కుర్చీలో కాళ్ళు బారచాపి కూర్చొని "ఏమిటి? పెళ్ళి కొడుకు గురించి కలలు కంటున్నావా?" అని అడిగాడు ఆ అడగడంలో చిలిపిదనం కంటే హేళనే ఎక్కువగా ఉంది.
"ఏం? కనకూడదా?"
"నీ ఊహల్లో పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో కాస్త వర్ణించు"
"అచ్చం నీలాగే ఉంటాను, మనూ!"
పారిజాత ఏ మాత్రం సిగ్గు, సంకోచాలు లేకుండా టక్కున చెప్పేసిన మాటకు మనోహర్ మొహం వెలవెల పోయింది. నోట మాటరానట్టుగా చూశాడు కొద్ది క్షణాలు. తల్లిలేనిపిల్లని, చిదిమి దీపం పెట్టుకొనేలా ఉందని కోమలమ్మ కాంపౌండ్ లో అన్ని కుటుంబాలతో పాటు కోమలమ్మ కూడా ప్రేమగా దయగా చూసింది పారిజాతను. అత్తా అత్తా అని మేనకోడలిలా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనోహర్ దగ్గరా అదే చనువుంది ఆ పిల్లకు.
ఇంకొక్క ప్రశ్న వేస్తే చాలు "ఆ వరుడివి నువ్వే మనూ" అన్నా అనేయగలదు! నిన్న మొన్నటిదాకా ఫ్రాకులు తొడిగిన పారు ఎంతపెద్దదయింది? బడిమానేసి సందుకు బాగా చీవాటు పెట్టి, తిరిగి బడికి వెళ్ళేలా చేయాలనుకని వచ్చాడు. నే నుండగా నువ్వు ఏ వెధవకో భయపడటమేమిటని చెప్పాలనుకున్నాడు. కాని అందుకు వ్యతిరేకంగా వ్యవహారం నడిచింది. ఏం చెప్పడానికి మాట రానట్టుగా కొంచెం సేపు కూర్చొని వెళ్ళడానికి లేచాడు మనోహర్.
"ఎప్పుడొచ్చావు. మనోహర్? చాలాసేపు అయిందా?" కూరగాయల సంచితో లోపలికి వచ్చాడు కృష్ణారావు.
మనోహర్ అయిష్టంగా తిరిగి కూర్చున్నాడు.
"పారు ఎంత పనిచేసిందో చూశావా? బడికి గుడ్ బై చెప్పి వచ్చింది. ఇక చదువదట. ఎవరు చెప్పినా వినడంలేదు."
అందరితోపాటు తనూ నాలుగు చీవాట్లు పారుకు వడ్డిద్దామని వచ్చిన మనోహర్ పారిజాత మాటలవల్ల కలిగిన కోపంతో మాష్టారు గోడు వెళ్ళబోసుకొంటూంటే తనకేం పట్టనట్టు కూర్చున్నాడు.
"పారును ఓ ఇంటిదాన్ని చేయాలన్న సంకల్పం ఈ రోజు కలిగింది. కలగడంతోనే ఎప్పుడెప్పుడు దాన్ని ఓ చేతిలో పెడతానా అన్న తహతహ నాలో ఏర్పడింది! మనిషి మనసు ఎంత విచిత్రమైనదో చూశావా? కోరిక కలగనంసేపు ఏ బాధలేదు. కలిగాక అది పెట్టే ఒత్తిడి, తొందర ఇంతా అంతా కాదు. పారుకు పెళ్ళిచేయాలనుకొన్నప్పటి నుండి ఎన్ని ఆలోచనలు! ఎన్ని కలలు!"
ఆయనకేసి విచిత్రంగా చూడసాగాడు మనోహర్.
"చదువుకొన్న వాడికి పారు అందానికి సరిపోయేవాడికి పారును సుఖపెట్టగలిగేవాడికి ఇవ్వాలని నా ఆశ! ఈ పేదతండ్రి అంతగొప్ప సంబంధం ఎక్కడనుండి తెస్తాడని? ఇతడి కేమైనా పిచ్చా అని నువ్వు నవ్వుకొంటున్నావా, మనోహర్?"
మనోహర్ ఈ కృష్ణారావు మాస్టారిని చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్నాడు. నిగర్వంగా. నిరాడంబరంగా రోజులు వెళ్ళబుచ్చడం అలవాటు ఈయనకు. కూతురు పెళ్లి విషయంలో మాత్రం అమాయకత ప్రదర్శిస్తున్నాడో, అత్యాశకు పోతున్నాడో తెలియకుండా ఉంది.
మనోహర్ గంభీరంగా. "నేను నవ్వడంలేదుగాని మీ అమ్మాయి పెళ్ళికోసం మీ రెంత మూటకట్టి పెట్టారో చెప్పండి. మాస్టారూ?" అని అడిగాడు.
"మాటా! మూట ఏదీ కట్టిపెట్టలేదు మనోహర్! నా పారును చూశావా? కోటి మందిలో అలాంటి అందగత్తెలు ఒకరైనా పుడతారా?"
"అందమైన ఆడపిల్లకు కట్నంలేకుండా పెళ్లి అవుతున్నట్టు నేను ఎక్కడా వినలేదు!"
"వినలేదుగాని. అదృష్టమనే దాన్ని నువ్వు విన్నావా లేదా?"
"విన్నాను కాని, కేవలం అదృష్టంమీది భరోసాతో పనులు చేసేవాళ్ళను నేను ఎక్కడా చూడలేదు మాస్టారూ! నిజంగా అలాంటి వారు ఉంటే వాల్లు శుద్ధ మూర్ఖులనుకోవాలి!"
"నీకు కాలేజీ ప్రెండ్స్ చాలా మంది ఉంటారుగా. మనోహర్? పిల్ల అందచందాలు, సుగుణాలు చూచి పెళ్ళాడడానికి ఇ,్టపడే ఆదర్శయువకులు ఒకరోయిద్దరో ఉండకపోరు. పారును నువ్వు చిన్నప్పటినుండి ఎరిగి వున్న వాడివి. ఓ అన్నయ్యలా దానికి అయిన సంబంధం చూస్తే చచ్చి నీ కడుపున పుడతాను. కనీసం పెళ్లి ఖర్చుకుకూడా నా దగ్గర డబ్బేమీ లేదు. నా దగ్గర ఎందరో చదువుకొని పోయారు! వాళ్ళందర్నీ ఒకసారి కలుస్తాను. పిల్లపేరు చెప్పి బచ్చమెత్తుతాను. రెండు మూడు వేలు జమకాకపోవు!"