Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 11


    ఆ సాయంత్రం ఇంటికెళ్ళేవరకూ ఆమె మనసంతా ఉద్విగ్నతతో నిండివుంది. తన ఆలోచనలకీ అభిప్రాయాలకీ ఋజువు దొరికినందుకు కలిగిన ఉద్విగ్నత అది. ప్రేమ అనేది పెళ్ళి ద్వారానే సాధ్యపడుతూంది అన్నది ఆమె థియరీ. అది నిరూపించబోతూంది. ఇన్నేళ్ళు వచ్చేవరకూ మనసు చలించకుండా కాపాడుకుని, ఇప్పుడు తన జీవిత భాగస్వామికి సర్వస్వం అర్పించబోతూంది. ప్రేమించటంలో ఇంత పవిత్రత వున్నందుకు అది పెళ్ళి ద్వారానే పరిపూర్ణత సాధించాలనే తన నిశ్చయాన్ని ఒక కుర్రవాడు బలపర్చబోతున్నాడు అన్నది ఆమెకి సంతోషం కలిగిస్తున్న విషయం.
    ఆమె మొహంలో వెల్లివిరుస్తూన్న సంతోషాన్ని జయ పసిగట్టింది.
    "ఏమిటీ విషయం?" అన్నది.
    అప్పుడే రాధ, విషయం చెప్పివుంటే ఈ కథ ఇంకో మలుపు తిరిగి ఉండేదేమో! కానీ ఆమె చెప్పలేదు. చిరునవ్వుని పెదవులు మధ్య అదిమిపెట్టి "ఏమీ లేదే...." అంది.
    "ఏదో వుంది. అది నీ మొహం చూస్తూనే తెలుస్తూంది. చెప్పు"
    "ఏం లేదు" అని రాధ అక్కణ్ణుంచి దాదాపు పారిపోయినట్టూ తూనీగలా వెళ్ళిపోయింది.
    .... ఆమె ఇంటికి వస్తూ ఆలోచించింది-
    -ఇదంతా ప్రేమేనా అని.
    కృష్ణ మీద అప్పుడే అభిమానం మొదలైందా?
    అతడు ఉపయోగించిన పదం- ఏమిటది- లైక్ -ఆఁ - 'లైక్' - అది మొదలైందా- అదే 'ప్రేమ'కిది మొదటి మెట్టా? ఆమె ఇవన్నీ ఆలోచించదల్చుకోలేదు. ఆలోచించటం అనవసరం. ఇంకొద్ది రోజుల్లో ఎలాగూ వివాహం జరగబోతూంది. ఇక ఆలోచన లెందుకు- కాంట్రడిక్ష నెందుకు?
    - అన్న ఆలోచనలలో ఆమె నిమగ్నమై వున్న సమయానికి అంటు కృష్ణ, పరశురాముడు రిజిస్ట్రాఫీసు అలంకరణతో మునిగి వున్నారు.
    "ఆ బల్ల ఇలా జరుపు. ఆ కాలింగ్ బెల్ ఈ మూల పెట్టు. కాళ్ళ దగ్గిర వేస్ట్ పేపర్ బాస్కెట్ పెట్టు" అని సూచనలు ఇస్తున్నాడు పరశురాముడు. మాడిజం సభ్యుడు ఒకరు ఫ్యూన్ డ్రస్ లో పన్లు చేస్తున్నాడు. పరశురాముడు రిజిస్ట్రార్ డ్రస్ లో వున్నాడు. అక్కడ డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. సెకెండ్ హాండ్ పుస్తకాలు కొన్ని అక్కడ పెట్టారు. ఒక పెద్ద బౌండ్ లెడ్జెరు టేబిల్ మీద వుంచబడింది. మొదటి పది పేజీల్లో రామారావు- సీత, అర్జునరావు- సుభద్ర లాంటి దంపతుల పేర్లు వ్రాయబడ్డాయి. పరశురాముడే వ్రాత మార్చి రకరకాల సాక్షి సంతకాలు చేశాడు.
    అదంతా అయిన తరువాత పరశురాముడు కృష్ణవైపు తిరిగి, "వెళ్ళి తీసుకురా" అన్నాడు.
    కృష్ణ తెల్ల మొహంవేసి "ఇప్పుడా" అన్నాడు.
    "మరి?" విసుగ్గా చూసేడు పరశురాముడు, ఇంత చిన్న విషయం తెలీదా అన్నట్టు. "ఓ పదిరోజులు పోయాక, ఈ లోపులో ఇది అందరికీ తెలిసి, 'రిజిస్ట్రాఫీసు వద్దు- మేం పందిట్లో చేస్తాం' అని అనేవరకూ ఆగుతావా ఏమిటి? వాళ్ళకు అసలు ఆలోచనకి తావివ్వకుండా అన్నీ తొందర తొందరగా చేస్తే గానీ లాభం లేదిటువంటి విషయాల్లో-"
    కృష్ణ ఆలోచనలో పడ్డాడు. ఒకటి రెండు రోజుల్లో రాధని పెళ్ళికి ఆయత్తపరచటం- అదీ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళికి వప్పించటం - చాలా కష్టం. ఎలా?
    అంతలో అతడికి ఓ ఆలోచన స్పురించింది.
    బామ్మ! 
    అవును. రాధ బామ్మ ఒక్కతే ఈ విషయాన్ని సులభతరం చేయగలదు.
    ....అయిదు నిముషాలలో అతడు రాధ వాళ్ళ ఇంట్లో వున్నాడు. పదో నిమిషంలో బామ్మకి స్నేహితుడై పోయాడు. పన్నెండో నిముషంలో వరుస కలిపేసేడు. పదిహేనో నిమిషంలో విషయం చెప్పేడు.
    "అదీ బామ్మగారూ విషయం. నాకా ఎవరూ లేరు. ఆకాశమంత పందిరివేసి చేసుకోగల స్థోమత ఇద్దరికీ లేదు. నాకు రాధ గారంటే ఇష్టం. మీ అమ్మాయిని మీరు కనుక్కోండి. ఈ కాలం ప్రేమలమీద నాకు నమ్మకంలేదు బామ్మగారూ! అందుకని మీరే కనుక్కోండి. మీరు సరేనంటే రేపే ఏర్పాట్లు చేసుకుందాం. చేసుకుందాం అని ఎందుకంటున్నానంటే- మనకి మాత్రం ఎవరున్నారు చెప్పండి. మనం మనం చేసుకోవాల్సిందేగా. నన్ను చూసేరు మీరు. నా వివరాలన్నీ చెప్పాను. ఇక మీ ఇష్టం." 
    బామ్మ ఆనందంతో తబ్బిబ్బవుతూ "అదేమిటి నాయనా- అసలు మేమే మా గురించి చెప్పుకోవాలి. అటువంటిది నువ్వు అడుగుతున్నావంటే నా కసలు నోట మాటే రావటంలేదు. ఇంకో అరగంటలో అదీ వస్తుంది నాయనా! రాగానే అడుగుతాను. అయినా అడగటానికి కేముందిలే. నీలాటబ్బాయిని ఎవరైనా కళ్ళ కద్దుకొని చేసుకుంటారు."
    కృష్ణ వెళ్ళిపోయిన అరగంటకి రాధ వచ్చింది. ఆ రాత్రి బామ్మ విషయాన్ని కదిపింది.
    "అబ్బాయి చాలా బావున్నాడే. నమ్రతగా వున్నాడు. ఎంతో వినయంగా మాట్లాడేడు. అతడు చేసుకుంటానని ముందుకు రావటం మన అదృష్టం."
    రాధ "నాకు అతను తెలుసు బామ్మా!" అంది.
    "మరి ఏం చెబ్తావే-"
    హరికేన్ లాంతరు మసక వెలుతుర్లో రాధ తలవంచుకుని నునుసిగ్గుతో తనలో తనే నవ్వుకోవటం బామ్మ మసక కళ్ళకి అస్పష్టంగా కనబడింది.
                                            *    *    *
    పార్థసారథి ఒకవైపు స్ట్రయిక్ గొడవల్లో సతమత మవుతూంటే ఇంకో సంఘటన జరిగింది.
    నాటకం రికార్డ్ చెయ్యటానికి కావలసినంత శ్రద్ధ తీసుకొనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లు చాలా తక్కువ. తెలుగు డ్రామా ప్రెక్స్ రాఘవరావు అటువంటి కోవకు చెందినవాడే. సినిమా వాళ్ళతో తిరగటం, తాగుడులాంటి అన్ని వ్యసనాలూ వున్న ఆ వ్యక్తి. నాటకపు అడిషన్ లో ఎన్నిక కాబడి, సంవత్సరాల తరబడి ఛాన్సురాక ఎదురుచూసే నటులు అనేకమంది వుండగా కేవలం ప్రోగ్రాంకి ఒకరోజు ముందు, కావల్సిన 'జనాన్ని' పోగుచేసి అయిందనిపిస్తాడు.
    ఐతే రాఘవరావు నిర్వహిస్తున్న పనికూడా తక్కువదేమీ కాదు. సంవత్సరానికి పన్నెండు వందల స్క్రిప్టులు చదివి ఎన్నిక చేయాలి. స్క్రిప్టులలోంచి వ్యాపార సంబంధమైన వస్తువుల్ని తొలగించాలి. (చాలామంది రేడియో రచయితలకి హార్లిక్స్, సర్ఫ్ లాటి పేర్లు వాడకూడదని తెలీదు.)
    ఆ రోజు ఆ కేంద్రం నుంచి ఒక నాటకం ప్రసారం కావల్సివుంది. పేరున్న రచయితది అవటంవల్ల స్క్రిప్టు విషయంలో ప్రెక్స్ కొంచెం అజాగ్రత్తగా వున్నాడు. అందులో వెనుకబడిన జాతి అని వాడవలసిన చోట 'నీచ జాతి' అన్న పదం పడింది. అలాగే ప్రసారమయి లక్షలాది శ్రోతలకి చేరుకొంది. ఇది జరిగిన పది రోజులకి అసెంబ్లీలో ఈ విషయం చర్చకొచ్చింది. ఆల్ ఇండియా రేడియో కేంద్రానికి సంబంధించినా సరే- అసెంబ్లీలో క్షమాపణ చెప్పుకోవలసిందే నన్నారు.
    స్టేషన్ ముఖ్యాధికారిగా క్షమాపణలు చెప్పుకొమ్మని యూనియన్ మినిస్ట్రీ నుంచి డైరెక్టర్ జనరల్ ద్వారా పార్థసారథికి ఉత్తర్వు వచ్చింది. అతనికి రెండో దెబ్బ.
    వచ్చినప్పుడు అన్నివైపుల్నుంచీ కష్టాలు ముంచుకొస్తాయంటారు. అతడి విషయంలో అలాగే జరిగింది.
    పార్థసారథి పని ఇరకాటంలో పడింది. ఒకవైపు స్ట్రెయికు, ఇంకోవైపు అసెంబ్లీలో క్షమాపణ చెప్పుకోవటం.
    కష్టాల్లోనే మొగవాడు ఒంటరితనం ఫీలవుతాడు.
    సీట్లో కూర్చోవటం యిష్టంలేక అతడు రాము బయటికి వచ్చాడు. గాలికి చెట్లు నెమ్మదిగా వూగుతున్నాయి. కారిడార్ లో వెళుతూంటే జయ కనబడింది.
    "..... ఎలావుంది మీ సెక్షను" అని అడిగాడు నడుస్తూ పార్థసారథి - జయకి అతడి వేగాన్ని అందుకోవటం కష్టంగా వుంది.
    తొంరగా తొందరగా నడుస్తూ "బానేవుంది సార్" అన్నది.
    మెయిన్ బిల్డింగ్ పక్కనే అశోక వృక్షాలు, దూరంగా గార్డ్ రూమ్ పక్కనే ఎక్చ్సేంజి- దాటి లోపలికి వస్తే రికార్డింగ్ రూమ్స్- డ్యూటీ ఆఫీసర్ రూమ్- పక్కనే అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ రూము.  
    పార్థసారథి మౌనంగా తన గదివైపు నడుస్తున్నాడు.
    అతడితోపాటే వెళ్తూన్న జయ కొద్దిగా తటపటాయింపుతో "సర్" అన్నది.
    అతడు ఏమిటన్నట్టు చూశాడు.
    ఆమె అడగనా వద్దా అన్నట్లు సంశయిస్తూ, ఇంగ్లీషులో "ఈ మధ్య మీరు అదోలా వుంటున్నారు...." అన్నది.
    ఇంకేదో ప్రశ్న ఆశించిన సారధి - అకస్మాత్తుగా తన విషయం - అదీ తన క్రింద పనిచేసే ఉద్యోగినుంచి వచ్చేసరికి తెల్లబోయాడు. అంతలోనే ఆ ప్రశ్న అర్ధమయి అందులో వాస్తవం వుండటంచేత, అదీగాక ఆ ప్రశ్న ఒక స్త్రీ అడగటంతో, ఎన్నాళ్ళనుంచో మనసు ఫీలవుతున్న "వాక్యూమ్" ని స్పందించి- మళ్ళీ తన పొజిషన్ గుర్తుకొచ్చి మామూలుగా అయిపోయి, "ఏమీ లేదే...." అన్నాడు.
    క్షణంలో వెయ్యవవంతుసేపు అతడి మొహంలో కదలాడిన భావాల్ని గుర్తించలేని చిన్నపిల్లకాదు ఆమె. అయినా మరి దాన్ని గురించి రెట్టించలేదు. అయితే సారధి అదోలాటి గిల్టీ ఫీలయ్యాడు. అతడి ముప్పై ఏడేళ్ళ జీవితంలో "ఏం అదోలా వున్నావ్" అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు. అతడి కెందుకో తన రూమ్ లోకి వెంటనే వెళ్ళిపోయి పని మామూలుగా ప్రారంభించ బుద్ధి కాలేదు.
    తన రూమ్ దాటి ముందుకు సాగేడు. ఆమె అతడితో పాటు నడిచింది.
    అక్కడ్నించి కిందకి మళ్ళీ మెట్లున్నాయి.
    అవి స్టేషను వెనుక వైపుకి వెళతాయి. యువరాణి, టాక్స్ పక్కనే పెద్ద వాటర్ టాంక్- వాటిని దాటితే టేప్స్ లైబ్రరీ.
    వాటిని చూడగానే- "ఏమిటి టేప్స్ లో చాలా తేడా వస్తూందట. ఎ.పి.సుబ్రహ్మణ్యం చెప్పాడు" అన్నాడు.
    కాజువల్ స్టాఫ్ కూడా టేప్స్ యింటికి తీసుకుపోవచ్చు. మరి తేడా రాకేం చేస్తుంది. అందులో లైబ్రేరియన్ సుషమా చక్రవర్తికి రికార్డ్స్ చూసుకోవటం కన్నా తన మొహం అద్దంలో చూసుకోవడమే ఎక్కువ ఇష్టమాయె.
    "టేప్స్ సంగతి ఫర్లేదు సార్! ఆఫీసులో అందరూ అనుకోవటం, మన వ్యాన్ లూ, వెహికల్స్ ఖర్చు- చేయవలసిన దానికంటే ఐదు రెట్లు ఎక్కువ అవుతుందని".

 Previous Page Next Page