అయామ్ ఇన్ అట్టర్ కన్ ఫ్యూజన్. ఇటువైపు క్లెయింట్ నుంచి నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతోంది. నీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో తప్పనిసరి అయి మన క్రియేటివ్ డైరెక్టర్ ముఖేష్ కి ఈ విషయం ఆలోచించమని చెప్పాను."
"అయామ్ వెరీ సారీ సర్! కేవలం నా మానసికస్థితి సరిగా లేకనే ఈ విషయంలో ప్రోగ్రెస్ చూపలేకపోయాను. అయితే ముఖేష్ ఏమైనా ఐడియా ఇచ్చాడా?"
"ఎస్! ఒక కాన్ సెప్ట్ క్రియేట్ చేశాడు. ఉదాహరణకి ఘంటసాల గారి పాటలు వున్నాయనుకో. ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా ఆయన పాడిన మధురమైన పాటలు మన మధ్య వున్నాయి. అంటే గాయకుడికి మరణం వుంది కానీ గానానికి కాదు. ఆ గానాన్ని మీకు అందించేది రాగమాల....అన్నట్లుగా ఐడియా చేశాడు. అంటే 'నాకు మరణం లేదు' అంటుంది గానం అన్న స్లోగన్ తో మన పేపర్ యాడ్ కాంపెయిన్ మొదలవుతుంది."
ఉలిక్కిపడింది ఆమె.
నాకు మరణం లేదు. నాకు మరణం లేదు.
అన్న మాటలు ఆమె చెవిలో హోరెత్తుతున్నాయి.
"ముఖేష్, న్యూస్ పేపరు యాడ్ కి ఐడియా ఇచ్చాడే కానీ యాడ్ ఫిల్మ్ కి ఇవ్వలేదు. అందువల్ల ముఖ్యమైన ఈ సమస్య సమస్యలాగే వుండిపోయింది. దీనికి నీ సమాధానం ఏమిటి?"
"........"
"చూడమ్మా! నిన్నే అడిగేది. దీనికి నీ సమాధానం ఏమిటి?"
"సర్....అది....నేను....రేపు....చెబుతాను" తడబాటుగా అంది ఆమె.
"రేపా?"
"అవును సార్!"
"కానీ టైం చాలా తక్కువగా వుంది" బి.పి. తారాస్థాయికి చేరుకుంటోంది అతనిలో.
"సర్.... ప్లీజ్! ట్రైటు అండర్ స్టాండ్ మై కండీషన్. నేను వుద్యోగ బాధ్యతలను ఏనాడూ తప్పించుకోలేదు. దయచేసి ఈ ఒక్కరోజు నన్ను వదిలి వెయ్యండి"
"ఐ హోప్ యూ డూది నీడ్ ఫుల్" ముక్తసరిగా అని లైన్ డిస్క్ నెక్టు చేశాడు పిళ్ళై.
ఫోన్ జారవిడిచి ప్రక్కనున్న చైర్ లోకి నీరసంగా జారిపోయింది ఆమె.
ఏమిటీ సంఘటనలు.
నాకు చావు లేదు. నేను మరణించలేదు.
ఇవే మాటలు గత కొద్ది రోజులుగా ఏదో ఒక సందర్భంలో ఎదురవుతున్నాయి. తన కొడుకు పడక గదిలో ఆ కాయితాలేమిటి?
"నేను చావలేదు" అని రాసి వున్న ఆ రెండు కాయితాలు ఎవరుంచారు? ఆ రోజు తన ప్రక్కన ఆగిన కారులో కనిపించిన ఆ కుర్రాడు ఎవరు?
అచ్చుగుద్దినట్టు తన కొడుకులాగే వున్నాడు.
అసలు పవన్ చనిపోయాడా! లేదా!
పవన్ చనిపోలేదు. బ్రతికే వున్నాడు అనే అనుమానం రోజురోజుకీ బలపడుతోంది. అది సాధ్యమా!
ఆలోచనలతో సతమతమవుతున్న ఆమెకు ఓ మార్గం తోచింది. వెంటనే ముందుకు వంగి టెలిఫోను అందుకుని ఒక నెంబరు డయల్ చేసింది.
నిమిషం తర్వాత ఫోను లిఫ్టు చేశారు అవతలి వైపు.
ఆ గొంతు వినగానే ఆ వ్యక్తి ఎవరయినదీ పోల్చుకుంది ఆమె.
"హలో....అంకుల్."
"ఎవరు?"
"నేను అంకుల్....అర్చనవి."
"అర్చనా....ఎలా వున్నావు? వారం రోజులుగా కనీసం ఫోను అయినా చేయలేదు?"
ఆ గొంతులో ఆప్యాయత నిండి వుంది.
"ఐయామ్ ఫైన్ అంకుల్."
"ఏమిటమ్మా....ఏమైనా విషయాలున్నాయా?"
ఒక్క నిమిషం మాట్లాడలేదు ఆమె.
"ఏమయిందమ్మా....ఎనీ ప్రాబ్లం?" ఆ గొంతులో ఆతృత పలికింది.
"నో నో....అదేం లేదు అంకుల్. మీతో కొంచెం మాట్లాడాలి."
"చెప్పమ్మా! ఏమిటి సంగతి?"
"అలా కాదు. ఐమీన్....ఫోనులో కాదు. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి."
"పర్సనల్ గానా!" ఒకింత ఆశ్చర్యం ధ్వనించింది ఆ కంఠంలో.
"దేనికి సంబంధించిన విషయం?" తిరిగి ఆయనే అడిగాడు.
"ఇలా ఫోనులో చెప్పడానికి కుదరదు అంకుల్. వ్యక్తిగతంగా కలిసినప్పుడే మాట్లాడాలి."
ఆ విషయం ఏమై వుంటుందా అని ఆలోచించాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు ఆయన.
"ఇట్సాల్ రైట్....సాయంకాలం ఫ్రీగా వుంటాను. ఇంటికి వచ్చేసేయ్. తీరికగా మాట్లాడుకుందాం" అన్నాడు. ఆమె అడగబోయే విషయం ఏమై వుంటుందా అని కొంత గెస్ చేశాడు.
బహుశా తన భర్త గురించి మాట్లాడుతుంది. ఇంక అంతకంటే ముఖ్య విషయం, పర్సనల్.... ఏముంటాయి?
ఖచ్చితంగా ఆమె భర్త గురించే....
"కాదు అంకుల్....నేను ఇప్పుడే మాట్లాడాలి....అర్జెంట్."
"అర్జెంట్....ఎనీథింగ్ సీరియస్?"
"సీరియస్ కాదు. కానీ అర్జెంట్."
ఒక నిమిషంపాటు ఏ సమాధానమూ చెప్పలేదు ఆయన.
తర్వాత అన్నాడు.
"ఆల్ రైట్....అర్జెంట్ అంటున్నావు కదా! నేను మీ ఇంటి ముందు నుండే రాజ్ భవన్ రోడ్ కి వెళ్లాలి. అలా వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి వస్తాను. బట్....మీ ఇంట్లో ఇరవై నిమిషాలు మించి వుండలేదు సరేనా!"
"సరే....ఇరవై నిమిషాలు కూడా అవసరం లేదు. పది నిమిషాలు చాలు అంకుల్."
"ఓ.కె! ఒక అరగంటలో నేను వస్తున్నాను."
"థాంక్యూ అంకుల్" ఒకింత ఆనందంగా అంది ఆమె.
అవతలివైపు లైన్ డిస్కనెక్ట్ అయింది.
* * * *
ఫ్లైట్ స్టెయిన్స్ మీదగా దిగుతున్న ఆమెకు సరిగ్గా రెండే అడుగుల దూరంలో ఆ వ్యక్తి అనుసరించసాగాడు.
ఆ వ్యక్తి తనకు అతి సమీపంగానే ఫాలో అవుతున్నట్లుగా ఆమెకు తెలుస్తోంది. వెనక్కి తిరిగి ఆమెకు చూడాలంటే ధైర్యం చాలటం లేదు.
అతను ఏం చేయబోతున్నాడో అర్ధంకాలేదు.
నడక వేగం హెచ్చిందామెకి.
అతను కూడా వేగంగా నడుస్తున్నాడు.
ఫ్లైట్ దిగి నడుస్తూన్న పాసింజర్స్ అందరికంటే ముందుగా ఆమె వెనుకగా ఆ వ్యక్తి ఎగ్జిట్ గేటుని సమీపించారు.
ఎగ్జిట్ చెక్ పూర్తికాగానే లాంజ్ లోకి వచ్చిందామె.
ఎందుకంత భయపడాలి? ఎయిర్ పోర్ట్ లో ఎలాగూ పాసింజర్స్ వున్నారు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ మనుషులు వున్నారు. ఇంక భయందేనికి?
అయినా లాంజ్ లో నుండి బయటికి రాగానే తనని రిసీవ్ చేసుకోవటానికి మ్యూజిక్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ వుంటారు. ఆ ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ మనుషులు కూడా వుంటారు. ఇంతమంది వుండగా తను ఎందుకు ఇంత భయపడుతున్నాను. ఒక వ్యక్తి ఏం చెయ్యగలుగుతాడు?
ఇలా ఆలోచించిన ఆమెకు ఒకింత ధైర్యం వచ్చింది.
లగేజి రావటానికి పది నిమిషాలయినా టైం పడుతుంది.
ఆమె లాంజ్ దాటి యివతలకి వచ్చింది.
ఆశ్చర్యం....
ఒక్క మనిషి లేదు అక్కడ.
విజిటర్స్ కానీ, వేరే ఫ్లైట్స్ లో వెళ్ళేపాసింజర్స్ కానీ....ఎవ్వరూ లేరు.
గ్లాస్ డోర్సులోంచి బయటకు చూసిన ఆమెకు టాక్సీలు కానీ, ఆటోలు కానీ, పోర్టర్స్ కానీ కనపడలేదు.
అంతా ఖాళీగా వుంది.
హోంమినిస్టర్ వచ్చాడని కానీ, ఆయన ఫ్లైట్ అప్పుడే టేకాఫ్ అయిందనికానీ, సెక్యూరిటీ కారణాల వాళ్ళ పురుగుని కూడా ఎయిర్ పోర్ట్ దరిదాపుల్లోకి రాకుండా చేశారని కానీ ,పబ్లిక్ ని ఆ పరిసరాల్లోకి వదలటానికి మరికొద్ది నిమిషాలు అయినా పడుతుందని కానీ....ఆమెకు తెలియదు.
మైగాడ్....ఏమిటీ ఎయిర్ పోర్టు....ఇంత నిర్మానుష్యంగా వుంది.
గుండెలు అదిరిపోయాయి ఆమెకు.
తనని రిసీవ్ చేసుకోవటానికి కూడా ఎవరూ రాలేదా!
తల తిప్పి వెనక్కి చూసింది.
ఆ వ్యక్తి ఇరవై అడుగుల దూరంలో వున్నాడు.
మిగతా ప్యాసింజర్లు ఒకరొకరే బయటికి వచ్చి లగేజి కన్వేయర్ దగ్గరికి వెళుతున్నారు.
తన కోసం ఒక్కరయినా రాకపోతారా అనుకుంటూ ఎయిర్ పోర్టు బయటికి వచ్చింది ఆమె.
సరిగ్గా అదే సమయంలో....