Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 9

    ఎ) కుడివైపు:

    కుడివైపునకు అక్షరాలు వంగివుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతీ విషయంలోనూ ఏక్టివ్ పార్ట్ తీసుకుంటారు. సాధారణంగా   మనందరం మన అక్షరాలని కుడివైపుకే కొద్దిగా వంచి వ్రాస్తాం. మీరు ఈఇ కేటగిరీలోకి చెందిన వారైతే మిమ్మల్ని మీరు ఒక "ఎక్స్ ట్రావర్ట్" గా భావించుకోవచ్చు.

     మీరు స్నేహమనస్కులై వుంటారు. ఆప్యాయతలకి ఎక్కువ విలువ ఇస్తారు.  మానవ సంబంధాలపట్ల ఎక్కువ నమ్మకాన్ని కలిగి వుంటారు. సంఘంలో ఎక్కువ భాగానికి మీరు ప్రతినిధులై వుంటారు.

     మీకు ఎమోషన్స్ ఎక్కువగా వుంటాయి. ఇవ్వటం, తీసుకోవటం అనేది సమాన స్థాయిలో వుంటుంది. ఈ విధంగా కుడివైపుకి వంచి వ్రాసే వాళ్లు, ఇతరుల చేత ప్రభావితమైనా కూడా తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకొనే  ప్రయత్నం చేస్తుంటారు. ప్రేమ, ద్వేషం త్యాగం లాంటి పదాల పట్ల చాలా దృఢమైన అభిప్రాయాలుంటాయి.  కానీ ఒత్తిళ్లకు మాత్రం లొంగిపోతుంటారు.

     (కొంతమంది  అక్షరాలను కుడివైపుకి వంచి వ్రాస్తే  మరికొందరు  పూర్తిగా పడుకోబెట్టి వ్రాస్తారు. ఈ ఛాప్టర్ లో చెప్పిన లక్షణాలన్నీ వారు కుడివైపుకి ఎంత వంచివ్రాస్తే అంత గాఢమైన గుణాలున్న వారుగా నిర్ణయించుకోవాలి)

    మీలో వున్న మంచి గుణాలని ఈ విధంగా గుర్తించుకోవచ్చు.

    1. సాంఘిక బాద్యతల పట్ల ఆసక్తి, ఎప్పుడూ రిలాక్సింగ్ గా వుండటం
    2. కొత్త వాతావరణానికి తొందరగా అడ్జస్ట్ అవటం
    3. మానవసంబంధాలు పట్ల ఆకర్షణ.
    4. నిస్వార్ద పరత్వం
    5. ఒక గమ్యం వైపు వెళ్లాలనే తపన
    6. భవిష్యత్తుపట్ల ధృఢనిశ్చయం
    7. ఎప్పుడూ రొటీన్ గా కాకుండా కొత్త విషయాలపట్ల ఆశక్తి
    8. చిన్న విషయాలకే ఎక్కువ ఎక్సైట్ అవటం.
    9.  ప్రతీ పనిలోనూ ఉత్సుకత
    10. అవసరమైన దానికన్నా ఎక్కువ సెంటమెంటల్ గా వుండటం.

     నిరోధక శక్తి లేకపోవటం, మీ మీద మీకు అవసరమైనంత కంట్రోల్ లేక పోవటం, మీ దగ్గర  వాళ్లపట్ల విసుగు చూపటం, ఎమోషన్ గా వుండటం. మీరు బాగా నమ్మిన వ్యక్తి మీద ఎక్కువ ఆధారపడటం, మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అని నిరంతరం తపనపడటం, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంగారు పడటం, ఏదైనా పని తొందరగా చేయటం - ఇవన్నీ మీ బలహీనతలుగా పేర్కొనవచ్చు.

     ఇటువంటి  చేతివ్రాత కలిగిన వాళ్ల గురించి ఒక ఉదాహరణ:

    ఒక అమ్మాయి మీద అన్ని రకాల ట్రిక్కులు ప్రయోగించి, (అవి ట్రిక్కులు అని తాము నమ్మకుండా) ఆ అమ్మాయిని ఒప్పుకొనేటట్లు చేసి,  (ఇందులో బలవంతం ఏమీ వుండదు. ఆ అమ్మాయే ఒప్పుకొంటుంది) ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక సందిగ్దంలో పడిపోయి, ఆ అమ్మాయి నిస్సహాయతని ఉపయోగించుకోవాలా, పెళ్లి చేసుకుందామా అని అఢగాలా, రెండూ మానేయాలా - ఇన్ని రకాలుగా  ప్రశ్నించుకొని సతమతమై  చివరికి ఆ అమ్మాయిని  కోల్పోతారు. అయినా సరే ప్రేమ విషయంలో ఎన్ని దెబ్బలు తగిలినా డీలాపడిపోరు. విధి అనుకూలించలేదనుకొని అతిమామూలుగా,  అతి సాదారణంగా వేరే అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు.

     ఇటువంటి చేతివ్రాత వున్నవాళ్లు ఎవర్నీ అవహేళన చెయ్యరు. కామెంట్ చేసి బాదపెట్టరు. వీరు ఒకవేళ ఏ అమ్మాయినైనా ప్రేమించినా, ఆ అమ్మాయి వ్రాసిన ప్రేమలేఖలన్నీ చివర్లో తీసికెళ్లి ఇచ్చివేసి తాము మంచివాళ్లని ముద్రవేసుకుంటారు.

    (బి) ఎడమవైపు:

    సాధారణంగా ఈ రకమైన చేతివ్రాత  గలవాళ్లు తక్కువ.

     1. వీళ్లు చాలా వరకు అంతర్ముఖులై వుంటారు.

     2. ప్రపంచం గురించి బాగా తెలిసినా కూడా తాము అమాయకులని భావిస్తూ వుంటారు.

     3. ఎప్పుడూ స్పృహలో వుండటం వీళ్ల దురదృష్టం ఒక పార్టీని గానీ, మంచి కంపెనీ గానీ సాదారణంగా అనుభవించలేరు.

     4. ముఖ్యంగా 16- 25 మధ్య వయస్సులో వుండి ఇటువంటి చేతివ్రాత గలవాళ్లు సెక్స్ పట్ల ఒక విధమైన నిర్లిప్తత వున్నట్లుగా  పైకి కనిపిస్తారు. అంతర్గతంగా చాలాకోరికలుంటాయి.

     5. వీరికి తమ బంధువులతోను, తల్లిదండ్రులతోను, తమని ప్రేమించే వారితోను గాఢమైన సంబంధాలుంటాయి. ఇవి మానసికమైనవి.

     6. ప్రతీ చిన్న విషయాన్ని అత్యంత జాగ్రత్తగా చేయటం వీరి అలవాటు. అందువల్ల వీరిని చుట్టూ వున్న వాళ్ళుఅర్దం చేసుకోలేరు. వీరికున్నంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎవరికీ వుండవు.

    7. జీవిత వాస్తవాల పట్ల ధృఢమైన అభిప్రాయాలు ఏ పనికైనా కంట్రోల్ గా చేయడం, మంచి జ్ఞాపకశక్తి  తనకుతాను నిజాయితీగా వ్యవహరించడం, అతిజాగ్రత్త, పట్టుదల, తనకి సంబంధించిన విషయాలన్నీ స్వతంత్రంగా ఆలోచించటం -  వీరి మరిన్ని మంచి గుణాలు.
 
    అయితే వీరిలో కొన్ని అభినందనీయంకాని గుణాలు కూడా వున్నాయి.

     అప్పుడప్పుడు సినికల్ గా ప్రవర్తించటం, అతిజాగ్రత్త చూపటం, అవతల వాళ్లకి తానొక గర్విష్టి అనే విధంగా ప్రవర్తించటం, తమ  జీవితగతానుభవాల ప్రభావానికి ఎక్కువగా గురవటం, ఎక్కువ సెన్సిటివ్ నెస్, తామెలా వుంటారో దానికి విరుద్దంగా బయటకి కృత్రిమంగా కనబడటం.

 Previous Page Next Page