Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 1

                                 మొగుడే రెండో ప్రియుడు
   

                                                         -----బలభద్రపాత్రుని రమణి


    ఆ అమ్మాయిని ఒకసారి చూసి కళ్ళు తిప్పుకున్నాకే మళ్ళీ చూసి ఇంకోసారి చూసి....చూస్తూనే వుండిపోవాలనిపిస్తుంది.

    ఆ అతివ లావణ్య లతిక!

    ఆ కొమ్మ అందాల బొమ్మ!

    ఆ అమ్మాయి 'ట్రైన్'లో కిటికీ దగ్గర కూర్చుని బైటికి చూస్తోంది. అసలే పాలల్లో కుంకుమ కలిసిన రంగు ఆమెది. మెరూన్ కలర్ చుడీదార్ లో మరీ మెరిసిపోతోంది. నుదుట చిన్న దోసగింజంత బొట్టు తప్ప ఏ అలంకరణలూ లేవు. కుడిచేతికి ఓ జత బంగారుగాజులూ, ఎడమచేతికి వాచీ, మెడలో నల్లపూసలూ, కాలి వేళ్ళకి మట్టెలూ....

    ఆ అమ్మాయినే కన్నార్పకుండా చూస్తూ పక్కన కూర్చున్న బామ్మగారు, పక్కకి తిరిగి భర్తతో "ఆ అమ్మాయిని చూశారా ఎంత లక్షణంగా వుందో!" అంది.

    ఆయన కళ్ళజోడు సవరించుకుని పరీక్షగా చూసి "ఆఖరివాడికి కూడా పెళ్ళిసంబంధం కుదిరిపోయిందిగా, ఇంకా పరీక్షగా చూస్తావేమే!" అన్నాడు నవ్వుతూ.

    "అందుకు కాదు! అయినా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది లెండి! ఆ మట్టెలూ, నల్లపూసలూ చూస్తుంటే తెలీడం లేదా!" అంది ఆవిడ.

    ఆయన కూడా ఔను అన్నట్టు తల వూపారు.

    ఆ సంభాషణని ఆ చుడీదార్ అమ్మాయి వింటూనే వుంది. కొద్దిగా చిరునవ్వు నవ్వింది కూడా !
    నవ్వుతూ ముందుకి పడిన జడని విసురుగా వెనక్కి వేసుకుంది. నీలాంబరంలో నుండి జాబిల్లి జారిపడినట్లు, ఆమె జడలోని గులాబీ రైలు కంపార్ట్ మెంట్ కిటికీలో నుంచి క్రింద ప్లాటుఫాం మీద పడింది. ఫ్లాట్ ఫామ్ మీద నిలబడ్డ ఓ యువకుడు చటుక్కున ఒంగి ఆ పువ్వు అందుకున్నాడు. ఈ హఠాత్ చర్యకి ఆ అమ్మాయి ఉలిక్కిపడింది. కళ్ళల్లో లీలగా భయం కనపడింది. ఆ అబ్బాయి 'సియారామ్' షూటింగ్స్ మోడల్ లా హుందాగా వున్నాడు. నవ్వినప్పుడు కళ్ళు కొద్దిగా మూసుకుపోయి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. చక్కని ఒడ్డూ పొడుగుతో చూడగానే 'అందగాడు' అనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి గులాబీని అందిస్తూ "మీదేనా" అనడిగాడు.

    సమ్మోహనంగా వున్న ఆ యువకుడి చూపుల శరఘాతాల నుండి తప్పించుకోడానికన్నట్లు ఆమె తల వాల్చి "ఔను" అంది చేయి సాచుతూ. అయితే అతడు దాన్ని ఆమెకి అక్కడే ఇచ్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ గులాబీని చాలా అపురూపంగా చేత్తో పట్టుకుని కిటికీలోంచి అందించకుండా ట్రైను ఎక్కి ఆమె దగ్గిరకు వచ్చాడు సీత దగ్గర కొస్తున్న రావణాసురుడిలా-

    ఆ అబ్బాయి అలా ఆమె దగ్గరికి రావడం, ప్రక్కన కూర్చున్న ముసలి దంపతులకి నచ్చినట్లు లేదు. ఒకరివంక ఒకరు "అదోలా" చూసుకున్నారు. ఆ అమ్మాయి కూడా విస్తుబోయినట్టు కనిపించింది.

    అతను గులాబీ ఆమెకి అందివ్వకుండా, ఎదుటి సీట్లో కూర్చుని ఆ పువ్వుని చెంపకి ఆన్చుకుని "ఈ ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలని ఈ గులాబీని ఇలాగే గుండెల్లో దాచుకోవాలనీ నా కోరిక. దయచేసి దీన్ని నాకిస్తారా?" అంటూ ఎంతో ఆర్తిగా అడిగాడు.

    బామ్మగారు అతడి చొరవకి దిగ్బ్రాంతి చెందింది. "వీడికిదేం పోయేకాలం?" అన్నట్టు తన భర్తవైపు చూసింది.

    ఆయన కూడా కనుబొమలు చిట్లించి ఆ అమ్మాయి ఏమి జవాబు చెప్తుందా అన్నట్లు ఆసక్తిగా ఆమెవైపే చూస్తున్నాడు.

    ఆ చొరవకి ముందు కంగారుపడ్డా ఆ అమ్మాయి సిగ్గుగా నవ్వి "మీకు_అంతగా కావాలంటే అలాగే వుంచుకోండి!" అంది.

    "థాంక్స్" అతను కొంచెం ముందుకు ఒరిగి "మీ పేరు తెలుసుకోవచ్చా?" అడిగాడు.

    "అమృత"

    "అబ్బా ఎంత తియ్యని పేరూ! నా పేరు తెలుసుకోవాలని లేదా?" చొరవగా అడిగాడు. ఆ ధైర్యానికి ఆమె విస్తుబోయి కాస్త తటపటాయించి "చెప్పండి" అంది సన్నటి స్వరంతో.

    "నా పేరు హర్ష"

    బామ్మగారు గొంతు తగ్గించి భర్తతో..."చూశారా వీళ్ళ భాగోతం" అంది.

    "ఆ...ఆ....ఆ అమ్మాయికైనా వుండాలి కాస్త బుద్ది" అన్నాడు ముసలాయన కూడా అదే గొంతుతో.

    ఎవరి హడావుడిలో వారున్నారు. ట్రయిన్ పెద్ద రష్ గా లేదు. ఆ కంపార్ట్ మెంట్ చాలా ఖాళీగా వుంది.

    "మీరు వివాహితులా?" ఆమె మెడవైపు చూస్తూ అతను ఆశాభంగం చెందినట్టు అడిగాడు.

Next Page