Next Page 
ఖజురహో పేజి 1

                                 


                                                ఖజురహో

                                                                ----బలభద్రపాత్రుని రమణి
    
    
                                  
  

    అబిడ్స్ సెంటర్......
    
    జుగల్ కిషోర్ షర్మల్ జైన్ జ్యువెలరీ షాప్ చాలా రష్ గా వుంది. పెళ్ళిళ్ళ సీజనేమో జనం కిటకిటలాడిపోతున్నారు.
    
    అక్కడున్న మనుషుల్ని, వారి వేషభాషల్ని చూస్తూ ఇండియా పేద దేశం అంటే ఎవరు నమ్ముతారూ?
    
    అందరూ చాలా బిజీగా నగలు కొనుగోలు చేస్తున్నారు. ఇంతలో షాప్ ముందుకి ఒక వైట్ మెర్సిడిస్ వచ్చి ఆగింది.
    
    నెమ్మదిగా డోర్ తెరుచుకుంది. అందులోంచి చెంగున గెంతుతూ క్రిందకు దూకింది రాక్సీ, దాని మెడకున్న వెండిగొలుసు పట్టుకున్న చెయ్యి ఒకటి కారు బయటికి వచ్చింది.
    
    ఆ చేతి అందం చూసిన ఎవరైనా ఆ చెయ్యి తహలూకు మనిషి యొక్క అందం చూడాలని కోరుకోకుండా వుండలేరు. గులాబీ రంగుచెయ్యి అందంగా షేప్ చేయబడిన నెయిల్స్ తో, వాటికి వేసిన నేచురల్ పాలిష్ తో మెరిసిపోతోంది. నడిమి వేలికున్న రింగు ఛమక్కున మెరిసింది.
    
    "రాక్సీ! రాక్సీ!" అన్న కోమలమైన గొంతు వినిపించి ఆ తర్వాత లేత తమలపాకు లాంటి అందమైన పాదం కారులోంచి నెమ్మదిగా భూమి మీద ఆనింది.
    
    కుక్కపిల్ల రాక్సీ ఆ పిలుపుకు చెవులు నిక్కబొడుచుకుని వున్న చోటనే ఆగి వెనక్కి తిరిగి చూసింది.
    
    ఆ యువతి కారు దిగి విలాసంగా డోరు మూసి ముందుకు నడిచింది.
    
    షాప్ ముందు నిలబడి మాట్లాడుకుంటున్న కుర్రాళ్ళు అమాంతం నోరు తెరిచి ఆ అందాన్ని అలాగే చూస్తూండిపోయారు.
    
    ఆమె కొనకంట ఈ విషయం పసిగట్టి చిన్నగా నవ్వుకుంది. ఇది ఆమెకు మామూలే. షాపులోకి అడుగుపెట్టగానే అందరూ చేష్టలుడిగి ఆ సజీవ పాలరాతి శిల్పాన్ని చూస్తూండిపోయారు.
    
    కవి భావనవో.... కమనీయ చిత్రానివో... ఖజురహో సుందరివో.... ఎవరివో.... నీవెవరివో....
    
    అందరి కన్నుల్లో దోబూచులాడుతూ ఇదే భావన.
    
    వైట్ టీ షర్ట్, బ్లాక్ మిడీలోకి టక్ చేసి, పొడవాటి పట్టుకుచ్చు లాంటి జుట్టు అలాగే వదిలేసి, కూలింగ్ గ్లాసెస్ నుదుటి మీదకి జరుపుకుని ఆమె నడుస్తూ వుంటే ఆ నగల దుకాణానికే ఎనలేని మెరుపొచ్చినట్టయింది.
    
    "ఎస్ మేడమ్! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?" ముక్కుమీదకి కళ్ళజోడు జారిపోతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు షాప్ ఓనర్"
    
    ఆమె అతనివైపు చూసి వెంటనే తల తిప్పుకుని చేతిలోని గొలుసు లాగుతూ "మా రాక్సీ కోసం ఒక చెయిన్ కావాలి. లేటెస్ట్ డిజైన్స్ ఏమైనా వచ్చాయా?" అంది.
    
    అతను పరమ భక్తిగా ఆమె బొచ్చుకుక్కవైపూ, అమెవైపూ చూసి "ఓ ష్యూర్! తప్పకుండా.... రామూ..... ఆ లేటెస్ట్ డిజైన్స్ వున్న బాక్స్ తీసుకురా" అన్నాడు.
    
    "అమ్మా! ఈ గొలుసు మోడల్ బావుంది కదూ!" ఓ అమ్మాయి తల్లితో అంటూ గొలుసు మెడలో పెట్టుకుని అద్దంలో చూసుకుంది.
    
    "బావుందమ్మా" అంది తల్లి వాళ్ళు పెళ్ళికి కాబోలు నగలు కొంటున్నారు.
    
    ఆమె చటుక్కున అటు తిరిగి ఆ తల్లీకూతుళ్ళని చూసింది.
    
    "చూడండి మేడమ్....లేటెస్ట్ డిజైన్స్" షాప్ అతను మిడీ యువతికి చూపించబోయాడు.
    
    "నో!" ఆమె అతన్ని వారించి "అటు చూడండి ఆ అమ్మాయి మెడలోది కావాలి" అంది.
    
    అతడు పరమ ఆశ్చర్యంగా ఆ చెయిన్ వైపూ, ఆ యువతివైపూ మార్చి మార్చి చూసి-"అది నానుతాడు తల్లీ! పెళ్ళికి పెట్టుకుంటారు" అన్నాడు.
    
    ఆమె ఆ మాటకి చిరాగ్గా చూసి- "అదే కావాలి" అంది స్థిరంగా.
    
    "ఓకే. ఓకే రామూ ఆ అమ్మాయిగారి మెడలో పెట్టుకునే మోడల్ లాంటిదే తీసుకురా" అన్నాడు.
    
    ఆమె ఇంకా చిరాగ్గా "అలాంటిది కాదు అదే" అంది గట్టిగా.
    
    ఆ మాటకి ఆ గొలుసు పెట్టుకున్న అమ్మాయీ, ఆమె తల్లి కూడా తలలు తిప్పి విస్మయంగా చూశారు.
    
    "ఓసారి ఆ గొలుసు ఇయ్యమ్మా!" షాపతను ఆ అమ్మాయిని మర్యాదగా అడిగాడు.
    
    "ఆ అమ్మాయి కాస్త కోపంగా "ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఇస్తాను?" అంది.
    
    "ఆ గొలుసు ఖరీదెంత?" మిడీ యువతి కంకం కరుగ్గా పలికింది.
    
    "పదహారువేల చిల్లరమ్మా."
    
    "అయితే ఇరవై ఆరు వేలు తీసుకోండి....నాకు అదే కావాలి. మా రాక్సీ మెడలో వెయ్యాలి" ఆమె దర్పంగా అంది.
    
    షాప్ ఓనర్ నోరు తెరిచి చూశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయివైపు గొలుసు కోసం చెయ్యి జాపాడు.
    
    ఆ అమ్మాయి నిస్సహాయంగా తల్లివైపు చూసి నెమ్మదిగా గొలుసు తీసి టేబుల్ మీద పెట్టింది.
    
    ఆమె ఆ గొలుసు అందుకుని రాక్సీ మెడలో వేసి ఆ అమ్మాయివైపూ, ఆమె తల్లివైపూ విజయగర్వంగా చూసింది. ఆ తర్వాత చెక్ తీసి, అంకెవేసి సంతకం పెట్టి అందిస్తూ, "రేపు మా రాక్సీ బర్త్ డే! అందుకే ఈ ప్రెజంటేషన్" అంది.
    
    "ఓ.....వెరీగుడ్! స్వీట్ డాగ్" అని దాన్ని నిమరబోయి అది గుర్....ర్.... మనడంతో ఆగిపోయాడు.
    
    ఆమె రాక్సీని ఎత్తుకుని నిర్లక్ష్యంగా తల ఎగురవేసి బయటికి వచ్చి కారు డోర్ తీస్తుండగా ఆమె కాళ్ళకి ఏదో తగిలి ఆమె వులిక్కిపడి చూసింది.

Next Page