రాక్షస నీడ (రెండవ భాగము)
వాసిరెడ్డి సీతాదేవి
"పారా సైకాలజీ పుస్తకాలు బాగా జీర్ణించుకున్నట్టున్నారు" అన్నది ఇందు వ్యగ్యంగా .
"అవునమ్మా! నువ్వూ చదవాలి. నీలాంటి వాళ్ళు ముఖ్యంగా చదవాల్సిన పుస్తకాలు అవి. నా దగ్గర చాలా వున్నాయి. ఇస్తాను. ఎందరో పెద్దలు పరిశోధనలు చేసి రాసిన అనుభవాలు."
"అవునండీ! అవన్నీ వారి వారి అనుభవాలే. వాస్తవాలు మాత్రం కావు. అవి కేవలం నిజాలు మాత్రమే.
"నిజాలు వాస్తవాలు కావా?" నిలదీసినట్టుగా అడిగాడు సుందరామయ్య. మొదటిసారిగా అతడి కంఠంలో అసహనం ధ్వనించింది.
"కావుం నిజం వేరు వాస్తవం వేరు."
"అదే- ఏమిటలా?"
సుందర్రామయ్య అడిగిన ధోరణికి ఇందుమతికి నవ్వు వచ్చింది.
"కోప్పడకండి , సుందర్రామయ్యగారూ! ఏ చనిపోయిన వ్యక్తీ తాలూకు ఆత్మ స్వరూపాన్నో మీరు ఎదుటి వారికి కూడా చూపించగలిగారనుకొండి, అది వాస్తవం. లేక మీరు మాత్రం చూడగలిగితే అది నిజం. ఎందుకంటే, మీ నమ్మకాల వల్ల మీరు కొన్ని అనుభవాలను పొందుతారు. అదే చెప్తారు. కనక మీరు చెప్పేది నిజం. అంతేగాని అది వాస్తవం కాదు."
సుందరరామయ్య ఏదో చెప్పాలని నోరు తెరిచాడు, కాని ఇందుమతి చెప్పనివ్వలేదు. మళ్ళీ అన్నది.
"ఏమండీ! జంతువులకు కూడా ఆత్మలు ఉంటాయా?"
"ఉంటాయి.' కచ్చితంగా అన్నాడు.
ఇందుమతి సుందర్రామయ్యను పిచ్చివాణ్ణి చూసినట్టు చూసింది.
"ఉంటాయా? అంటే జంతువులూ కూడా మనుషుల వలె చచ్చిపోయాక కనిపిస్తావా?" రవి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
"అవును, రవీ! కనిపిస్తాయి. ఎలియట్ ఒడానేల్ గోస్టు హంటర్ తన అనుభవాన్ని రాశాడు. పెట్రోలు చేసే ఒక పోలీసు చచ్చిపోయాడు. అతడి గుర్రం కూడా చచ్చిపోయింది. అతడి అలవాటు ప్రకారం ఆతడు అతడి గుర్రం మీద ఎక్కి కెనడియన్ సిటిలో పెట్రోలు చేసేవాడట. అంతే కాదు, పెర్రివాన్ పాసేన్ అనే అతడి ఇంటికి ఒక నల్లటి కుక్క రోజూ రాత్రిళ్ళు ఓ కుక్క వచ్చి తనను నిద్ర లేపేదనీ , తలుపులు వేసి ఉన్నా అది లోపలకు ఎలా వస్తుందో తెలయదనీ చెప్పిందట. పాసేన్ కు అది కుక్క కాదనీ, ఘోస్ట్ అని అర్ధం అయిందట. అతడు....."
"ఇక ఆపండి ఆ కధలు." దాదాపు అరిచినట్టే అన్నది ఇందుమతి.
"స్పిరిట్సు లేవని నువ్వు ప్రూఫ్ చెయ్యగలవా?" సుందర్రామయ్య సూటిగా ఇందుమతి ముఖంలోకి చూశాడు.
"లేవని ప్రూవ్ చేయాలంటే ఏమిటి! లేవు - అంతే ! ఉన్నవి అనేవాళ్ళే ప్రూవ్ చెయ్యాలి. మీరు చెయ్యగలరా? " సవాలు విసిరింది ఇందుమతి.
"ఆ. " చాలా తాపీగా అన్నాడు సుందర్రామయ్య.
"ఎలా?" రవి నోరు తెరిచేశాడు.
"నేను స్పిరిట్ ను పిలుస్తాను. చూస్తారా?"
"చూపించండి.' ఇందుమతి , రవి ఒకేసారి అన్నారు.
"చూపిస్తాను. ఎవర్నో కాదు - నువ్వు ఇంతకూ ముందు చూపిన స్పిరిట్ నే పిలుస్తాను."
"అంటే మా అన్నయ్య....." అపైకి గొంతుకు ఏదో అడ్డం పడి నట్టుగా ఆగిపోయాడు రవి.
"నోరు ముయ్యి' అని అరవాలనుకుంది ఇందుమతి. కాని, అరవలేదు.
కసిగా "పిలవండి" అన్నది.
"రవీ! పెద్ద తెల్ల కాగితం ఉందా? పాత కాలెండరైనా ఫర్వాలేదు"
కొత్త క్యాలెండరైతే పనికిరాదా, హేళనగా అడిగింది ఇందుమతి.
"ఎందుకు పనికిరాదు?"
"అంటే ఊ.జా. బోర్డు పెట్టబోతున్నారా?"
ఇందుమతి ఊ. జా బోర్డు గురించి విన్నది. చదివింది. కాని, చూడలేదు. ఆమెకు కూడా కుతూహలం కల్గింది. ఇందుమతి ఆ మధ్య పారా సైకాలజీ పుస్తకాలు చాలా చదివింది. అందులో ఒక్కటీ రీజనింగు కు నిలబడేలా అనిపించలేదు. అంతా గాలిపోగు చేసినట్టే అనిపించింది. వారి వారి అనుభవాలను చేప్పడం జరిగింది. కొందరు నిజంగా నమ్మి ఇతరులను నమ్మించే ప్రయత్నం చేశారు కొందరు ట్రిక్స్ ప్లే చేసి ఎదుటి వారిని ఫూల్స్ ను చెయ్యడానికి ప్రయత్నించారు అని ఆమె తెల్సుకున్నది. అబ్రహం కోవూర్ నూ, జేమ్స్ రామ్ డీనీ కూడా తను చదివింది.
"ఇందూ, ఒకసారి పైకి వస్తావా?"
రవి మాటలకూ ఇందుమతి తన ఆలోచనల నుండి బయటపడింది.
తలెత్తి రవి ముఖంలోకి సాలోచనగా చూసింది.
"పైకి వస్తావా?"
"ఎందుకూ?"
"నేను నిన్నేం చేయ్యనులే. " రవి సీరియస్ మూడ్ నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో అన్నాడు.
"ఓస్! నువ్వే కాదు, ఎవడు నన్నేం చెయ్యలేడు!" నిటారుగా అయి గంబీరంగా అన్నది.
సుందర్రామయ్య ఇందుమతిని ముగ్ధుడైనట్టు చూశాడు.
"సెబాస్ ఇందూ! నువ్వు తెలుసు గాని, ఇవ్వాళే దగ్గరగా చూడటం అంటే నిన్ను అర్ధం చేసుకోవడం జరిగింది. ఆడపిల్లలకు అలాంటి ఆత్మ విశ్వాసమే కావాలి. అప్పుడు గాని ఈరోజు రోజు హత్యలూ, ఆత్మ హత్యలూ తగ్గవు" అన్నాడు ప్రశంశపూర్వకంగా సుందర్రామయ్య.
ఇందుమతి సుందర్రామయ్యను ఆశ్చర్యంగా చూసింది. సుందర్రామయ్య మీద ఏర్పడిన చులకన భావం పోయింది .
"ఈ మనిషేమిటి? ప్రసాదానికి ప్రసాదం - తీర్దానికి తీర్ధం అన్నట్టున్నాడు' అనుకుంది.
"రా, ఇందూ!"
"ఏం? భయంగా ఉందా ఒంటరిగా వెళ్ళాలంటే హేళనగా అన్నది ఇందుమతి.
"నీకు భయంగా లేదా?"
"నాకా? భయమా? అదీ దయ్యాల గురించి ఏదో ట్రాష్ విని భయపడటమా?" తేలిగ్గా కొట్టేసింది.
'అయితే, నువ్వే తీసుకురా!" ఉడుకున్నాడు రవి.
"ఏమిటి?"
"నా గదిలో నా టేబుల్ ఎదురుగా పాత కాలెండర్ ....పెద్దది గోడకు తగిలించి ఉంది. అది తీసుకురా!"
"ఓ! పాత కాలెండరూ - అది పెద్దది - అంటే...." ఓ క్షణం అలోచించినట్టు నటించి అందమైన అమ్మాయి న్యూడో బొమ్మ ఉందా?" అన్నది.
రవి ముఖం వెలతేలా పోయింది.
"ఏదైనా ఫర్వాలేదు , తీసుకురా, తల్లీ!" అన్నాడు సుందర్రామయ్య.
పెద్ద ధైర్యవంతురాలిగా కోతలు కోస్తుంన్నావు తీసుకురా మరి.