Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 9


    ఆమె ముఖం సంతోషంతో వికసించింది. "సరేనండి" అంది బుద్దిగా తల వూపుతూ.
    
                             *    *    *
    
    ఎనిమిది దాటింది. మామూలుగా అయితే మహేష్ ఆ సమయనికల్లా కాలేజికి వెళ్ళిపోయేవాడు. కాని అనుకోని యీ సమస్య ఎదురవటం వల్ల ఏం చెయ్యాలో తెలీక గదిలోనే వుండిపోయాడు.
    "గురూ! ఏమంటోంది ఆ అమ్మాయి?" అన్నాడు చంద్రం గదికి తిరిగి వచ్చాక.
    "పాపం. అలిసిపోయిందిగా. రెస్ట్ తీసుకుంటోంది."
    "ఈ అమ్మాయిని గురించి ఏం చేద్దామనుకుంటున్నావు?"
    "నిద్రలేవనీ."
    "సరే లేచాక మీరూ మీరూ చూసుకోండి. ఆపద్భాంధవుడిలాగా అడ్డు పడ్డావు గాని తర్వాత వొచ్చే కాంప్లికేషన్లు చూసుకో. వయసులో వున్నపిల్ల, ఆ చీకటి వేళప్పుడు వొంటరిగా రావటం....నీ మంచికోరి చెబుతున్నా. నీకేం నువ్వు స్టూడెంటువి కాబట్టి కాలేజి ఎగ్గొట్టావు. మా యముడున్నాడు చూశావ్! ఒక్కరోజు మానేసినా ఆబోతుల్లా రంకెలు వేస్తాడు. నే వొస్తా" అంటూ చంద్రం వెళ్ళిపోయాడు.
    చంద్రం టెన్త్ తోనే చదువుకు స్వస్తిచెప్పి ఉద్యోగాన్వేషణలొ పడి చిల్లర మల్లర వుద్యోగాలు కొన్ని చేశాడు. ప్రస్తుతం ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు.
    ఓ అరగంట గడిచాక ఆ అమ్మాయి అటూ యిటూ కదిలింది. కళ్ళు విప్పకుండానే నిద్రమత్తులోనే వుండి "కాఫీ" అంది.
    పాపం యీ అమ్మాయికి బెడ్ కాఫీ అలవాటు కాబోలు అని జాలిపడి గబగబ స్టవ్ అంటించి కాఫీ తయారు చేశాడు. ఓ కప్పులో పోసి మంచందగ్గర నిలబడి "యిదుగో కాఫీ" అన్నాడు.
    ప్రియంవద కళ్ళు తెరిచింది. చెయ్యిజాపి కాఫీ అందుకోబోయి, ఎదురుగా వున్న మహేష్ ని చూసి ఉలికిపడినట్లయి లేచి కూర్చుంటూ "సారీ! యిల్లనుకున్నాను" అంది.
    "ఫర్వాలేదులే. తీసుకో."
    "వొద్దులెండి" అంది మొహమాటంగా.
    "తీసుకోమన్నానా?" అన్నాడు గదమాయిస్తున్నట్లుగా.
    "అంతకోపమెందుకండీ" అంది కాఫీ కప్పు అందుకుంటూ.
    కాఫీ త్రాగి కప్పు బల్లమీద పెడదామని లేచి అటుకేసి వెడుతూ కెవ్వుమంది. అని వెనక్కి ఓ గెంతుగెంతి యించుమించు అతని మీద పడినంత పని చేసింది.
    "ఏమిటి? ఏం జరిగింది? ఎందుకలా కేకలుపెడుతున్నావు?" అన్నాడతను విసుగ్గా.
    "అటు చూడండి, అటు" అని టేబిల్ ప్రక్కన గుట్టగా పోసి వున్న బోన్స్ వైపు సౌంజ్ఞ చేసి  చూపించింది.
    స్కూల్, ఫీమర్, టిబియా, ఫిబ్యులా, వర్టి బ్రే, రిబ్స్, హ్యూమరస్, రేడియస్, ఆల్ నా-ఓ మానవ అస్థిపంజరం తాలూకు బోన్స్  అన్నీ రాశిగా పోసివున్నాయి.
    "బోన్స్, అయితే ఏమయింది?"
    "అవి......అవి.....అక్కడెందుకున్నాయి?"
    "స్టడీ చెయ్యటానికి నేనే పెట్టాను."
    "మీరు......మీరు....."
    "నేను మెడికల్ స్టూడెంట్ ని."
    "చచ్చాను" అంటూ మంచంమీద కూలబడింది.
    "ఏమిటి? ఏం జరిగింది?" అన్నాడతను కంగారుపడుతూ.
    ఇక్కడ కూడానా....?" అంది.
    ఏమిటి యిక్కడకూడా? చెప్పండి"
    "ఏమీలేదు. నాకు ఎముకలూ, వగైరాలు అంటే భయం. ఇంకా చెప్పాలంటే కొంచం ఎలర్జీ."
    "మీకు ఎలర్జీ అని వాటిని ఇక్కన్నుంచి తీసెయ్యమంటారా? వాటిని ఎంత కష్టపడి కొన్నానో తెలుసా?"
    అంతకోపమెందుకండీ" ఆ మాట నేను అనలేదు కదండీ" అన్నది జాలిగా.
    "అవునా?" అన్నాడు మహేష్.
    "అవునండి."
    
                              *    *    *
    
    "ఇదిగో చూడూ" అన్నాడు మహేష్, ఆమెకు హితబోధ చేస్తున్నట్టు-
    "నువ్వు చాలా కష్టాలలో వున్నావు కాబట్టి నీకు సాయం చేస్తాను. నీవు ప్రేమించిన వాడిని వెదకి పట్టుకోవటంలొ తోడ్పడతాను కాని నాకున్నది ఒకే ఒక్క గది. ఇందులోనే అన్నీ సర్దుకోవాలి. ఈ యింటి ఓనర్లు చాలా ఖచ్చితమైన మనుషులు. వాళ్ళు సవాలక్ష కండిషన్లుపెట్టి మాకీ గదిచ్చారు. ప్రస్తుతం తీర్ధయాత్రలకు వెళ్ళారు కాబట్టి సరిపోయిందనుకో. ఒకవేళ వొస్తే-నువ్వు నా మరదలుపిల్లవని అబద్దం చెప్పాల్సి వొస్తుంది."
    "ఓస్ అంతేకదండీ. అబద్దాలు చెప్పటం అవన్నీ మంచినీళ్ళ ప్రాయంగా చేసేస్తానండీ."
    "ఇక్కడ చుట్టుప్రక్కల కొన్ని గ్రహాలున్నాయి. వాళ్ళకు కూడా అలాంటి యింప్రెషనే కలిగించాలి."
    "కలిగిద్దామండీ."
    "నీవు ప్రేమించినవాడిని వెదుకుతామనుకో. ఎన్నాళ్ళకీ కనిపించకపోతే?"
    "ఎందుకు కనిపించడండీ? తప్పకుండా కనిపిస్తాడు.
    "ఒకవేళ కనిపించకపోతే?"
    "ఏంచెయ్యాలో మీరే చెప్పండి."
    "ఇవేళ మూడో తారీఖు. వచ్చేనెల మూడోతారీఖు దాకా గడువుపెట్టుకుందాం. ఈ లోపల కనిపిస్తే సరేసరి. లేకపోతే నువ్వింటికి తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే నేనే చెవి పట్టుకుని తీసుకెడతాను. అదీ కండిషన్. సరేనా?"
    "సరేనండీ?"
    "ఇవాళ్టి నుంచీ సరిగ్గా ముఫ్ఫైరోజులు- గుర్తుందా?"
    "గుర్తుందండీ?"
    "ఏమిటి?"
    "ఇవాళ్టి నుంచీ సరిగ్గా ముఫ్ఫై రోజులు."
    "ఇంతకీ అతని పేరేమిటి?" అనడిగాడు మహేష్.
    "పేరాండి? పేరు...."
    "ఏమిటి? పేరు కూడా తెలీకుండా ప్రేమించావేమిటి?"
    "అదికాదండీ నేను ముద్దుపేరుతోపిలిచేదాన్ని. అందుకని అసలు పేరుఒక్కపళాన గుర్తురావటంలేదు"
    ముద్దుపేరు. ఏం పెట్టి పిలిచేదానివి?"

 Previous Page Next Page