4.జానకీపరిణయము రాముడు లక్ష్మణునితో 'దశరథ మహారాజు' ఈ బ్రహ్మర్షి చెప్పినట్లు చేయుడు' అని ఆదేశించి పంపినాడు. పితృ ఆదేశానుసారము మనమిప్పుడీయనతో మిథిలా నగరమునకు పోవలెను" అన్నాడు.
రామ లక్ష్మణులు వచ్చిన పని నెరవేరినది అక్నుక ఇంక తాము అయోధ్యకు తిరిగి పోవచ్చుననుకొనుచుండగా విశ్వామిత్రుడు "దశరథాత్మజులారా, విదేహ రాజ్యపాలకుడు జనకుడు నాకు మిత్రుడు. పూర్వ మాతడొక యాగమును తలపెట్టి భూమిని దున్నించుచుండగా నాగటి చాలువ దివ్యమంగళ విగ్రహయగు ఒక ఆడ శిశువు కనపడినది. ఆ ముద్దుబిడ్డను అతడు తీసుకొనిపోయి పెంచినాడు. 'సీత' (నాగటి చాలు) అని నామకరణము చేసినాడు. అతడు పెంచినాడు కనుక 'వైదేహి' (విదేహ రాజు కుమార్తె) అనియూ' 'జానకి' అనియూ కూడ పిలువబడుచున్నది... జనకుడిప్పుడా భూపుత్రికి (నాగటి చాలు నందుదయించిన సీతకు) తన రాజధానియగు మిథిలా నగరమున పెండ్లి చేయ తలపెట్టినాడు. ఆ కల్యాణమును తిలకించుటకు మనము పోవలెను. మరియొక కారణమున్నది: పూర్వము దేవశిల్పియగు విశ్వకర్మ రెండు గొప్ప విల్లులను తయారు చేసినాడు. ఒక మహాధనువును పరమ శివునకునూ రెండవ చాపమును శ్రీమహావిష్ణువునకునూ సమర్పించినాడు. రుద్రుడు తన ధనువుతో త్రిపురాసురులను సంహరించి లోకములకు మేలు చేసినాడు. పిమ్మట మహేశ్వరుడాధనువును 'దేవరాతుడు' అను రాజునకు ప్రసాదించినాడు. ఇపుడా మహాకార్ముకము దేవరాతుని వంశమువాడైన జనకుని వద్ద నున్నది. మీ అన్నదమ్ముల వంటి మహాధానుష్కులు తిలకించి మెచ్చతగిన విల్లు అది! మిథిలా నగరమునకు పోవుదము, రండు" అనెను.
రాముడు లక్ష్మణునితో 'దశరథ మహారాజు' ఈ బ్రహ్మర్షి చెప్పినట్లు చేయుడు' అని ఆదేశించి పంపినాడు. పితృ ఆదేశానుసారము మనమిప్పుడీయనతో మిథిలా నగరమునకు పోవలెను" అన్నాడు.
మిథిలకు పోవు మార్గమున వారికి గంగానది ఎదురైనది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో "త్రిపథమిగానియై ముల్లోకములనూ పావనము చేసిన ఈ గంగా స్రవంతికి నమస్కరించుడు" అనెను.
వారట్లు చేసిరి. పిమ్మట రాముడు "మహాత్మా ఈ వాహిని త్రిపథగామిని ఎట్లైనదో తెలుపగోరుచున్నాను" అన్నాడు. విశ్వామిత్రుడు ఇట్లు వచించెను:
గంగా స్రవంతి పర్వతరాజగు హిమవంతుని కుమార్తె. దేవతలు హిమవంతుని మ్రోల నిలిచి 'నాగరాజా దేవలోకమున జీవనాధారమగు వాహిని ఏదియూ లేదు. నీ తనయయగు గంగను మా లోకమున ప్రవహింపజేసి మాకు తోడ్పడుము అని ప్రార్ధించినారు. హిమవంతుడంగీకరించి గంగను 'దేవ లోకమున నుండుము' అని పంపినాడు...అనంతరము గంగ దివి నుండి భువికేల రావలసి వచ్చెనో పిమ్మట పాతాళమునాకేల కొనిపోబడినదో తెలిపెదను. వినుడు.
"ఇక్ష్వాకు వంశమున మీ పూర్వులలో 'సగరుడు' అను చక్రవర్తి అశ్వమేధ యాగమును తలపెట్టి గుఱ్ఱమును వదిలినాడు. సాగర సార్వభౌమునకు 'కేశిని' అను పత్నియందు 'ఆశ్వమంజుడు' అను ఒక పుత్రుడునూ 'సుమతి'యను సతియందు ఆరువది వేలమంది సుతులునూ జన్మించినారు. ఆ యారువది వేలమందియూ ఆశ్వరక్షకులుగా వెంబడించినారు...ఎవడు ఆశ్వమేధయాగమును తలపెట్టిననూ ఇంద్రుడు తన పదవికి ముప్పు రావచ్చునన్న బెదురుతో ఆ యాగమునకు విఘ్నము కలిగించుటకు పూనుకొను చుండును. ఇంద్రుడిప్పుడునూ అట్లు చేసెను. సాగర పుత్రుల కన్నులు కప్పి సవనాశ్వమును హరించి తీసికొనిపోయి పాతాళ లోకమున కపిల మహర్షి ఆశ్రమము వెనక విడిచి తన దారిని పోయినాడు. ధ్యాన నిమగ్నుడైయున్న మహర్షికా హయము సంగతి తెలియదు. సగర పుత్రులరువదివేలమందియూ అశ్వము కొరకు భూతలమునంతయూ గాలించినారు. తురంగము కనపడక పోవుటతో వారు తలకొక యోజనము మేర భూతలమునూ త్రవ్వి ఆ అఖాతమున అన్వేషించుచూ పోయి పాతాళమును ప్రవేశించినారు. కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణమున ఆగి అశ్వము గూర్చి మహర్షిని అడిగినారు. ధ్యాన నిమగ్నుడైయున్న మహర్షికి వారి రాక తెలియలేదు. వారు ఆశ్రమమును చొరబడి గాలించగా తమ అశ్వము కనపడినది. 'మన హయమును హరించినవాడు ఈ గడ్డమువాడే! మన ప్రశ్నకు ప్రత్యుత్తర మీయక ముని వలె నటించుచున్నాడు! ఈ చోరుని శిక్షించవలెను!" అని వారు మహర్షిని చుట్టుముట్టి హింసించసాగినారు. ఆ తపోధనుడు కన్నులు తెరచి ఉగ్రుడై హుంకరించినాడు. ఆ మహాశక్తిమంతుని కోపాగ్నికి ఆ అరువదివేల సగర పుత్రులునూ ఇంధనములై ఎక్కడి వారక్కడ భస్మరాశులుగా మారిపోయినారు!
సగరుడు గుఱ్ఱమేమైనదో పుత్రులేమైరో తెలియక ఆశ్వమంజుని కుమారుడునూ తన మనమడునూ ఐన అంశుమంతుని పంపినాడు. అతడు పాతాళమునకు పోయి కపిల మహర్షిని దర్శించి సవినయముగ నమస్కరించినాడు. మహర్షి 'అంశుమంతా! అశ్వమును కొనిపొమ్ము పితామహునిచే యాగమును పూర్తి చేయుంచుము" అనెను. అంశుమంతుడు 'మహాత్మా అట్లే చేసెదను...నా మనవిని ఆలకించుడు. మీకు అపచార మొనర్చి భస్మమైపోయిన నా అరువదివేల పినతండ్రులనూ క్షమించి వారికి పుణ్యలోకములు ప్రాప్తించు మార్గమును తెలుపుడు" అని ప్రార్ధించినాడు. మహర్షి వాని వినయమునకు సంతసించి 'అంశుమంతా దేవలోక వాహిని యగు గంగానదిని రప్పించి ఆ పవిత్రోదకములను ఈ భస్మరాశులపై ప్రవహింపచేసినచో నీ పినతండ్రులకు సద్గతి కలుగును' అని చెప్పి వీడ్కొలిపినాడు.
"అంశుమంతుడునూ పిమ్మట అతని పుత్రుడు దిలీపుడునూ గంగను దివి నుండి భువికి రప్పించుటకు ప్రయత్నించిరి కాని క్రుతార్ధులు కాలేకపోయినారు. దిలీపుని కుమారుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రమున మహోగ్ర తపము నాచరించి గంగను సాక్షాత్కరించుకొనెను. "తల్లీ, నన్ను కరుణించి నా ప్రపితామహుల భస్మరాశులపై ప్రవహించి వారికి స్వర్గప్రాప్తిని కలిగించుము' అని కోరినాడు. కరుణాంతరంగయగు గంగ 'నాయనా నేను ఆకాశము నుండి భూమిపై పడినప్పుడు ఆ పాటునకు భూదేవి తట్టుకొనలేదు. భూపతియగు నీవు భూదేవికి చేటు రాకుండ చూడవలెను. నేను మహావేగమున క్రిందికి దిగుచున్నప్పుడు నన్ను భరించగలవాడు భర్గుడొక్కడే. ఆ మహాదేవుని ప్రార్ధించుము' అని చెప్పి అదృశ్యమయ్యెను.
"పిమ్మట భగీరథుడు శివుని గూర్చి తపమొనరించెను. శివుడు ప్రత్యక్షమై 'భగీరథా, గంగ ఒత్తిడి వలన భూమికి కీడు రాకుండ చూచెదను, జలపాతము వేగమును తగ్గించుటకు ముందుగా నా శిరసున ధరించెదను' అనెను.
"అనంతరము గంగాస్రవంతి అత్యంత వేగమున దివి నుండి భువి వైపు దిగి వచ్చి కైలాసగిరిపైన తనకై నిరీక్షించుచూ నిలిచియున్న ఉమామాధవుని శిరముపై బడి, ఆయన జటాజూటమును ప్రవేశించినది. 'అప్పుడామెకొక కొంటె బుద్ది జనించినది. 'ఇప్పుడు నా జవసత్వముల నొక్కుమ్మడి పెంచుకొని అత్యంత వేగమున ఈయన కేశపాశము నుండి బయల్వెడలి పోవుచూ ఈయననూ ప్రవాహమున లాగుకొని పోయెదను! నన్నెవ్వరునూ నిరోధించలేరన్న సత్యమును నిరూపించెదను!'
"సర్వజ్ఞుడైన ఈశ్వరుడామె అహంకారమును తెలిసికొని నిజ జటాజూటాంతర్భాగమును హిమాద్రి యందలి గుహ వలె విస్తృతము కావించెను. గంగ జలమంతయూ ఆ కుహరమున (గుహ యందు) బందీ ఐపోయినది! తటాక మందలి జలము వలె చలన రహితమై నిస్తరంగమై, ప్రవహించుశక్తిని కోల్పోయినది.
"గంగ దిగులు చెందినది. 'భగీరథునకు తోడ్పడదలచి దివి నుండి భువికి దిగివచ్చుచున్న నాకు నడుమ ఈ పాడుబుద్ది ఏల పుట్టినది? శివాపరాధమును చేసితిని!.....పరమేశ్వరా నన్ను క్షమించి పోనిమ్ము' అని వేడుకొన్నది.
"శంకరుడు గంగను వదలినాడు. భూతలమున తనకై నిరీక్షించుచున్న భగీరథునకు సాక్షాత్కరించి గంగాఝరి (గంగానది) ఇట్లన్నది: 'రాజా నీవు నీ రథములో ముందుపోవుచూ నాకు దారి చూపుము, నేను నిన్ను అనుసరించి వచ్చెదను' అన్నది.
"భగీరథుని స్యందనము కడురయమున పోయి పోయి జహ్ను మహర్షి యజ్ఞవాటిక వద్ద హఠాత్తుగా ఆగిపోయినది. అనుసరించి వచ్చిన ఆపగ (నది)యునూ హఠాత్తుగా నిలిచిపోయినది. గంగా జలము తాడియెత్తున పొంగి ఆ ప్రాంతమంతయూ మునిగిపోయినది. జహ్నుమునికి కోపము వచ్చినది. ఆ మహర్షి అగస్త్యుని వలెనే మహాశక్తి సంపన్నుడు. నదీ జలమునంతనూ గ్రుక్కెడుగా త్రాగివేసినాడు! భగీరధుడు ముని పాదములపై బడి 'మహాత్మా నా రథాశ్వములు ఎందువల్లనో హఠాత్తుగా ఆగిపోవుట వలన తమకీ అపచారము జరిగినది. ఈ వాహిని దోషము లేదు. మీరీమెను పుత్రికగా భావించి విడిచిపెట్టవలెను' అని వేడుకొన్నాడు. జహ్ను మహాముని శాంతించి గంగను తన చెవుల ద్వారా వదలినాడు....నాటి నుండియూ గంగకు 'జాహ్నవి' అన్న పేరునూ వచ్చినది.