Previous Page Next Page 
గ్రాఫాలజీ  పేజి 10

                                 

    సి) నిట్టనిలువుగా:

    అక్షరాలను నిట్టనిలువుగా వ్రాసేవారు తమమీద తమకి బాగా కంట్రోల్ వున్న వాళ్లై వుంటారు. ప్రతీ విషయంలోనూ బాగా నిర్లిప్తంగా కనిపిస్తారుగానీ, లోలోపల దాని గురించి లోతుగా ఆలోచిస్తారు. వీళ్ల హృదయాన్ని వీళ్ల మెదడు ఎప్పుడూ కంట్రోల్ చేస్తుంది. ఏదేనా విషయాన్ని వీళ్ళు ఆనందించాలంటే దానికి వీళ్లమెదడు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవలసి వుంటుంది.

     వీళ్లు చాలాకూల్ గా తమపై తాము నమ్మకంతో వుంటారు.  ఏ విషయంలోనైనా వీళ్లని ఒప్పించటం కష్టం. ప్రభావానికి ఎక్కువగా లోనవరు.

     వీరు చాలా సాధారణంగా చాలా ప్రాక్టికల్ గా జీవితాన్ని జీవిస్తుంటారు.  ప్రతి విషయంలోనూ విమర్సనాత్మక దృష్టి ఎక్కువగా  వుండటం వల్ల వీరిని అర్దం చేసుకోవటం కష్టం.  ఒక స్వీట్ ని వీరిముందు పెట్టినప్పుడు కూడా అది తింటూ ఇదెలా చెయ్యబడింది?  ఇదెందుకింత  రుచిగా వుంది?  నేను చెయ్యగలనా? అనే ఆలోచనలతో  ఆ స్వీట్ తినటంలో  వుండే ఆనందాన్ని కోల్పోతారు. వీరి ఆనందం మళ్లీ ఆ స్వీట్ తయారు చేయటంలోనే వుంటుంది తప్ప వేరొకరు చేసినదాన్ని తినటంలో వుండదు.

     ఇన్ని గుణాలుండటం వల్లే వీరు రాజకీయనాయకులుగానో,  లీడర్ గానో తయారవుతూ వుంటారు.

     వీళ్ల మంచి గుణాలని ఈ విధంగా  నిర్దేశించవచ్చు. నమ్మకస్తులు, సలహాలు చెప్పే సామర్ధ్యం గలవాళ్లు,  వాస్తవ దృక్పధం, ఎంత దగ్గరగా వుంటే అంత దూరం మెంటైన్ చెయ్యటం, కాస్త గర్వం, సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించటం, నిష్పక్షపాతమైన గుణం, భవిష్యత్తుని ఊహించటం - గుణాలు కలిగివుంటారు.

     అలాగని చెప్పి వీళ్లలో కొన్ని బలహీనతలు కూడా లేకపోలేదు. మిగతావాళ్లకి వ్యతిరేకంగా ఆలోచించడం, అవసరమైన దానికన్నా  ఎక్కువగా ఆలోచనలు, దృఢంగా వుండటం కన్నాఎక్కువ రిజిడ్ గా  వుండటం, స్పందనలేకపోవటం - వీరి బలహీనతలు. అందరూ ప్రకృతిని ఆరాధిస్తుంటే  వీళ్లు న్యూటన్ గురించి ఆలోచిస్తారు. అలాగే వీళ్లకి సెంటిమెంట్స్  కూడా తక్కువ. వీళ్లని ప్రేమించడం అవతల వారి దురదృష్టం. ప్రేమని  కూడా వీళ్ళు కేవలం ప్రాక్టికల్ గానే చూస్తారు. మిగతా ప్రపంచం వేరు తాము వేరు అనే భావన  కలిగి వుంటారు. అహంభావానికి ఇది మొదటిమెట్టు.

     పై మూడు వర్గాల్లోకి ఈ వర్గంలోకి వారే చివరికి తమని అభిమానించే వాళ్లకి, ప్రేమికులకి , సరియైన సలహాలు ఇవ్వటంలోనైతేనేమి, వాళ్లతో ప్రేమించబడటంలో అయితేనేమీ అగ్రగాములుగా నిలుస్తారు.  ఎందుకంటే నిజం అనేది మొదట్లో బాధపెట్టినా, చివరికి గమ్యానికి చేరుస్తుంది కాబట్టి.

   
                3. అక్షరాల పొడవు:

    మనం ఏదైనా ఒక రచన చేస్తున్నప్పుడు లేదా ఒక ఉత్తరం వ్రాస్తున్నప్పుడు అది పూర్తవగానే  ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది. ఒక కార్యాన్ని పూర్తిచేసే మన్న సంతృప్తి అది మొదట్లో  ఎంతో బాగా మొదలుపెట్టిన అక్షరాలు చివరికొచ్చేసరికి చాలా గజిబిజిగా తయారవొచ్చు.  ఇది మన తొందర తనాన్ని తెలియజేస్తుంది. అయితే ఇదే విధమైన తొందరతనం మనకి ప్రతీ వాక్యంలోనూ,  ప్రతీ అక్షరంలోనూ కనిపిస్తుంది. ఒక అక్షరం వ్రాసినప్పుడు దానికి తలకట్టు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  అది మన తొందరతనాన్ని తెలుపుతుంది. అదే విధంగా ఒత్తు బలంగా ఇస్తే  అది మన యొక్క మనస్తత్వాన్ని మరోరకంగా సూచిస్తుంది. అందువల్ల తలకట్లు, ఒత్తులు  బట్టి కూడా మన మనస్తత్వాన్ని మనం విశ్లేషించుకోవచ్చు.

    ప్రతి అక్షరానికి మూడు 'జోన్స్' వుంటాయి. ఉదాహరణకి "భ" అనే అక్షరం తీసుకుంటే తలకుట్టుని  అప్పర్ జోన్  అని,  ఒత్తుని లోయర్ జోన్ అని, 'బ' అక్షరాన్ని మిడిల్ జోన్ అని అంటారు. కొంతమంది  అక్షరాలు మామూలుగా వ్రాసి తలకట్లని మాత్రం చిన్నవిగా ఇస్తారు. ఇదే విషయం  ఒత్తులకు కూడా వర్తిస్తుంది. ఈ క్రింది మూడు చేతి వ్రాతలను గమనించండి.

                   

 Previous Page Next Page