"ఏదో తెలుసుకోవాలని ప్రయత్నించిన కృషి ఇప్పుడు మరో కొత్త విషయం వింటున్నట్టు ఆసక్తిగా" గ్రాండ్ పాకి, చౌదరికీ గొడవలున్నాయా"
"ఉపాధ్యాయ గారి స్థాయినిబట్టి తనంతట తానుగా చౌదరితో గొడవపడే అవకాశంగాని అవసరంగానీ లేవు కృషీ...కానీ చౌదరి తానే కోరి మీ తాతయ్యతో గొడవ ప్రారంభించాడు" డాక్టర్ మహంతి సంకోచించలేదు చెప్పడానికి. ఒకనాడు తాతయ్యకి సంబంధించిన చాలా విషయాలు వినడానికి ఆసక్తి చూపించని కృషి యిప్పుడు యిలాంటి సంయమనాన్ని ప్రదర్శించడం ఆనందంగా వుంది. "ఫ్యాక్టరీ కార్మికుల కోసం ఓ హాస్పిటల్ కట్టించాలని సరిగ్గా పదేళ్ళ క్రితం ఫ్యాక్టరీ దగ్గరగా పదెకరాల భూమి కొన్నారు మీ గ్రాండ్ పా..... కన్ స్ట్రక్షన్ ప్రారంభం కావటానికి కొన్ని ఫార్మాలిటీస్ వుంటాయిగా... ఈ లోగా ఆ లేండ్ కావాలన్నాడు చౌదరి."
"దేనికి"
"తను ఓ హోటల్ కట్టించాలని- డబ్బు ఎంత చెల్లిస్తానన్నాడన్నది కాదు సమస్య..... అదే లేండ్ కావాలని చౌదరి అడగటంతో తాతయ్య తిరస్కరించాడు. పొలిటికల్ గా చాలా ఒత్తిడి తెచ్చాడు కూడా. అయినా మీ తాతయ్య వీల్లేదని ఖండితంగా చెప్పేశాడు. అంతే.... ఓ అర్దరాత్రి అక్కడ గుడిసెలు వేయించాడు. దాన్ని బడుగు వర్గాల కాలనీగా ప్రభుత్వం గుర్తించాలని నిరాహారదీక్ష లాంటిది చేసి పెద్ద రాద్దాంతానికి కారణమయ్యాడు."
"తాతయ్య లీగల్ గా ఎదుర్కోలేడా?"
"ఈ దేశానికి ఇలాంటి కేసులు దశాబ్దాల తరువాత గానీ ఓ కొలిక్కి రావు కృషి. కేసు నడుస్తూంది. ఇక ముందూ నడుస్తుంది. ఐతే ఆ తర్వాత మీ గ్రాండ్ పా ఫ్యాక్టరీ లో చౌదరి కార్మికుల ద్వారా సృష్టించిన, ఇంకా సృష్టిస్తున్న అల్లర్లు కాని, ప్రభుత్వ పరంగా ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లయ్ విషయంలో కలిగిస్తున్న విఘాతాలు కాని నువ్వూహించలేవు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే మీ తాతయ్య అనారోగ్యానికి ఖచ్చితంగా ఈ సమస్యలే కారణం కాకపోయినా ఈ సమస్యలు కూడా ఆయన్ని మానసికంగా క్రుంగదీస్తున్నాయని మాత్రం చెప్పగలను."
ఆ తర్వాత కృషి ఇక మాట్లాడలేదు.
డాక్టర్ మహంతి చెప్పిన విషయాల్లోని ఆ చివరి పంక్తులు ఆమె ఎంత కలవరపరిచాయీ అంటే అవే మాటల్ని పదేపదే మననం చేసుకుంది...
ఒక నేరస్తుడు - ఒక దళారి - ఒక సంఘ విద్రోహకశక్తి తాతయ్యపై విజయం సాధించాడు. ఆ ప్రభుత్వాన్ని పాలిస్తున్నది దళారీలు, గూండాలు కావడంతో వేలమంది నిరుపేదలకి ఉపాధిని కల్పించగలుగుతున్న తాతయ్య ఉనికిని ప్రశ్నిస్తూంది.
పేదల సంక్షేమ న్యాయంగా సంపద పంపిణీ సర్వం సహకారాలు గల రాజ్య వ్యవస్థ అనే సూత్రాల్ని వల్లెవేసే బ్యూరోక్రాట్స్, రాజకీయ దళారులు ఆశ్రిత వ్యాపార గణానికి అమ్ముడుపోతూంది సమర్దులకి శ్రమించి పైకెదిగే తత్వం గల పలుకుబడి అడ్డం పడి జాతీయ సంపద సృష్టికి అవకాశాలు మృగ్యమై పోతున్నాయి.
పారిశ్రామిక విస్తరణ, ఆరోగ్య ప్రదమైన పోటీతత్వం, అధునాతన టెక్నాలజీకి ఆహ్వానం ప్రపంచ మార్కెట్ లో పోటీ పడాల్సిన అవకాశాల్ని కాక అవినీతి విస్తృతం కావటానికి ఆర్ధిక దుస్థితిలో ద్రవ్యోల్బణం పెరగటానికి కొందరు స్వార్ధపరులు కారణమౌతున్నారు.
ఇవన్నీ కాదు - చాలా గర్వంగా బ్రతుకుతున్నాడనుకున్న తాతయ్య కూడా ఓటమిలాంటి స్థితిలోనే కూరుకుపోయారు. దానికి కారణం చౌదరి. ఈ వ్యవస్థలోని కాలుష్యాన్ని మొత్తం కడిగేయగల శక్తి తనకు లేదు. కాని చౌదరి లాంటి ఓ దుష్టశక్తిని ఎదుర్కోవాలనుంది.
చాలా చిన్న విషయాలు ఒక్కోసారి మనసుని ఎంత కలవరపరిచేదీ ఇప్పుడిప్పుడే అర్దమవుతున్నట్టుగా అంది. "స్టేట్స్ కి వెళ్ళిపోదామనుకున్న నేను ఎందుకు వున్నదీ ఇప్పటిదాకా ఖచ్చితంగా నాకూ తెలీదు అంకుల్. కాని వున్నందుకు ఏదో చేయాలనిపిస్తుంది."
ఓ చిన్న ప్రారంభానికి అంకురార్పణలా ఆ క్షణాన ఆమె గుర్తు చేసుకుంది. చౌదరిని కాదు...
డబ్బు కోసం ఏదన్నా చేయగల విశ్సుని...
* * * *
"హల్లో"
మంద్రంగా వెలుగుతున్న బ్లూ లాగూన్ రెస్టారెంటు విధ్యుద్దీపాల కాంతిలో కృషి మెరుస్తున్న తారకలా కనిపించింది.
రాజేంద్రతో ఉత్సాహంగా మాట్లాడుతున్న విస్సు ముందు ఉలికిపడ్డాడు. మరుక్షణం పలకరింపుగా నవ్వి వెంటనే ఆహ్వానంలా కూర్చోమన్నట్టుగా చూశాడు.
ఏదో మాట వరసకి అన్నాడే కాని ఇలా ఆమె వస్తుందని ఊహించలేకపోయాడు.
"ఇండస్ట్రియలిస్టు ఉపాధ్యాయగారి గ్రాండ్ డాటర్ కృషీ- ఇతను రాజేంద్రని" విశ్సు పరిచయం చేస్తుంటే అర్దోక్తిగా ఖండించాడు.
"మిస్టర్ రామనాథ్ చౌదరి ఒక్కగానొక్క కొడుకు, నిన్న మీతో ఐక్యూలో పోటీపడ్డ డిఫెండింగ్ ఛాంపియన్- ఇప్పుడు మీ ఓటమికి ధర చెల్లిస్తూ...."
"స్టాపిట్" ఆవేశంగా అరిచాడు రాజేంద్ర. "మీరు నన్ను ఇన్సల్టు చేస్తున్నారు"
"వందలమంది ప్రేక్షకుల్ని మోసం చేసిన మీ మీద గౌరవం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు".
"వాట్ నాన్సెన్స్ ఆర్యూ టాకింగ్"
"సన్నివేశాన్ని ఎదుర్కొనే నైతిక శక్తి లేనివాడు ఇలాగే అరుస్తాడు మిస్టర్ రాజేంద్ర" సూటిగా విషయానికి వచ్చింది. "చెప్పండి నిజంగా మీరు మరోసారి ఐక్యూ కాంపిటీషన్ లో మరో ప్రత్యర్ధిని ఎదుర్కోగలరా....అఫ్ కోర్స్ - చేతకాదు అంటే వెంటనే చెప్పండి"
పైకి లేచాడు రాజేంద్ర.
"పారిపోతున్నారేం-"
ఒక అందమైన అమ్మాయి పైగా తన తండ్రికి ప్రత్యర్ధి అయిన ఉపాధ్యాయ మనవరాలు ఇలా దారుణంగా అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు "వాట్ డూ యూ మీన్"
"ఓకే...మీరు వెళ్ళొచ్చు" అంది కృషి.
"దమ్ముంటే పోటీ ఏర్పాటు చేయండి" అన్నాడు ఉక్రోషంగా. "ఒక్క విశ్వనాథ్ నే కాదు అలాంటి వందమందితో ఛాలెంజ్ చేయమనండి"
"వెల్ కమ్"
"కాని ఈ సారి ఇరవై వేలు కాదు" గుర్తుచేశాడు రాజేంద్ర.
"లక్ష రూపాయలు- సరేనా" అంది కృషి.
రాజేంద్ర మొహం వివర్ణమైపోయింది. "అంత పెట్టుబడి పెట్టబోతున్నారా?"
"నాలక్ష్యం నీ ఓటమి...కావాలంటే రెండు లక్షల పెట్టుబడికైనా సిద్దం."
"ఓకే-నేను రడీ" ఆవేశంగా విజిటింగ్ కార్డు టేబుల్ పై గిరాటేసి వెళ్ళిపోయాడు.
అప్పటికి చాలా ఇబ్బందిగా కూర్చున్న విస్సు ఓపిక నశించినట్టుగా అన్నాడు "మీరిలా చేయాల్సింది కాదు."
నవ్వింది అవహేళనగా "ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యొచ్చో డబ్బు కోసం ఏదన్నా చెయ్యగల నువ్వు మాట్లాడ్డం దారుణం"
చురుక్కుమంది. ఐనా తమాయించుకున్నాడు. "రాజేంద్ర బేక్ గ్రౌండ్ మీకు అంతగా తెలీదనుకుంటాను."
"అలా ఆలోచించాల్సింది గాలివాటుగా బ్రతికేవాళ్ళు."
ఈ వాక్యమూ తగలకూడని చోటనే తగిలింది.
డబ్బున్న ఓ అమ్మాయి ఇక్కడ అవసరానికి మించిన స్వాతిశయాన్ని ప్రదర్శిస్తూంది.
"నేనూ రాజేంద్రని మించిన ఆస్థిపరురాలినే విస్సూ. కాబట్టి రెండు లక్షలు ఖర్చు చెయ్యడం నాకు శ్రమ కాదు."
"గెలుపు అంత సులభం కాదు."
"నీకూనా"
రెచ్చగొడుతున్నట్టుగా చూసింది.
"మాట్లాడు విశ్సూ.... నీకు చేతకాదంటే చెప్పు- మరో సమర్ధుడ్ని రంగంలోకి దింపుతాను. ఏమిటి అలా తెల్లమొహం వేసుకు చూస్తున్నావు. ఐనా డబ్బుకోసం స్వాభిమానం చంపుకోగల నీలాంటివాడు ఇలా రియాక్టు కావడం ఘోరం."
ఉన్నవాళ్ళ భేషజం అతడికి సరిపడదు. ఇప్పుడు కృషి అదే వ్యక్తం చేస్తూంది.
ఏ అభిజాత్యాన్ని అతడు సహించలేడో కృషి అదే ఎగ్జిబిట్ చేస్తూ అతడ్ని దారుణంగా గాయపరిచింది.
"నిజంగా మీరు రెండు లక్షలు పెట్టుబడి పెడతారా"
"యస్.... గెలవగల సమర్దుడికి"
"ఒకవేళ మీరనుకుంటున్న సమర్ధుడు ఓడితే..."
"ఊరుకోను. రెండు లక్షలు నాకు చెల్లించమంటాను."
"చెల్లించే శక్తి లేకపోతే..."
"ఆరు నెలలపాటు మాయింటి గూర్కాగా వూడిగం చేయించుకుంటాను. ఓ గూర్కాకి అంత జీతం యిస్తారా అని అడక్కు. అది నా స్టేటస్ కి సంబంధించింది. చెప్పు నువ్వు పోటీకి సిద్దపడతావా....మరో సమర్దుడ్ని వెదుక్కోమంటావా..."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"అక్కర్లేదు నేనే పోటీ పడతాను."
"కాని మరో ఏభైవేలు రాజేంద్ర నుంచి ఎక్కువ తీసుకుని ఓడిపోకూడదు."
ఆవేశంగా పైకి లేచిన విస్సు బార్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఓ కాగితంపై చకచకా రాసేడు. "ఇది మీ దగ్గర ఉంచుకోండి" అన్నాడు కాగితాన్ని అందిస్తూ.
"ఏమిటది" అంది కాగితాన్ని అందుకోకుండా...
"మాట పట్టింపు వున్నవాళ్ళకే కాదు లేనివాడికీ వుంటుందని నిరూపించే మోరల్ అగ్రిమెంట్. నేను ఓడితే మీ ఇంట ఆరునెలలు గూర్కాగా పనిచేస్తానని రాసిన పేపరు. కాని నేను గెలిస్తే."
"చెప్పు"
"నాక్కావాల్సింది రెండు లక్షలు కాదు"
"మరి..."
"మీరు నాతో ఒక రాత్రి గడపాలి"
ఉలిక్కిపాటుగా చూసింది. మెదడు పొరల్లో పేలిన విస్పులింగాలు ఆమె కళ్ళలో క్రోధాన్ని నింపుతుంటే నిశ్శబ్దంగా వుండిపోయింది చాలా సేపటిదాకా....
"బలవంతం లేదు మిస్ కృషి.... మీరు సరేనంటే నే ఈ పందేనికి సిద్దపడదాం.....ఆలోచించుకోండి. సరే అని నోటితో అనాల్సిన పనిలేదు. ఈ కాగితాన్ని అందుకుంటే అది మీ అంగీకారమనుకుంటాను."
రెండు యుద్దాల మధ్య ప్రశాంతత లాంటి విరామం.
కోరిన గెలుపు కోసం చాలా మూల్యాన్ని కోరుతున్న ఓ అనామకుడు యిప్పుడు తన వునికినే ప్రశ్నిస్తున్నాడు.
రెండు నిముషాలు గడిచాయి.
అంతే. కాగితాన్ని అందుకుంది ఉద్విగ్నంగా
ఆ రాత్రి నేను నిద్రపోలేదు.