Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 11

 

      "సరోజినీ! నువ్వెంత అదృష్టవంతురాలవు!" అన్నాడు మధ్యలో.
   
    "మళ్ళా ఏమొచ్చింది?"
   
    "అందమంటే ఆడవాళ్ళదే" అన్నాడు అప్పుడే కనిపెట్టినట్లు.
   
    "మెచ్చాం" అని ఆమె అనీ అనకముందే "ఆడవారి నయనాలదే" అని సవరించాడు. "సుందర నయనదళ కాంతిలో" అన్న వాక్యం నెమరు వేసుకుంటూ పైగా అంటాడూ "ఏమో బాబూ! అంతశక్తి నాకులేదు నా దగ్గర వున్న రంగులకు ఆ కాంతి క్రాంతి యధాతధంగా నిర్మించేటంతటి సామర్ధ్యం లేదు. ఇహ నా సామాగ్రి మూలపడేయాల్సిందే"
   
    సరోజిని మహా మండిపాటుతో "ఏమమ్మా గడుసుతనం? ఈ మూడు రోజుల్నుంచీ నన్నింత శ్రమ పెట్టకపోతే ఏం ఈ భాగ్యానికి? నేనేమన్నా కావాలని మొత్తుకున్నానా? ఉరేసుకున్నానా? మధ్యాహ్నంపూట శుభ్రంగా నిర్ధరోనీయకుండా ఇదో ఝంఝాటం పెట్టావు. పైగా శక్తిలేదుట! అన్నీ గొప్పలు. ఎవరు నమ్ముతారు బాబూ ఇవన్నీ! ఇంకా ఏమోననుకున్నా అబ్బాయిగారు చివరకుచెప్పేది యిదా? బాగుందమ్మా బాగుంది. మళ్ళీ ఏమన్నా అంటే కోపాలు. పైగా బడాయిలు. ఏమోనబ్బా యీ వ్యవహారం నాకేం అర్ధంకావడంలా. ఇంకా ఏమిటోననుకున్నాను. ఓ కన్ను గీశాడు. పై పెదవి వేశాడు. జుత్తు బాగానే వేశాడు. బుగ్గలు యింతింతలావు వేశాడు. ఊ...ఆఁ ....అమ్మక చెల్ల! ఏం గడుసుతనం? ఏం కథా? ఏం కమామీషు? నా చేత అడిగించుకోవాలని నన్ను ఊరించి, బ్రతిమాలించుకోవాలనీ ఈ ఎత్తులేం మనదగ్గర సాగవు. అసలు నాకెందుకంట బొమ్మ? ఇక్కడెవరైనా కొట్టుకుపోతుంటే కదా? ఆ తెలివి చూడండి. చాతకాదుట. డబ్బాలు...."
   
    ఈ మధ్యలో అతను "ఏయ్! ఏమిటా ధోరణి? ఊరుకుంటావా లేదా?" యిత్యాది ప్రయోగాలు చేసి, వారించబోయి విఫలుడై యిహ ఆమె వయ్యారాన్ని గమనిస్తూ ఊరుకున్నాడు. చివరకు ఆమె ఒక్కసారిగా సిగ్గుపడి ఫక్కుమని నవ్వి తన కోమలమైన చేతుల్తో ముఖాన్ని ఆచ్చాదితం చేసుకుంది.
       
    ఆమె లోలోపల నవ్వుకోవటం గ్రహించి "యిహ చాల్లే ఆపు" అని గదమాయించాడు.
   
    ఇంతలో గోవిందు కాఫీలు తీసుకుని పైకి వచ్చాడు.
   
    కాఫీ త్రాగుతూ సరోజిని "మా తమ్ముడికి నిన్ను చూస్తే పెద్దపులిని చూస్తున్నట్లు ఉంటుంది... ఎందువల్ల?" అనడిగింది.
   
    "కలలేమైనా వస్తుంటాయేమో" అన్నాడు శివనాథరావు సాలోచనగా.
   
    "కలలేమిటి బావా?" సరోజిని నవ్వడం మొదలుపెట్టింది.
   
    అప్పుడతను వివరించడానికి పూనుకున్నాడు. "సైకో ఎనాలసిస్ అని ఓ థియరీ వుంది. కొందరికి తెలియకుండా కొన్ని అణిగిపోయిన కోరికలుంటాయి. వాటినే సప్రెస్స్డ్ డ్ డిజైర్స్ అంటారు. గొడవ-నీకర్ధం కాదు. వీడికి నామీద వున్న భయానికి, ఆ థీరీకి ఏదో సంబంధముందని తోస్తోంది నాకు. అసలు సైకో ఎనాలసిస్ అంటే నీకు తెలియదు గదూ?"
   
    "ఓ భార్యా భర్తలున్నారనుకో చాలాకాలంనుంచి అన్యోన్యంగా వున్నారు. ఉన్నట్లుండి హఠాత్తుగా విడాకులిచ్చుకున్నారు. ఎలా జరిగిందంటావు?"
   
    "ఏమో హడలగొట్టి చంపేస్తున్నావు నన్ను"
   
    "వివరించెద నవధరింపుము. ఆ భార్యకు వుండి వుండి కలలు రావడం మొదలుపెట్టినై రోజూ కల్లో ఓ కోతి కనిపించేది. తనని వెంటాడేది. తను భయపడి పరిగెత్తేది. అప్పుడు కోతి మీదపడి రక్కేది. తాను ఆ కోతిమొహం మీద గుద్దేది. అప్పుడు కోతి ఓ పెద్ద వృక్షం పీకి విసిరేది. తాను ఓ విల్లంబుతీసి నిప్పులు కక్కుతూన్న బాణం ఒకటి కోతిమీదకు వేసేది. కోతి ఓ కొండశిఖరాన్ని పీకి ఆమె తలమీదకు విసిరేది. ఆమె మరో వృక్షం పీకి కోతి వీపుమీద గుద్దేది."
   
    "ఆపు, ఆపు ఇదంతా వింటూంటే రామాయణంలో హనుమంతుడు ఎవరితోనో యుద్ధం చేస్తున్న దృశ్యం జ్ఞాపకం వస్తోంది."
   
    "చూశావా! నీకు వెనువెంటనే హనుమంతుడు గుర్తుకువచ్చాడు. ఈ కలలబాధ పడలేక ఓసారి ఆమె ఏంచేసింది? వెళ్ళి ఓ ప్రఖ్యాత డాక్టర్ని కలుసుకుంది. ఆయన అంతా విని బాగా ఆలోచించి "మీ ఆయన పేరు హనుమంతరావా?" అన్నాడు. కాదు-ఆంజనేయులంది. ఇంకేం ఆయనంటే ఓ విధమైన అసహ్యం నీలో వుందన్నమాట. అందుకే ఆ మాదిరి స్వప్నాలు వస్తున్నాయి. అమ్మాయ్! ఆయన్తో నువ్వింకా కాపురంచేస్తే నీ జీవితం దుఃఖభాజనమౌతుంది. ఆయనకు విడాకులిచ్చేయ్" అని సలహా యిచ్చాడు.
   
    "ఇచ్చేసిందా?" అని అడిగింది సరోజిని ఆదుర్దాగా.       
   
    "ఇవ్వక?" అన్నాడు గర్వంగా అతను.
   
    "ఎవరు బావా ఆ తలకుమాసిన డాక్టర్? ఉండు నాకో ఆలోచన వస్తోంది.
   
    ఆ ఆంజనేయుడి భార్య పేరేమిటి?"
   
    "మండోదరి అనుకుంటా"
   
    "ఇంకేం? ఏం డాక్టర్! వాడి తెలివి తెల్లారా ఓ భార్యా నువ్వంటే నాకు యిష్టమే. కానీ నీపేరు చూస్తే నాకు అసహ్యము. అందువల్లనే యిలా ప్రవర్తిస్తున్నాను. నీ మండోదరి అన్న పేరు పరి.....చ్చ.....పరి..... త్యజించి ఓ కోతిపేరు పెట్టుకో అని ఆ ఆంజనేయుడు తన యుద్ధంద్వారా సూచిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు?"
   
    "అమ్మ సరోజినీ! ఒక్కో సమయంలో నీ బుద్ది యింత నిశితమైన, అసాధారణమైన పని చేస్తుందే" అనుకుంటూ అతను తన సైకో ఎనాలసిస్ ని గురించి బ్రహ్మాండమైన డైలమాలోపడి ఆలోచనలలో కొట్టుకుపోసాగాడు.
   
    "నువ్వు ఆలోచిస్తూండు. నేను వెడుతున్నాను బాబూ" అన్న సరోజిని మంజులస్వరం లీలగా వినిపించింది.
   
    ఆ సాయంత్రం ఐదింటికి శివనాథరావు బైటకువచ్చి ముందుగా కృష్ణ యింటికి వెళ్ళాడు. అతను డాబామీద అటూఇటూ హుషారుగా తిరుగుతున్నాడు. మిత్రుడ్ని చూసి, రా రమ్మని పైకి పిలిచి, ముందుగా వేసిన ప్రశ్నయిది: "మీవాళ్ళు వెళ్ళిపోయారా?"
       
    అతనేం జవాబు చెప్పలేదు వెంటనే.
   
    "వెళ్ళిపోయినట్లున్నారు-నీ మొహం చెప్పటంలా."
   
    శివనాథరావు జంకుతూ జంకుతూ "ఇంకా వెళ్ళిపోలేదురా" అని చెప్పాడు.
   
    కృష్ణ వెంటనే పెదవులు బిగించాడు. ఓ క్షణం ఎగతాళిగా నవ్వి, మరుక్షణంలో ముఖం గంభీరంగా మార్చి "మంచివాడివే ఈ సంధ్యా సమయంలో ఇలా వంటరిగా ఏ మొహం పెట్టుకుని వస్తావురా? పోపోపో చప్పున పో, మీ యింటికి పో" అన్నాడు.
   
    "అది కాదురా....."
   
    "నిముషాలు వేస్టయిపోతున్నాయి. మధురమైన సాయంత్రం మరుగునపడుతోంది. అరే! ఇంకా నిల్చుంటాడూ?"
   
    "నే చెప్పేది వినరా."
   
    "అరే! వెళతావా, తన్నమంటావా?"
   
    ఛీ అనుకుని బయటకు వచ్చేశాడు. ఒట్టి క్రూరుడు. హృదయంలేదు అని నిందించాడు మనసులో.
       
    "అరే! వెళతావా, తన్నమంటావా?"
   
    ఛీ అనుకుని బయటకు వచ్చేశాడు. ఒట్టి క్రూరుడు. హృదయంలేదు అని నిందించాడు మనసులో.
   
    ఒకచోట నిలబడి ఎక్కడకుపోదామా అని ఆలోచించాడు. చంద్రం యింటికి పోవాలన్న కోరిక కలిగింది. రెండు ఫర్లాంగులు నడవాలి. అంతే.....వెళ్ళేసరికి చంద్రం యింట్లో కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నాడు. వచ్చి కూచోమని యిలా అన్నాడు. "నా దృష్టిలో మానవుడికి అతీతమైనదేమీ లేదంటాను. రెండేళ్ళలో ఇండియాలో నన్ను మించిన ఫాస్టుబౌలరు లేడనిపిస్తాను. గిల్ క్రిస్టును తల దన్నకపోతే ఛాలెంజి...చూడు ఇవాళ ప్రొద్దుటినుంచీ నూటయాభయిసిగరెట్లు కాల్చాలని పందెం వేసుకున్నాను. ఇంకా ఆరన్నా కాలేదు, అప్పుడే నూటపాతిక కాల్చాను." నాయి ఓ మూలాన వున్న సిగరెట్ పీకల్ని చూపించాడు గర్వంగా.
   
    శివనాథరావుకు మనసు చివుక్కుమంది. జాలి అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించుకుని యింక ఎక్కడైనా జాగా వుందేమో వెదుకుతోంది. అతని భుజంమీద చెయ్యివేసి ప్రేమగా "ఎందుకొచ్చిన పందేలు చెప్పు యివన్నీ."
   
    చంద్రం జవాబు చెప్పకుండా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు.

 Previous Page Next Page