"నీకు తెలుగు రాదా"
దార్కా రాదన్నట్టు తలూపేడు. ఆ తరువాత సంభాషణ ఒరియాలో జరిగింది.
దార్కా సాలోచనగా ఆయన వైపు చూశాడు. అవును నేర్చుకోవాలి. కనీసపు తెలుగయినా రాకపోతే ఈ తెలుగుదేశంలో కష్టం. అందులోనూ పూర్తి చేయవలసిన పని కూడా తక్కువేమీ కాదు. ఎంతోమందితో మాట్లాడితే గానీ ఆ తులసి ఎక్కడ వున్నది తెలీదు. తెలిసిన ఈ కొద్ది ఒరియా భాషతో అది సాధ్యం కాదు. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి......
"నేను మీ ఇంట్లో పని చేస్తాను. నాకు తెలుగు నేర్పండి"
"ఏం పని చేస్తావ్ నువ్వు?"
"ఏ పని అయినా సరే"
ఆయన ఒప్పుకుంటున్నట్టు తలూపేడు.
దార్కా అడిగేడు తెలుగు నేర్చుకోవటానికి, మామూలుగా మాట్లాడటానికి ఎంతకాలం పడ్తుంది?"
"ఒక సంవత్సరం"
దార్కా ఉలిక్కిపడి "ఒక సంవత్సరమా" అన్నాడు. సమయం అసలే తక్కువ ఉన్నవి ఐదారు సంవత్సరాలు. కాష్మోరా నిద్రలేచి తులసిని చంపకముందే ఆమెను కనుక్కోవాలి. అందులో ఒక సంవత్సరం ఈ తెలుగు నేర్చుకోవడానికే సరిపోతే ఎలా?
"అంతకన్నా తక్కువ కాలంలో నేర్చుకోవడానికి వీలుపడదా?"
"మాములుగా మాట్లాడటం, వ్రాయటం వీటికైతే ఆర్నెల్లుచాలు. అంతకన్నా తక్కువ ఎటువంటి పరిస్థితిలోనూ సాధ్యంకాదు. 'సరస్వతీ నమస్తుభ్యం' అన్న పద్యం నేర్చుకవడానికే నాల్గు రోజులు పడ్తుంది."
"ఏం పద్యం అది?"
"సరస్వతీ నమస్తుభ్యం..... వరదే కామ రూపిణీ....." ఆయన చెప్పారు. చెబుతున్నంతసేపూ దార్కా కళ్ళు మూసుకుని విన్నాడు. విషాచి మంత్రం చెబ్తుంటే ఎలా విన్నాడో అంత శ్రద్దగా విన్నాడు.
పద్యం పూర్తయింది అనగానే దార్కా పెదవులు కదిలాయి. ఒక్క అచ్చు కూడా పొల్లుబోకుండా అతడు తిరిగి పద్యాన్ని వప్పచెబుతుంటే ఆయన తెల్లబోయి చూడసాగేడు. పద్యం పూర్తి చేసి దార్కా కళ్ళు తెరిచి అడిగేడు - "ఇప్పుడు చెప్పండి తెలుగు నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది?"
ఆయన విస్మయం నుంచి కోలుకోకుండానే అసంకల్పితంగా "నెల" అన్నాడు.
రైలు వేగం తగ్గింది.
ఆయన చేతిసంచి పట్టుకొని "దిగు" అన్నాడు.
దార్కా లేచాడు.
టికెట్ కలెక్టర్ వస్తున్నాడు. దార్కా అతడివేపు చూసి నవ్వేడు. టికెట్ కలెక్టర్ మొహం చిట్లించి "దిగు బే" అన్నాడు. దార్కా మళ్ళీ అతడి వేపు నవ్వి దిగిపోయేడు.
"వీడెవడో పిచ్చివాడిలా వున్నాడు" అనుకున్నాడు టికెట్ కలెక్టర్. వాష్ బేసిన్ దగ్గర కొట్టినప్పుడు. దార్కా పడిలేవబోతూ, తన బూటుకాలు తొక్కిన మట్టిని సేకరించాడనీ అది తనతో పాటు తీసుకెళుతున్నాడనీ అతడికి తెలీదు.
బిస్తా గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయాన్ని చితిలో కూడా మర్చిపోరు........
*********
"ఇదే మా ఇల్లు" అన్నారు. ఆచార్యులు ఒరియాలో.
తలెత్తి చూశాడు దార్కా. చాలా పెద్ద ఇల్లు. పురాతనమైనది ఒకప్పటి పూర్వపు వైభవాన్ని కోల్పోయింది.
"మా పూర్వీకులు విజయనగర సంస్థానాదీశుల దగ్గర కొలువు చేసేవారు. మా తాతగారి నాన్నగారు దారివెంట వెళుతూంటే పశుపక్ష్యాదులు కూడా వినమ్రతతో తలవంచేవని ప్రతీతి" ఆయన పెదవులమీద జీవం లేని నవ్వు వెలసింది.. "ఇప్పుడు మేము తెలుగు అధ్యాపకులుగా మిగిలిపోయేము" అంటూ లోపలికి నడిచేరు, దార్కా అనుసరించేడు.
"చాలా పెద్ద ఇల్లు మాది. ఈ ఇంట్లో నువ్వు నీకు కావలసినంత కాలం నిరభ్యంతరంగా వుండవచ్చు"
"ఊరికే వుండను. మీ ఇంట్లో పని చేస్తాను. ఉన్నంత కాలమూ ఏదో ఒక పని చేస్తాను"
"సరే! ఏదో ఒకటి చెద్దూగాన్లే రేపటినుంచి ప్రారంభిస్తాను"
"కాదు, ఇప్పటినుంచే" అన్నాడు దార్కా. ఆయన ఆశ్చర్యంగా చూసేరు.
సమయం విలువ దార్కాకి బాగా తెలుస్తూంది. నిజానికి సమస్య ఇంత క్లిష్టమైందని అతడు అనుకోలేదు. అతడి గురువైన విషాచికి కూడా తెలీదు. ఇన్ని రకాలయిన చదువులు వుంటాయని, వాళ్ళకున్న పరిజ్ఞానంతో పెద్ద వూళ్ళలో, వూరుకొక కళాశాల వుంటుందనీ, అది వెతికితే సరిపోతుందనీ అనుకున్నారు. కానీ ఆచార్యుల వారితో జరిగిన సంభాషణతో దార్కాకి తెలిసింది - అమ్మాయిలు ఇంజనీరింగు, మెడిసిన్ పాలిటెక్నిక్ కూడా చదువుతారని. అప్పుడర్ధమయిందతడికి తన పని ఎంత కష్టమో.
రాత్రి పదయింది.
ఒక్క రోజులో దార్కా నేర్చుకున్న తెలుగు, ఆయనకి ఎంతో విస్మయాన్ని కలిగించింది. దార్కా తెలుగులో, ఆ భాషలో ఎంతో పరిచయం వున్నవాడిలా "నాకీ రోజు భోజనం వద్దు మీరు చేసెయ్యండి" అనగలిగాడు మొదటిరోజే.
*************