ఎప్పుడో పి.జి.లో చదువుకున్న విషయాల్ని ఇక్కడ అన్వయిస్తూ మాట్లాడుతున్న ఆమెను చూస్తూంటే నవ్వొచ్చింది ఆర్తికి.
"నవ్వడం కాదే !" ధీర సౌమ్యంగా అంది. "దేశాన్ని కాపాడే సైనికుడు గొప్ప ఆదర్సాలు కలవాడు కావచ్చు. దేశానికి అవసరమైన ముఖ్య వర్గంలోని వ్యక్తి కావచ్చు. కానీ నిరంతరం శ్రమించే కర్షకుడు కూడా దేశానికి ముఖ్యమే అని నువ్వు అంగీకరించాలి."
" గుడ్ !" అభినందనగా అంది ఆర్తి. " దాంపత్యాన్ని కాపాడే సైనికుడిగా భార్తని , పంట పండించే రైతుని పిల్లల్ని కనే భార్యగా నువ్వు వ్యక్తీకరించడం సమంజసంగా బావుంది. కానీ ప్రకృతి మీద, విధి మీద ఆధారపడి బ్రతికే కర్షకుడిలాగే భార్య స్థానంలో నిలబడ్డ ఆడదాని అదృష్టం కూడా భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుంటుందని నువ్వు నమ్మితే సంతోషి,స్తాను."
ఇంత చదువుకున్న నువ్వు కూడా యిలా ఆలోచించటం దారుణం ఆర్తీ! నేనన్నది ఆ ఉద్దేశ్యంతో కాదు. అసలు భర్తనేవాడు......
" ధీరా!" ఆర్థోక్తిగా ఖండించింది ఆర్తి "మనం ఎంత తెలిసినవాళ్ళమైనా, ఎంత చదువుకున్నా ఒక్క విషయం మాత్రం అంగీకరించి తీరాలి. కాకుండా అది వీణ గురించి తెలీని ఓ అనమకుడి చేతిలో పడిందనుకో. దాని విలువ తెలీని ఆ వ్యక్తి వీణకున్న రాగి తీగల్ని పీకిపారేసి బఠాణీలకి అమ్ముకుంటాడు."
" అంటే భార్యా-భర్తలు కలిసి బ్రతికే దాంపత్యం అన్న పదం నిర్వచనం కూడా 'కెపాసిటీ టు యూజ్' అన్న సూత్రం మీద ఆధారపడినట్టు నువ్వూ అంగీకరించి నట్లేగా."
"అంగీకరిస్తే మాత్రం ఏం చేయగలనని."
"ఖచ్చితంగా నీకూ,నాకూ వున్న తేడా యిదే ఆర్తీ!"ధీర ఎమోషనల్ గా చెప్పుకుపోయింది. "ఒక వస్తువు విలువ తెలిసేది ఉపయోగించే వ్యక్తి నైపుణ్యానికి సంబంధించిందని నమ్మే నేను ఈ ప్రపంచంలో ఆస్తి అంటే డబ్బు కాదు ఆనందం అని నిర్ణయించుకున్నాను. ఆ ఆనందం అనే ఆస్తి కూడబెట్టుకోవడంలో కాదు, తోచినట్టు ఖర్చు చేయటంలో వుందని గ్రహించి ఈ సంఘం కట్టుబాట్ల గురించి పట్టించుకోకుండా నాకు తోచినట్టు నేను బ్రతకడం అలవాటు చేసుకున్నాను."
"అంటే?" విస్మయంగా చూసింది ఆర్తి.
"నేనూ మా బావని పెళ్ళి చేసుకున్నాను. నాకోసం కాదు. నా వాళ్లకోసం. అదితొందరపాటుతో తీసుకున్న నిర్ణయమైనా అతడితో అడ్జస్టు కావాలనుకున్నాను. కానీ చాలా తొందరలోనే గ్రహించాను - అది అసాధ్యమని."
ఏ ప్రశ్నలయితే కొన్ని క్షణాల క్రితం ఆర్తిని కలవరపరిచాయో వాటికి జవాబుల్ని యిప్పుడు ధఈర అడక్కుండానే చెబుతూంది.
ధీర సంకోచించలేదు. నిబ్బరంగా, సూటిగా చెప్పింది.
"బావ మంచివాడే. అందగాడే. కానీ నాకన్నా తక్కువ చదువుకున్నవాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయినా బావ నాకు అనర్హుడని నేను అనుకోలేదు ఆర్తీ! తను అనుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూ తనలో తాను కుచించుకుపోయి భర్త స్థానంలో నిలబడక ఓ విద్యార్దిలా నా ముందు కంగారుపడుతన్నాడు. ఒకరకంగా ఆడదానికి అలాంటి భర్త దొరకడం అదృష్టమని కొందరి స్త్రీల అభిప్రాయం కావచ్చు కానీ నాకు బోరింగ్ వుంది నీకు తెలీదు ఆర్తీ! తొలిరాత్రి నుంచీ నేను బావకి నచ్చచెబుతూనే వున్నాను. డబ్బున్న వాళ్లంతా ధనవంతులు కానట్టే చదువుకున్నవాళ్లంతా తెలివైనవాళ్లు కావాలని రూల్లేదు అంటూ తెలియచెప్పి నా మనిషిగా అతడ్ని మార్చుకోవాలని చాలా రోజులు శ్రమించాను. అవసరమైతే ఇంకా చదువుకోమన్నాను. కానీ బావ ఒప్పుకోలేదు. శ్రమపడి చదువుకోవడంకన్నా నా దగ్గర అణకువగా మసలుకోవడంలోనే ఆనందం వున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయాలి నేను? ఈ పురుషాధిక్య సమాజంలో నాకు వూడిగం చేయటానికి సిద్దపడే ఓ మగాడు భర్తయినందుకు ఆనందించాలా లేక దాంపత్య జీవితం గురించి నేను కన్న కలలు యిలా భగ్నమైనందుకు చింతించాలా?అందుకే....."
క్షణం ఆగింది.
"నేను కోరిన, నేను కలలు కన్న వ్యక్తిని మరో మనిషఇలో చూసుకుంటూ అతడికి దగ్గరయ్యాను అతడిలో అన్నీ షేర్ చేసుకుంటూ అందులో ఆనందాన్ని పొందుతున్నాను."
ఆర్తి నుదుట స్వేదం పేరుకుందిత. "దయాకర్ అంటే..."
"ఎస్! మూడు నెలల క్రితందాకా వైజాగ్ లో నా కొలీగ్. ఇప్పుడు హైద్రాబాద్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న వ్యక్తి."
ఆర్తి సన్నగా కంపిస్తూ గోడకి జారగిలబడిపోయింది.
ధీర ఏమిటి చెప్పింది ఇంతవరూ?
ఒకడికి భార్యాగా, మరో వ్యక్తికి ప్రియురాలిగా బ్రతుకుతూందా? పైగా అంత దారుణానికి సిద్దపడి అదో తప్పు కాదన్నట్టు ఇంత నిర్భీతిగా చెప్పగలుగుతుందేం?
చేస్తున్న పనికి కుంచించుకుపోవటానికి బదులు ఆలోచనలకు మెరుపుల రెక్కలు తొడిగి ఆ వెలుగుని ఎందరికైనా పంచగలనన్నంత ధీమాని ప్రదర్శించి సజీవ ప్రవాహం కావటానికి ఏ జీవితమైనా ఇలాగే వుండాలని ఉద్బోదిస్తున్నట్టు మాట్లాడుతూందేం?
మాట మింగేసిన నేపధ్య సంగీతంలా నవ్వేస్తూ అంది ధీర - "ఏమిటే ..షాక్ తిన్నావా? లేక ఆడదంటే నాలాగే వుండాలని అంగీకరిస్తున్నావా?"
"లేదు ధీరా!" అప్పటికి ఆర్తి గొంతు పెగిలింది. "నువ్వు చేస్తున్నది సవ్యంగా లేదని చెప్పాలనుకుంటున్నాను."
"అంటే బ్రతికుండగానే మన మీద మనం సాంప్రదాయాల గోరీ కట్టుకుని శవం నేత్రాలతో చుట్టూ వున్న సంఘాన్ని చూస్తూవారి అభినందనలతో పులకించిపోవాలంటావా?"
"అదికాదు ధీరా! మీ బావ చాలా మంచివాడని ఒకపక్క చెబుతున్నావు."
"మంచివాడే. మరి మంచి భర్త కూడా కావాలిగా."