Previous Page Next Page 
పరిహారం పేజి 10


    ఆ రాత్రే కోమలమ్మ కాంపౌండ్ లో కాపురాలున్న వాళ్ళందరికీ ఈ సంగతి తెలిసి పోయింది.
    కోమలమ్మ కొడుక్కి దెబ్బలాటలో బాగా దెబ్బలు తగిలాయని, ఆ దెబ్బలాట ఓ ఆడపిల్ల మూలంగా వచ్చిందని ఆ ఆడపిల్ల అపరంజి బొమ్మ కృష్ణారావు కూతురు పారిజాత అనీ తెలిసి పోయింది. అది చిలవలు పలువలై వ్యాపించసాగింది.
    ఎదురింటి మేడవాళ్ళ అబ్బాయి మనోహర్ క్లాస్ మేట్.   "చాలా అందమైన పిల్లను కొట్టేశావురా! ప్రేమేనా! పెళ్ళిమాటలు కూడా ఏమయినా జరిగాయా?" అని అడిగాడు పారిజాత అందాన్ని తలుచుకొని కొంచెం జెలసీతో.
     "ప్రేమా లేదు పెళ్ళీలేదు, నోరుముయ్!" మనోహర్ కసిరాడు.
    "ఉత్త పుణ్యానికి నువ్వు తన్నులు తిన్నావంటే నేను నమ్మను"
    "చాలా సంవత్సరాలుగా మా కాంపౌండ్ లో అద్దెకు ఉన్నారు. ఇంత పిల్లప్పటినుండి మా కళ్ళముందు పెరిగి పెద్దదైంది. ఆ అభిమానం తప్ప. నువ్వనే ప్రేమా గీమా ఏం లేవు మా మధ్య! రోడ్డుమీద ఎవడో అల్లరి పెడుతున్నాడని మాస్టారు చెబితే, కాస్తవాడికి బుద్ది చెబుదామని వెళ్ళాను. దానికి మీరెన్ని రంగులు పూసినా బాధ్యత నాదేమీ ఉండబోదు" సీరియస్ గానే మాట్లాడాను మనోహర్.
    "మా చెడ్డ అందం ఆ పిల్లది, ఎవరో ఆ ముసలాడి కంట్లో దుమ్ముకొట్టి ఎగరేసుకుపోతాడు చూడు!"
    "చూడబోతే నువ్వాపని ప్రారంభంలో ఉన్నట్టున్నావే?"
    "ఛ! నాకంత ధైర్యం ఎక్కడ? ఇల్లూ వాకిలి విడిచి పెట్టుకొని ఎక్కడికి పారిపోతాను?"
    "పారిపోవనక్కరలేదు, పెళ్లిచేసుకో, ఆ ఏర్పాట్లు నేను చేస్తాను?"
    స్నేహితుడి ముఖంలో ఆశాదీపం వెలిగి అంతలోనే ఆరిపోయింది. "మా తల్లిదండ్రులు....."
    "చవట సన్యాసివి! ఆ పిల్ల అందంగా ఉందని లొట్టలు కొట్టకపోతే ధైర్యంగా పెళ్ళి చేసుకోకూడదా?"
    "ధైర్యంగా పెళ్ళి చేసుకోలేను కానీ. రిజిష్టర్ మా రేజ్ చేసుకొంటాను. నన్ను వాళ్ళ నాన్నకు పరిచయం చెయ్."
    "అలాగే ఈ రోజు సాయంత్రం తీసికెళతాను ఆయన దగ్గరికి!"
    ఈ స్నేహితుడి పేరు రామచంద్రరావు మనోహర్ తోపాటు ఎమ్. ఎ. ప్యాసయ్యాడు. కృష్ణారావు తన కూతురికి కావలసినవాడికి కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి. కాని కాస్త రూపం తక్కువ. నల్లగా పీలగా ఎత్తుపళ్ళతో కాస్త వికారంగా వుంటాడు. అబిడ్స్ లో రెండు షాపులున్నాయి వాళ్ళకు. బాగా డబ్బున్న వాళ్ళు. చదువుకొన్నాడు డబ్బుంది. కాస్తరూపం తక్కువ, అయితే మాత్రం అందాన్ని కొరుక్కుతింటారా?
    మనోహర్ గదిలో సరిగా ఇలాంటి సంభాషమ జరుగుతున్నప్పుడే. పారిజాత స్నేహితురాలు లలిత ఆ పిల్ల చెయ్యిపుచ్చుకొని తన పోర్షన్ లోకి లాక్కుపోయింది. బరబరా. చాపమీద డబ్బున కూలేసి. "ఎప్పుడు పెళ్ళి?" అని అడిగింది.
    "ఎవరి పెళ్లి?"
    "నంగనాచివి!" పారిజాతనెత్తిన ప్రేమగామొట్టి. "నీ పెళ్ళి మనోహర్ తో" అంది.
    "కలగన్నావా ఏమిటి?" పారిజాత తెల్లబోయింది.
    "ఎంత మోసగత్తెవి! నిండా పదహారైనా లేవు! ఎంత జాణగా తయారయ్యావు. ఈ సంగతి ముందుగా నాకు తెలియాల్సింది పోయి ఎవరో చెబితే తెలిసింది. నేను నీ దగ్గర ఏ సంగతైనా దాచానా? ఏం? నువ్వూ మనోహర్ ప్రేమించుకొన్నారని చెబితే సంతోషించే వాళ్ళలో మొదటి దాన్ని కాదూ నేను?"

 Previous Page Next Page