"అనంతరము భగీరథుడు పూర్వము తన ముత్తాతలు సాగర పుత్రులు అరువదివేలమందియూ సవనాశ్వమును వెదకుటకు త్రవ్విన అగాధము ద్వారా తన రథమును పోనిచ్చి గంగానది తన్ను అనుసరించి రాగా పాతాళమును చేరినాడు. గంగానది సగరపుత్రుల భస్మరాశులపై ప్రవహించి వారికి పుణ్యలోకములను ప్రాప్తింపచేసినది.
"సగర పుత్రులు త్రవ్విన అగాధము కాలక్రమమున వర్ష జలముతో నిండి సముద్రము ఏర్పడినది. సగర పుత్రులు త్రవ్విన నది గనుక సముద్రమునకు 'సాగరము' అను పేరు వచ్చినది.
"స్వర్గ మర్త్య పాతాళ లోకములు మూడింటి యందునూ ప్రవహించినది గనుక గంగ 'త్రిపథగామిని'యైనది. భగీరథునిచే కొని రాబడిన ఆ నదీమ తల్లికి 'భాగీంధి' అన్న నామదేయమునూ కలిగినది"
మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో గంగానదిని దాటి మిథిలా నగరమునకు ప్రయాణమును సాగించినాడు.
మార్గము ప్రక్కనొకచోట వారికి పాడుపడిన కుటీర మొకటి కనపడినది. విశ్వామిత్రుడు 'ఇందొక పని యున్నది, లోనికి రండు' అని రామ లక్ష్మణులతో ఆ పర్ణశాలను ప్రవేశించెను. ఆయన ఇట్లు చెప్పెను"మున్ను ఇది 'గౌతముడు' అను ముని ఆశ్రమము. గౌతముని భార్య పేరు 'అహల్య'. ఆమె విరుపమాన సౌందర్యవతి. ఇంద్రుడామెను మోహించి ఆమె పొందును కోరెను. ఒక అర్దరాత్రి సమయమున అతడు కుక్కుట రూపమును దాల్చి వచ్చి ఈ పర్ణశాల ముందు నిలిచి కొక్కొరొకో అని కూసెను. గౌతముడు మేల్కొని తెల్లవారనున్నదని భ్రమపడి నదికిపోయెను. ఇంద్రుడు లోన ప్రవేశించెను. నదికి పోయిన గౌతమునకు ఉషోదయ చిహ్నము లేవియూ కనపడక 'ఎందుకిట్లు జరిగినది?' అని అనుమానించుచూ ఆతడు పర్ణశాలకు తిరిగి వచ్చెను. లోనుండి దొంగచాటుగా బయటకు వచ్చుచున్న ఇంద్రుడాతనికి ఎదురైనాడు. గౌతముడు జరిగిన మోసమును గ్రహించి ఆగ్రహముతో 'ఓరీ నీచుడా! నీ దేహము సహస్ర యోనిమయమై జుగుప్సాకరము అగుగాక!' అని శపించెను. శకృడు (ఇంద్రుడు) బ్రహ్మయొద్దకు పోయి తన దుస్థితిని తొలగించుమని మొరపెట్టుకొనెను. బ్రహ్మ 'మునికిట్లు ద్రోహము నేల చేసితివి?' అని ఇంద్రుని మందలించెను, పిమ్మట కరుణించి వాని శరీరమందంతట నున్న యోనులను కన్నులుగా మార్చెను. నాటి నుండియూ శక్రుడు 'సహ స్రాక్షుడు' అనియూ పిలువబడెను....అహల్యకు ఏమైనదో ఆలకించుడు. ఆమె కంటబడుటతోనే గౌతముడు కోపముతో 'అపవిత్రవు! శిలగా పడియుండుము!' అని శపించెను. 'మా దాంపత్యమిట్లేల ధ్వంసమైపోయినది?' అని విలపించుచూ 'ఇంక నేనిక్కడ ఉండజాలను హేమాద్రికి పోయెదను' అన్న నిశ్చయమునకు వచ్చెను. అతడు శిలను ఉద్దేశించి 'కొంతకాలము పిదప దసరథాత్మజుడు రాముడిటువచ్చును. ఆ మహిమాన్వితుని పదస్పర్శ వలన నీవు మరల నీ రూపమును పొందెదవు. ఆ సమయమునకు నేనీ ఆశ్రమమునకు మరలివచ్చెదను' అని ఈ పర్ణశాలను విడిచి పోయినాడు....రామా అదిగో ఆ శిలయే అహల్య. ఆ రాతిని నీ పద రజమున మరల నాతిగా జేయుము"
కరుణామయుడగు రాముడు శిలను తన పాదముతో తాకి అహల్యను శాపవిముక్తను చేసెను. ఆశ్రమమునకు తిరిగి వచ్చిన గౌతముడు ఆ విశుద్దాంగిని చేరదీసి ఆదరించినాడు.
పిమ్మట ఆ దంపతులు విశ్వామిత్రునకునూ దశరథ నందనలకునూ అతిథి సత్కారములు చేసి వీడ్కోలిపినారు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో ప్రయాణమును సాగించి మిథులను చేరుకోన్నాడు.
విశ్వామిత్రుని రాకకు జనకుడు సంతోషించినాడు. "బ్రహ్మర్షిపుంగవా, సూర్యచంద్రులు వలె భాసిల్లుచూ కాంతులను వెదజల్లుచున్న ఈ యువకులెవరు?" అని అడిగినాడు. విశ్వామిత్రుడు "వీరు దశరథ మహారాజ కుమారులు. ఇతడు రాముడు. అతడు లక్ష్మణుడు" అనెను. జనకుడు "రేపు నా అభిమాన పుత్రిక సీతకు వరుడు నిశ్చయించబడును. మీరా సభకు వీరితో విచ్చేయుడు" అని ఆహ్వానించినాడు.
వివిధ ప్రాంతముల నుండి వచ్చిన రాజపుత్రులతో సభ నిండియుండెను. జనకుడు పెక్కుమంది బలాఢ్యులను పంపి శివుని విల్లు గల మందసమును సభలోనికి రప్పించేను వారు. ఆ మహాధనువును పైకి తీయుటకు ఎంతగానో శ్రమించవలసి వచ్చెను. అందరికినీ కనబడునట్లు ఆ కార్ముకమును ఒక ఉన్నత పీఠముపైన ఉంచినారు.
పిమ్మట జనకుడు సభయందలి రాజపుత్రుల నుద్దేశించి ఇట్లు ప్రకటించినాడు: "మీలో ఎవడు ఈ చాపమును ఎక్కుపెట్టగలడో ఆ మహాధానుష్కుడే ( నిలుకాడే) మా సీత పాణిగ్రహణమునకు అర్హుడు"
ఆ ధనువును చూచిన రాజకుమారులలో అనేకులు "విలా ఇది? కొండవలెనున్నది! ఎక్కుపెట్టుట మాట అటుంచి ఈ మహా కార్ముకుమును ఆవగింజంత మాత్రుమైన ఎత్తగలమా? చేతగాని పనికి సిద్దమై నగుపాటు పాలగుట వివేకము కాదు" అనుకొని తమ అసనములందే ఉండిపోయిరి. మిగిలిన కొలదిమంది ప్రయత్నించిరి కాని వారి ప్రయత్నము ఫలించలేదు..... విశ్వమిత్రుడు రామునకు కనుసౌజ్ఞ చేసినాడు; రాముడు లేచి వెళ్లి కొదండమును అవలీలగా ఎత్తినాడు; వింటి వారిని సులువుగా సంధించినాడు; గుణమును ( వింటి త్రాటిని) ఆకర్ణాంతము లాగి చాపమును వంచబోగా అది ఫెళఫెళమను శబ్దము చేయుచూ రెండు ఖండములుగా విరిగిపోయినది! జనకుడు ఆనందభరితుడైనాడు. 'ఎక్కుపెట్టుటయే గాక ఈ మహాధనుస్సును విరిచివేయగలిగినంతటి బలాధికుడు ఈ రాముడు!' అని ప్రశంసించినాడు.
పిమ్మట జనకుడు పెండ్లి సంబంధమును నిశ్చయము చేసుకుని రమ్మని తన మంత్రి పురోహిత వర్గమును దశరథుని వద్దకు పంపెను. దశరథుడు వారితో "మిథిలాధి వతితో వియ్యమందుట మాకేంతయు ముదావహాము" అని చెప్పి సత్కరించి వీడు కొలిపెను..... ముహూర్త నిశ్చయమైనది. దశరథుడు తన తన రాణులతోనూ భరత శత్రుఘ్నలతోనూ బంధుమిత్ర పరివారముతోనూ మిథిలా నగరమునకు తరలివెళ్లెను....... భరత లక్ష్మణ శత్రుఘ్నలను గమనించిన జనకునకు ఒక ఊహా జనించినది. తన తమ్ముడు కుశధ్వజునకు ఒక ఊహా జనించినది. తన తమ్ముడు కుశధ్వజునకు మాండలి, ఊర్మిళ, శత్రుకీర్తి అను మువ్వురు కుమార్తెలు కలరు. భరతనకు మాండలినీ, లక్ష్మణునకు ఊర్మిళనూ, శత్రుఘ్ననకు శత్రకీర్తినీ ఇచ్చి పెండిండ్లు చేసినచో ఈడూ జోడై శోభిల్లుదురని తోచినది. దశరథునితో చెప్పగా అయన తన రాణులను సంప్రదించినాడు. వారు 'మహాబాగు' అని అంగీకరించినారు. సీతారాముల కల్యాణముతోపాటు ఆ మూహూర్తముననే తక్కిన మూడు వివాహములునూ అత్యంత వైభవోపేతముగ జరిగినవి.
నాటితో రామాయణమున విశ్వామిత్రుని పాత్ర ముగిసినది. ఆ బ్రహ్మర్షి హిమాచలనముకు పోయిపారమార్ధిక చింతనలో శేష జీవితమును గడిపినాడు.
దశరథుడు కొడుకులతోనూ కోడండ్రతోనూ అయోధ్యకు తిరిగివచ్చుచుండగా మార్గమున ఒకచోట భార్గవ రాముడు ఎదురయ్యెను. ఆజానుబాహువునూ భయంకరాకారుడునూ అగు అయన తల జడలతో నిండియున్నది; దక్షణ హస్తమున ఒక మహాధనువు ఉన్నది; అది విశ్వకర్మచే చేయబడి విష్ణువునకు సమర్పించబడిన విల్లు; ఆ మహాకార్ముకము పేరు శార్ధము. అవతార పురుషుడగు భార్గవ రామునకు ఆ చాపము విష్ణువు నుండియే సంక్రమించినది. అయన వామ హస్తమున ఒక పరశవు ( గండ్ర గొడ్డలి) ఉన్నది...... భార్గవరాముడు వుష్ణువు అంశమున జమదగ్ని అను మునీంద్రునకు సుతుడుగా జన్మించెను. వేయి చేతులు కళ 'కార్తవీర్యార్జునుడు' అను రాజు వలననూ వాని పుత్రుల వలననూ భార్గవ రామునకు అపచారము జరిగినది; కార్త వీర్యార్జునుని పుత్రులు జమదగ్నిని చంపివేసినారు. శోకతప్తుడునూ కృద్దుడునూ ఐనభార్గవుడు రాజును సపుత్రకముగా సంహరించినాడు. అంతటిలో ఆగలేదు. దుర్మార్గులను రాజులపైకి ఇరువది యొక్కసార్లు పోయి తన పరుశువుతో వారి తలలు నరికి భూమికి భారమును తొలగించినాడు; ఆ రక్తముతో తండ్రికి తర్పణములు వదిలినాడు.
పరశురాముడు మార్గమున తనకు అభిముఖుడైయున్న దశరథ రామునిపై కోపమును వెల్లడించుచూ ఇట్లు అనెను నీవు జనకుని యింటవిల్లును విరిచి శివాపరాధమును జేసినావు! నిన్ను దండించేదను. నాతో ద్వంద్వ యుద్దమునకు రమ్ము."
దశరథ రాముడు: (సవినయముగ) మాహత్మా మీరు పరమ పవిత్రలగు బ్రాహ్మణులు. మరియూ భార్గవాన్వయులు. మీతో మాకు సమరము తగదు.
పరశురాముడు (హేళనగ) చివుకు విల్లును విరిచి వీరుడనని విర్రవీగినావు! ఇప్పుడు ఏమేమియో చెప్పినీమ అసమర్ధతను కప్పిపుచ్చుకొను చున్నావు! సమర్ధుడవైనచో నా దక్షణ హస్తమందున్న 'శార్ఖ్గము' అను ఈ మాహ ధనువును ఎక్కుపెట్టుము, చూచెదను! ఇది శ్రీ మహావిష్ణువు కార్ముకము.
ఆ కార్ముకమును భార్గవరాముడు దశరథ రామున కందించినాడు. అయన ఊహించని దొకటి జరిగినది. అయన యందలి విష్ణ్వంశయూ బయల్వెడలి ధనువుతోపాటు రాముని చేరినది. రాముడు ద్విగుణీకృత తేజముతో భాసిల్లినాడు. భార్గవుడు తేజోవిహీనుడై వెలవెలపోయినాడు...... అయన చిన్నబుచ్చుకొనలేదు. తన అవతారము సమాప్తమైనదని తెలిసికొన్నాడు. రాముడు మహవిష్ణువు అవతారమే అనియూ తానానాడందించిన మహధనువు అతనిదే అనియూ సంతుష్టా౦తరంగుడై వీడుకుని అట నుండి మహేంద్ర పర్వతమునకు పోయినాడు. తపమున నిమగ్నుడై శేషజీవితము నచ్చట గడిపినాడు.
రాజ లోకమునుకు భయంకర శత్రువైన పరశురాముని నేర్పుగా ప్రతిఘటించిన కుమారుని దశరధుడు సంతోషముతో కౌగలించుకోన్నాడు....... పిమ్మట వారందరూ ప్రయాణమును సాగించి అయోధ్యా నగరమును చేరుకున్నారు.