మీనాక్షి తిన్నగా ఒక గదిలోకి వెళ్ళింది. ఆమె వెనుకనే స్వామి ఆ గదిలోనికి ప్రవేశించాడు.
మీనాక్షి వెనక్కు తిరగలేదు. స్వామి తన వెనుకనే ఉన్నట్లు ఆమెకు తెలుసునో తెలియదో అతనికి అర్ధంకాలేదు. మీనాక్షి ఆ గదిలో ఉన్న మంచం మీద కూర్చుంది. చీరకొంగుతో కన్నీరొత్తుకొంది. స్వామి చటుక్కున ఆమెను సమీపించి__"ఏడుస్తున్నారా? అదీ నేను వచ్చినపుడు" అన్నాడు.
మీనాక్షి మాట్లాడలేదు. తల ఎత్తలేదు.
"దూరాన్నుంచి చూసి ఈ మెరుపు తీగ ఎవరా అనుకున్నాను. దినదినానికి మీ సౌందర్యం ఇంతలా పెరిగిపోతుందని తెలిసి ఉంటే...."
"ఉంటే? మార్గరెట్ విషయంలో తొందరపడి ఉండేవారు కాదా?"
"ఓహ్- అదా సంగతి! అయితే ఆ ఉత్తరాలన్నీ నమ్మేశారన్నమాట! నాతో మీకున్న పరిచయాన్ని, నామీద మీకున్న నమ్మకాన్ని పురస్కరించుకుని నేను మీకా ఉత్తరాలు రాశాను. ఇప్పుడు నేను సగర్వంగా చెబుతున్నాను. అక్కడున్న ఇంతకాలంలోనూ ఒక్క చుక్కయినా మత్తు పానీయం ముట్టలేదు. ఏ స్త్రీని దురుద్దేశ్యంతో వీక్షించనైనా లేదు. నమ్ముతారా?"
"నమ్మగలను. కానీ మీకో పరీక్ష పెట్టాను. అందులో మీరు ఓడిపోయారు."
"ఏమిటా పరీక్ష?"
"మీకు తెలియనిదేమీ కాదు- కుక్క మిమ్మల్ని చూసి మొరిగింది."
స్వామి నవ్వడం మొదలుపెట్టాడు. అతనలా నవ్వుతాడని ఊహించని మీనాక్షి విస్తుపోయి అతనివంక చూసింది. స్వామి తమాయించుకుని__ "దాని మొరుగు విని మీ నాన్నగారు కూడా ఆశ్చర్యపడ్డారు. అయితే ఆయనకు నా ప్రవర్తన మీద అనుమానం లేదు. రాజా ఈ విధంగా మొరగడం ఆయన జీవితంలో ఇదే అనుభవమని ఆయన అన్నారు. దాని కళ్ళలో విపరీతమైన ఆనందం కనబడుతోందిట. తనకు కావలసిన అత్యంత ఆప్తుణ్ణి చూసి ఆగలేక అదలా మొరిగిందట. కుక్క నన్ను చూసి అంతలా అభిమానపడడం ఆయనకూ ఆశ్చర్యాన్ని కలిగించిందట. 'ఇంక లాభంలేదోయ్, వెంటనే ముహూర్తం పెట్టించి నిన్ను మా ఇంట్లో ఓ మనిషిని చేసేసుకోవాలి' అన్నారాయన" అన్నాడు.
"నిజమా?" అంది మీనాక్షి నమ్మలేనట్లు.
"పచ్చి నిజం. కుక్కలకు మొరగడం సహజ గుణం. కాని మీ నాన్నగారా సహజ గుణాన్ని హద్దుల్లో ఉంచారు రాజాకి. రాజాకు నామీద అభిమానం పెరిగింది. ఆప్యాయంగా నన్ను చూసి మొరగాలనుకునేది. అయితే అదలా మొరిగి ఉంటే నాకు మీ ఇంట స్థానం లభించి ఉండేది కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను కనిపిస్తూండే వాడిని. మొరగాలనుకునే అది మానేసేది. దానికివ్వబడిన శిక్షణ అలాంటిది. కాని ఈ రోజు__మూడు సంవత్సరాల తర్వాత నేను కనబడేసరికి అది ఆనందం ఆపుకోలేక అదేపనిగా మొరగడం మొదలుపెట్టింది. నేను మీ నాన్నగారికి అత్యంతాప్తుణ్ణి కావడం కూడా దాని ఆనందానికి కారణంకావచ్చు. దాని ప్రవర్తన కారణంగా ఈ రోజు మీ నాన్నగారికి కూడా నాపైన అభిమానం మరింత పెరిగింది."
"నమ్మలేకుండా ఉన్నాను."
"అబద్ధాలు నమ్మినంత సులువుగా నిజాలు నమ్మలేరు. అది మానవ నైజం. నన్ను చూసి నాకేమీకాని ఒక కుక్క సంతోషపడింది, అభిమానాన్ని ప్రకటించింది. జీవితమంతా నాతో గడపాలనుకునే ప్రియురాలు నన్ననుమానించింది. తప్పితే నన్ను చూసి ఆనందపడలేదు. ఇండియా వచ్చినందుకు నా సంతోషంలో సగం అప్పుడే తగ్గిపోయింది."
"మనిషి కుక్క కాలేడు గదా?" అంది మీనాక్షి చటుక్కున.
"కాని నేను మాత్రం కుక్క నవ్వాలనే అనుకుంటున్నాను. తన యజమాని ఆశయాల్ని బాధ్యతలనూ అది నరనరాలా ఎలా జీర్ణించుకుని అనుసరిస్తోందో అదే విధంగా నేనూ చేయగలిగితే నా జన్మ ధన్యమైనట్లే భావిస్తాను" అన్నాడు స్వామి.
"ఎదుటి వాళ్ళను నమ్మించగల శక్తి మీకు బాగా ఉంది. మీ ఉత్తరాలను నేను నమ్మేశాను. అవి అబద్ధమైన పక్షంలో__నమ్మించగల శక్తి మీలో ఎలాగూ ఉంది. నేను మీ దాన్ని. మీ మాటలకు లోబడిపోవడమే నాకు ఆనందం" అంది మీనాక్షి.
తర్వాత రుద్రరాజు కూతురివద్ద స్వామి ప్రవర్తనను బలపరిచాడు. కుక్క అతనిపట్ల చూపించిన ప్రేమకు ఆశ్చర్యాన్ని ప్రకటించాడు__"ఇంకిది నా కుక్క కాదు - నీదే. నీకు చెందవలసినదే. పెళ్ళికి అరణంగా నీతోపాటు ఇది మీ ఇంటికి వస్తుంది" అన్నాడు.
రుద్రరాజు ఉన్న ఒక్క కూతురి వివాహము వైభవంగానే జరిపించాడు. వివాహానికి స్వామి అసలు తల్లిదండ్రులతో పాటు, పెంపుడు తల్లిదండ్రులు కూడా వచ్చారు. అందరికీ స్వామి స్థాయి బాగా తెలిసివచ్చింది.
మంగళ సూత్రధారణ అయేక రుద్రరాజు చెమ్మగిల్లిన కళ్ళతో స్వామిని పక్కకు పిలిచి __"కంటికి రెప్పలా పెంచుకున్న కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. అమెరికాలో మూడేళ్ళుండి వచ్చినా నీవు అక్కడి దురలవాట్లకూ లోను కాలేదు, నా కూతురికి అన్యాయమూ చేయలేదు. నీలాంటి ఉత్తముడిని తగిన విధంగా సత్కరించే శక్తి నాకు లేదు. మిగతా విషయాలెలాగున్నా నేను నీ కివ్వబోయే వాటిలో __ నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన కుక్కనే అసలైన బహుమతిగా ఎంచుకో" అన్నాడు.
"మీ కుక్కను నా కిచ్చేస్తారా?" అన్నాడు స్వామి.
"దాని అవసరం నాకింక లేదు. నీ కది చాలా అవసరం. దాని ప్రవర్తనలో నీ ప్రతిబింబాన్ని చూసుకుంటూ గొప్పవాడివౌతావని నా ఆశ" అన్నాడు రుద్రరాజు.
"అయితే...." అని ఆగిపోయాడు స్వామి. తన మనసులోని కోరిక తను బయట పెట్టలేక పోయాడు.
ఆ రాత్రికి శోభనం ఏర్పాటు చేయబడింది. ఎదురుచూస్తూ మంచంపైన కూర్చున్న స్వామికి కనులు విందు చేస్తూ మీనాక్షి గదిలో అడుగు పెట్టింది. ఆమె వెనుకనే గది తలుపులు మూసుకున్నాయి. అయినా ఆమె ముందడుగు వేయలేదు. స్వామి ఓ రెండు నిముషాలెదురు చూసి, తనే లేచి వెళ్ళి ఆమెను సమీపించి __"మీనా! సిగ్గు పడుతున్నావా?" అన్నాడు. అతని మాటల్లో ఎన్నడూలేని చనువూ, ఆప్యాయత ధ్వనించింది.
"ఊహూఁ" అంది మీనాక్షి.
"భయపడుతున్నావా?"
"అనుమానం ఇంకా నీ మనసులోంచి పోలేదా?"
మీనాక్షి తలెత్తి నవ్వింది. ఆ నవ్వులో ఆహ్వానముంది. స్వామి తటాలున ఆమెను కౌగలించుకున్నాడు. ఆ కౌగిట్లో ఆమె యిమిడిపోయింది.
"ఎంత హాయిగా ఉంది!" అన్నాడు పరవశంగా.
"మార్గరెట్ గుర్తుకొస్తోందా?"
"మార్గరెట్ అయినా మరెవరైనా నాకు తెలిసిన స్త్రీమూర్తిది ఒక్కటే రూపం! ఆ రూపం పేరు మీనాక్షి. ఆ మీనాక్షి ఈ క్షణంలో నా స్వంతం."
"ఆగండాగండి" అంది మీనాక్షి.
"ఎందుకని?"
"అటుచూడండి" అంది మీనాక్షి.
రాజా అక్కడ నిలబడి ఉంది. అంతసేపూ అది మంచం క్రింద దాగుని ఉన్నట్లుంది. ఈ నూతన దంపతు లిద్దరివైపూ కుతూహలంగా చూస్తోందది.
స్వామికి ఉత్సాహం వచ్చింది. అతను మీనాక్షిని మళ్ళీ ఆవేశంగా, బలంగా కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. తొలి ముద్దులోని రుచిని ఆస్వాదించే అతని జిహ్వకంటే__చెవులు సునిశితంగా పనిచేస్తున్నాయి. కాని అతనికి మొరుగు వినబడలేదు.
స్వామి మీనాక్షిని వదిలిపెట్టి__"ఆహాఁ! ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది" అన్నాడు.
"ఇంతేనా?" అంది మీనాక్షి. కానీ సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
"అటుచూడు__ఒకప్పుడు మనిద్దరినీ కంట్రోల్ చేసిన ఆ కుక్క ఇప్పుడు నిస్సహాయంగా మన వంక చూస్తోంది. ఇది మనిషి కంటె తెలివైన కుక్క. ఇప్పుడు నాకు మన మధ్య మూడో మనిషి ఉన్నట్లే అనిపిస్తోంది. దీన్నిప్పుడు బయటకు తోలేయాలి" అన్నాడు స్వామి.
9
విశాఖపట్నంలో పూల్ ఆఫీసరుద్యోగం స్వామి ఏడాది కూడా చేయలేదు.
అక్కడే అతనికి ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఉద్యోగం దొరికింది. జీతం బాగానే లభిస్తుంది కాని__అతను ఆంద్రప్రదేశ్ అంతా తిరిగి సర్వే చేయవలసి ఉంటుంది.
సర్వేలో అతనికి నలుగురు సహాయకులుంటారు.
వివిధ ప్రాంతాల్లో తిరిగి ఏయే ప్రాంతంల్లో ఏయే ఖనిజాలు దొరకవచ్చునో అతను కనుక్కోవలసి ఉంది.
ఇటువంటి పనిచేయడానికి దేశంలో ప్రభుత్వ సంస్థలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగం స్వామి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేకంగా సృష్టించబడింది.
అతని అనుభవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ ఉద్యోగాన్ని సృష్టించింది. గతంలో పరిశోధనలవల్ల కొన్ని ప్రాంతాల్లో ఖనిజాలుండే సూచనలు తెలిశాయి.
అయితే రాజకీయ కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో మరింక పరిశోధనలు జరుగలేదు. అక్కడ పరిశోధనలు కొనసాగించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా స్వామిని నియోగించింది.
అతనికి అవసరమైన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రత్యేకమైన పర్మిట్లు ఇవ్వబడ్డాయి.
స్వామి పరికరాలు తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పని తక్కువే అని చెప్పవచ్చు.
ఆ కాలంలో అతను తన విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి యూనివర్శిటీకి వెళ్ళి వస్తూండేవాడు. అక్కడి ప్రొఫెసర్స్ తోనూ, రీసెర్చి స్కాలర్సుతోనూ చర్చిస్తూండడమూ__విదేశంలో జరిగే నూతన పరిశోధనల గురించి చదవడమూ అతనికి దినచర్య అయింది.