ - నేను బస్ దిగి వస్తూ హోటల్ రేడియో నుంచి వస్తోన్న వార్తలు విన్నానిందాక! దాని ప్రకారం డిల్లీలో ఆఖరి వివరాలను బట్టి మేడమ్ ఇంట్లో వంటవాడైనా రజనీరాకోడ్ అనే అతనిని మన రాష్ర ముఖ్యమంత్రిగా నియమించాలని ఆలోచిస్తున్నారట! అతనికి పన్నెండేళ్ళ రోడ్ రోలర్ డ్రైవింగ్ అనుభవం ఉందిట...."
దీప్ చంద్ నీరసంగా అమ్మాయి వేపు చూశాడు.
అమ్మాయి ఇంకా నీరసంగా భవానీ శంకర్ వేపు చూసింది.
అటో డ్రైవర్ మీటరు వేపు చూశాడు.
"అయినా నిరుత్సాహపడవలసిన విషయమేమీ లేదు మేడమ్! వేర్ దేరీజ్ ఏ విల్ - దేరీజ్ ఏ వే అనేది నా పాలసీ! మీ మహత్తరమయిన ప్రేమ మీ డాడీ దగ్గర విజయవంతంగా ప్రదర్శించాలంటే నా దగ్గరో అద్భుతమయిన అయిడియా ఉంది. ఆరోజు నావల్ల మీకు జరిగిన అవరోదానికి మీ ప్రేమను ఎలాగోలా శతదినోత్సవం చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది!" అన్నాడు భవానీశంకర్.
"ఏమిటది?" ఆశగా అడిగింది అమ్మాయి.
"అద్భుతమయిన ప్లాన్లు ఇలా రోడ్ల మీద నిలబడి చెప్పుకోవటం మంచిది కాదని మా ఫ్రెండ్ బ్రహ్మానందరావ్ అంటుంటాడు. కనుక మనం...."
దీప్ చంద్ ఉత్సాహంగా అతని వాక్యం పూర్తీ చేశాడు.
"హోటల్ హోయసలలో ఏసీ రూమ్ లో కూర్చుని డిస్కస్ చేద్దాం!"
ముగ్గురూ సరికొత్త ఉత్సాహంతో హోటల్ హేయసల వేపు నడవడం ప్రారంభించారు.
*****
యదా ప్రకారం సూర్యుడు తన ఎయిటో క్లాక్ ఎండను ప్రపంచానికి సరఫరా చేస్తున్నాడు.
గడియారం ఆ ఎండను చూచి ఇక తప్పదని ఎనిమిది గంటలు కొట్టింది.
శివతాండవం ఆప్రయత్నంగా తన బట్టతల సవరించుకున్నాడు. 'తెలుగుకిరణం' దినపత్రిక మేనేజర్ వెంకటేశ్వర్లు మరో పట్టు ముక్కు పొడుం పట్టించాడు. చిరంజీవి మరోసారి 'హు' అనుకున్నాడు అసహనంగా.
వాళ్ళ ముగ్గురికి కొద్ది దూరంలోనే కూర్చుని కిటికీ లోంచి దూరంగా హడావుడిగా పరిగెడుతున్న వాహనాల రద్దీని గమనిస్తోంది స్వప్న.
ఆమెకు గడియారం ఎనిమిదిగంటలు కొట్టినట్లే తెలీదు. ఆ ఇంట్లో నుంచి ఎంత త్వరగా బయట పడదామా అని ఆత్రుతగా ఉందామెకి. 'తెలుగుకిరణం' చీఫ్ ఎడిటర్ శివతాండవం, మేనేజర్ వెంకటేశ్వర్లు అందరూ 'చిరంజీవి' అంటే చాలా అయిష్టధోరణిలో ఉన్నట్లు పసిగట్టిందామె. అలా తమను వ్యతిరేకించే వాళ్ళ మధ్య ఎందుగ్గడపాలో ఆమెకు అర్ధం కావడం లేదు. ఒకవేళ లాయరు విల్లు గురించి చెప్పదల్చుకుంటే తమ ఇంటికే వచ్చి చెప్పవచ్చుకదా! అయినా అస్థులూ, అంతస్తులూ - తననే మాత్రం ఆకర్షించవు!
బయట కారు ఆగిన చప్పుడయింది. అందరూ తలలు కిటికీ వేపు తిప్పి రోడ్డు మీదకు చూశారు.
లాయర్ రంగనాధన్ తన భారీ శరీరాన్ని అయిదు నిముషాల 'యాతన' తర్వాత బయటకు లాగగలిగాడు. తర్వాత దానిని నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికొచ్చి మేట్లేక్కింఛి మేడమీదకు చేరుకున్నాడు.
"గుడ్ మాణింగ్ " అన్నాడతను. మెడను కుడివేపుకి జర్క్' ఇచ్చి విరుస్తూ.
"గుడ్ మాణింగ్ ' అన్నాడు చిరంజీవి తనలో పెరిగిపోతున్న 'టెన్షన్' బయటకు కనబడనీయకుండా 'చిరునవ్వు' అనే ముసుగు వేస్తూ.
"కూర్చోండి !' అన్నాడు శివతాండవం సోఫా చూపిస్తూ.
రంగనాధన్ మరికొంత 'యాతన' తర్వాత తన స్థూలకాయాన్ని సోఫాలో కుదేశాడు.
చిరంజీవి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన భవిష్యత్తు ఇంకొద్ది క్షణాల్లో తెలిపోబోతోంది లక్కీ! ఆర్ అన్ లక్కీ?
'స్వప్న' దేవతను పువ్వుల్లో నడిపించటమో, ముళ్ళలో ఇరికించడమో - ఏం జరగబోతోంది?
రంగనాధన్ తన మెడను మరోసారి కుడివేపుకి జెర్క్ ఇచ్చి జేబులో నుంచి సీల్ చేసిన కవరు బయటకు తీశాడు.
నర్శింలు ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు.
"ఏమప్పా ! విల్లు' సదువుతామా?" అన్నాడు రంగనాధన్ తన అరవయాసతో!"
"యస్ చదవండి!" అన్నాడు శివతాండవం బట్టతలను నిమురు'కోబోయి - ఆపేస్తూ.
"ఏమప్పా సిరంజీవి! ఏమి సేప్తావు? సదువుదునా 'విల్లు?" చిరంజీవిని కూడా అడిగాడతను.
"ఓ యస్ ! చదవండి!" అన్నాడు చిరంజీవి.
రంగనాధన్ జాగ్రత్తగా సీలు విప్పాడు.
ఆ తర్వాత మెడను కుడివేపుకి జర్క్ ఇచ్చాడు మరోసారి.
అప్పుడు కవర్లోని కాగితాలని బయటికి లాగాడు.
"ఇది 12-5-1982 వ తారీఖున తిరుమలరామ్ అను నేను పూర్తీ ఆరోగ్యంతో, పూర్తీ స్పృహ లో ఉన్నప్పుడు రాసినటు వంటి విల్లు పత్రము -"
మెడను మరోసారి కుడిప్రక్కకు జర్క్ ఇచ్చాడతను.
"నా మరణానంతరం నా యావదాస్తి (స్థిర్తస్తి, చరాస్తీ - 'తెలుగు కిరణం' దినపత్రిక. దాని మీద సర్వదికారం)నేను పెంచుకున్న కుమారుడు చిరంజీవికి -"
ఓ క్షణం ఆగి మళ్ళీ చదవడం ప్రారంభించాడు రంగనాధన్.
"నేను పెంచుకున్న కుమారుడు చిరంజీవికి చెందుతుంది."
శివతాండవం మొఖంలో వెలుగు తగ్గిపోయింది. వెంకటేశ్వర్లు ముక్కు పొడుం గాలిలోకి వదిలేశాడు.
చిరంజీవి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయాడు.
చటుక్కున స్వప్న వేపు చూశాడు. స్వప్న అదేమీ వినిపించుకుంటున్నట్లు లేదు.