కాద్రా మెదడు దార్కా తిని మాంత్రికుడయ్యాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో విషాచి మరణిస్తే -గ్రామస్థుల్లో ఇంకో దార్కా ఉద్భవిస్తాడు. అది విషాచికి ఇష్టం లేదు. తన మరణం గురించి బిస్తాలో తెలియకూడదు. మూడో కంటికి తెలియకుండా అది జరిగిపోవాలి. తన మెదడు తనతోనే నిక్షిప్తం అయి పోవాలి. తనలోనే -తనతోనే
అతడు గుంటలో చిన్నరాయిని కదిపేడు.
ముందుగా చిన్న శబ్దం అయింది. ఆ తరువాత అది క్రమంగా పెరుగుతూపోయింది సన్నటి ఇసుక, రాళ్ళమీద కప్పబడిపోతుననాయి. నిముషంలో అది నిండిపోయింది. ఆ తర్వాత రాళ్ళమధ్యనుండి తోసుకుంటూ ఒక చెయ్యి బయటకు వచ్చింది. అతి కష్టం మీద బయటకొచ్చిన ఆ చెయ్యి లోపల మనిషి అంతిమ క్షణాన్ని భయంకరంగా సూచిస్తూ టపటపా కొట్టుకుంది. పిడికిల మూసుకుని వేగంగా విడిచేయ సాగింది. తరువాత దాని వేగం తగ్గింది. ఆ తరువాత రెండు నిముషాలకి అది అచేతనమయింది.
4
విషాచి ఆత్మార్పణం గావించిన సంగతి దార్కాకు తెలీదు. ఆ సమయానికే అతడు ప్రయాణంలో సగ దూరం వెల్ళిపోయాడు. మరో రెండు గంటలు గడిచేసరికల్లా అతడు రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్నాడు.
కేవలం గోచీతో ప్రయాణం చేస్తున్న అతడిని కంపార్ట్ మెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. కొందరు ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.
అతడు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
రైలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ప్రవేశిస్తూంది. టికెట్ కలెక్టర్ ఒక్కొక్కరినే చెక్ చేసుకుంటూ వస్తున్నాడు.
దార్కాకి తెలీదు ట్రైన్ లో టికెట్ కొని ఎక్కాలని. ఒకవేళ తెల్సినా కూడా ఏమీ లాభం లేదు. అతడి వద్ద డబ్బేమీ లేదు.
టికెట్ కలెక్టర్ దగ్గరకు వస్తున్నాడు. దార్కా అటూ ఇటూ చూసేడు. ఒక్కొక్కరూ తమ దగ్గరున్న పచ్చ కాగితం ముక్క చూపిస్తుంటే అతనికి అర్ధమయింది. తనూ అలాంటిది చూపించాలని
టికెట్ కలెక్టర్ వచ్చి చెయ్యి సాచాడు.
దార్కా కదల్లేదు. తలెత్తి చూసేడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు.
"టికెట్ ప్లీజ్"
దార్కా లేదన్నట్టూ అస్పష్టంగా తలూపేడు.
ఆ కంపార్ట్ మెంట్ లో ఒకమ్మాయి తమవైపే చూస్తూవుండడం ఆ టికెట్ కలెక్టర్ గమనించేడు. ఒకప్పుడు అతడు ఫుట్ బాల్ ప్లేయరు. తన పర్సనాలిటీ మీద అందంమీద అంత నమ్మకం వున్నవాడు. దార్కా రెక్క పట్టుకుని లేపి, "లెగు బే" అంటూ కంపార్ట్ మెంటు చివరివరకూ లాక్కొచ్చాడు.
అక్కడెవరో అన్నీ మూటలు అడ్డుగా పెట్టారు. వాటి వెనక్కి వచ్చి తరువాత ఎవరూ లేకుండా వుండడం చూసి "ఊ! రూపాయి తియ్యి" అన్నాడు.
గిరిజనులు ఆ ప్రాంతంలో రూపాయిచ్చి ప్రయాణం చేస్తారని దార్కాకు తెలియదు.
"రూపాయి కూడా లేదా"
దార్కా లేదన్నట్టు తలూపక మౌనం వహించాడు. అది తనని అవమానించటంగా భావించి, టికెట్ కలెక్టర్ అతడి చెంపమీద ఛెళ్ళున కొట్టేడు. అనాగరికులైన ఈ ఒరియా ప్రజలమీద అధికారులు ఇంతకన్నా ఎక్కువ దారుణంగానే ప్రవర్తిస్తారు. అందులో ఓ అమ్మాయి ప్రేక్షకురాలు.
దార్కా ఈ దెబ్బ ఊహించలేదు. నిలదొక్కుకోలేక పక్కకు తూలి పడ్డాడు. చెక్క తలకి టప్ మని కొట్టుకుంది. టికెట్ కలెక్టర్ చేతులు దులుపుకుంటూ "వచ్చే స్టేషన్ లో దిగు లేకపోతే చర్మం వొలిచేస్తాను" అని లోపలికి వెళ్ళబోయి, దార్కా మొహం చూసి ఆగిపోయాడు.
దార్కా చేతులమీద లేస్తున్నాడు.
అందుక్కాదు అతడు ఆగింది.
ఆ మొహాన్ని చూసి.
అవే కళ్ళు, నిస్తేజమైన కళ్ళు, పంజా విసరబోయే ముందు పులి కళ్ళలో కృరత్వం..... నిస్తేజంతో కలిసి.... తలుపులన్నీ వేసి కొట్టబోతే పిల్లి కళ్ళలో కనబడే తెగింపు.
- ఎందుకో తెలీదు టికెట్ కలెక్టర్ వెన్నులో సన్నగా చలి, తరంగంలా మొదలయి వళ్ళంతా వ్యాపించింది. ఆ భయంతోనే అసంకల్పితంగా కాలు విసిరేడు. అది దార్కా గెడ్డం కింద తగిలింది. అతడు వెనక్కి పడ్డాడు. దార్కాకి ఒక కన్ను కనపడదు. అందువల్ల తనవేపు పక్కనుంచి వస్తున్న కాలుని చూసుకోలేదు. వాష్ బేసిన్ గొట్టం అతడి పెదవికి తగిలి చిట్లింది. తడిమొహానికి అంటింది. టికెట్ కలెక్టర్ బూటుతోపాటు ఎగిరిన మట్టి అది. దార్కా మొహం ఎర్రగా కందిపోయింది. నెమ్మదిగా లేస్తున్నాడు.
వాష్ బేసిన్ పట్టుకుని అతడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అది చూసి టికెట్ కలెక్టర్ మళ్లీ చెయ్యి ఎత్తాడు.
ఎందుకు నాయనా పాపం అతణ్ని అలా కొడ్తావ్?
తమ తమ బోన్లలోకి చప్పున వెళ్ళిపోయిన పులుల్లా ఇద్దరూ మామూలుగా మారిపోయారు. దార్కా తలెత్తి చూశాడు. ఖద్దరు బట్టల్లో ఒకాయన నిలబడి వున్నాడు. ఆయన నుదురు ఆకాశంలా వింది. నుదుటి మీద బొట్టు సూర్యుడిలా ప్రకాశిస్తుంది.
టికెట్ కలెక్టర్ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు. దార్కా లేచి తన సీటు దగ్గరికి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.