ముసలాయన బెర్తు మీద పడుకున్న రహీంని పలకరించాడు. అతను చలించలేదు. చివ్కారికాయన విసుక్కుని కసిరాడు. రహీం లేచాడు. ముసలాయన కోపంగా- ఈ సామానంతా నీదేనా?" అన్నాడు హిందీలో.
"అవును." అన్నాడు రహీం ఆవలిస్తూ.
"తునిలో సామాన్నీ నిన్నూ దింపేస్తాను..."
"అలా చేయకండీ-" అన్నాడు రహీం యాంత్రికంగా.
"మరేం చేయమంటావ్?"
"ఓ బెర్తు ఇప్పించండి...." అన్నాడు రహీం తాపీగా.
ముసలాయన ఒళ్ళుమండిపోయింది- "చూశారుటండీ. ఇదీ వరస. ఏదో మంచితనానికిపోయి బోగీలో ఎక్కనిస్తే తర్వాత నా నెత్తినెక్కికూర్చుంటారు. ఇప్పుడెవరైనా చూస్తే నేనేదో డబ్బుతీసుకుని ఇలా వదిలేశాననుకుంటారు...
"మిమ్మల్నా- ఎన్థమాత!" అన్నాడు ఈశ్వరరావు. సీట్లు ఇచ్చినపుడందరూ ఆయనకు అయిదురూపాయలనోట్లుఇచ్చారు. ఆయన చిల్లర అడిగితే లేదనికూడా అన్నారు. ఆయన సీరియస్ గా తన పెట్టిలోంచి ఓ మూట తీశాడు. అందులోంచి చిల్లరనోట్లూ అర్ధరూపాయకాసులూ తీసి అందరికీ చిల్లర ఇచ్చేశాడు. ఎవరిదగ్గరా సీటు ఖరీదుకు మించి తీసుకోలేదు.
ముసలాయన రహీంను దెబ్బలాడి విజయవాడదాకా సీటు రాశాడు.
ఇంతలో ముసలాయన కేదో సందేహంవచ్చి చౌదరిని టికెట్ అడిగాడు. చౌదరి ఇచ్చాడు. ముసలాయన దాన్ని పరీక్షగా చూస్తూ- "ఈ అక్షరాలు సరిగా అర్ధం కావడం లేదు..." అన్నాడు
"మీకు తెలియనిదేముందండీ టికెట్ కలెక్టర్సు, డాక్టర్సూ రాసినా అర్ధం చేసుకోవడం చాలా కష్టమండి. ఏదీ స్పష్టంగా రాయరు...." అన్నాడు చౌదరి.
ముసలాయనకాజవాబు వచ్చినట్లులేదు- "చూడండి బాబూ- మా ఉద్యోగాలు-మీలా మల్లెపూవుల్లాంటి బట్టలు వేసుకుని మడత నలక్కుండా గదిలో బల్లముందు కూర్చుని- ఒళ్ళు అలవాకుండా పని చేయడానికి సృస్టించబడలేదు. కదిలే రైళ్ళలో ఈ సమయమని కాకుండా తిరుగుతూంటాం. ఏం చేస్తాం? నిలకడగా రాయడానికి వుండదు. మమ్మల్ని డాక్టర్లతో పోల్చవద్దు..."
చౌదరి గతుక్కుమని నా ఉద్దేశ్యం అదికాదండీ..." అన్నాడు. అతను ముసలాయన్ను నొప్పించినందుకు ఈశ్వర్రావు సంతోషించాడు. చాన్సంటూ వస్తే మాకే తగులుతుంది..." అనుకొన్నాడతను.
"తెలుసులెండి బాబూ- నా దస్తూరి సంగతి చెప్పమంటారా? అది రాసేటప్పుడు ఇద్దరికీ తెలుస్తుంది. రాసేసింతర్వాత ఒక్కడికే తెలుస్తుంది...." అని కుతూహలంగా మిగతావారు చూస్తున్నారా లేదా అని చూశాడాయన.
ఈ జోకు రాజారావు ఐస్ స్టేస్ సాపేక్ష సిద్దాంతం గురించి విన్నాడు. అయినా కుతూహలాన్ని నటిస్తూ చూశాడతను. మిగతావారుకూడా అంతే చేశారు.
"రాసేటప్పుడు నాకూ, దేవుడికీ తెలుస్తుంది. రాసేక దేవుడికొక్కడికే తెలియాలి. నాక్కూడా తెలియదు...." అని ముసలాయన పూర్తిచేసి తనూ నవ్వేశాడు.
అందరూ గలగలా నవ్వేశారు. బాలకృష్ణమాత్రం ఆలోచిస్తునవ్వేడు. రహీం యాంత్రికంగా కొద్దిక్షణాలు నవ్వి మళ్ళీ సీరియస్ గా అయిపోయాడు.
ట్రయిన్ తునిస్టేషన్లో ఆగింది. అక్కడ కోటా సీట్లలో ఒక్కటి మాత్రం కాళీ వుంది. వెయిటింగులిస్టులో ఎవ్వరూ వున్నట్లులేదు. ఈశ్వరరావు లో మళ్ళీ ఆశ ప్రారంభమైంది. అతను ముసలాయన పక్కనచేరి చేతులు సలపడం ప్రారంభించాడు. మిగతా వాళ్ళూ తక్కువ తినలేదు. పోటాపోటీ మీద చేతులు నలుపుతున్నారు. ఇంతలో వీరందర్నీ తోసుకుని ఒక వ్యక్తి వచ్చేడు. ఈశ్వరరావు అతన్ని గుర్తుపట్టి కంగారుపడి పోయాడు. వాల్తేరులో వెయిటింగులిస్టు నంబర్ వన్ అతను. పరిస్థితి ఏమైనా ఇంప్రూవయిందేమో కనుక్కుందామని వచ్చేడతను.
"వెయిటింగులిస్టులో వుంటే వాల్తేర్లోనే బోగీలో ఎక్కవలసింది. తప్పక సాయపడి వుండేవాడిని. ఇంత ఆలస్యంగా వస్తే ఎలా?" అన్నాడు ముసలాయన చిరాగ్గా.
"నాకు తెలియదండి. రైల్వేజర్నీ కొత్త నాకు. పోనీ నా అదృష్టం బాగోలేదనుకుంటాను..." అని వెళ్ళిపోబోయాడతను.
ముసలాయన అతనివంక జాలిగా చూసి- సామర్లకోటలో ఇంకోసారి కనిపించండి. పరిస్థితి చెబుతాను...." అన్నాడు.
ఈశ్వరరావు గుండెల్లో రాయిపడింది.
ట్రయిన్ కదలడానికి ఒక్కనిమిషం సమయముందనగా ఒక ఆడమనిషి ఆ కంపార్టుమెంటులో ఎక్కి కూర్చుంది. ఆవిడను ముసలాయన ముందుచూడలేదు. చూడగానే రిజర్వేషన్ వుందా? అని అడిగాడు.
"లేదండి. మీరిస్తే తీసుకుంటానండి..." అందావిడ.
"అడక్కుండా రిజర్వేషన్ కంపార్టుమెంటులో ఎక్కకూడదని తెలియదూ....?