మీనాక్షితో అతని సంసార జీవితం సాఫీగానే నడిచిపోతోంది. స్వామి ఆఖరి తమ్ముళ్ళు అతని వద్దనే ఉండి చదువుకుంటున్నారు. చెల్లెళ్ళ పెళ్ళి విషయంలో అతను తండ్రికి చాలా సహాయం చేశాడు. అమెరికాలో ఉన్నప్పుడు అతను పొదుపుగా మసిలి చాలా డబ్బు నిల్వచేశాడు. ఆ డబ్బుతో తండ్రి తాలూకు చాలా అప్పులు తీర్చివేశాడతను. అతని తండ్రికిప్పుడు రోజులు హాయిగానే వెళ్ళిపోతున్నాయి. నెలనెలా కొడుకు దగ్గర్నుంచి మనియార్డరు వస్తుందాయనకు.
మీనాక్షి స్వామిని కంటికి రెప్పలా చూసుకునేది. ఆమె తనపైన చూపే శ్రద్ధ కతను ఆశ్చర్యపోతూ ఉండేవాడు. అదేవిషయం పైకి అంటే__"భర్త భార్యనూ, భార్య భర్తనూ ప్రేమగా చూసుకోవడంలో ఆశ్చర్యమేముంది? కాని నాకు మీమీద చాలా ఆశలున్నాయి. జీవితంలో నాకు చాలా కోర్కెలున్నాయి. అవన్నీ మీ వల్లనే గదా తీరవలసింది?" అనేసి మీనాక్షి.
"ఏమిటా కోర్కెలు?" అనేవాడు స్వామి ఆశ్చర్యంగా.
"సమయం వచ్చినప్పుడు చెబుతాను" అని ఊరుకునేది మీనాక్షి. స్వామి ఆ మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు.
ఒకరోజు మీనాక్షి స్వామిని__"బ్యాంకులో ఇప్పుడు మన డబ్బెంత ఉంది?" అనడిగింది.
"పెద్దగా ఏమీ లేదు" అన్నాడు స్వామి ఆశ్చర్యపోతూ. సాధారణంగా మీనాక్షి డబ్బు గురించి అడగదు. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలు స్వామి తనే చూసుకుంటాడు.
"ఓ ఇరవై వేలన్నా ఉండదా?" అంది మీనాక్షి.
"ఇరవై వేలే!" ఆశ్చర్యంగా అడిగాడు స్వామి.
"గుమాస్తా అప్పారావుగారి భార్య మనింటికి వచ్చింది. బ్యాంకులో ఆయనకు అయిదు వేలుందట. మన జీతం ఆయనదానికి రమారమి మూడు రెట్లు. అదీకాక మీరు అమెరికా కూడా వెళ్ళి వచ్చారు" అంది మీనాక్షి.
స్వామి నవ్వి__"నువ్వింత మాయకురాలవేమిటి మీనా? చిన్న చెట్టు వందేళ్ళు బ్రతికితే__ పెద్ద చెట్టు నాలుగొందలేళ్ళు బ్రతకదు. ఎంత చెట్టుకు అంత గాలి. అప్పారావుగారు సినిమాకు వెడితే మనిషికి రూపాయన్నర అవుతుంది. బస్సులో వెళ్ళి రావడానికి అర్ధరూపాయవుతుంది. మనమైతే రిక్షాల్లోనూ, టాక్సీల్లోనూ తిరుగుతాం. కూల్ డ్రింక్స్ తాగుతాం. మూడు రూపాయల టిక్కెట్లు కొంటాం" అన్నాడు.
"అయినా అయిదు వేలైనా లేదా?" అంది మీనాక్షి.
"ఇక్కడ నా ఇద్దరు తమ్ముళ్ళు\న్నారు. మా నాన్నగారికి నెల నెలా డబ్బు పంపుతాను" అన్నాడు స్వామి.
"బాగుందండీ! అప్పారావుగారి కెవరూ లేరనుకుంటున్నారా?" అంది మీనాక్షి.
"ఆయన గురించి నా కంతగా తెలియదు. తెలుసుకుని చెబుతాను"
"మీరేమీ తెలుసుకోనవసరం లేదు. అన్నీ నాకు తెలుసు. ఆయనకు డబ్బు విలువ, డబ్బు జాగ్రత్త తెలుసు. నేను నిజంగా మనకూ బ్యాంకులో బోలెడు నిల్వ ఉందనుకున్నాను. కావాలంటే ఖర్చులు తగ్గించుకుందాం. కాని బ్యాంకులో నిల్వ పెరగాల్సిందే!"
"నీ కెంత డబ్బు కావాలో చెప్పు?" అన్నాడు స్వామి నవ్వుతూ.
"ఎంతని చెప్పి లాభం? ఓ ఏడాదిలో నాకు కారు కొనిపెట్టగలరా?" అంది మీనాక్షి.
స్వామి తృళ్ళిపడి__"కారా! అదెందుకు మనకి?" అన్నాడు.
"జీవితంలో నాకున్న కోరికల్లో ఇదొక్కటి" అంది మీనాక్షి.
స్వామి భయపడ్డాడు. అది చాలా భయంకరమైన కోరిక అని అతనికి అనిపించింది. భార్యకూ తనకూ అంతరం ఏర్పడనున్నదనీ అదిప్పుడే తొలగించుకోవాలనీ అతను నిర్ణయించుకున్నాడు.
వివాహమైనప్పట్నించీ స్వామి తన భార్యతో మధుర జీవితాన్నే కాని బాధ్యతలను పంచుకోలేదు. అతను తన బాధ్యతల గురించి ఆమెకు చెప్పలేదు. తన ఆదాయ వ్యయాల గురించి ఆమెకు వివరించలేదు. ఆమె అడిగినవన్నీ కొనిపెడుతూండేవాడు. ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూండేవాడు.
మీనాక్షి అమాయకురాలు. రుద్రరాజు వద్ద పెరిగిన ఆమెకు తన హద్దులైతే తెలుసు కాని ఆ హద్దులెందుకు వచ్చాయో తెలియదు.
స్వామి భార్యను దగ్గర కూర్చోపెట్టుకొని తనకు వచ్చే ఆదాయమూ, ఇంటి ఖర్చులూ, తనకున్న ఇతర బాధ్యతలూ వివరించి చెప్పాడు. అన్నీ లెక్కవేసి చూస్తే నెలకో 200 మిగులుతాయి. అందులోనే బట్టలు కొనుక్కొన్నా, ప్రయాణాలు చేసినా, అనుకోని ఇతర ఖర్చులు వచ్చినా అడ్జస్టు కావాలి.
మీనాక్షి బాధగా- "నిజంగా మన పొజిషన్ ఇదాండీ! నేను మనమింకా చాలా గొప్పవాళ్ళమనుకున్నాను. ఇలా అయితే మనం కారు కొనుక్కోవడం అసలు సాధ్యపడదేమో!" అంది. ఆమె ముఖంలో అమాయకత్వం, బాధ రెండూ కనబడ్డాయి.
"అయితే నన్ను పెళ్ళి చేసుకొన్నందుకు బాధపడుతున్నావా? కారు కొని పెట్టలేని అసమర్ధుడు నీకు భార్తయ్యాడని విచారంగా ఉందా?" అన్నాడు స్వామి.
"అదేమిటండీ అలాగంటారు? మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకొన్నాను. చేసుకొన్నాను. అదైపోయింది. ఇప్పుడు కారు కొనుక్కోవాలనుంది. ఇది నా కొత్త మోజు. మాటలతో మభ్యపెట్టడంలో మీ అంతటి వారు లేరు. నన్ను అవీ ఇవీ చెప్పి మరిపించేయండి. మీకంటే నాకింకేమీ ఎక్కువకాదు. అయినా గుర్తు వచ్చినప్పుడల్లా కారు విషయం అడుగుతూనే ఉంటాను. మీరు మాత్రం ఎలాగో అలా మరిపించేయండి" అంది మీనాక్షి.
మీనాక్షి నిజంగానే అమాయకురాలు. అందుకే ఆమె అంటే స్వామికి ఇష్టం. అతను నవ్వుతూ "మీనా! నిజంగా నీకోసం కారుకొన్నాను కాని, తెస్తూంటే దారిలో కాకి ఎత్తుకుపోయింది. ఆ కాకిని వెంటాడమని ఓ మనిషిని పంపించాను. వాడు రాగానే నీ కారు నీకు ఇచ్చేస్తాన్లే" అన్నాడు చిన్న పిల్లతో మాట్లాడుతున్నట్లు.
మీనాక్షి బుంగమూతి పెట్టి "మరిపించడమంటే ఇలాగేంటి?" అంది.
"మరెలా?" అన్నాడు స్వామి.
"నాకు తెలుస్తుందేమిటీ! మీరే చెప్పాలి?" అంది మీనాక్షి.
"ఇదివరకైతే ఇంకోలా మరిపించేవాణ్ణి. కాని నీకిప్పుడు కారు మీద మోజు మళ్ళింది. నేను పాతబడిపోయాను గదా_అందులోనూ అలా మరిపించగలనో లేదో అనుమానంగా ఉంది" అన్నాడు స్వామి.
అయితే మర్నాడు స్వామి కాకి దగ్గర్నుంచి సంపాదించానంటూ ఆమెకు కారు తెచ్చినాడు. కారంటే ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆమెకు ఎదురైనది బొమ్మ కారు!
10
ఓ రోజు స్వామి తన ఆఫీస్ లో ఉండగా అతన్ని చూడ్డానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమెను చూస్తూ 'ఎక్కడో చూసినట్లుందే?' అనుకున్నాడతను.
"మీ దగ్గర స్టెనోగ్రాఫర్ పోస్టు ఒకటి కాళీ ఉందని తెలిసింది" అందామె.
"అవును. ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజ్ కి సమాచారం పంపాము"
"అవునండి. సమాచారం అందేక మీ గురించి తెలిసింది. మీరు నాకు సాయపడగలరని ఆశిస్తున్నాను...." అందా అమ్మాయి.
"ఏ విధంగా?" అన్నాడు స్వామి.
"నా పేరు ఇందిర. మనకొకప్పుడు పరిచయముంది. అప్పట్లో మీరు నాకు ప్రేమలేఖ రాస్తే నేను మెత్తగా మందలించాను...." అని ఆగిందామె.
స్వామి ఆమెను గుర్తుపట్టాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె అందం మాసిపోలేదు. ఎటొచ్చీ అప్పుడు అమాయకతను ప్రతిఫలించే ఆ కళ్ళు ఇప్పుడు అనుభవాన్ని ప్రతిఫలిస్తున్నాయి. "గుర్తున్నారు. ఎప్పుడో చూశాను__అనుకొంటున్నాను. అప్పట్లో మీరు నాకు చాలా ఉపకారం చేశారు."
"నేను చేసింది ఉపకారమేనని మీరనుకొంటూంటే ఇప్పుడు నాకు మీరు ప్రత్యుపకారం చేయాలి" అంది ఇందిర.
"ఏ విధంగా?" అన్నాడు స్వామి అర్ధంకానట్లు.
"నాకీ ఉద్యోగం రావడానికి మీరు సహకరించాలి" అంది ఇందిర.
అది తన చేతుల్లోని పనే అని తెలుసు స్వామికి. కాని ఇందిర లాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగానికి ఆఫ్లై చేసి ఉండవచ్చు. అందరిలోకీ ఈమె అర్హత ఏ స్థాయిలో ఉంటుందో తనకింకా తెలియదు. అటువంటప్పుడు....
"అది ఇంటర్వ్యూలో మీ పెర్ ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది" అన్నాడు నిర్మొహమాటంగా.
"అంతవరకూ నేను చూసుకొంటాను కాని అది బాధ్యతకు సంబంధించిన విషయం. ఒక జీవితానికి సంబంధించిన విషయమొకటుంది-నా జీవితం ఈ ఉద్యోగం రావడం పైనే ఆధారపడి వుంది" అంది ఇందిర.
"అదేమిటి?" అన్నాడు స్వామి ఆశ్చర్యంగా.
ఇందిర తన విషాదగాధ వివరించి చెప్పింది. ఇందిర బియస్సీ పాసయ్యాక పెళ్ళి కుదిరింది. కట్నం 8 వేలు. వెంటనే ఇవ్వలేమనీ వాయిదాల పద్ధతిని ఇచ్చుకొంటామని ఇందిర తండ్రి అన్నదానికి మగ పెళ్ళివారు సమ్మతించారు. పెళ్ళి జరిగి ఇందిర కాపురానికి వెళ్ళింది. ఇందిర తన భర్తను ఆకట్టుకోగలననీ అతనికి నచ్చజెప్పి తండ్రికి వాయిదాలు కట్టుకొనే వ్యవధిని పెంచగలననీ అనుకొంది. ఇందిర తండ్రి చాలా అప్పుల్లో వున్నాడు. ఆయన ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆ పరిస్థితుల్లో ఆమె భర్త కట్నం డబ్బు గురించి ఆయన్ను నొక్కించసాగాడు. ఇందిర ఎదురు తిరిగింది. భర్త తగ్గినట్లే కనపడ్డాడు కాని, అతని ప్రవర్తన అసహ్యంగా తయారయింది. అతను వేశ్యల ఇంటికి వెళ్ళి వస్తున్నట్లుగా, అతనే ఆమెకు చెబుతూండేవాడు. తన వద్ద ఏ వేశ్య ఎలా ప్రవర్తించిందో చెప్పి భార్యను కూడా అలా ప్రవర్తించమనేవాడు. అతను వేశ్య దగ్గరకు వెళ్ళినందుకు ఆమె అసహ్యాన్ని వ్యక్తపరిస్తే- 'సగం సగం కట్నాల పెళ్ళి మనది. నీ మొగుడి ప్రవర్తన కూడా సగం సగం పవిత్రంగానే వుంటోది. ఇంకా నిన్నొదిలి పెట్టలేదు గదా-అందుకు సంతోషించు!' అన్నాడతను. ఇందిరకు భర్తంటే అసహ్యం వేసింది. అప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు. ఇందిర టైపు, షార్టుహ్యాండ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడామె భర్త వద్ద వుండడం లేదు. తల్లి వద్ద వుంటోంది. ఆమె ఉద్యోగం పైన ఆమె బ్రతుకూ, మరికొన్ని జీవితాలూ ఆధారపడి వున్నాయి.
"మీరు చేసిన పని మంచిదేననుకొంటున్నారా?" అన్నాడు స్వామి.
"నాకు మనసుంది. చదువిచ్చిన వివేకముంది. ఈ రెండింటినీ అణగ దొక్కడానికి ప్రయత్నం జరుగుతున్న చోట నేను బ్రతకలేను. నాకు మళ్ళీ వివాహం కాదనీ తెలుసు, నా అందం నా శత్రువనీ తెలుసు. అయినా స్వతంత్ర జీవనంలో కొంత సంతృప్తి వుంది" అంది ఇందిర.
"నేను మీకు సాయపడలేకపోతే?"
"అది నా దురదృష్టం అనుకొంటాను. ఇంకో అవకాశం కోసం ఎదురుచూస్తాను. కాని ఉద్యోగం నాకు వచ్చేలా చేస్తే ప్రతిఫలంగా మీకు ఏమైనా ఇవ్వగలను" అంది ఇందిర.