Previous Page Next Page 
మౌనం పేజి 8

    అది కేవలం  తన భ్రమ  అని కూడా  అనుకుంది.

    కాదు....వాస్తవం  అనే ఆలోచనా  వస్తుంది.

    శ్రీశైలం  ఘాట్  రోడ్ లో, ఎక్స్ కర్షన్ కి వెళుతున్న  బస్సు లోయలోకి  దొర్లిపోయింది. పిల్లలంతా  నజ్జునజ్జుగా  నలిగిపోయారు.

    తను మాత్రం  శవంవైపు  చూడలేకపోయింది.

    ఒక మాంసపు  ముద్దకి  వస్త్రాలు  తొడిగినట్లు   వుంది.  రక్తసిక్తమై  వున్న అతని డ్రస్  చూసింది. ఇంక  ముఖంవైపు  చూడలేకపోయింది  ఆమె. తట్టుకోలేని  ఆ మానసిక స్థితిలో ఆమెకు స్పృహ తప్పింది.

    ఆమె మేనమామ  శవాన్ని  ఖననం  చేయించాడు.

    అంత మాత్రాన....

    ఆ పవన్ బ్రతికి వున్నట్లా....

    బ్రతికి  వుంటే  ఏనాడో  తన దగ్గరికి  వచ్చేవాడు  కదా!

    చంపుకోలేని  మమకారం, అతనింకా  బ్రతికి  వున్నాడు అనే అపోహకి  దారి యిస్తోంది....అంతే!

    అదే సమయంలో  ఆమెకు తన భర్త  గుర్తుకువచ్చాడు.

    తన భర్తని  కూడా   ఆమె  ఎంతగానో  ప్రేమించింది. ఇప్పటికీ ప్రేమిస్తోంది. కానీ....

    ఆమె భర్త  గురించి  ఆలోచిస్తున్న  ఆమె తలపులకు  భంగం  కలిగింది.

    కారణం....

    ప్రక్క గదిలో  ఏదో  క్రిందపడిన  శబ్దం  అయింది.

    ఆ శబ్దం  వచ్చిన  దిశగా  తలతిప్పి  చూసిందామె.

    తన కొడుకు గదిలో  నుంచి వచ్చిందా శబ్దం. ఏదో  లోహపు వస్తువు  నేలమీద  పడిన శబ్దం అది.

    ఏదయి వుంటుందా  అని చైర్ లోంచి  లేచి  ఆ గదివైపు  నడిచిందామె.

    గది అంతా నీట్ గా వుంది. కిటికీ  తలుపులు  తెరిచి వున్నాయి.

    దానిలో నుండి  వచ్చే గాలికి గదిలోని  గోడకి  వున్న  మిక్కీమౌస్ ప్లాస్టిక్ కట్  అవుట్ చిన్నగా  శబ్దం చేస్తోంది.

    బెడ్ చుట్టూ  చూసింది.

    ఆమె కేమీ కనపడలేదు.

    గోడ మూల వుండే  టేబుల్ వైపు  చూసింది.

    అక్కడ  వుండాల్సిన  బ్రాస్ ఫ్లవర్ వాజ్ లేదు.

    కొద్దిగా  ముందుకు  వంగి  టేబుల్ క్రింద  చూసింది.

    టేబుల్ క్రింద  పడిన  ఫ్లవర్ వాజ్ కనిపించిందామెకు. గాలికి క్రింద పడిందేమో అనుకుందామె.

    కానీ అంత బరువైన  వస్తువు  ఆ మాత్రం  చిరుగాలికి  క్రిందపడుతుందా?

    ఏమో!

    గోడవైపు  చూసిన  ఆమెకు చిరునవ్వు  తన కొడుకు ఫోటో కనిపించింది.

    కొద్దిక్షణాలు తదేకంగా  ఆ ఫోటోని చూసిందామె.

    సుమారు  రెండేళ్ళ  క్రిందట  తనే తీసిన  ఫోటో అది.

    అది ఆమెకు ఎంతగానో  నచ్చింది.

    తన కొడుకుని  లెక్కలేనన్ని  ఫోటోలు  తీసిందామె. అన్నింటినీ  పద్ధతిగా, డైట్ వైజ్ ఆల్బంలో  పెట్టింది.

    ఆమె కాళ్ళు  అల్మారావైపు  కదిలాయి.

    డోరు తెరిచి  అందులోనున్న  కొన్ని  పుస్తకాలు  ఇటూ అటూ  కదిలించి  వాటి మధ్యలో వున్న  ఒక స్కైబ్లూ కలర్ ఫోటో ఆల్బంని  బయటికి  లాగింది ఆమె.

    అలా ఆగినప్పుడు  ఆ ఆల్బం  క్రింద  నుండి  ఏదో  జారి ఆమె పాదాల మీద  పడింది.

    తల క్రిందికి  వంచి  చూసిన  ఆమెకు నాలుగైదు  మడతలు  పెట్టివున్న ఎర్రని  కాయితం  కనిపించింది.

    ఓ క్షణం  ఆ కాయితంవైపు  నిశితంగా  చూసి, ముందుకు  వంగి  ఆ కాయితాన్ని  అందుకుంది  ఆమె.

    ఆమె చేతివేళ్ళు  ఆ పేపరు  మడతలు  విప్పాయి.

    అందులోని నల్లని  అక్షరాలు చూసిన  ఆమె ఒళ్ళు  జలదరించింది.
   
             "నేను చావలేదు"

    స్పష్టంగా  రాసి వున్నాయి అక్షరాలు.

    అవే అక్షరాలు....అదే హేండ్ రైటింగ్....తన కొడుకు  రాసినట్లుగానే  వున్నాయి అక్షరాలు.

    ఆ పేపర్ తోనే  హాల్లోకి  తిరిగి  వచ్చిందామె.

    అస్తవ్యస్తం  అవుతోంది  ఆమె మనస్సు.

    ఎక్కడిది  ఆ పేపర్? ఎవరు  పెట్టి  వుంటారు? పనిమనిషా! మరెవ్వరూ  ఆ గదిలోకి  అడుగుపెట్టే  ఆస్కారం లేదే? ఎవరు  చేస్తున్నారీ  పని?

    సరిగ్గా  అదే సమయంలో  కరెంటు  వచ్చింది.
    టి.వి. తిరిగి  ఆన్ అయింది.

    రేస్ పూర్తి అయిపోయినట్లుంది. విన్నర్స్ కి  'కప్' అందిస్తున్నారు.

    ప్లాష్ లు వెలుగుతున్నాయి.

    క్లిక్....క్లిక్....మని  ఆ కప్  అందుకునే  దృశ్యాలను  ఫోటోలు తీస్తున్నారు ప్రెస్ ఫోటోగ్రాఫర్ లు.

    ప్రోగ్రాం అయిపోయింది.

    ఏదో ఎడ్వర్ టైజ్ మెంట్  అనుకుంటా....

    ఒక రేసర్  తన తల మీద హెల్మెట్  ధరించాడు.

    భైక్ మీద కూర్చున్నాడు.

    ఒక్కసారిగా  అన్ని  బైక్స్  స్టార్ట్ అయ్యాయి.

    విపరీతమైన  వేగంతో  వెళుతున్న  అతని  బైక్ టర్న్  చేశాడు. అంతే! ఒక్కసారిగా  బైక్ స్కిడ్ అయింది.

    విసిరేసినట్లుగా  క్రిందపడి  ఎనిమిది  పల్టీలు  కొట్టాడతను.

    మోటారు బైక్  తుక్కు తుక్కు  అయిపోయింది.

    కెవ్వుమని  అరిచారందరూ.

    అతని వైపు  పరిగెత్తారు రెస్క్యూ ఆపరేషన్ మనుషులు.

    నిశ్చలంగా పడివున్న అతను  లేచి  కూర్చున్నాడు. హెల్మెట్  తొలగించి  చిరునవ్వు నవ్వాడు.

        "హి ఈజ్ నాట్ డెడ్"

    అనే స్లోగన్ టి.వి. మీద  నాలుగైదుసార్లు  కనిపించింది.

    అతను  చావలేదంటే  'స్టడ్స్' హెల్మెట్  అతన్ని రక్షించింది  అని చెప్తాడతను.

    యాడ్ పూర్తయింది.

    ఉలిక్కి పడిందామె.

    "'హి ఈజ్ నాట్ డెడ్'....అంటే....అతను చావలేదు" అని  అక్షరాలు టి.వి. స్క్రీన్ మీద  కనిపించాయా అనిపిస్తోంది.

    ఏమిటిది? కాకతాళీయమా!

    ఆ అక్షరాలు  కూడా  తన కొడుకు  బ్రతికే  వున్నాడన్న  విషయం చెబుతున్నాయి ఏమో! అనుకుందామె.
   

                       *    *    *    *   

    అప్పటికి  అరగంట  నుంచి బేగంపేట  ఎయిర్ పోర్ట్ పైనే  రౌండ్స్ కొడుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్.

    గ్రాండ్ క్లియరెన్స్  రాలేదు.

    లాండింగ్  పర్మిషన్  రాలేదు.

    విండోలోంచి  బయటికి  చూడసాగింది  సంజు.

    హైద్రాబాద్  మహానగరం  భవనాలన్నీ  చిన్న చిన్న  పేకమేడల్లా ఆమె శరీరం  పులకరించిపోయింది.

    హైద్రాబాద్ లో తనకి  ఎవరూ తెలీదు. బంధువులు ,స్నేహితులు ఎవరూ లేరు.

    ఏదో ఎడ్వర్ టైజింగ్  ఏజెన్సీ  నుంచి  ఓ వ్యక్తి  వచ్చాడు. "ఏదో ఆడియో సిస్టమ్స్ కి యాడ్ ఫిల్మ్ లో నటించాలి" అంటూ  "హైద్రాబాద్ లో దిగగానే  కలుస్తాను" అన్నాడు.

    బహుశా అతను  ఎయిర్ పోర్టుకి  రావచ్చు.

    మ్యూజిక్  ప్రోగ్రాం  ఆర్గనైజర్స్  కూడా  వస్తారు.

    విండో వైపు  నుంచి  ఆమె తన దృష్టిని యిటుగా  తిప్పింది.

    మిడిల్  సీట్లలో  అటువైపు  కూర్చుని  వున్నాడు  ఆ నీగ్రోలాంటి  వ్యక్తి.

    అతను  కళ్ళకు  అడ్డంగా  కూలింగ్ గ్లాసెస్ వున్నాయి.

    అతని దృష్టి  మాత్రం  తన మీదే వుందన్న  విషయం  ఆమెకు అర్ధంమవుతోంది.

    ఎవరతను? ఎందుకలా  తనని  వెంటాడుతున్నాడు? అతనికి  ఏం కావాలి?

    ఫ్లైట్ ఆమ్ స్టర్ డామ్  ఎయిర్ పోర్ట్ లో ఆగినప్పుడు  ప్రయాణీకులు అందరూ  దిగినప్పుడు  అందరితోపాటే  ఆమె కూడా  క్రిందికి  దిగింది.

    నీడలా ఆమెను  వెంటాడుతూ  నడవసాగాడు  అతను కూడా.

    చెప్పలేని  భయం  ఆమెను ఆవరించసాగింది.

    ఒంటరిగా  నడవటానికి  ధైర్యం  చాలక, తన పక్క సీట్లోనే  ప్రయాణించే  యాభయ్ ఏళ్ళున్న  మరో వ్యక్తితో  మాట్లాడసాగింది.

    ఆయనతో  కలిసే  రెస్టారెంట్ లోకి  వెళ్ళింది. స్నాక్స్ తీసుకుంది.

    ఆమెకు  నాలుగు  టేబుల్స్  అవతలగా  చైర్లో  కూర్చున్నాడతను.

    ఆమె ప్రతి  కదలికనీ  పరిశీలిస్తున్నాడు.

    డిన్నర్  పూర్తయిన  తరువాత  "నేను  టాయ్ లెట్ కి వెళ్ళివస్తాను. మీరు ఫ్లైట్ లోకి నడవండి" అన్నాడు ఆ పెద్దమనిషి.

    తిరిగి భయం ఆవహించిందామె.

    లేచి త్వరత్వరగా  నడక సాగించింది.

    ఆమె వెనుకనే  వేగంగా  నడుస్తూ  ఆమెను   సమీపించడానికి  ప్రయత్నిస్తున్నాడతను.

    అతను  చంపాలనుకుంటున్నాడా?   

 Previous Page Next Page