"ఏమైనా అంటే?" అన్నాడు స్వామి ఆశ్చర్యంగా. పేదరికంలో ఉన్నానంటున్న ఈమె తనకేమివ్వగలదా అని ఆశ్చర్యపడ్డాడు.
"డబ్బు కావాలంటే- నా ఉద్యోగం మీద నెలనెలా వాయిదాల పద్ధతిలో తీర్చగలను. ఇంకా ఏమైనా కావాలన్నా ఆశ్చర్యపోను."
స్వామి ఆమెనింకేమీ అడగలేదు - "మిసెస్ ఇందిరా! మీకు నా చేతనైనది చేయగలను. నావల్ల మీకు సహాయం లభించకపోతే అన్యధా భావించవద్దు" అన్నాడతను.
11
"ఏమండీ! ఇరవై ఏళ్ళమ్మాయిని పెళ్ళ చేసుకుందామని దొరక్కపోతే పదేళ్ళ అమ్మాయిల నిద్దర్ని చేసుకున్నాట్ట ఒకడు. అలా ఉంది మీ వరస. ఎన్ని స్కూతర్లైతే మాత్రం ఓ కారు సాటి వస్తుందండీ?" అంది మీనాక్షి.
"నువ్వలాగంటే నేనేం చేయను? ప్రస్తుతానికి నేను కొనగలిగింది స్కూటరొక్కటె- అదీ ఒక్కటే- అదీ లోన్ మీద."
"ఎప్పుడు డబ్బుంటే అప్పుడే కారు కొనుక్కుందాంకాని, స్కూటర్ మాత్రం వద్దు. స్కూటర్ మీద యాక్సిడెంట్లెక్కువగా జరుగుతాయంటారు. అదెక్కి తిరగటం మొదలెట్టామంటే కారు కొనుక్కునేదాకా బ్రతుకుతామో-బ్రతకమో?" అంది మీనాక్షి.
"అయితే లోన్ పెట్టొద్దంటావ్?" అన్నాడు స్వామి.
"లోన్ సంగతెందుకులెండి గాని, మన నిల్వ ఏమైనా పెరిగిందా?"
"లేదు మీనా!"
"అయితే ఓ పని చేయకూడదూ?" అంది మీనాక్షి.
"ఏమిటది?"
"చెప్పడానికి భయంగా ఉందండీ? చెప్పాక మీరేమీ అనుకోకూడదు" అంది మీనాక్షి తటపటాయిస్తూ.
"నా దగ్గర నీకు సంకోచమెందుకు?"
"అబ్బే మరేం లేదండీ...." అని మళ్ళీ ఆగిపోయింది మీనాక్షి.
అప్పుడే ఎక్కణ్ణించో రాజా వచ్చి వాళ్ళ ముందు నిలబడింది.
"అప్పారావుగారు మనకో ఉపకారం చేయబోతున్నారు" అని తడబడింది మీనాక్షి. రాజా ఆమెవంక అదోలా చూస్తోంది.
"చెప్పు- సందేహిస్తావేం?" అన్నాడు స్వామి.
"మీ ఆఫీసులో ఒక స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉందిటకదా- ఆయన తాలూకు వాడెవడో ఉన్నాట్టకదా....ఉద్యోగానికి అయిదువేలిస్తాడట...." మీనాక్షి ఆగింది.
స్వామి ఏదో చెప్పబోతుండగా రాజా భయంకరంగా మొరిగింది. మీనాక్షి వంక అది కోపంగా చూస్తోంది.
"రాజా! ఊరుకో" అన్నాడు స్వామి. అతనికి తెలుసు - అది తన ఆలోచనలకు ప్రతిబింబంలా పనిచేస్తుందని. కుక్క ఊరుకోగానే అతను భార్యతో - "చూశావా మీనా! నీ ఆలోచనల్లోని లోపాన్ని కుక్క కూడా ఎత్తి చూపించింది" అన్నాడు.
మీనాక్షికి కళ్ళనీళ్ళ పర్యంతమయింది - "నేననుకున్నంతా అయింది. మీరు మా నాన్నగారికి లాగానే ప్రవర్తిస్తున్నారు" అంది.
వెంటనే స్వామికి అర్ధంకాలేదు - "అదేమిటి మీనా?" అన్నాడు.
"వెధవ కుక్క. బయటివాళ్ళను చూసి మొరగదు కాని, దీని ప్రతాపమంతా ఇంట్లో వాళ్ళమీదే. చిన్నప్పట్నించీ నా చేత్తో బిస్కట్లు తినిపించాను. కాని ఇది నామీదనే మొరుగుతోంది. మా నాన్నగారూ అంతే! చిన్న చిన్న వస్తువులు నేనేం కోరినా వెంటనే కొనిపెట్టేవారు. కాస్త ఖరీదైనది ఏదైనా అడిగేసరికి వస్తువు లేదు సరికదా, ఓ గంట ఉపన్యాసం కూడా ఇచ్చేవారు. అది మన అంతస్తుకు తగ్గ కోరిక కాదన్నది ఆ ఉపన్యాస సారాంశం. నేను గోల పెట్టేదాన్ని. ఆయనెన్ని చెప్పినా నేను డబ్బు సంపాదించడం కోసం ఏం చేసినా తప్పులేదనేదాన్ని. అప్పుడాయన రాజాను పిలిచేవారు. అప్పుడు నా కోరికలు చెప్పమనేవారు. బట్టలడిగినా, ఆటబొమ్మలడిగినా, పెన్నూ, పుస్తకాలు, సినిమాల గురించి అడిగినా అది నాకేసే అదోలా చూసేది. ఏ రవ్వల నెక్లెసో, కారో అడిగేసరికి భొఁయ్ మనేది.
"నాన్నగారు దాన్ని ఆప్యాయంగా నిమిరి - 'నేనేం చేసేదమ్మా - ఇది వద్దంటోంది. ఏది తప్పో ఏది ఒప్పో నాకంటే దీనికి బాగా తెలుసు' అనేవారు. నా కోరికల నాటంకపరుస్తున్న దీన్ని చూస్తే నాకు చాలా మంటగా ఉండేది. తర్వాత నాన్నగారి కెంతోమంది డబ్బిస్తామంటూ వచ్చేవారు. కాలేజీ ప్రిన్సిపాలంటే మాటలు కాదు. చాలా పలుకుబడి ఉంటుంది. ఆ పలుకుబడి ఉపయోగించుకుని మేడలు కట్టినవాళ్ళున్నారు. కార్లు కొన్నవాళ్ళున్నారు. తమ భార్యాబిడ్డలను అష్టయిశ్వర్యాలతో ముంచెత్తేవారున్నారు. కాని నాన్నగారలా కాదు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సిరిని కాదనేవారు. ఏ లాభమూ ఉండేది కాదు సరిగదా ఉన్నదాంట్లోనే దానధర్మాలొకటి. అమ్మ దేబ్బలాడితే- 'దేవుడు మనకింత ఇచ్చాడు! ఉన్నదాంట్లో పదిమందికి సాయపడితే తప్పేముంది?' అనేవారు. 'మనకింతిచ్చాడేమిటి? గట్టిగా ఓ రవ్వల నెక్లెస్ కొనుక్కుందామంటే లేదు'....అని నేనంటే ఆయన మళ్ళీ ఓ ఉపన్యాసం మొదలు పెడ్తారు. సంతృప్తిని మించినది లేదన్నది ఆ ఉపన్యాస సారాంశం.
"ఆకలేసినవాడికి అన్నం తింటేనే సంతృప్తి. కోరికలున్నవారికి అవి తీరినప్పుడే గదా సంతృప్తి అంటే మళ్ళీ ఆయన ఉపన్యాసం ప్రారంభమయ్యేది. కోరికలు రెండు రకాలట- న్యాయమైనవీ అన్యాయమైనవీ అని. న్యాయమైన కోరికలంటే ఆకలి ఇలాంటివి. ఆ కోర్కెలు తీరకపోతే మనిషికి మనుగడే లేదు. అన్యాయమైన కోర్కెలంటే రవ్వల నెక్లెస్ లాంటివని ఆయన ఉద్దేశ్యం. అవి లేకపోయినా బ్రతకొచ్చును కాబట్టి, అవి అన్యాయమైపోయాయి. నాకు చాలా బాధగా ఉండేది. ఆయన చెప్పిన ప్రకారం మనిషికీ జంతువుకీ తేడా లేదు. జంతువులు తిండికోసమే బ్రతుకుతాయి. అలా అంటే నాన్నగారు మళ్ళీ ఉపన్యాసం ప్రారంభించేవారు.
"జంతువులు తిండికోసం ఏమైనా చేస్తాయట. మనిషి కూడా అలా చేస్తే జంతువుతో సమాన మవుతాడట, అలా కాకుండా ఏ పరిస్థితుల్లోనూ సత్ర్ప్రవర్తన విడిచిపెట్టనివాడొక్కడే అసలైన మనిషి అవుతాడట. అసలైన మనిషిగా జీవితం గడిపినప్పుడే ఎవరికైనా తృప్తిగా ఉంటుందట. ఏమో- నాకు మాత్రం వుండేదికాదు కాని ఆ మాట పైకి అనడానికి భయం వేసేది. ఒక పక్క కుక్క మొరుగుతుంది. ఇంకోపక్క నాన్నగారి ఉపన్యాసం. ఈ రెండూ భరించలేక నా ఊహల్ని నా మనసులోనే దాచుకునేదాన్ని. ఒకే ఒక్క ఆశ నాలో తళుక్కుమంటూండేది. అమ్మ నా గురించి నాన్నగారి దగ్గర బాధపడుతూండేది- 'ఒక్కగానొక్క పిల్ల మనకు. దానికి అచ్చటా ముచ్చటా తీరడం లేదు. చిన్నపిల్లకు మీ ఆశయాలేం అర్ధమవుతాయి' అంటూ ఆయన దగ్గర అంటే ఆయన నవ్వేసి- 'అది అదృష్టవంతురాలే- నేను తీర్చలేని కోరికలు దాని మొగుడు తీరుస్తాడు' అంటూండేవారు.
అప్పట్నించీ నా కోర్కెల్ని వాయిదా వేసుకున్నాను. మీతో పరిచయమైనప్పట్నించీ నాలో ఆశలు రేగాయి.
మీరు నన్ను ప్రేమిస్తున్నారనీ నా కోసం ఏమైనా చేయగలరనీ అనిపించింది.
నా ఆశల్ని మీ చుట్టూ పేర్చుకున్నాను. నేను చూస్తూండగా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతూంటే ఎంతో సంతోషించాను.
మధ్యలో మీరు నా చేయి దాటిపోతారేమోనని భయపడ్డాను కూడా. కాని అలా జరగలేదు.
నా మీద ప్రేమను మీరు వదిలిపెట్టకుండా నన్ను వివాహం చేసుకున్నాను.
ఆ క్షణం నించే నా మనసు కార్లలో విహరిస్తోంది. అష్టయిశ్వర్యాలతో తులతూగుతోంది. కాని ఇన్నాళ్ళకు మీ అసలు రంగు బయటపడింది. మీరు కూడా కుక్క చేత మొరిగిస్తున్నారు, ఉపన్యాసాలిస్తున్నారు."
మీనాక్షి చెప్పడం ఆపి వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
స్వామికి వెంటనే ఏం చేయాలో తోచలేదు.
భార్య మనస్సులోని ఆవేదన అతనికి ఆవేశాన్ని కలిగించింది.
ఆమె కోసం ఏమైనా చేయాలని ఆ క్షణంలో అనిపించింది. అతనామెను దగ్గరగా తీసుకుని- "నా ప్రియమైనా మీనా! నీ మనసులో ఇంత బాధ ఉందని నాకు తెలియదు. నువ్వు కూడా మీ నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు ప్రతి బింబంగా పెరిగావనుకున్నాను. సత్ప్రవర్తన నా ఊపిరి. అదే నిన్ను బ్రతికించింది. ఇంత వాణ్ణి చేసింది. అప్పట్లో నాకది అవసరం కూడా అయింది. అయితే అది వదులుకోవడం అవసరంగా ఇప్పడు పరిణమించేలా ఉంది. అయితే నీ అమాయకత్వం నాకు బాగా తెలుసు. సత్ప్రవర్తనను వదులుకోవడమంటే నీకు అర్ధం కాలేదు. చిన్నపిల్లలకు కనిపించిన ప్రతీ దానితో ఆడుకోవాలనుంటుంది. అది విషసర్పమైనా వారు సంకోచించరు. ఆ తర్వాత కాటు వేసినా బాధ పడి ప్రయోజనముండదు. పెద్ద వాళ్ళ అనుభవముంటుంది కాబట్టి పిల్లల్నిలాంటి ప్రమాదాలకు లోను కాకుండా కాపాడుతూంటారు. నీ కోరిక విషసర్పతుల్యం. ఆ సంగతి నేనిప్పుడు చెప్పినా నమ్మలేవు కాని జరగవలసింది జరిగిపోయాక, నమ్మి మాత్రం ఏం ప్రయోజనం?" అన్నాడు.
"ఉపన్యాసమిస్తున్నారా?" అంది మీనాక్షి.
"లేదు. నిన్ను మరిపించగల శక్తి నాకుంది గదా- అందుకని మరిపిస్తున్నాను."
"ఏమండీ! పిల్లల్ని మరిపించడానికి రెండు రకాల కారణాలుంటాయి. ఒకటి- వారి కోరిక మీరు చెప్పినట్లు ప్రమాదకరమైనది కావడం. రెండవది- వారి కోర్కె తీర్చే శక్తి తల్లిదండ్రులకు లేక పోవడం. మీరిప్పుడు నన్ను మరిపించడానికి ఏది కారణమంటారు?" అంది మీనాక్షి.
స్వామి తడబడి-"మొదటిదే. ఉద్యోగం ఇప్పించడానికి లంచం పట్టడం అంటే...." అని ఆగాడు.
మీనాక్షి అందుకుని- "కాని నా కోరిక మొదటిది కాదు. నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించే శక్తి మీకు లేదు. అందుకని ప్రమాదకరమైన పనుల వైపు మిమ్మల్ని పురిగొల్పుతున్నాను. అవైనా ప్రమాదకరమైనవి మీరంటున్నారు. లేకపోతే లక్షలకు లక్షలు సంపాదించవచ్చు మీరు. అది అందరూ చేసేదే" అంది.
స్వామి భయంగా- "లక్షలకు లక్షలా! ఏ విధంగా?" అన్నాడు.
"తెలుసుకోవాలని మీకు నిజంగా ఉంటే ఓ రోజు అప్పారావుగారిని మనింటికి పిలుస్తాను" అంది మీనాక్షి.
"నేను మాట్లాడితే ఉపన్యాసమని పిలుస్తూ, ఆ అప్పారావు చెప్పిన ఉపన్యాసాన్ని తలకెక్కించుకున్నావన్న మాట! అయినా నా ఉద్యోగంలో నాకు తెలియని రహస్యాలు ఆ అప్పారావు కెలా తెలిశాయో, ఎందుకు తెలిశాయో తెలుసుకోవాలనే ఉంది-ఓ సారి మనింటికి ఆహ్వానిద్దాం" అన్నాడు స్వామి.