Previous Page Next Page 
పరిహారం పేజి 9


    ఇంతసేపటికి మనోహర్ మనసుకొంచెం తేలిక పడింది. అమ్మయ్య! ఓ అన్నయ్యలా బాధ్యత స్వీకరించమని వేడు కొంటున్నాడు. అంతేకదా! పారు పెళ్లికి తనామాత్రం సహాయం చేయలేడా?
    "మంచిది? మాస్టారూ, రేపటినుండి నేను ఆ పని మీదే ఉంటాను" మనోహర్ సెలవు తీసుకొని గబగబా వెళ్ళి పోయాడు.
    మరునాడు ఆదివారం.
    తొమ్మిది గంటలయినా పక్క వదలకుండా హాలీడే మూడ్ ఎంజాయ్ చేస్తూన్న మనోహర్ ప్రక్కగదిలో తల్లీ పారిజాత మాట్లాడుకోవడం విన్నాడు.
    "ఇంతకీ బళ్ళోజరిగిన అల్లరేమిటే, పారూ?"
    నిన్న మనోహర్ ఆ రౌడీని మెడ పట్టుకు గెంటి, హెచ్చరించిన సంగతీ అదీ చెప్పి "నిన్న బడికి వెళ్లేసరికి బడి గోడలనిండా ఎంత అశ్లీలమైన రాతలున్నాయో! నా బొమ్మా, ప్రక్కనే మనోహర్ బొమ్మా గీసి ఛీఛీ.... ఎంత అసహ్యంగా రాశాడో? నా తల సిగ్గుతో వాలిపోయింది. అక్కడ ఎవరికీ నా ముఖం చూపలేకపోయాను!" అంది పారిజాత.
    "వాడేదో అక్కసుతో రాస్తే నీదేం పోయిందే? ఏనుగులు వెడుతుంటే కుక్కలు అరుస్తాయి. నీదేం పోదు, అనవసరంగా నీ చదువు పాడుచేసుకొంటున్నావు!"
    "వాడు దీనితో అలాగే లేడు. అత్తా! దేనికైనా తెగించేట్టు ఉన్నాడు."
    "మనోహర్ వాడి అంతు కనుక్కోడూ?"
    "ప్రతీసారీ నా వెనుక ఉంటాడా మనోహర్? బడికి వెళ్ళడమంటే దినదిన గండంగా తయారై పోయింది నాకు. ప్రయివేటుగా పరీక్షకు కడతాను"
    "పెళ్ళికి తయారైన దానివి, పరీక్షకు ఏం వెడతావులే" అని భుజాలమీద టవల్ కప్పుకొని బాత్ రూం కేసి వెళ్ళిపోయాడు మనోహర్. అతడు ముఖం కడుక్కొని తిరిగి వచ్చేసరికి పారిజాత వెళ్ళిపోయింది.
    "ఇందాక నువ్వన్నమాట ఏమిటిరా? పారుకు ఎక్కడైనా సంబంధం కుదిరిందటనా?"
    నిన్న సాయంత్రం మాస్టారుకూ, తనకూ నడిచిన సంభాషణగురించి చెప్పాడు మనోహర్.
    అంతా విని కోమలమ్మ గుండెలమీద చెయ్యుంచుకొంది. "ఎంత ఆశ! కొంపదీసి ఆయన కన్ను నీమీద పడలేదు కదా?"
    "పడితే మాత్రం? ఆయనకు నేను అల్లుడిని కావడానికి ఎన్ని జన్మలు తపస్సు చేయాలి!"
    "ఏమో! పిల్ల ఎర్రగా, బుర్రగా ఉందని మోజు పడకూడదేమిటి నువ్వు?" కొడుకువంక అనుమానంగా చూసింది.
    "పారు అంటే నీ కెటువంటి అభిప్రాయముందమ్మా?"
    "తల్లిలేని పిల్లని జాలి, బొమ్మలా ఉందని ప్రేమా, అత్తా అత్తా అని ఆత్మీయంగా తిరుగుతోంటే ఆదరణా ఏర్పడ్డాయి అంతేకాని......"
    "నాకూ ఆ పిల్ల అంటే దయా, ప్రేమా తప్ప ఇంకేం లేవమ్మా! ఆ దయ, ప్రేమ ఆమెను భార్యగా మార్చుకొనేది కాదులే. నువ్వంత భయపడకు."
    తృప్తిగా, గర్వంగా కొడుకును చూచుకొంది. కోమలమ్మ.
    తను ఎంతో కష్టపడి కూర్చుకొన్న అంతస్తు ఇది! ఈ అంతస్తుకు సరితూగే సంబంధమే చేసుకొంటుంది.
                                5
    రాత్రి ఎనిమిది గంటల సమయం
    ఇంటి ముందు ఆగిన టాక్సీలోంచి మనోహర్ స్నేహితులందరు అతడిని చెరో పక్క పట్టుకొని ఇంటికేసి నడిపిస్తూ. "కాలు నడవనిస్తుందా భాయ్?" అని అడిగారు. ఆ పరామర్శలో ఏదో పరిహాసం తొంగి చూస్తోంది.
    "ఆ ఫర్వాలేదు" అన్నాడు మనోహర్. ఈ రోజు రోడ్డు మీద జరిగిన దెబ్బలాటలో అతడికి బలమైన దెబ్బలే తగిలాయి. అయినా అతడు నిర్లక్ష్యంగానే ఉన్నాడు. నడుస్తూంటే కాలు నొప్పితో చచ్చినంత పనిగా ఉంది. కాని, అది ఎక్కడా వ్యక్తం చేయడం లేదు. ఇంతటి దృఢ శరీరుడు ఇద్దరు రౌడీల చేత చిత్తుగా తన్నులు తిన్నాడని కాలేజీలో తెలిస్తే ఏమైనా ఉందా?ఛస్! ఇదంతా ఆ పారిజాత మూలంగా జరిగింది. దాన్ని రోడ్డు మీద ఎవరు అల్లరి పెడితే తన కేమిటి? తన చెల్లెలా? పెళ్ళామా? తగుదునమ్మా అని ఆ రౌడీలతో తగవు పెట్టుకొన్నాడు. వాడీ రోజు ఇద్దరు గూండాలను వెంటబెట్టుకు వచ్చి పిలిచి కయ్యం పెట్టుకొని తన్నించాడు. ఇంతా జరిగితే ఆ పిల్ల చదువుకు పంగనామం పెట్టనే పెట్టింది! వాళ్ళ మధ్య తను అనవసరంగా ఫూల్ అయ్యాడు!

 Previous Page Next Page