ఆమెతో ఎలా ఆర్గ్యూ చేయాలో ఆర్తికి తోచడంలేదు. "మంచి భర్తంటే నీకు అనుకూలంగా మసలుకునేవాడు అన్నది నీ నిర్వచనమయితే అసలు సంఘంలో చాలామంది భార్యలు నీలాగే ప్రవర్తించావలి."
"సుఖపడాలీ అంటే అంతే."
"సుఖమంటే అక్రమసంబంధం పెట్టుకోవడమా?"
ధీర సీరియస్ గా చూసింది. "మరి దాంపత్యమంటే. ఇష్టంలేని మగాడికి శరీరాన్నిచ్చి అదే జీవితమని సరిపెట్టుకోవడమా?"
"సుఖానికి అర్దం సెక్స్ ఒక్కటే కాదే."
"ఎగ్జాక్ట్ లీ దృఢంగా అంది ధీర. "సుఖమంటే సెక్స్ ఒక్కటే కాదు.... ప్రేమ, అనురాగం. ఇవన్నీ వున్నప్పుడే అది ఆనందాన్నిస్తుంది. అది లేనప్పుడు భర్తతో సెక్స్ కూడా వ్యభిచారమే అవుతుంది. అలాంటప్పుడు ఏ మనిషిని చూసినప్పుడు నిన్ను నువ్వు మరిచి మరో లోకంలో విహరిస్తున్న భావం కలుగుతుందో, ఏ మనిషి ఉనికితో మన చుట్టూ వున్న ప్రపంచం స్వర్గంలా అనిపిస్తుందో, ఏ మనిషి సంపర్కంతో మన మనసు, మాట, ఆలోచన సత్యం - శివం - సుందరమై మనల్ని పులకింపచేస్తుందో అలాంటి మనిషి కోసం మనం అంతా అర్పిస్తేనేం?"
లాభంలేదు -ధీర చాలా లోతుగా వెళ్ళిపోయింది.
"కానీ కట్టుకున్నవాడికి అది ద్రోహం చేయడం కాదా?"
"నా వుద్దేశ్యంలో ద్రోహమంటే మన అంతరాత్మని మనకి మనమే వంచించుకోవడం. అంటే ఇష్టం లేకుండా భార్యగా నటిస్తూ భర్తతో కాపురము చేయడం."
"అలాంటప్పుడు ఆ భర్తనుంచి విడిపోవాలిగా?"
"కానీ బావ బ్రతకడు."
విభ్రమంగా చూసింది ఆర్తి.
"అవునే! మా బావకి నేనంటే ప్రాణం. నేను అతడ్ని కాదంటే బ్రతకలేనంత అమాయకత్వం. అలాంటివాడికి నేనెలా దూరం కావాలి? అప్పటికీ నేను ఒకసారి అడిగాను. ఒప్పుకుంటేగా. పసిపిల్లాడిగా కంటతడి పెట్టుకున్నాడు మగాడివయ్యుండీ ఆ కంటతడేమిటీ అంటే నువ్వు లేకపోతే నేను బ్రతకను అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు"ధీర గొంతు గాద్గదికమయిపోయింది. "ఎలానే.. అలాంటివాడ్ని విడిచిపెట్టి ఎలా బాధపెట్టను?"
ఇది జవాబులేని ప్రశ్నో లేక తన తప్పుని అందంగా సమర్దించుకోగల ఓ అందమైన అమ్మాయి నేర్పో ఆర్తి ఆలోచనలకి అందడంలేదు.
"నాకూ బాధగా వుందని నేనూ అంగీకరిస్తాను ఆర్తీ! కానీ ఎలా? ఏం చెప్పి బావని వప్పించాలి? మగాళ్లలోనూ ఇలాంటివాల్లు వుండడం అరుదన్న సత్యాన్ని భరిస్తూ అతడ్ని ఆనందంగా దగ్గరకు తీసుకోలేకపోతున్నాను. సో... ఇలాంటి సమస్యలకి పరిష్కారాన్ని కాలానికే వదిలేయాలనుకుంటున్నాను."
భర్త బ్రతికుండగానే అతడికి శద్దాంజలి ఘటించే ఓ ఆడదానిలోని తెగువని ధీర ప్రదర్శిస్తుంటే అసలు ఆమె చేస్తున్నది తప్పో - ఒప్పో అర్దం కానట్టు నిలబడిపోయింది ఆర్తి చాలా సేపటిదాకా.
"అంటే...." ఆర్తి నెమ్మదిగా అడిగింది "ఇంతవరకూ ఒక్కసారీ నీ భర్తతో శారీరకంగా కలవలేదా?"
ఆమె విస్మయంగా చూసింది. "ఆ అనుమానం ఎందుకొచ్చింది?"
"అహం.... అడగాలనిపించింది."
"ఇప్పటికీ కలుస్తూనే వున్నాం."
"అంటే..." విషయాన్ని ఎలా విశ్లేషించాలో బోధపడలేదు ఆర్తికి. "అతడితో కాపురం చేస్తూనే మరో వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నావన్నమాట."
"ఎస్!" ధీమాగా అందామె. "ఒకటి సంఘం కోసం, మరొకటి నా కోసం."
"ఇట్సే రెడిక్యులస్ ధీరా! ఇంత మొండిగా మాట్లాడగలుగుతున్న నువ్వు మళ్లీ సంఘం గురించి ఆలోచించటమేమిటి?"
ఆమె నవ్వలేదు. ఎవరి మాటెలా వున్నా ఆర్తి తనను సరిగ్గా అర్దం చేసుకోలేదని బోధపడిపోయింది. అదికాదు ఆమెని ఆశ్చర్యపరిచింది. చాలా చదువుకుని మోడ్రన్ గా ఆలోచించాల్సిన ఆర్తికూడా అందరిలో ఒకతిగా నిలబడి తనను దోషినన్నట్లు చూస్తూంది.
"చూడు ఆర్తీ! నేను భర్తనుంచి విడిపోయిన ఆడదాన్నే అయితే నాకు తోచిన పద్దతిలో బాహాటంగా ప్రవర్తించగలను. కానీ దురదృష్టవశాత్తూ బంధువుల కోసం, ఆ బంధువులున్న సంఘం కోసం ఆ ఇంటి కోడలిగా మసలుకోవాలిగా."
ఆమె మాటల్లో ఫలానా అని చెప్పలేని అపశృతి ధ్వనిస్తూంది.
నిజానికి భర్త మీద వున్న జాలితో అతడి భార్యగా బ్రతుకుతూంది తప్ప సంఘానికి భయపడికాదు.
ఆ విషయం అంగీకరించటంలేదు ధీర.
అసలు జాలితో శరీరాన్నివ్వడమేమిటీ అన్న తన ప్రశ్నకి భయపడి అలా మాట్లాడుతూందని బోధపడిపోయింది.
"అప్పుడు కొంతయినా అర్దమయిన నువ్వు ఇప్పుడు ఏమీ అర్దం కాని స్టేజ్ కి ఎదిగిపోయావే ధీరా" ఆర్తి
సాలోచనగా అంది. "నువ్వు చేస్తున్నది తప్పో - ఒప్పో ఖచ్చితంగా నాకు తెలీదు. ఏ మూలో తప్పని బలంగా అనిపిస్తున్నా నిన్ను ఒప్పించడం నాకు సాధ్యంకాదు. కారణం... నీకంటూ ఓ ఆర్గ్యుమెంట్ వుంటుందని - వుందనీ నాకు తెలుసు. కాబట్టి యింతదాకా వచ్చాక చెప్పడంకన్నా నీకు వదిలిపెట్టడమే నయమని అనిపించబట్టి.. అయితే నా ఆలోచన ఒక్కటే."
"చెప్పు"
"సాధ్యమైనంత త్వరగా శ్యాంని విడిచిపెట్టి దయాకర్ కి భార్యగా జీవితాన్ని ప్రారంభించు."
ఆమె నవ్వింది మామూలుగా. "కానీ దయాకర్ కి భార్యగా జీవితం మొదటు పెట్టడమూ అంత సులభం కాదే."
ఆమె మాటల్లోని కాంట్రాడిక్షన్స్ ఆర్తిని కలవరపడుతుంటే "ఎందుకు కాదే.. శ్యాంతో విడాకులు తీసుకున్నాకనేగా నువ్వు దయాకర్ కి దగ్గరయ్యేది" అంది.