Previous Page Next Page 
రామాయణము పేజి 10

                                 

                             

                                                    5.  రెండు వరములు 
   
    ( "నేను వృద్దుడనగుచున్నాను. నా జేష్టపుత్రుడు రాముని యువరాజుగా అభిషక్తుని చేసి రాజ్యభారమును వానికప్పగించ సంకల్పించినాను...... రాముడు పరాక్రమమున ఇంద్రుని వంటివాడు. పరమ ధార్మికుడు ; ముల్లోకములనూ ఏలగల సమర్ధుడు; మీ అంగీకారమును తెలుపగోరుచున్నాను.")

   
    కేకయ రాజ్యమునకు గిరివజ్రము రాజధాని. కేకయ రాజు కుమారుడూ కైకేయి సోదరుడుగా అగు యధాజిత్తు  ఒకనాడు అయోధ్యా నగరమును వచ్చి దశరథునితో "బావా మా తండ్రికి మనమడు భరతుని చూడవలెనన్న కోర్కె కలిగినది. వానిని తీసుకుని "నాతో శత్రుఘ్నుడు   కూడా రావలెను" అన్నాడు. తల్లిదండ్రుల అనుమతిని  బడసి  ఆ అన్నదమ్ములిరువురూ యుధాజిత్తుతో గిర్రివజ్రమునకు పోయినారు. మాటా మహుని కోరికపై వారు అచ్చటనే ఉండిపోయినారు.
    ఏండ్లు గడిచినవి. రాముడు ఇరువది నాలుగు వత్సరముల ప్రాయము వాడైనాడు. అతడు పిత్రాజ్ఞానుసారము ప్రజల మంచి చెడ్డలను విచారించుచూ ప్రజాహిత కార్యక్రములలో నిమగ్నుడైనాడు. అతని ప్రతిభనూ వినయ శీలమునూ అందరూ ప్రశంసించసాగినారు.
    ఒకనాడు దశరథ మహారాజు నిండు కొలువులో గురువులనూపుర వరముఖలనూ ఉద్దేశించి ఇట్లు చెప్పినాడు.   
    "నేను వృద్దుడనగుచున్నాను. నా జేష్టపుత్రుడు రాముని యువరాజుగా అభిషిక్తుని చేసి రాజ్యభారమును వానికప్పుగించ సంకల్పించినాను...... రాముడు పరాక్రమమున ఇంద్రుని వంటివాడు. పరమ ధార్మికుడు ; ముల్లోకములనూ ఏలగల సమర్ధుడు ; మీ అంగీకారమును తెలువగోరుచున్నాను."
    వారందరునూ సంప్రదించుకొని ఏకగ్రీవముగా ఇట్లు వంచించినారు.   
    "మహారాజా, శ్రీరాముడు అనంత కల్యాణ గుణసంపన్నుడు. ప్రజల ప్రేమాభిమానములకునూ గౌరవ భావనకునూ పాత్రుడైనవాడు అతడు పాలకు డగుటకన్న మాకింక కొరదగినదేమున్నది?"
    సభయందలి జ్యోతిష్కులు "మహారాజా, తలపెట్టిన శుభకార్యమును శీఘ్రముగా జరిపించవలెను. రేపు పుష్యమి నక్షిత్రము, పట్టాభిషేకమునకు మంచిరోజు" అన్నారు.  
    దశరథుడు సంతసించి మంత్రులను "నేడే నగరమును అలంకరించుటకు పనివారిని నియమించుడు ; పట్టాభిషేకమునకు ఏమేమి కావలయునో వసిష్టముల వారి నడిగి తెలుసుకొని ఆ సామగ్రిని సమకూర్చుడు; నాలుగు వర్ణముల వారికినీ పంచభక్ష్య పరమాన్నములతో విందులను ఏర్పాటు చేయుడు" అని ఆదేశించినాడు... పిమ్మట రాముని రప్పించి "కుమారా రేపునీవు యువరాజువు కాబోవుచున్నావు. అమాత్యులూ, సేనాధిపతులూ, ఇతర ఉద్యోగులూ ఎల్లప్పుడూ   సంత్రుప్తులుగా ఉండునట్లు నీవు చూడవలెను. నీవు ఏ వ్యసనములనూ ధరిచేరనీయరాదు. చారుల ద్వారా పరరాజుల వృత్తాంతములనూ స్వయముగా స్వరాజ్యవిషయములనూ తెలిసికొనుచుండవలెను. కోశాగార ములకూ ధాన్యాగారములనూ నిండుగా ఉంచి ప్రజలకు ఏ లోపమూ లేకుండ పాలించవలెను" అని బోధించినాడు.
    రాముడు తండ్రికి నమస్కరించి తల్లి కౌసల్యదేవి వద్దకు పోయి సుమిత్రా లక్ష్మణుడూ వినుచుండగా  ఆ  శుభవార్తను తెలియజేసినాడు. కౌసల్య తనయుని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ 'నాయనా నేడు నా నోములు ఫలించినవి!" అని ఆనంద బాష్పములు రాల్చినది. "యువరాజుగా నీ విధ్యుక్త ధర్మములను నేరవేర్చెదపు  గాక!" అని దీవించినది. రాముడు లక్ష్మణునితో 'తమ్ముడా నీవు నా బహి:ప్రాణమవు. విధి నిర్వహానములో నీవు నాతో సహకరించవలెను" అన్నాడు ..... కౌసల్యదేవి అచ్చటకు సీతను రప్పించి, పట్టాభిషేక  వార్తను తెలిపి ఆనందమును కలిగించినది. "నీ భర్తతోబాటు నీవునూ ఈ రాత్రి ఉపవాసము చేసి దీక్షను వహించవలెను.... నేనింక దేవతా గారమునకు పోయి మీ యిరువరి మంగళాభివృద్దికినీ లక్ష్మినారాయణులను ప్రార్ధించెదను" అని లేచినది.   
     మరునాటి కార్యక్రమునుకు ఏర్పాట్లు చేయుచూ దశరథుడు కొల్వు కూటముననే ఉండిపోయినాడు. ఆ రాత్రి కైకేయి అంతఃపురమునకు పట్టాభిషేక వార్త అందలేదు. దశరథుడు "ఉదయమున స్వయముగా పోయి 'చెప్పి' కైకకు సంతోషమును కలిగించేదను" అనుకొన్నాడు.   
    కైకేయి అంతఃపురమున 'మంధర' అను దాసి ఉన్నది. ఆమె కైక పుట్టినింటి నుండి అరణముగా వచ్చిన దాసి... పట్టాభిషేక దినమున పాతఃకాలమున ఆమె అతఃపురము నుండి వెలుపలకు వచ్చి చూచినది. తుడిచి నీరుజల్లి ముగ్గులతో ఉన్న నగర వీధులునూ, గాలికి రెపరెపలాడుచూ ఎగురుచున్న రంగురంగుల జండాలనునూ, పూల మాలలలో మామిడాకుల తోరణములతో అలంకరించబడి యున్న భావన ద్వారములునూ కనబడినవి "ఏమిటి విశేషము?" అని అడిగి తెలిసికొన్నదామే. "రామునకు పట్టాభిషేకను" న్న శుభవార్త మంధరకు సంతోషకరముగా లేదు. రాముడనన్నూ, కౌసల్యాదేవియన్ననూ మంధరకు కిట్టదు.
    మంధర శరవేగమున అంతఃపురమునకు తిరిగివచ్చి కైకేయి శయనాగారమును ప్రవేశించినది.  కైకఇంకనూ తల్పము నుండి లెవలేదు. మంధర "అవతల ఉప్పెన ముంచెత్తుకొని వచ్చుచుండగా నీవంకనూ నిద్దుర యందే ఉంటివా తల్లీ? మహారాజూ నీ మీద ప్రేమ నటించుచునే భరతుడు లేని సమయమున నీ సవతి కొడుకు రామునకు పట్టము కట్టుచున్నాడు!" అన్నది. అంతలో మేల్కొన్న కైకేయి రామునకు పట్టము మాట విని బ్రహ్మానంద భరితమైలేచి "ఎంత మంచి మాటను చెప్పితివే మంధరా! అనుచూ తన మేడ యందలి రత్నహారముల నుండి ఒక హరమును తీసి ఆమెకు బహుకరించినది. మంధర చిరాకుతో ఆ మణిమాలను ప్రక్కన పడవైచి "వెఱ్ఱి తల్లీ, ఇది నీకు సంతోషకర  వార్తయా! రాముడు యువరాజైనచో అధికారమంతయూ కౌసల్య చేజిక్కించుకొనును. రాజమాతనన్న గర్వముతో ఆమె నిన్ను లోకువ చేయును. సింహసనమును రామునకు అప్పగించిన పిమ్మట ఆమె దశరథుని మాటనూ లక్ష్యపెట్టదు. నవతివన్న పగతో నిన్ను దాసి కన్నహీనముగా జూచును.          
                పరాక్రమవంతుడైన భరతుడు రామునకు ఊడిగము చేయవలసివచ్చును. ఆ అభిమానధనుడు దాస్యమును సహించక ఎదురుతిరిగినచో రాముడు వానిని దేశము నుండి బహిష్కరించుటయో జరుగును"అన్నది ..... కైక మొదట మంధర మాటలను లక్ష్యపెట్టలేదు. "మంధరా ఏవేవో ఊహించుకుని అల్లుకొని పోవుచున్నావు! రాముడు మహారాజు జేష్టపుత్రుడు కనుక యువరాజు కాబోవుచున్నాడు. అతడు ధర్మజ్ఞుడు. నన్ను కౌసల్యాదేవిని వలెనెగౌరవముగానూ ప్రేమాభిమానములతోనూ చూచుచున్నాడు. ఆ చిరంజీవి రాజు ఐన పిమ్మట తమ్ములనూ తక్కిన వారినీ కూడ కన్నతండ్రి వలె ఆదరించును. రామునకు రాజ్యము వచ్చినచో భరతునకు వచ్చినట్లే..... ఇంతకూ ఈ అనవసర ప్రసక్తి దేనికి? భరతుడు ఆభిషిక్తుడు కావలేనన్నది నీ అభీష్టము కావచ్చును కాని అదేట్లు సాధ్యము?" అన్నది.   
    మందర ఇట్లు చెప్పినది:   
    "నేను సదా నీ శ్రేయమును గూర్చి అలోచించుచుండ వలెననియే కదా తలితండ్రులు నన్ను నీతో పంపినారు? నీకు మేలు చేయు అవకాశమిప్పుడు చిక్కినది కానుక ఈ ప్రసక్తిని తెచ్చినాను..... నీవు మరచి తివేమో కాని నాకు జ్ఞప్తి యందున్నది. పరిణయమైన  పిమ్మట నీవు అయోధ్యకు వచ్చిన కొత్తలో నీ నాథునకు శంబరాసునితోయుద్దము చేయవలసి వచ్చినది. నీకు సౌరథ్యము వెన్నతో బెట్టిన విద్య కానుక మహారాజునకు రథసౌరథివై రణరంగమునకు కొనిపోయినావు. ఆ పోరాటములో దశరథుడు శంబరుని శరాఘాటములకు రెండుసార్లు రథములో మూర్చిల్లినాడు. నీవు రెండు సార్లనూ స్యందనమును చాకచక్యముగ సమరస్థలి నుండి సురక్షిత ప్రాంతమునకు చేర్చిశైత్యోపచారమును  చేసి కాపాడినావు. మహారాజు నిన్ను కృతజ్ఞతా పూర్వకముగ ప్రశంసించి "రెండు పర్యాయములు తోడ్పడితిని కాన రెండు వరములను కోరుకొనుము, ఇచ్చెదను" అన్నాడు. నీవు 'మహారాజా, మీ ప్రేమాభిమానములకు నోచుకున్న నాకిప్పుడు తీరని కోర్కెఏదియూ లేదు. మున్ముందు అవసరమైనప్పుడు అర్ధించేదను లెండు" అన్నావు.... ఇప్పుడా అవసరము వచ్చింది. 'రాముని బదులు భరతుని పట్టాభిషిక్తుని చేయుచున్నది' మొదటి వరము.
    తమ ప్రేమాభిమానములకు ఆస్పదుడైన రాముడు అయోధ్యలోనే ఉండిపోయినచో ప్రజలు భరతుని రాజుగా అంగీకరించరు. కనుక రాముని అదియందే అరణ్యమునకు పంపివేయవలెను".
    కైకేయి తటపటాయించినది "ఇట్టి వరములను కోరవచ్చునా?" అన్నది. మంధర "కన్నబిడ్డకు మేలు కలిగించు అవకాశము ఎదురైనప్పుడు చేజిక్కించుకొనకుండుట అవివేకము... మహారాజు రామ పట్టాభిషేక వార్తను  తెలుపుటకిప్పుడిచ్చటకు  రావచ్చును. ఈలోపుననే నీవు కోప గృహమును చేరవలెను. నీ కోపకారణమును తెలిసికొనుట కాయన అచ్చటకు  వచ్చును. నీ  తెలివినంతనూ ప్రయోగించి కృతార్ధూరాలవు కమ్ము" అనెను.
    దాసి సలహా రాణికి నచ్చినది. ఆమె ఉత్సాహముతో " మంధరా భరతుడు పట్టాభిషిక్తుడు అగుటతోనే నీ మెడలో బంగారు గొలుసులను వేయించెదను;  దాసీ జనము పై నీకు  పెత్తనము కలిగించెదను; నా సవతులను సైతము తృణీకరించుచూ నీవు  సగర్వముగ తిరుగునట్లు చేసెదను!" అన్నది. మంధర "అదంతయూ తర్వాత  చూచుకొందము లెమ్ము. నీవు వెంటనే మాసిన చీరతో కోపగృహమును ప్రవేశించుము; నగలనన్నింటినీ తీసి చిందరవందరగ పడవేయుము; నెలపైన పరుండుము" అని  తొందరపెట్టి, పంపినది.
    దశరథుడు కైకేయి అంతఃపురమునకు వచ్చి ఆమె  కోపగృహముననున్నదని తెలిసికొన్నాడు. "ఈ  శుభదినమున ఈమెకు ఆగ్రహమేల కలిగినది?" అని  తలపోయుచూ అతడు కోపసదనమును చేరుకొన్నాడు. వివర్ణమగు వాసనముతో విరబోసికొని యున్న జుట్టుతో అలంకార రహితయై నింగి నుండి రాలిన చుక్కవలె నేలపై  యున్న  కైకేయి కంటపడుటతోనే రాజు హృదయము వికలమైపోయినది. అతడామెను లేవదీసి బుజ్జగించుచూ "కైకా ఎందుకిట్లున్నావు? నీవేమి చేయుమన్ననూ చేసెదను, ఏమి ఇమ్మన్ననూ ఇచ్చెదను, చెప్పుము అన్నాడు.
    "కైక: ప్రాణేశ్వరా 'ఇచ్చెదను' అని ఒట్టుపెట్టి చెప్పినచో అడిగెదను.
    దశరథుడు: నీవు నా రాణులలో ప్రియతమురాలవు. ఎట్టి ఒట్టునకైనను వెనుదీయను. నాకు రాముడు  ఆరవ ప్రాణము, వానిపై ఒట్టు; యజ్ఞములు చేసి  నేనార్జించిన పుణ్యము మీద ఒట్టు.
    కైక: దేవతలారా పంచభూతములారా మహారాజు వాగ్దానమునకు మీరు సాక్షులు!... మహారాజు పూర్వము మీరు  నాకు  రెండు వరములను ప్రసాదించినారు. వాటి "నిప్పుడు కోరుకోనుచున్నాను. నా అభీష్టము నెరవేరనిచో ఆ అవమానమును భరించలేక నా  ప్రాణములను విడిచెదను!
    దశరథుడు: నీకు  అవమానమా? అదెన్నడునూ జరుగుదు. ప్రమాణము చేసితిని  కదా? అడుగుము.
    కైక: మీరు  నేడు రాముని పట్టాభిషిక్తుని చేయబోవుచున్నారట కదా?
    దశరథుడు: ఔను; ఆ శుభవార్తను  నీకు తెలుపుటకే వచ్చినాను.
    కైక: నాకు తెలిసినది కనుక ఇంక మరల తెలుపనక్కరాలేదు. నేను కోరు వరముల నాలకించుడు. నా కుమారుడు భరతుని గిరివ్రజము నుండి రప్పించి రామునకు బదులు వానిని పట్టాభిషిక్తుని కావించవలెను. ఇది  మొదటి వరము. అంతకుముందే అయోధ్య నుండి రాముని పదునాలుగేండ్ల వనవాసమునకు పంపివేయవలెను. ఇది రెండవ వరము.
    తాను ఏమాత్రమునూ ఊహించని ఆమె వరములను విని రాజు నిశ్చేష్టుడైనాడు. తేరుకొని గద్గద కంఠముతో "కైకా దారుణములైన ఈ కోర్కెల నేల కోరితివి? రాముడు  జ్యేష్ఠుడు. సకల  కల్యాణ గుణధాముడు. మంత్రులూ , పురోహితులూ, పురప్రముఖులూ అందరూ రాముని పట్టాభిషిక్తుని చేయవలెనని నిర్ణయించినారు. నీవు ధర్మ విరుద్ధముగా ఇట్లేల కోరుచుంటివి?.... ధర్మజ్ఞుడైన  భరతుడు జ్యేష్ఠుడుండగా తాను అభిషిక్తుడగుటకు అంగీకరించునా?... రాముని పట్టాభిషిక్తుని చేసెదనని ప్రకటించినాను. అట్లు చేయక వానిని అరణ్యమునకు పంపివైచినచో ఇంక నేను ప్రజలకు నా ముఖము నెట్లు  చూపగలను?... ఆ విషయమునట్లుంచుము. భరతునకు పట్టము కట్టుమని కోరుటతో ఆగక  రామునకు పదునాలుగెండ్ల వనవాసమును విదించుమని అడిగితివెందులకు?" అన్నాడు.
కైక: భరతుని రాజ్యపాలనము నిరాటంకముగ జరుగవలెనన్న రాముని అయోధ్య యందుండనీ యరాదు; దీర్ఘకాల మరణ్యమున నజ్ఞాతముగ వసింపజేసి ప్రజలు వానిని మరచిపోవునట్లు చూడవలెను.
    దశరథుడు: రాముడు  ఉత్తముడు; భరతున కాటంకములను కలిగించడు... రాముని విడిచి నేనుండలేను. కౌసల్యనెట్లు సమాధాన పరుచగలను? (గద్గదికతో) కేకయ రాజపుత్రి నిన్ను బ్రతిమాలుచున్నాను, మరి ఏ వరమునైన కోరుము. రామ వనవాసమునుకొరకుము.
    కైక చలించలేదు. దశరథునకు కోపము వచ్చినది. "నీవు  పత్ని రూపమున ప్రవేశించిన క్రూర సర్పమవు! గోవు అని భ్రమపడి పులిని తెచ్చుకొన్నాను! రాముడడవికి పోవుటతోనే నా ప్రాణములునూ పోవును. అప్పుడు నీవు  ముండమోపివై కొడుకుతో ఈ రాజ్యమును ఏలుదువుగాని!" అన్నాడు కైక, "ఇచ్చెదనని ప్రమాణము చేసి ఇప్పుడీ విషపు మాటలెందులకు? నేను అడిగినది ధర్మసమ్మతమైననూ కాకున్ననూ, ఇచ్చుట మీకిష్టమైననూ అయిష్టమైననూ ఇక్ష్వాకు వంశజులైన మీరు అడిన మాట  తప్పరాదు" అన్నది.
    దశరథుడు కోపగృహముననున్నాడని తెలిసి సుమంత్రుడచ్చట కేగు దెంచి "ప్రభూ  'రామ పట్టాభిషేకమునకు సుముహూర్తము ఆసన్నమగు చున్నదని మనవి చేయమ'ని వసిష్ఠులవారు నన్ను పంపినారు. అహూతులై సోమంతలూ పురప్రముఖులూ, జానపద ముఖ్యులూ విచ్చేసి మండపమున తమ రాకకై నిరీక్షించుచున్నారు" అని చెప్పినాడు.
    దశరథుడు నోరు తెరువకముందే కైక కలుగజేసికొని "సచివోత్తమా మీరు  తిరిగిపోయి రామునకు మేమిచ్చటకు రమ్మన్నామ'ని తెలుపుడు; ఇది రాజజ్ఞ అని చెప్పుడు" అన్నది.
    రాముడు తన  మందిరామున కుబేరుని వలె సర్వాలంకార భూషితుడై ధవళ రత్న కంబళమును కప్పుకొని పాన్పుపై అసీనుడై యున్నాడు. సుమంత్రుడు వచ్చికైకేయి చెప్పుమన్న రాజాజ్ఞను తెలిపినాడు. రాముడు లేచి జానకితో "దేవీ నేను తిరిగివచ్చులోగా నీవు  అలంకరణము పూర్తిచేసికొని సిద్దముగా నుండుము" అని చెప్పి కైకేయి అంతఃపురమునకు పోయినాడు.
    చింతాక్రాంతుడై యున్న దశరథునకు రాముని చూచుటతోనే దుఃఖము పోంగివచ్చినది....రాముడు  ఆందోళనతో "అమ్మా మహారాజు  ఖేదమునకు కారముమేమి?" అని  అడిగినాడు. కైకేయి నిర్మోగమోటముగా రామునకు తాను దాశరథుని అడిగిన వరద్వయమును గూర్చి  వివరించినది "అడుగుము ఇచ్చెదను అని ప్రమాణము చేసి  అడిగిన పిమ్మట ఇచ్చుటకు వెనుకాడుచున్నారు!"  అన్నది.
    తనకు పట్టాభిషేకము జరుగుట లేదన్న విషయము రామునకు వెతను కలిగించలేదు. అతడు "అమ్మా నాయనగారి సత్యవ్రతమునకు భంగము కలుగరాదు. భరతుని రప్పించి అతని పట్టాభిషిక్తుని చేసెదను" అన్నాడు. కైక "భరతుని పట్టాభిషేకము సంగతి నేను చూచుకొందురు. నీవు  వనవాసమునకు నేడే పోవలెను" అన్నది. "అట్లే కానిమ్మునేడే పోయెదను" అన్నాడు రాముడు.

 Previous Page Next Page