Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 10


    "ఎందుకు?"
    "మీరు చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి- మీ పనేదో మీరు చూసుకుంటారు కాబట్టి - ఎప్పుడూ ఒక్క జడే వేసుకుంటారు కాబట్టి- ఎప్పుడూ హాఫ్ వాయిల్ చీరలే కట్టుకుంటారు కాబట్టి- ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది రాధగారూ! అన్నీ కలిపితే ఒకే పదం- 'లైక్'. ఐ లైక్ యూ! అందుకే మీతో మాట్లాడాలనీ, స్నేహం పెంచుకోవాలనీ అనుకుంటూ వుంటాను."
    "నేనలా అనుకోను" అంది రాధ. "నాకు మాటలాడటం- మనసులో భావాలు వెలిబుచ్చటం సరిగ్గా రాదు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఒక కామన్ అభిరుచి వున్న విషయాలు మాట్లాడుకోవటానికీ, పరస్పర అభిప్రాయాలు తెలుసుకోవటానికీ స్నేహం అవసరమే. కానీ ఆ స్నేహం స్వజాతి అయితే బావుంటుందని నా ఉద్దేశ్యం. ఒంటి జడా, హాఫ్ వాయిలూ, నచ్చటం.... ఉహు - నాకెలా చెప్పాలో తెలియడంలేదు. మానసికంగా పవిత్రంగా వుండటం నాకు ఇష్టం. ఒకబ్బాయితో స్నేహం చేస్తేనే పవిత్రత పోతుందా అని మీరనొచ్చు. కానీ నేను చిన్నతనం నుంచీ అదే వాతావరణంలో పెరిగాను కృష్ణగారూ! నన్ను క్షమించండి. స్నేహం అనేది చాలా మామూలు పదం- ప్రేమ అనేది చాలా గొప్ప పదం. అయితే ఆ స్నేహమూ- ఆ ప్రేమా అంతా నా ఒకే ఒక స్నేహితుడు- నా భర్తతోనే చెయ్యదల్చుకున్నాను. నా ఉద్దేశ్యంలో ప్రేమ పెళ్ళితోనే ప్రారంభం అవుతుందని, అంతకు ముందంతా ఆకర్షణ మాత్రమే అని. స్నేహం పేరిట ఆ ఆకర్షణలో పడటం నా కిష్టంలేదు."
    కళా విహీనమైన మొహంతో తాండవకృష్ణ "మిమ్మల్ని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు" అన్నాడు.
    "నన్ను చేసుకోవటంవల్ల ఆర్ధికంగానూ, ఇంకే విధంగానూ సుఖపడనివాడ్ని కనీసం ఈ విషయంలోనైనా అదృష్టవంతుడిని కానివ్వండి." అంది.
    "నేను వెళ్ళొస్తాను."
    "మంచిది కృష్ణగారూ, నన్ను క్షమించండి".
    ఆమె ముందుకు సాగిపోయింది. కృష్ణ వెనుదిరిగాడు.
    జీవితంలో మొట్టమొదటిసారి ఓటమి అది.
    వాళ్ళకి వందగజాల దూరంలో ఒక వ్యక్తి కారులో కూర్చొని వున్నాడనీ- ఎత్తి వున్న కూలింగ్ గ్లాసెస్ వెనుకనుంచి తననే గమనిస్తున్నాడనీ కృష్ణకి తెలీదు.
    కృష్ణ వెనుకే ఆ కారూ కదిలింది.
    సాయంత్రం ఆరున్నర కావొస్తూంది.
    అతడి మనసు చిరాకుగా వుంది. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. అతడి తాగుడు పెద్దగా అలవాటులేదు. కానీ ఆ సాయంత్రం అతని కెందుకో బాగా తాగాలనిపించింది. అతడికున్న వ్యసనం ఒక్కటే- స్త్రీ! స్వతహాగా అందగాడు. ఒంటరివాడు, డబ్బు ధారాళంగా ఖర్చుచేస్తాడు. అటువంటి వాడికి స్త్రీ అంటే తేలిక అభిప్రాయం వుండటంలో ఆశ్చర్యం లేదు. అతడి చుట్టూ అటువంటి స్త్రీలు చేరటం దురదృష్టం.
    చిప్స్ తోపాటూ ఒక పెగ్ విస్కీకి ఆర్డరిచ్చి అతడు కుర్చీ వెనక్కి వాలి కూర్చున్నాడు. ఓ అమ్మాయి అతడితో ఆ విధంగా మాట్లాడటం అదే మొదటిసారి. బ్రెయిన్ వాష్ జరిగినట్టుంది. ఆమె మాటల్లో లాజిక్ కనబడుతూంది. అయితే అంతకన్నా ఎక్కువగా ఏదో తెలియని కసి పెరిగిపోతోంది.
    అంతలో వెయిటర్ వచ్చాడు. గ్లాసూ, చిప్సూ పెట్టి వెళ్ళిపోయాడు. సోడా పోసుకుని, నోటి దగ్గిర పెట్టుకోబోతూంటే ఒకవ్యక్తి అతడి దగ్గిరకి వచ్చాడు.
    "మీ కభ్యంతరం లేకపోతే నేనిక్కడ కూర్చోవచ్చా?"
    "ష్యూర్" అన్నాడు కృష్ణ.
    "నా పేరు రాముడు- పరశురాముడు"
                                          *    *    *
    అరగంటలో ఇద్దరూ ఆత్మీయులయ్యారు. తాండవకృష్ణ పరశురాముడ్ని అన్నివిధాలా తన గురువుగా వప్పేసుకున్నాడు. అంతేకాదు. అన్ని రంగాల్లో అన్ని తెలివితేటలున్నవాడు, ఈ సామాన్యమైన బారుకి రావటం, అదీ తన టేబిల్ లోనే కూర్చోవటం తన అదృష్టంగా భావించాడు. అప్పటికి మూడో పెగ్ తాగుతూ వుండబట్టి, మరింత ఆత్మీయతతో తన పెర్సనల్ అనుభవాలూ, ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ అంతా వివరంగా చెప్పేశాడు. 
    "పెళ్ళితోనే ఆవిడకి ప్రేమ మొదలవుతుందట గురూగారూ. అంతవరకూ ఆవిడగారు అసలు మొగాడివైపు కన్నెత్తి కూడా చూడదట. నేను చాలా మంచి మనసుతో స్నేహం చేద్దామనుకుంటే, ఆ స్నేహం కూడా భర్తతోనే చేస్తుందట. దీనికన్నా చెప్పుతో కొట్టినా బాధపడేవాడ్ని కాను, నవ్వుతూనే ఘోరంగా దెబ్బతీసింది."
    "ఆవిడ అన్నదాన్లో తప్పేం కనబడలేదే-" అన్నాడు పరశురాముడు. నిజానికి ఆ అనటంలో అతడి ఉద్దేశ్యం, కృష్ణని మరింత కవ్వించటమే. డిఫెన్స్ ఆడుతున్నకొద్దీ అవతలివ్యక్తి అఫెన్సయి పోతాడు.
    "తప్పా తప్పున్నరా- అసలావిడ ఉద్దేశ్యం ఏమిటి? 'ఒరే వెధవా, నీ కసలు స్నేహం అంటే తెలీదు. ప్రేమంటే అంతకన్నా తెలీదు- నీదంతా సెక్స్ మయం అని'. అంతేగా?"
    పరశురాముడు మాట్లాడలేదు. ఒక క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకునే జేబులోంచి చుట్టతీసి వెలిగించాడు. తరువాత చూపుడు వేల్తో గెడ్డం రాసుకుంటూ కృష్ణతో అన్నాడు.
    "అనుభవిస్తే అటువంటి అమ్మాయినే అనుభవించాలి. లేకపోతే వెధవ జీవితం ఎందుకూ-"
    "కరెక్టుగా చెప్పారు గురూగారూ!"
    "అంత సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయి నిజంగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ పొంగి వస్తుంది. అలాంటివాళ్ళు శారీరకంగా ఇచ్చే ఆనందం మామూలు కాగితంపువ్వు లివ్వలేవు" అన్నాడు పరశురాముడు సాలోచనగా- "అలాంటి అనుభవం ఒకటి చాలు జీవితం మొత్తానికి-"
    ఎగ్జయిట్ మెంటుతో కృష్ణ కుర్చీలో సగం లేచి, "సరిగ్గా నేనూ అదే అనుకొంటున్నను గురూగారూ. అబ్బా! నిజంగా అలాంటి అమ్మాయి ప్రేమని ఆస్వాదించటం కంటే మొగాడికి ఏం కావాలి?" అన్నాడు.
    పరశురాముడు మాట్లాడలేదు. మళ్ళీ చుట్ట పీలుస్తూ కళ్ళు మూసుకున్నాడు. కృష్ణకి మాత్రం ఒక ముసలివాడు తన స్థాయికి దిగి ఆలోచించటం భలే థ్రిల్లింగ్ గా వుంది. పరశురాముడు చుట్ట నుసి యాష్ ట్రేలో వేస్తూ, "ఆ అమ్మాయి మాటలు బట్టి, ప్రేమ పేరుతో ఆమెని కన్విన్స్ చేయటం కష్టమని తోస్తూంది. నువ్వో రెండు సంవత్సరాలు కష్టపడ్డా పెళ్ళి చేసుకోకుండా ఆ అమ్మాయిని ముట్టుకోలేవు. ఔనన్నట్టు తనని నువ్వెందుకు పెళ్ళి చేసుకోకూడదూ?"
    "అలా పెళ్ళి చేసుకునేటట్టయితే ఈ గొడవలన్నీ దేనికి స్వామీ-"
    "పెళ్ళనేదంత ఘోరమైన - భయంకరమైన విషయమా"
    "కాదా?"
    "ఏం కాదు, ఒక పెద్ద బోర్డూ- పెయింటూ 'రిజిష్టర్ ఆఫీసర'ని వ్రాయటానికి ఒక బ్రెష్షూ, మన మనుష్యులు ఒకరిద్దరు ఉంటే చాలు."
                                               6
    రేడియో స్టేషన్ లో పనిచేసే వాళ్ళేకాక, కాంట్రాక్టు ఆర్టిస్టులు అని కొంతమంది ఉంటారు. వీళ్ళ జీవితం దినదిన గండంలా వుంటుంది.
    ఏ క్షణాన పడితే ఆ క్షణాన కారణం చెప్పకుండా వీళ్ళని తీసెయ్యొచ్చు. రేడియో స్టేషన్ పుట్టిన గత ముప్పయ్యేళ్ళుగా వీళ్ళకు జీతాలేగానీ, డి.ఏ.డి.పి.లు లేవు. అంతేకాదు, ఈ కాంట్రాక్టు ఆర్టిస్టులు ఎంతసేపు పనిచేసినా ఓవర్ టైం రాదు. 1964 లో శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా కల్పించుకుని కొన్ని సంస్కరణలు చేసినా ఇంకా పరిస్థితి పూర్తిగా బాగుపడలేదు. ఒక న్యూస్ రీడర్ జీవితాంతం న్యూస్ రీడర్ గానే వుంటాడు. ఇంక్రిమెంట్లు (కొంతకాలానికి అవి ఆగిపోతాయి) తప్ప ఇంకేమీ వుండవు. సంవత్సరానికి యాభై, అరవై లక్షలు ఖర్చుపెట్టే ఒక కేంద్రం అందులో పనిచేస్తున్న ఇరవై మంది ఉద్యోగస్తులకి మంచి జీతం ఇవ్వటానికి తటపటాయిస్తుంది. అయిదుకోట్ల రూపాయల లాభాలు కమర్షియల్ బ్రాడ్ కాస్ట్ ద్వారా వస్తున్నా స్టాఫ్ కి బోనస్ లేదు. ఇంత పెద్ద సంస్థలో ఇన్ని రేడియో కేంద్రాలు నిర్విరామంగా పని చేస్తున్నా అన్ని రేడియో స్టేషన్ లలో కలిపి మొత్తం మీద మూడు వేలమంది మాత్రమే ఆర్టిస్టులున్నారంటే ఎంత శ్రమతో వాళ్ళు పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. వీళ్ళకు ఫామిలీ పెన్షన్ లేదు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లేవు.  
    ఆల్ ఇండియా రేడియోకి హాలిడే లేదు. పండుగ రోజుల్లో మరింత ఎక్కువ పనిచెయ్యాలి. ప్రొద్దున్న అనిలేదు. రాత్రని లేదు. వానలేదు... తుఫాను లేదు. పని..... పని.... పని. గుర్తింపులేని పని.
    ఆగష్టు 1973 లో ఆల్ ఇండియా స్టాఫ్ ఆర్టిస్టుల యూనియన్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు తమ కోర్కెలు మానేజ్ మెంట్ కి విన్నవించారు. ఫలితం దక్కలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. యూనియన్ సహనం నశించింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ రంగంలోకి వచ్చింది.
    నిరాశా దినంగా, 24 మేన స్ట్రయిక్ చేస్తున్నట్టు నోటీసు పంపేరు.
    పరిస్థితిని అదుపులో ఉంచవలసిన బాధ్యత పార్థసారథి మీద పడింది.
                   *    *    *
    పరశురాముడితో కలిసి ప్లాను ఆలోచించేక రాధ ఒంటరిగా ఉన్నప్పుడు, రేడియో స్టేషన్ లో టేపులు అందిస్తున్న సమయాన వాటి మధ్యగా కృష్ణ ఒక కాగితాన్ని పెట్టి ఇచ్చేడు. అందులో ఇలా వుంది-
    "రాధగారూ, మనిషిని ప్రభావితం చేసేది అనుభవమేనని ఎక్కడో చదివేను. ఆ రోజు మీరన్న మాటలు నా చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఇద్దరు వ్యక్తులు పరిపూర్ణమైన స్నేహంతో దగ్గిరవ్వాలీ అంటే ప్రేమతో పాటూ పెళ్ళి కూడా అవసరమే. నేను మీ బామ్మగారితో మాట్లాడతాను. మిమ్మల్ని అడిగినప్పుడు దయచేసి 'ఊ' అనండి. చాలు"
    ఇంతే వుంది అందులో.
    రాధకి ఇదంతా కలో నిజమో అర్ధం కాలేదు.
    కృష్ణ మారేడా?.... కేవలం తన మాటలవల్ల మారేడా?.... ఆమెకి సంతోషం వేసింది. కొంచెం అమాయకత్వం... కొంచెం గర్వంతో కూడిన సంతోషం.
    ప్రతి స్త్రీ పురుషుడ్ని క్షమించినట్లే, ఆమె కూడా క్షమించింది. నిండు మనసుతో అతడ్ని స్వీకరించటానికి సిద్ధపడింది. ఒక మనిషి తన అభిప్రాయాన్ని మార్చుకోవడం అంత సులభం కాదనీ- మన చుట్టూ ఉన్న మనుష్యులు మనకి కనబడేటంత అమాయకులు కారనీ ఆమెకు తెలీదు. 

 Previous Page Next Page