Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 9


    రాధ జరిగిందంతా చెప్పింది.
    "పద-పద- పద- ముందు కాంటీన్ ని పరిచయం చేస్తాను. అక్కడ టిఫిన్ తింటే మరీ జన్మలో తినబుద్ధి వెయ్యదు. తరువాత మన వాళ్ళందర్నీ పరిచయం చేస్తాను. అందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డులో చాలా గొప్పవాళ్ళు. కానీ, వాతావరణం వాళ్ళని మన్నుతిన్న పాముల్లా చేసింది."
    ఇద్దరూ కాంటీన్ చేరుకున్నారు. కాఫీ తాగుతుంటే ఓ వ్యక్తి ఎదురుగా రావటం చూసి, విజయ రాధవైపు తిరిగి "పరిచయాలు ఇక్కణ్ణుంచే మొదలు పెడ్తాను-" అని తిరిగి "నా స్నేహితురాలు రాధ. ఈ రోజే జాయినయింది" అంది.
    "హౌ ఆర్యూ?" అంటూ చేయి సాచేడు.
    జయ అన్నది "వంటికి పూల పూల షర్టు- మొహం మీదెప్పుడూ నవ్వు- చేతిలో స్కూటరు. ఇతడి పేరు కృష్ణ- తాండవకృష్ణ"
    రాధ బెదిరిపోయి, రెండు చేతులూ జోడించింది.
    "మా మేనకోడలు సుమిత్ర మీకు తెలుసాండీ" రాధని అడిగేడు కృష్ణ నవ్వుతూ. రాధ మాట్లాడలేదు. జయ ఇద్దరివేపూ ఆశ్చర్యంగా చూసింది. అతడు వెళ్ళిపోయాక, "నీకు తెలుసా ఈ అబ్బాయి" అని అడిగింది జయ.
    "తెలుసు"
    "ఎలా?"
    "ఓ రోడ్ సైడ్ రోమియోగా."
                                           *    *    *
    రాధ జాయినయి అప్పటికి నాలుగు నెలలయ్యింది. ఆమె చదివింది ఉమెన్స్ కాలేజీలో. సాధారణంగా బిడియస్తురాలవటం చేత ఆమెకి నలుగుర్లో కలిసిమెలిసి తిరగటం అలవాటు కాలేదు. ఇప్పుడు ఇంతమంది మొగాళ్ళమధ్య పని చెయ్యటం ఆమెకి కొంచెం కష్టంగానే వుంది. అయితే చాలాకాలం నుంచీ అనుభవీస్తున్న బీదరికపు కష్టాలు కొద్దికొద్దిగా డబ్బువల్ల పరిష్కారం అవుతూ రావటంతో ఆమె కొత్త ఉత్సాహాన్ని పుంజుకొంటూంది.
    ఆమెకి రేడియో స్టేషన్ నచ్చింది.
    దేశం మొత్తంమీద పంక్చువాలిటీకి అగ్రతాంబూలం ఇచ్చేది ఈ కార్యాలయం ఒక్కటే. జనం అంతా వాచీలు కూడా దాని ప్రసారాలబట్టే మార్చుకొంటారు. రేడియోలో అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రతిరోజూ పదింటికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లందరూ ఒక గంటసేపు మీటింగ్ జరిపి, ఆ క్రితం రోజు జరిగిన ప్రసారాల విషయమై చర్చించుకుంటారు. వాటిని ఇంకా ఎలా బాగుపర్చాలా అని ఆలోచిస్తారు. లావుగా, బొద్దుగా వుండే లైబ్రేరియన్ కల్పనా చక్రవర్తి, తెలుగు స్క్రిప్ట్ రైటర్ అశోక్, అనౌన్సర్ రాఘవా ఆమెకి నచ్చారు.
    జనరంజని ప్రసారంచేసే కమర్షియల్ బ్రాడ్ కాస్టింగ్ సెక్షన్ ఆఫీసూ- పాటకీ పాటకీ మధ్య టింగ్ టింగ్ మని కొట్టటం, అక్కడి వ్యక్తులూ ఆమెకి గమ్మత్తుగా కనిపించసాగారు.
    వీటన్నిటిమధ్యా ఆమెని కలవరపరుస్తున్నది కృష్ణ. ఆమె ఎక్కడుంటే అక్కడికి ఏదో ఒక పని కల్పించుకుని వచ్చేవాడు, పలకరించేవాడు. అతడిని కాదనటానికి ఆమె సంస్కారం అడ్డువచ్చేది. అతడేమీ అందవిహీనుడు కాదు. మంచి జీతం కూడా వస్తున్నది. అయితే అతడికి స్త్రీపట్ల అంత గౌరవం లేదు. ప్రతీదాన్నీ తేలిగ్గా తీసుకొంటాడు. జీతం అంతా మొదటి పదిరోజుల్లోనే ఖర్చు పెట్టేసి అందరి దగ్గిరా అప్పులు చేస్తూ వుంటాడు. చాలామంది స్త్రీలు అతడి స్నేహం కోసం పాకులాడటం ఆమె గమనించింది. అందులో చిత్రమేమీ లేదు. ఎప్పుడూ హుషారుగా మాట్లాడటం, డబ్బు ధారాళంగా ఖర్చుపెట్టటం దానికి కారణాలను కొంటూ వుండేది. అయితే ఎప్పుడూ గంభీరంగా వుండే అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ సుషమా పాటిల్ కూడా అతడితో స్నేహాన్ని కోరడం ఆమెకి ఆశ్చర్యంగా వుండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. రాధ చేరిన తర్వాత అతడికి మిగతా విషయాలన్నిటి మీదా శ్రద్ధ తగ్గింది. ఈ విషయాన్ని జయ కూడా గమనించింది.
    "ఏమిటి నీ మీద కృష్ణ అంత శ్రద్ధ చూపిస్తున్నాడు?" అన్నది జయ.
    "నాకేం తెలుసు...."
    "అంటే- శ్రద్ధ చూపిస్తున్నాడనే తెలియదా - ఎందుకు చూపిస్తున్నాడో తెలీదా?"
    రాధ మొహం ఎర్రగా కందిపోయింది. "నాకేమీ తెలీదు. అసలిలాటివి యిష్టంలేదు కూడా" అన్నది.   
    "పదహారేళ్ళ అమ్మాయిలా మాట్లాడక. ఇరవై రెండేళ్ళ వయస్సులో నువ్విలా మాట్లాడితే అది గిల్టీకాన్షస్ నెస్ అవుతుంది."
    "నేను మానసికంగా ఎదగలేదేమో! అందుకే నేను సిగ్గుపడుతున్నాను. కానీ ఏం చెయ్యను? సమస్య మనిషిని నొక్కిపెడుతుందికదా" అంది రాధ. కొన్ని నెలల క్రితపు తన జీవితాన్ని తల్చుకొని ఆమె కంట నీళ్ళు తిరిగాయి.
    అది గమనించిన జయ విచలితురాలై "ఐయామ్ సారీ" అంది. అయినా రాధ ఆ మూడ్ లోనే వుండటం గమనించింది. మాట మారుస్తూ ఆమెని మామూలుగా చేయటానికి "నీకూ నాకూ తేడా ఏమిటో తెల్సా?" అని అడిగింది.
    "ఏమిటి?"
    "చెప్పు"
    "నాకు తెలీదు".
    "నిన్ను మొదటిరాత్రి గదిలోకి పంపిస్తూ మీ బామ్మ, "ఒసే రాధా, అబ్బాయి ఏం చేసినా బెదిరిపోకు' అంటుంది. అదే నాకు బామ్మంటూ వుంటే రాత్రి గదిలోకి పంపిస్తూ, 'ఒసే జయా, అబ్బాయిని బెదరగొట్టేయ్యకే' అంటుంది. అంతే తేడా".
    రాధ ఫక్కున నవ్వింది.
    "హమ్మయ్య - నవ్వేవు కదా"
    అంతలో మెసెంజర్ వచ్చి ఒక కవరు యిచ్చాడు- జయాని కో ఆర్డినేటర్ అసిస్టెంట్ గా వేస్తున్నట్టు.
    "కంగ్రాట్స్-" అంది రాధ. కో-ఆర్డినేషన్ లో అంత ఎక్కువ పని వుండదు. జయలాంటి వాళ్ళకి మరీ మంచిది.
    "ఈ సెక్షన్ లోనేనొక రహస్యాన్ని ఛేదించదల్చుకున్నాను".
    "ఏమిటి?" అడిగింది రాధ.
    "ఈ సెక్షన్ లో చీఫ్ విజయప్రకాష్ తెల్సుగా"
    "కథలూ అవీ రాస్తాడు. ఆయనేగా"
    "ఆయనే. ఈ సెక్షన్ లోనే సరళా శంకర్ అనే నలభైఏళ్ళ రచయిత్రి వుంది. ఆమె నవలలు పుంఖానుపుంఖాలుగా ఈ మధ్య వెలువడ్తున్నాయి, చూసేవుగా. జనాలు అనుకోవటం ఏమిటంటే సదరు ప్రకాష్ గారు ఈమె సేవలకు ముగ్ధుడై తన రచనల్ని ఆమె పేరుతో పంపుతున్నాడని! ఆ విషయం కనుక్కోవాలి."
    "వాళ్ళ విషయం మనకెందుకు పోనిద్దూ"
    అంతలో ఎవరో కనబడటంతో జయ అటు వెళ్ళింది. రాధ కూడా సీటు కట్టేసి బస్ స్టాప్ వైపు నడిచింది.
    సాయంత్రం అయిదున్నర కావొస్తుంది. ఏప్రిల్ నెల కావటంతో పగటి ఎండ తాలూకు శ్రమని సాయంత్రపు గాలులు చల్లారుస్తున్నాయి.
    ఆమె స్టాపులో నిలబడ్డ అయిదు నిమిషాలకు బస్ వచ్చింది.
    తన వెనుకే కృష్ణ కూడా యెక్కేడని ఆమెకు తెలీదు. ఆ రోజు ఆమెతో ఎలాగైనా మాట్లాడాలనీ, విషయం కదపాలనీ అతడు నిశ్చయించుకున్నాడు.
    బస్ రెండో స్టాపు దాటిన తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అడిగాడు. మామూలుగా బ్యాగ్ లో చెయ్యి పెట్టిన రాధ షాక్ కొట్టినట్టు నిలబడి పోయింది.
    బ్యాగ్ లో డబ్బుల్లేవు.
    పాలిపోయిన ఆమె మొహం చూసి కండక్టర్ "ఏం లేవా?" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. "డబ్బులు పర్సులో వున్నాయో లేవో కూడా చూసుకోకుండా బస్ ఎక్కేయ్యటమేనా?" ఆమె వంక ఎగాదిగా చూస్తూ అన్నాడు మళ్ళీ.
    ఆమె చాలా సున్నిత మనస్కురాలు. ఆ మాత్రం మాటలకే కళ్ళవెంట నీళ్ళొచ్చేయి. ఒక జులపాల జుట్టువాడు చెవిలో గుసగుసలాడ్తున్నట్టూ "ఇదిగో ఈ అయిదూ వుంచుకో" అన్నాడు. దాంతో ఇక నీళ్ళు ఆగలేదు- బుగ్గలమీద జారేయి. బస్ లో వున్న ఆడవాళ్ళు కూడా నిర్లిప్తంగా చూస్తున్నారే తప్ప పట్టించుకోవటం లేదు.
    వెనుక ఎక్కడో వున్న కృష్ణ జనాన్ని తోసుకుని అక్కడికి వచ్చేసరికి ఆమె బిగ్గరగా ఏడవటం ఒక్కటే తరువాయి.
    "ఏం జరిగింది?" అని అడిగాడు.
    "డబ్బుల్లేవంట సార్! ఇలాగే రెండు మూడు స్టాపులు చూడకుండా వుంటే దిగాల్సిన స్టాపు వచ్చేసేది" అన్నాడు కండక్టర్.
    కృష్ణ వాడిని మింగేసేటట్టూ చూసి, జేబులోంచి అర్ధరూపాయి తీసి "టిక్కెట్టియ్యి ఆమెకి" అన్నాడు. జులపాల జుట్టువాడు సన్నగా విజిల్ వేయబోయి కృష్ణ ఒడ్డూ పొడుగూ చూసి మానుకున్నాడు. పదిహేను నిమిషాల్లో బస్ స్టాప్ వచ్చింది. ఆమెతోపాటు కృష్ణకూడా దిగాడు.
    కొంచెం దూరం ఆమె వెనుకే నడిచాడు. ఆమె వెనక్కి చూడకుండా నడుస్తూంది.
    "నమస్తే"
    ఆమె ఉలిక్కిపడి తలతిప్పి చూస్తే తాండవకృష్ణ. ఆమె కళ్ళలో బెదురు స్పష్టంగా కనిపించింది. తడబాటుతో "నమస్తే"! థాంక్సండీ....." అంది.
    "ఇంటికేనా" అని అడిగాడు.
    "ఊ"
    "అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తారు- రండి కొంచెం కాఫీ తాగుదాం."
    ఆమె తల వంచుకుని మరింత వడివడిగా నడుస్తూ "సారీ" అంది. అతడు ఆమెని వదిలి పెట్టలేదు. వెనుకే వస్తూ "చూడండి, మీరు అనవసరంగా నన్ను చూసి భయపడ్తున్నారు. కేవలం మీతో మాట్లాడడం కోసం నేనిలా రమ్మంటున్నాను" అన్నాడు. అసలే ఆ క్షణం ఆమె మనసు బావోలేదు. ఈ మాటల్తో ఆమెనో రకమైన ఉద్విగ్నత ఆవరించింది. ఏమనుకుంటున్నారు తనని చూసి వీళ్ళంతా? ఏమీ స్వంత అభిప్రాయాలు లేని దాన్లాగా, ఎటు తిప్పితే అటు తిరిగే మరబొమ్మలా కనబడుతోందా తను? చెప్పెయ్యాలి తన ఫీలింగ్స్ అన్నీ! ఏం, తన మనసులో భావాలు స్పష్టంగా చెప్పగలిగే శక్తి తనకు లేదా-
    ఆమె తలెత్తి "ఏం చెప్పదల్చుకున్నారు మీరు- మాట్లాడండి" అన్నది.
    ఆమె అంత చప్పున అలా అడగడంతో అతడు కొంచెం తడబడ్డాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఈ మౌనంలో ఆమెకి మరింత ధైర్యం వచ్చింది. "చెప్పరేం?" అంది.
    "ఇలా నిలదీసి 'మాట్లాడండీ' అంటే నేనేం మాట్లాడను? ఒకటి మాత్రం నిజం. మీరంటే నాకెంతో ఇష్టం".

 Previous Page Next Page