ఈ జోక్ కి ఎవ్వరూ నవ్వలేదు. కృష్ణని గురించి ఆలోచిస్తున్నారు. అతను జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటాడు! అతనికి ఒకరంటే భయంలేదు. ఒక పని చెయ్యాలంటే వెరుపులేదు. పైగా రహస్యం అంటూ ఏదీ దాచుకోడు. శివనాథరావు అనుకున్నాడు-ఆ సమయంలో అతనుగాక మరెవరి నోటంటయినా ఈ కథ విన్నట్లయితే తను ఛీ అని చీదరించుకునేవాడు.
చిన్నప్పుడు ఓసారి ఏప్రిల్ ఒకటిన కృష్ణ శివనాథరావు వీపుమీద ఎ.ఎఫ్.అని అచ్చుగుద్దాడు.
అతను కోపంతో అతని ముక్కుమీద గుద్దాడు.
తర్వాత ఏడాదివరకూ యిద్దరూ మాట్లాడుకోలేదు. ఒకరోజు హఠాత్తుగా కృష్ణ మిత్రుడికి ప్రేమలేఖ రాశాడు. అతడ్ని ప్రేమించాడట. అందులో చాలా విరహం వుంది. పొరపాటున-ఏ ఆడపిల్లకైనా రాసింది తనకు పంపించాడేమో అనుకున్నాడు శివనాథరావు. మళ్ళీ యిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఆ రోజునుంచీ కూడా కృష్ణకు అవే బుద్దులు ఎక్కడిదో పాత బైనాక్యులర్ పట్టుకువచ్చి వెనుక బెంచీమీద కూర్చుని ఆడపిల్లల్ని చూసేవాడు. ఒకసారి టీచర్ పసిగట్టి "నువ్వందులోంచి చూసేదేమిటిరా?" అని కుండ బ్రద్దలు కొట్టినట్లు అడిగేశాడు. క్లాసంతా ఘొల్లుమంది.
"ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు" అని కృష్ణ కంఠస్వరం వినిపించి శివనాథరావు పరధ్యానంనుంచి కోలుకుని చూశాడు. అతను కొంటెగా నవ్వుతున్నాడు. "నిన్ను గురించే" అని ఎట్లా చెప్పడం?
తరువాత కాసేపటికి పేకాట మొదలుపెట్టారు. ఉషారైన రమ్మీ అది. చంద్రం క్లబ్బుల్లోకూడా ఆడతాడు. మిగతావాళ్ళు తమలోతాము తప్ప బయట ఆడరు. ఇవాళ చంద్రం రెండుమూడు డీల్ షోలు చూపించాడు. మోహనరావు స్నేహితుల బలవంతంవల్ల ఆడతాడే కానీ యింతవరకూ ఎన్నడూ గెలిచిన పాపాన పోలేదు. శివనాథరావు తను ఆడి డ్రాప్ చేసినప్పుడు అతనికి ఆడి పెడుతూండేవాడు....మధ్యలో అలిసిపోయి కాఫీలు కావాలన్నారు. వంటవాడు యింట్లో లేనందున అటువంటి సదుపాయాలేమీ వీలుపడనందుకు చాలా చింతిస్తున్నానని శివనాథరావు తప్పుకున్నాడు.
సరోజిని ఇంతసేపూ ప్రాణాలు బిగబెట్టుకుని పైన కూర్చుంది. ఆమె ఇంతవరకూ స్నానం అదీ ఏమీచేయలేదు. వీళ్ళు ఎంతసేపటికీ కదలరు ఇహ చేసేది లేక మెట్లు దిగి తలవంచుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయింది. వచ్చిన స్నేహితులు ముగ్గురూ తలలెత్తి ఆమెకేసి ఆతృతగా చూశారు. మళ్ళీ ఏమీ జరగనట్లు కృత్రిమంగా తలలు వంచుకుని కూర్చున్నారు. కానీ ఎవరో తెలుసుకోవాలని అందరికీ ఆరాటంగానే వుంది. చివరకు కృష్ణ 'ఎవరోయ్" అని అడిగేశాడు.
"మా బంధువు."
ఎవరూ మాట్లాడలేదు.
"ఈ ఉదయం వచ్చారు వాళ్ళు."
ముక్కలు పంచుదామని చంద్రం పేక కలుపుతున్నాడు. కృష్ణ లేచి నిలబడి "ఒరేయ్, మీరంతా లేచి నిలబడండి. నువ్వొద్దు శివాయ్! నువ్వు కూర్చో" అన్నాడు.
చంద్రం, మోహనరావు అర్ధంగాకుండా లేచి నిలబడ్డారు.
"ఓహో!" అన్నాడు చంద్రం నవ్వి మోహనరావుకూడా తల పంకించాడు. వెళ్తున్నామనయినా చెప్పకుండా ముగ్గురూ హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు. శివనాథరావుకు అర్ధంకాలేదు. లోపలకు వచ్చాడు.
* * *
"వెళ్ళిపోయారా?" అనడిగింది సరోజిని.
తల ఊపాడు.
"నువ్వు పైకి వెళ్ళికూర్చో. నేను స్నానంచేసి వస్తాను" అన్నది.
సరేనని పైకివచ్చి ఈజీచైర్ లో కూర్చున్నాడు. గోవిందూ, వాసూ ఇంకా రాలేదు. గోవిందు ఈ పూట భోజనంమాట మరిచిపోయినట్లున్నాడు. రాగానే రెండు చివాట్లు వెయ్యాలి.
ఏమీ తోచక లేచివెళ్ళి ఫిడేలు తీశాడు. వసంతరాగంలో అష్టపది ఒకటి వాయించడం మొదలుపెట్టాడు. రెండుమూడు సంవత్సరాల క్రితం ప్రక్కింటి చిన్నపాప డ్యాన్స్ చేస్తోంటే యీ పాత వాయించేవాడు. ఆ రోజుల్లో ఎంతో ఇష్టం యీ పాటంటే అతనికి. ఆ పాప బుల్లిబుల్లి పాదాలు అడుగులు వేస్తూ చిన్న పెదాలు కదిలించి "లలిత, లలిత" అంటూంటే అతనిలో రక్తం కరిగి నీరయేది. అతనిలో రాధ నిలిచి కృష్ణా అని దీనంగా పిలచేది. చిన్నప్పుడు అతనూ నాట్యం నేర్చుకుందామని ప్రయత్నించాడు. కొత్తగా మద్రాసునుండి వచ్చిన నాట్యాచార్యుడు "ఒన్, టూ, త్రీ, ఫోర్" అంటూ ఇరవై ముఫ్ఫైమంది పిల్లలచేత అడుగులు వేయిస్తుంటే అతని హృదయంలో ఇరవై ముఫ్ఫైజతల సున్నితమైన పాదాలు ఎగిరి గంతులువేసేవి ప్రపంచంలో వున్న అన్ని విద్యలూ, కళలూ తనకే కావాలి. సర్వం ఆకళింపు చేసుకోవాలి.
"బావా! ఎంతబాగా వాయిస్తావ్!"
కమాను ఆగింది. తల త్రిప్పి చూడబోయేలోపున కళ్ళముందుకే వచ్చి నిలబడింది.
"నీకూ నేర్పిస్తాను. నేర్చుకుంటావా."
"బాబోయ్! నీకు కోపం ఎక్కువబాబూ! రాకపోతే చెంపలు వాయించేస్తావ్."
"మహా నేనంటే నీకు భయం వున్నట్టు" అని కదిపాడు.
"లేదా మరి?"
ఈ కంఠస్వరం చాలా ఆహ్లాదం కలిగించి ఆమె నేత్రద్వయంలోకి సూటిగా చూశాడు. అంతపెద్ద చక్రాలలాంటి .....సిగ్గుపడి, తలవంచుకుని తనలో తాను నవ్వుకుంటోంది.
"సరోజినీ! తల ఎత్తు"
అతనికి తనివి తీరలేదు "ఊఁ ఎత్తు" అన్నాడు.
పాపం తప్పనిసరిగా తల ఎత్తి చూసింది. విశాలమూ, విప్పారితమూ స్నిగ్ధమూ, స్విన్నమూ అయిన ఆ నాయన రవళిలోని తేజోకాంతులు యధాతథంగా కుంచెతో చిత్రించాలంటే ఎంత తపస్సు చేయాలి! అసలే అప్పుడు స్నానంచేసి వచ్చి, యింకా జడల్ని వేసుకోకుండా జుట్టు ఒదులుగా వదిలేసి, మృదు సుగందంలాంటి పరిమళంతో సరోజిని హాయిహాయి అనిపిస్తోంది.
అవి అరమోడ్పు కన్నులు అతను ముందుకు నడుస్తున్నాడన్న సంగతి స్ఫురించలేదు. అడుగులు తడబడుతున్నాయి. దూరం సంకోచంతో ముడుచుకుంది. అబ్బ! మనిషికీ, మనిషికీ ఎంత దగ్గర? అందమైన ఆ కనురెప్పల కదలికతో అతని ప్రతిబింబం పదిసార్లు మూసుకుని తెరుచుకుంటోంది. నిన్నటి గాలివాన తాలూకు మెరుపు ఒకటి అతని హృదయాంబరంలో మెత్తగా మెరిసింది. మేఘం విడివడి ఓ చుక్క కనిపించీ కనిపించనట్లుగా తృటికాలం మిలమిలలాడి అదృశ్యమైంది. అవి రెప్పలు, ఇవి రెప్పలు.....రెండూ స్ప్రుశించుకుంటున్నాయి. అది వణుకుతూన్న చెయ్యి-ఆమె భుజంమీద పడింది. క్షణంలో చీకటితెరలు చిరిగాయి. అతను వెనక్కి జరిగి కళ్ళు మూసుకున్నాడు.
అడుగుల చప్పుడు దూరమై క్రమంగా వినిపించడం మానేసింది. నెమ్మదిగా కళ్ళువిప్పాడు. తడిగా వున్నాయి. ఎవరిదీ తడి? స్త్రీ నయనాలు ఎప్పుడూ నీరు కారుస్తూనే వుంటాయా? అవేమిటో చెప్పాయే, తనెందుకు వినలేదు?
గోవిందు పైకి వచ్చాడు ఓ అరగంట గడిచాక.
"బాబూ".
"భలేవాడివే చుట్టాలుకూడా వచ్చారు కదా....తిండీ తిప్పలూ అక్కరలేదనుకున్నావా?" అన్నాడు కోపంతో.
అతను వినయంగా "ఏం చెయ్యను బాబూ! అలా వీరయ్య యింటికి వెళ్లాం. పాపం చాలా దురదృష్టం" అని నిట్టూర్చాడు.
"ఏం జరిగింది?"
వీరయ్య వాళ్ళింట్లో నౌఖరు.
"వాడి యిల్లు కూలిపోయింది. భార్యాబిడ్డలతో తిండీతిప్పలూ లేకుండా ఏడుస్తూ కూర్చున్నాడు."
"తీసుకురాలేకపోయావా?"
"తీసుకొచ్చాను బాబూ క్రింద వున్నాడు."
అతను గబగబ మెట్లుదిగి క్రిందకు వచ్చాడు. ఈ ముందుగదిలో వీరయ్య దిగాలుపడి గోడకు ఆనుకుని నిలబడి వున్నాడు.
"ఏం వీరయ్యా, ఇల్లు కూలిపోయిందా?"
పనివాడు ఏదో చెప్పబోయాడు. ఒకటిరెండు మాటలు అస్పష్టంగా వెలువడి గొంతు పూడుకుపోయింది. పైగుడ్డతో కళ్ళు వొత్తుకున్నాడు.
"దిగులుపడకు వీరయ్యా! ఏం జరిగిందో చెప్పు."
"అదికాదండీ మొన్న పాతిక రూపాయలు పెట్టి యిల్లు నేయించానండీ కర్రలు పాతవైనా యింకా కొంతకాలం పనికి వస్తాయని అలాగే వుంచాను. నిన్నటి గాలివాన దెబ్బకు అంతా నాశనమైపోయిందండీ. మా యింటిది నెలల్తో వుంది."