విషాచి దాన్ని వినిపించుకోలేదు. తన ఆలోచనల్లోనే కొంచెం సేపుండి -ఒక నిర్ణయానికొచ్చినట్లుగా తలపంకించి ఇలా అన్నాడు.
"దార్కా -నేను చెప్పేది జాగ్రత్తగా విను. మంత్రగాడు పరిపూర్ణుడవటానికి పదహారు స్థాయిలున్నాయి. ఎంతో భయంకరమైనది అని చెప్పబడ్తున్న చేతబడి నిజానికి ఎనిమిదో మెట్టు మాత్రమే. ఆ తరువాత కొన్ని విద్యల తరువాత కాష్మోరా.
"దార్కా - ప్రతివాడికీ కొద్దిగా స్వార్ధం వుంటుంది. ఆ స్వార్ధంతోనే నీకు చివరి విద్య అయిన కాష్మోరా నేర్పలేదు. కేవలం నా కొడుకైన కాద్రాకి మాత్రమే నేర్పాను. నా మరణంతో ఆ విద్య అంతరించి పోవాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసీ తెలియని విద్య ప్రయోగించి నీ కన్ను పోగొట్టేను. దాని ప్రతిగా నీకు కాష్మోరా నేర్పుతాను. ఈ క్షణమే నిన్ను నా కొడుకుగా స్వీకరిస్తుననాను."
"విషాచీ"
"అవును! తెల్లవారేలోపులో నేను నీకిది నేర్పుతాను. ఈ విద్యతో నీ చదువు పూర్తవుతుంది. నిన్ను మించిన మంత్రగాడు ఇక ప్రపంచంలో ఎవరూ వుండరు. లే- దార్కా యిలా దక్షిణం దిక్కుగా కూర్చో. నీ నగ్న శరీరాన్ని యీ ప్రేతాత్మలు సరీగ్గా చూడనీ. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు పఠించు. అంతా వెలుగురేఖ పొడవకముందే జరిగిపోవాలి సుమా. చీకటి విడిపోతే ప్రేతాత్మలు వెళ్ళిపోతాయి. త్వరత్వరగా పఠించు" అంటూ మంత్రం చెప్పాడు.
దార్కా మంత్రం విన్నాడు. మంత్రం చెప్పేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్ధమూ వుండకూడదు. దానికి నీళ్ళు కావాలి. అదే అడిగేడు.
విషాచి నవ్వేడు.
"దార్కా మంత్రగాడికి కావల్సినవి అనుకున్నప్పుడు దొరకవు. దొరికిన వాటితోనే సంతృప్తి పర్చుకోవాలి. నిజంగా నీ దగ్గర నీరేలేదా?"
దార్కాకి క్షణంలో అర్ధమైంది.
మంత్రవిద్యలో ఏదీ క్షుద్రం కాదు.
రెండు నిముషాల్లో నోరు ప్రక్షాళన మయింది.
నూట ఎనిమిది సార్లు మంత్రపఠనం పూర్తి అయింది.
ఆ తర్వాత అతడు నిద్రపోతున్న కాష్మోరాని ఎట్లు లేపాలో చెప్పాడు. పూజకి కావాల్సిన వస్తువులు, వాటిని ఉపయోగించే విధానం తెలిపాడు. క్షుద్ర కర్మలన్నీ స్త్రీ పురుషుల జననేంద్రియాల మీదే జరుగుతాయి. అతడు దార్కాని ఉత్తర దిక్కుగా నిలబెట్టాడు. ఆరడుగుల దార్కా నగ్నంగా అలా నిలబడి వుంటే గ్రీకు శిల్పం నిలబడినట్టు వుంది.
అతడి పురుషత్వాన్ని చూసి ప్రకృతికి కూడా అతడితో రమించాలని బుద్ధి పుట్టింది కాబోలు - దక్షిణం నుంచి గాలి రివ్వున వీచి అతన్ని స్పృశించి సంతృప్తి పొందుతూంది. అతడిని అలా చూసి విషాచి ఇంకేమైనా వుందా?మంత్రగాడవుతున్నాడు కాబట్టి బయపడ్తారేమో గానీ లేకపోతే బిస్తా గ్రామపు యువతులు ఇతడ్ని ఇలా బ్రతకనిచ్చేవారా! అతడికి నవ్వొచ్చింది. ఈ యువకుడు ఇపుడు నాగరిక ప్రపంచంలోకి వెళుతున్నాడు. అక్కడి స్త్రీలకు ఇతడి మంత్రశక్తుల సంగతి తెలియదుగా మరి, ఇతణ్ని ఇలా వుంచుతారా? ఏమో నాగరిక ప్రపంచంలో నైతిక విలువలకి ప్రాధాన్యత ఎక్కువటగా! చూడాలి.
ఒకవైపు విషాచి ఆలోచిస్తూనే తన పని చేసుకుపోతున్నాడు.
కాల్చడానికి వూచ కావాలి. ముందు అనుకోకపోవడం వల్ల వూచ తెచ్చుకోలేదు. కాలికున్న కడియం విప్పి వంకర తీసి ఎర్రగా కాల్చేడు.
.................
దార్కా కళ్ళు నెమ్మదిగా విప్పేడు.
విషాచి సంతృప్తితో తల పంకించాడు. "నీ కిక నేర్పవలసింది ఏమీ లేదు. దార్కా, ప్రపంచంలో నిన్ను మించిన వాడెవడూ లేడు."
"కృతజ్ఞుడ్ని"
"నేనీ క్షణమే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం బయలుదేరుతున్నాను. ఇక బిస్తాలోకి వెళ్ళే అవసరం లేదు విషాచీ! అయిదు సంవత్సరాల లోపులో ఆ ముగ్గుర్నీ చంపి నీకు ఆ మంచి వార్త చెప్పడానికి వస్తాను. అంతవరకూ నా కోసం వేచివుండు"
"నీ మీద నమ్మకం ఉంది. వేచి వుండక్కర్లేదు."
"అంటే" అన్నాడు అర్ధంకానట్టు దార్కా.
విషాచి నవ్వి వూరుకున్నాడు. తూర్పున వెలుగురేఖ నెమ్మదిగా విచ్చుకొంటూంది. నిశ్శబ్దంగా ప్రేతాత్మలు తమ స్థానాన్ని చేరుకుంటూంటే - ప్రపంచం నిద్రలేస్తూందనటానికి నిదర్శనంగా పక్షులు కిలకిల మొదలయ్యాయి.
"వెళ్ళొస్తాను"
"మంచిది.నీకు శుభమగు గాక"
దార్కా మంత్రగాళ్ళ ఆనవాయితీ ప్రకారం వంగి గురువు కటి ప్రదేశంలో తలవంచి నమస్కారం చేశేడు. విషాచి అతడి తలమీద ఎడమ చేత్తో స్పృశించి ఏదో మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాడు. అతడు లేవగానే దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకొని "వెళ్ళిరా" అన్నాడు.
ఆ తరువాత విషాచి కదిలేడు.
అక్కడికి పది గజాల దూరంలో అతడు దార్కా కలిసి తవ్విన గొయ్యి వుంది. అన్నీ రాళ్ళూ -రాళ్ళ మీద మట్టీ పేర్చబడి వుంది. అతడు గుంటలోకి దిగేడు.
విషాచి మరణించాడని తెలిస్తే గ్రామం గ్రామం కదిలి వస్తుంది. కపాలం వలుస్తారు. ఆ మెదడుని తింటాడెవడో. ఈ ప్రపంచంలో ఒకడే మహా మాంత్రికుడుండాలి. ఒకప్పుడు ఇద్దరుండేవారు కాద్రా విషాచీలు. తండ్రీ కొడుకులు.