తనకి శత్రువులు ఎవరూ లేరే?
డబ్బు కోసం కిడ్నాప్ చేస్తాడా?
ఎయిర్ పోర్ట్ లో యివేవీ సాధ్యం కాదు....
పోనీ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీకి చెబితే....
ఏమని చెబుతుంది? అతను తనని ఏం చేశాడని?
ఆమెకు నాలుగడుగులు దూరంలోకి వచ్చేశాడతను.
అతని చెయ్యి జేబులోకి వెళ్ళింది.
ఆమె మనసు ఏదో కీడును శంకించింది.
అదే సమయంలో అటుగా వస్తున్న ఇద్దరు పైలట్స్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతోపాటు నడక సాగించి ఫ్లైట్ లోకి ఎక్కేసింది. తరువాత తిరిగి బొంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు అతను కనపడలేదు.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టాక్సీలో డొమస్టెక్ ఎయిర్ పోర్ట్ కి వచ్చింది.
తనని ఎవరూ ఫాలో అవలేదు.
గొప్ప రిలీఫ్ గా ఫీలయిందామె.
ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కి టిక్కెట్ కోసం క్యూలో నిలబడి టిక్కెట్ తీసుకుని బయటకి వస్తూ ప్రక్కకి చూసింది.
క్యూలో నిలబడి వున్నాడా వ్యక్తి.
కౄరంగా వున్నాయి అతని చూపులు.
అదిరిపడిందామె.
ఆమె వెనుకనే ఫ్లైట్ ఎక్కాడు ఆ వ్యక్తి కూడా.
అప్పటి నుంచి తననే గమనిస్తున్నాడతను.
సందేహంలేదు.
తనకేదో కీడు జరగబోతోంది....
ఏదో భయంకరమైన ప్లాన్ వుంది.
తనని హత్య చేయబోతున్నారా?
కిడ్నాప్ చేయబోతున్నారా?
మరేదయినా పథకముందా?
కీచుమన్న శబ్దం చేస్తూ ఫ్లైట్ వీల్స్ రన్ వేని తాకాయి.
నిమిషం తరువాత ఫ్లైట్ ఏప్రన్ మీద ఆగింది.
డోరు ఓపెన్ అయ్యింది.
హేండ్ బ్యాగ్ తీసుకుని లేచి నిలబడిందామె.
అతను కూడా లేచాడు.
ఆమె శరీరంలో సన్నని వణుకు మొదలయింది.
రక్తపోటు హెచ్చింది.
త్వరత్వరగా అడుగులు వేస్తూ స్టెయిర్స్ మీదకు వచ్చిందామె.
తన ముందు నడుస్తున్న నలుగురయిదుగురు వ్యక్తులకు నిర్మొహమాటంగా పక్కకు నెట్టి ముందుకు తోసుకుని వచ్చి ఆమెను సమీపిస్తున్నాడతను.
అదిరే గుండెలతో వేగంగా దిగసాగిందామె.
అతను కూడా స్టెయిర్స్ మీదకు వచ్చాడు.
అప్పుడు....
ఆమెకు అతనికి మధ్య రెండే మెట్ల దూరం వుంది.
* * * * *
అప్పుడు సమయం సరీగ్గా పదీ యిరవయ్.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఫ్లైట్ టేకాఫ్ కి సిద్ధంగా వుంది.
డోరు క్లోజవగానే ప్రాపెల్లర్సు గిరగిర తిరగనారంభించాయి.
దూరంగా నడిచారు, కేంద్ర హోంమినిస్టరుకి సెండాఫ్ యివ్వడానికి వచ్చిన హోంమంత్రి, రాష్ట్ర ఇతర మంత్రులు....పోలీస్ డి జి పి.... ఐ జి లు....ఇతర పోలీస్ అధికారులు....పార్టీ కార్యకర్తలు.
చెవులు చిల్లులు పడేలా రొద చేస్తూ రన్ వే మీదకు పరిగెత్తింది ఫ్లైట్.
రెండు నిమిషాల తరువాత....
గాలి పొరలను చీల్చుకుంటూ టేకాఫ్ అయింది ఫ్లైట్.
'హమ్మయ్య' అంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు కౌశిక్. తల మీద నుంచి పెద్ద భారం దింపినట్లయింది.
'ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా, క్షేమంగా ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు హోంమినిస్టరు' కాబట్టి తన బాధ్యత విజయవంతంగా పూర్తయ్యింది.
లాంజ్ లో నుండి బయటకు రాసాగారు పోలీస్ అధికారులు, రాష్ట్ర మంత్రులు....అంతా.
ఎవరెవరి వాహనాలలో వాళ్ళు కూర్చుంటున్నారు మంత్రులంతా.
రాష్ట్ర హోంమంత్రి కారు ఎక్కగానే శాల్యూట్ చేశారు అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా.
ఆయన కారు, దాని ముందుగా పైలట్ వాహనం....ఆ వెనుకగా సెక్యూరిటీ జీప్స్....వరుసగా వెళ్ళిపోయాయి.
ఆ వెనుకగా మిగతా వాహనాలు కూడా దూసుకుపోయాయి.
కొద్ది నిమిషాలకి ఆ ప్రాంతం ఖాళీ అయ్యింది.
ఇంక తను కూడా బయలుదేరవచ్చు అనుకున్నాడు కౌశిక్.
హోంమినిస్టర్ ఫ్లైట్ టేకాఫ్ కి ముందు, బొంబాయి నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది. అయితే సెక్యూరిటీ కారణాలవల్ల, హోంమినిస్టర్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యేవరకు లాండింగ్ కి అనుమతించకూడదని నిర్ణయించారు. అందువల్ల దాదాపు అరగంటసేపు గాలిలోనే రౌండ్స్ కొట్టింది ఫ్లైట్.
కానీ అందులో ఇంధనం అయిపోవచ్చింది.
మరికొద్ది నిమిషాలపాటు అలా ఎగిరిందంటే....ప్రమాదస్థితిని చూడాల్సి వస్తుంది. అందువల్ల తప్పని పరిస్థితిలో లాండింగ్ కి అనుమతి యిచ్చారు.
బట్ హోంమినిస్టర్ ఫ్లైట్ గాలిలోకి ఎగరగానే ప్రయాణీకులని బయటికి దిగనిచ్చారు. అంటే సుమారు ఆరు, ఏడు నిమిషాలపాటు ప్రయాణీకులు ఫ్లైట్ లోనే కూర్చుండిపోయారు.
ఎప్పుడూ రానన్ని ఆకాశరామన్న ఉత్తరాలు, ఫోన్స్ ఈసారి వచ్చాయి. హోంమినిస్టర్ ని చంపుతాం అంటూ....
టెర్రరిస్ట్ ల నుంచి తీవ్రమైన ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి.
అందువల్లనే పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ఎప్పుడూ తీసుకోనంత జాగ్రత్తలు తీసుకుంది.
నగరం అంతా కర్ఫ్యూ పెట్టారా అన్నంత హేపీగా పోలీస్ ని డిప్లాయ్ చేశారు.
అదృష్టవశాత్తు ఏ చెడూ జరగకుండా గడిచిపోయింది.
ఈ రోజంతా తను రిలాక్స్ అవచ్చు అనుకున్నాడు.
ఒకసారి రిలీఫ్ గా ఒళ్ళు విరుచుకొని తన జీప్ వైపు కదిలాడు కౌశిక్.
* * * *
శ్రావ్యంగా మంద్రస్థాయిలో వినిపిస్తోంది ఎం.ఎస్. సుబ్బలక్ష్మి మధుర స్వరం స్టీరియోలో....
గంధర్వ గానం అంటే అదేనేమో అనిపించేటంత మధురంగా వుంది ఆ పాట.
అది వింటూ బెడ్ మీద బోర్లా పడుకొని వుంది అర్చన.
కళ్ళు మూసుకుని ఆ పాటలో లీనం అయ్యిందామె.
ఆమె కుడి కాలిని మోకాలి దగ్గర కొద్దిగా మడిచి అప్పుడప్పుడు ఆ కాలి బొటనవేలితో ఎడమ అరికాలి దగ్గర తాకిస్తోంది ఆమె. పాదాలకున్న రెండు పట్టీలు, అలా రెండు పాదాలు తాకిన ప్రతిసారి ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తున్నాయి.
పర్షియన్ బ్లూ షిపాన్ చీర ఒకింత తొలిగి ఆమె మోకాలి వరకు వున్న శరీరం అనాచ్చాదితంగా తెల్లగా పాలరాయిలా మెరుస్తోంది.
అప్పటికి సుమారు అరగంట నుండి ఆమె అదే భంగిమలో వుంది.
అదే సమయంలో మోగిన ఫోన్, ఏకాగ్రతతో పాట వింటున్న ఆమెను డిస్టర్బ్ చేశాయి.
ఒకింత విసురుగా లేచి రెండు అడుగులు వేసి టీపాయ్ మీద ఫోన్ అందుకుందామె.
"హలో...."
"హలో అర్చన!"
"ఎస్!"
"నేను పిళ్ళైని."
"ఆ! హలో సార్. గుడ్ మార్నింగ్" ఒకింత సర్దుకుని చైర్ లో కూర్చుంటూ అంది ఆమె.
"వాట్ హేపెండ్ టు యు? కొద్ది రోజులుగా ఆఫీస్ కే రావటం లేదు?"
"సార్! ది ప్రాబ్లం....ఈజ్ విత్ మై హెల్త్."
"వై....నాట్ హేపెండ్" పిళ్ళై గొంతులో ఒకింత ఆతృత ధ్వనించింది.
"నథింగ్ సీరియస్ సర్....మానసికంగా సరిగాలేను. రెండు రోజులుగా తలనొప్పి....తల తిరుగుతున్నట్లు వుంటోంది"
"అరె....డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా?"
"ఫరవాలేదు సర్! నౌ అయామ్ ఆల్ రైట్."
"దట్స్ ఫైన్....మరి....ఈ రోజు ఆఫీసుకి రావట్లేదా?"
"లేదు సర్"
ఒక్కక్షణం సైలెంట్ అయ్యాడు ఆ సమాధానం విని పిళ్ళై.
తరువాత అన్నాడు "చూడమ్మా! ఇంక ఐదు రోజులు మాత్రమే మనకి టైం వుంది గుర్తుందా?"
"ఐదు రోజులా....దేనికి సర్?"
ఒక్కసారి బి.పి. పెరిగింది పిళ్ళైకి. అసహనంగా కుర్చీలో కదిలి ఫోన్ ని ఎడమచేతిలోకి మార్చుకున్నాడు.
"ఈ నిమిషంలో ఏం పని అని అడిగితే ఏం చెప్పను? ప్రీమియర్ ఆడియోస్ కంపెనీకి యాడ్ ఫిల్మ్ చేయాలని ప్లాన్ చేశాము. అందుకుగాను పాప్ సింగర్ 'సంజు' ని కాంటాక్ట్ చేశాము కదా! ఆమె ఈ రోజు హైదరాబాద్ వస్తోంది. ఐమీన్ ఈ పాటికి లాండ్ అయి వుండవచ్చు కదా! ఆమెతో ప్లాన్ చేయబోయే యాడ్ ఫిల్మ్ మేకింగ్ మన యాడ్ ఏజెన్సీకే ప్రెస్టేజీగా మారబోతోంది. అయితే ఇంతవరకు ఆ యాడ్ ఫిల్మ్ ఎలా చెయ్యాలో దాని కాన్ సెప్ట్ ఏమిటో....విజువల్స్ ఏవో, ఒక్క విషయం కూడా చెప్పలేదు. అప్పటికీ బాంబే నుండి బీటా కెమెరా, దాని టెక్నిషియన్ పంకజ్ లని రప్పించుతున్నాను. బట్....మిగతా విషయాలు నాకు నువ్వు ఏమీ చెప్పలేదు.