Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 10

 

         "వీరయ్యకూ, పిల్లలకూ తిండీతిప్పలు లేవు" అన్నాడు వెనుకనే వచ్చిన గోవిందు.
   
    వీరయ్య అసలే అమాయకుడు, గంగిగోవులాంటివాడు గోవిందును పైకి రమ్మని చెప్పి, ఓ పదిరూపాయల నోటిచ్చి "ప్రస్తుతానికి యిది యివ్వు తర్వాత తోచిన సహాయం చేద్దాం" అన్నాడు.
   
    అతనింకా స్నానం చేయలేదు. క్రిందకు పోదామంటే భయంగా వుంది. చివరకు దిటవు తెచ్చుకుని క్రిందకు దిగివచ్చి, లోపలకు పోయాడు. గోవిందు వంటగదిలో వున్నాడు. పెద్దగదిలో కిటికీముందు కూర్చుని వాసు కథలపుస్తకం చదువుకుంటున్నాడు. సరోజిని ఎక్కడ నక్కిందో కనబడలేదు.
   
    దాదాపు రెండుగంటలు గడిచాక గోవిందు క్రిందనుంచి కేకేశాడు భోజనానికి శివనాథరావు లేచివెళ్ళాడు. వంటయింట్లో రెండు కంచాలూ, పీటలూ వేసివున్నాయి. ఓ దానిముందు వాసుగాడు కూర్చున్నాడు. సరోజిని ఓ మూల గోడను ఆనుకుని నిలబడివుంది ధైర్యం చేసి.
   
    "నువ్వూ?" అన్నాడు కూర్చుంటూ.
   
    ఆమె అతనివంక చూపులు వెదజల్లి "ముందు నువ్వు చేద్దూ, తర్వాత నేను" అంది.
   
    "అంటే ముందు పురుషులు, తదనంతరం స్త్రీలు అన్న ఆచారాన్ని పాటించదలచావా?"
   
    "ఆఁ మరే" అంటూ ఆమె నవ్వు ఆపుకుంటూ తల మరోవైపుకి త్రిప్పుకుంది.
   
    గిన్నెలు సవరిస్తోన్న గోవిందు కలుగజేసుకొని ఈ పూట అమ్మాయిగారు మడికట్టుకున్నారు బాబూ వారి చేతివంట" అన్నాడు.
   
    "హతోస్మి! ఎందుకైనా మంచిది, ఆనక అట్లా వెళ్ళినప్పుడు డాక్టరుగారితో ఆమాట చెప్పిరా."
   
    సరోజిని నవ్వుతోంది.
   
    అప్పుడు శివనాథరావు కాస్త గంభీరంగా "గోవిందూ! నీకు వయస్సయితే వచ్చిందిగానీ జ్ఞానం కొంచెంకూడా పెరగలేదయ్యా" అన్నాడు.
   
    "అదేమిటి బాబూ?"
   
    "లేకపోతే ఏమిటి? ఆవిడగారు మన అతిధిగారు అతిథిచేత పనులు చేయిస్తావా? మంచివాడివే నాన్నగారుంటే ఏమనేవారో తెలుసా?"
   
    అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బిక్కమొహం వేసి  "నా తప్పా చెప్పండి? వద్దని ఎంత మొత్తుకున్నా విన్నారు కాదు. అడగండి వారిని" అంటూ తన లోపం ఏమీలేదని రుజువు పరచుకోచూశాడు.
   
    "సరేలే అయిపోయిందేదో అయిపోయింది. ఏదీ? వడ్డించండి అమ్మాయిగారూ మీ చేతివంట రుచిచూద్దాం."
   
    సరోజిని నెమ్మదిగా వచ్చి యిద్దరకూ నెయ్యి వడ్డించి వెళ్ళింది. కంచంవైపు తీక్షణంగా చూశాడు. ఒకమూల కూర, ఒకమూల పప్పు, మరోమూల కొబ్బరి పచ్చడీ వున్నాయి.
   
    "ఇదేం కూర?" అన్నాడు వేలెత్తి చూపిస్తూ.
   
    "అదా!" అని గోవిందు ఏదో చెప్పబోతున్నాడు. సరోజిని అతన్ని వారించి "చెప్పుకో చూద్దాం" అంది.
   
    "మానవుడన్నవాడికి యీ ఆకారాన్ని బట్టి కనుక్కోవటం కష్టం. సరే రుచిని బట్టి ప్రయత్నిద్దాం" అని ఓ ముద్దా కలిపి నోట్లో పెట్టుకుని "నాయనోయ్" అని అరిచాడు.
   
    అక్కడున్న వాళ్ళంతా కంగారు పడిపోయారు.
   
    "ఏం జరిగింది?" అంది సరోజిని మ్లానవదనంతో నీరసంగా.
   
    గబగబా యిన్ని నీళ్ళు తాగి "గొడ్డుకారం తిన్నానేమో అనుకున్నాను. పోనీ దాని రుచిని వర్ణించనులే. ఇదేమిటీ పచ్చడేనా?"
   
    జరిగినదానికి ఆమె దిగజారిపోయింది. ఏమీ పలకకుండా, ఏమంటాడోనని చూస్తోంది. కొంచెం కలిపి నోట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురూ అనిమిషంగా అతనివంక చూస్తున్నారు ఏదో విచిత్రాన్ని గమనిస్తున్నట్లు అతఃను నవ్వాపుకోలేకపోయాడు.
   
    ఇక ఆమెగారి వదనంలో శ్రావణమేఘాలు చూడలేక "అద్బుతం, పరమాద్భుతం" అన్నాడు. తర్వాత ఉన్మాదితమైన ఆమె ముఖకమలాన్ని చూడడానికి ముచ్చటపడ్డాడు.
       
    సరోజిని చదరంగం వచ్చు ఎంతబాగా వచ్చనిఅడక్కండి. అతనే నేర్పాడు. ఆ మధ్యాహ్నం మూడుగంటలవేళ చేసేదేమీ లేక యిద్దరూ ఆడుతూ కూర్చున్నారు. అతనామె ఆట చాలాసార్లు కట్టేశాడు. "ఒట్టి మొద్దు" అనుకున్నాడు. అసలే విజ్ఞాన శిఖామణికీ, అపురూప మేధా సంపన్నురాలకూ యీ ఆట నేర్పటానికి యిదివరలో ఎంత శ్రమపడాల్సి వచ్చిందో! ఓ వంద తిట్లు తిట్టి వుంటాడు.
   
చివరకు గెలిచాననిపించుకునేందుకు అవకాశంలేక ఓడిపోతున్నానన్న బెంగతో పావులన్నీ తోసేసి, "ఫో, అమాయకురాల్ని చేసి ఎంతైనా ఆడేస్తావు" అంది ఉక్రోషంతో.
   
    "నేను కళ్ళు మూసుకుంటాను. కాసేపు ఏడ్చుకో" అన్నాడు గేలిచేస్తూ.
   
    "ఏయ్" అనేసిందిగాని నెమ్మది నెమ్మదిగా కన్నీళ్ళు కార్చసాగింది. తప్పించుకునేందుకు వ్యవధానం లేదు. తుడుచుకుంటే అహం దెబ్బతింటుంది. కానీ తను కన్నీళ్ళు విడుస్తున్నట్లు ఎదుటివ్యక్తి గమనించరాదు. ఇంతకన్నా దీనమైన అవస్థ భగవంతుడు కల్పించలేదు. పళ్ళు బిగించి, కళ్ళార్పకుండా ఎటో చూస్తూ ఏమాత్రం కదిలినా నీటిభిందువులు టపటప ఎక్కడ రాలిపోతాయోనని, ఊపిరి బిగబట్టి చలనం లేని చందనపు బొమ్మలా కూర్చున్న ఆ మూర్తీభవించిన సౌందర్యాన్ని అలా చూసే అదృష్టం పట్టినందుకు ఆ యువకుడ్ని అభినందించి తీరాల్సిందే.
   
    "జేబురుమాలు ఇచ్చేదా?"
   
    పరాజయం ఆమెదే. దయాదాక్షిణ్యం లేకుండా బొటబొటమని అవిరళ జలప్రవాహం నిండైన చెంపలమీదుగా జారి, ఆ నునుపూను తట్టుకోలేక భుజం మీదికి రాలిపోతూ గోముగా బుల్లి జలపాతాన్ని సృష్టించాయి.
   
    అతనికి సరోజినిని దుఃఖోపశమనం చేయగల ఉపాయమేమీ తట్టలా. తనూ ఏడిచేస్తే కొంతవరకూ ప్రయోజనం ఉండవచ్చు. కానీ ఏడుపు రావటం ఎలా? కాసేపు ఆలోచించి ఇహ జాగుచేస్తే శృతిమించి రాగాన పడుతుందని చేతిరుమాలు తీసి చెంపలమీది కన్నీళ్ళు శుభ్రంగా తుడిచివేశాడు. ఇహ ఆమెను నవ్వించాలి.
   
    చక్కిలిగింతలు పెడితే......ఛీ! మోటుగా వుంటుంది.
   
    ఇంతలో ఓ చక్కని ఆలోచన వచ్చింది. డ్యాన్స్ చేస్తే...? అంటే కాళ్ళూ, చేతులూ అటూ యిటూ త్రిప్పుట, తల ప్రక్కలకూ, ముందుకూ ఆడించుట, గెంతుట, అమాంతంగా క్రిందపడుట, యిత్యాదులు, చిన్నతనంలో ఈ విద్య ప్రదర్శించి అక్కయ్యనూ, బావనూ కడుపు పగిలేటట్లు నవ్వించాడు. తనకు యిప్పుడీ ఆలోచన కలిగినందుకు అభినందించుకుంటూ అంత పనీ చేయటానికి లేచి నిలబడ్డాడు. కానీ యింతలో గోవిందు నక్షత్రకుడిలా వచ్చి యీ దృశ్యాన్ని పాడుచేశాడు.
       
    "టెలిగ్రాం వచ్చిందండీ."
   
    క్షణమైనా ఆలస్యం చేయకుండా క్రిందకు పరిగెత్తాడు. వణుకుతూన్న చేతులతో ఎక్స్ ప్రెస్ వైర్ అందుకున్నాడు. మరుక్షణంలో నవ్వు వచ్చింది.
       
    "క్షేమం నీ క్షేమం వెంటనే తెలియపరచు."
   
    అతని తండ్రి యిచ్చాడు.
   
                               3
   

    యిదురోజులు గడిచాయి. రోజులు నిముషాలలా గడిచిపోతున్నాయి. ఇది అతని జీవితంలో ఓ ఆనందకరమైన ఘట్టం. స్నేహితులు రావడం తగ్గించారు. అప్పుడప్పుడూ ఎవరైనా వచ్చినా-ఓ అరగంట ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చుని తరువాత నెమ్మదిగా కదిపేవారు "మీ చుట్టంగారు వెళ్ళిపోయారా?" అని. "లేదు" అనేవాడు. ఒక్కమాటయినా బదులు పలక్కుండా అక్కడినుండి హడావుడిగా నిష్క్రమించేవాళ్ళు.
   
    వీరయ్య మళ్ళీ యిల్లు వేసుకున్నాడు. శివనాథరావు కొంత డబ్బు సహాయం చేశాడు. పనిలోకి వస్తున్నాడు.
   
    ఓరోజు గంటలు కొంచెం మందంగా గడుస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకి సరోజినిని సుదూరంలో తనకు నచ్చిన భంగిమలో కూర్చోబెట్టీ డ్రాయింగ్ బోర్డుదగ్గర నిలబడి ఆమెగారి రూపాన్ని సర్వాంగ సుందరంగా చిత్రించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి చిత్రం ప్రారంభించి మూడురోజులైంది. సగం పనికూడా కాలేదు. అతనిలో వున్న చిత్రమైన గుణాన్ని చెబుతున్నాను. మరెవరైనా బద్దకస్తులు కాకపోతే అతనికి అసూయ మెండు. ఈయనగారు యింట్లో కూర్చుని యింతకాలం ఒంటరిగా గడుపుతూంటే కళారాధనంలో సద్వినియోగం చేస్తున్నాడని తెలిసినవారు భ్రమపడతారు. అదేం లేదు.

 Previous Page Next Page