"కరెంట్ షాక్ ఇప్పిద్దామంటే వద్దన్నారు. మందులతో కుదరడం అన్నది చాలా కష్టం. కరెంట్ షాక్ ఇప్పిద్దామంటారా?"
"మీ ఇష్టం డాక్టర్! మీకెలాతోస్తే అలా చేయండి."
"రేపు ఉదయం కరెంట్ షాక్ ఇచ్చి చూద్దాం. సాధ్యమైనంతవరకూ గదిలో పెట్టకండి. పిచ్చిముదిరే ప్రమాదముంది. మీలో కలుపుకుని మామూలుగా వుండటానికి ప్రయత్నించండి."
"అలాగే డాక్టర్!"
అతని హార్ట్, పల్స్ చూసి మందులు వ్రాసి పంపించేసి లేచాడు రాజేంద్ర.
ఆస్తిపరుడైన మామగారు లభించడంవల్ల రాజేంద్ర హోదా పెరిగింది. చాలా డిగ్నిఫైడ్ గా తయారయ్యాడు. మామగారిచ్చిన ఖరీదయిన కారులో సూర్యని ఇంటికి తీసుకుపోయి, తన శ్రీమతిని పరిచయం చేశాడు.
కొంచెం సిగ్గుపడుతూ అయినా చేసింది ఆప్యాయంగా వడ్డించింది సులోచన.
"మీ ఫ్రెండ్ మీ గురించే చెబుతుంటాడు ఎప్పుడూ. మీ సాయమే లేకపోతే తన అమెరికా చదువు పూర్తయ్యేది కష్టమయ్యేదంటారు. ఇంకా కొంచెం ఈ వంకాయ కర్రీ వేసుకోండి అన్నయ్య. వంకాయ కర్రీ చేయడంలో నేను స్పెషలిస్టుని. ఇంకొంచెం అన్నం పెట్టుకోండి. కాస్తే తిన్నారు" అంటూ కొసరి కొసరి వడ్డించింది.
"నోరారా అన్నయ్యా అని పిలిచి నాకు చెల్లెలు లేని లోటు తీర్చావమ్మా! ఒకసారి మీ ఆయనతో కలసి మా వూరికి రావాలి. నేనిచ్చే సారే చీరా తీసుకోవాలి" అన్నాడు సూర్య.
"నాకూ అన్నలూ, తమ్ముళ్లూ లేరుగా - ఆ లోటు ఇప్పుడు తీరింది. తప్పక వస్తాం."
ముగ్గురి భోజనాలు అయ్యి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు
తమ స్టూడెంట్ లైఫ్ లోని సంగతులు, అమెరికాలో వున్నప్పటి సంగతులు చెప్పుకున్నారు.
"చాలా లక్కీగా ఈ ఇల్లు దొరికిందిరా. మంచి లొకాలిటీ. ఓనర్ కి ఈ ఇల్లు అమ్మేసే ఉద్దేశ్యం వున్నట్టు తెలిసింది. లక్ష అటు ఇటుగా అయినా సరే కొనేద్దాం అనుకుంటున్నాను. కన్ స్ట్రక్షన్ కూడా కొత్తదే. రెండు సంవత్సరాలైందట కట్టి."
"ఈ ఇల్లు కొనడం కాదు. అసలీ ఇంట్లో అద్దెకు కూడా వుండొద్దు. వెంటనే ఖాళీ చేయి. లేకపోతే చాలా నష్టపోతావు" అన్నాడు సూర్య.
"ఏంట్రా? వాస్తు బాగాలేదా ఈ ఇంటికి? నాకేమీ అలాంటి మూఢనమ్మకాలు లేవు."
"మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. వెంటనే ఖాళీ చెయ్యండి."
"ఈ ఇంట్లో ఆరునెలల నుండి వుంటున్నాం. మాకేం కాలేదు. పిచ్చి పిచ్చి అనుమానాలతో ఈ ఇల్లు పోగొట్టుకుంటే మళ్లీ ఇంత మంచి ఇల్లు దొరకడం కష్టమవుతుంది."
"అనుమానం కాదు నిజం. ఇంటికంటే మనిషి జీవితం ముఖ్యంరా! నువ్వు వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేయి."
"చూద్దాం......."
"చూస్తానంటే కాదు. ఖాళీ చేస్తానని నాకు మాటివ్వు."
"అలాగేగానీ.... నువ్వెందుకిలా చెబుతున్నావో నాకు చెప్పాలి..... నాకు వాస్తు పట్టింపులు లేవు. దేవుడు, దెయ్యం మూఢనమ్మకాలు అసలు లేవు."
"ఎందుకు.... ఏమిటి అని అడగొద్దు. నువ్వు ఈ ఇల్లు విడిచి పెట్టాలి. అంతే!"
"ఈ ఇల్లు మంచిది కాదేమో రాజు! నాక్కూడా ఏవో పీడకలలు వస్తుంటాయి." సులోచన అంది.
"నాన్సెన్స్ కలలన్నవి మన ఆలోచనలకు దర్పణాలు, అంతే! అంతకుమించి ఏంలేదు."
"ఎవరో వచ్చి మనల్ని పొడిచేస్తున్నట్లుగా, గొంతు పిసుకుతున్నట్లుగా కలవస్తే, అవి మన ఆలోచనలకి దర్పణం ఎలా అవుతుంది?" అంది.
"మనలో మనకే తెలీని భయాలుంటాయి. అవే ఈ కలలు రావడానికి కారణమౌతుంటాయి.
"నేనూ డాక్టర్నే రాజూ! నాకూ తెలుసు కలల గురించి, మనసు గురించి. అన్నిటినీ మనం చదివిన శాస్త్రాలకు ముడిపెట్టి ఆలోచించడం కూడా మూర్ఖత్వమే. మనకి తెలీని అతీత శక్తులున్నాయి."
"ఎక్కడ?"
"మన లోపలా, వెలుపలా?"
"నీకా పల్లెటూరి జిడ్డు బాగా పట్టినట్టుందే! నువ్వు చాలా మారిపోయావురా? నవ్వుతూ, తుళ్లూతూ వుండేవాడివి. ఇప్పుడేదో పర్వతం మోస్తున్నట్లుగా సీరియస్ ఫేస్. మారిపోయావనడంకంటే పాడై పోయావనడం కరెక్ట్ గా వుంటుందేమో!"
"ఏమైనా అనుకోరా. నీ ఇష్టం. మరి నే వస్తాను. చెల్లెమ్మా! వస్తాను. వీడేమో నా మాట వినడంలేదు. అనర్దం జరక్క తప్పదేమో! బుద్ది ఖర్మానుసారిణి. ఏం చేస్తాం. అన్నయ్య అని పిలిచావు. ఏ అన్నయ్యా తన చెల్లెలికి ఆపద వస్తుందంటే, పట్టనట్టుగా వుండడుకదా! ఈ ఇంట్లో రక్తపాతం జరగబోతోంది. చివరి క్షణంలో నైనాసరే నన్ను తలచుకుంటే నేనే నిన్ను కాపాడుకుంటాను. వస్తానమ్మా!"
"నీకేదో నరాల బలహీనత వున్నట్టుంది. ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావే ఇంత ఎకాయెకీ నువ్వు నువ్వు దేవుడివి ఎప్పుడై పోయావురా?" రాజేంద్ర ఎగతాళి చేశాడు.
"నువ్వే నన్ను దేవుడిగా పూజించేరోజు వస్తుందిరా రాజూ! అదీ త్వరలోనే. చూడు! ఉదయం నీ డిస్పెన్సరీ కి వచ్చిన వున్మాద పేషెంట్ కి కరెంట్ షాక్ ఇద్దామన్నావుకదా! కరెంట్ షాక్ ఇస్తే వాడు చచ్చి వూరుకుంటాడు. ఆ పని చేయవద్దు."
"మరేం చేయాలంటావు?" ఆశ్చర్యపోయాడు రాజేంద్ర.
"శేఠ్ భుజాల మీద ధనపిశాచం కూర్చుని అతడిచేత ఆ వికృతచేష్టలు చేయిస్తున్నది. వాళ్లకీమధ్య లంకెబిందెలు దొరికాయేమో అడుగు. దొరికితే అవి ఇంట్లో పెట్టుకోకుండా తీసుకుపోయి ఏ తిరుపతి హుండీలోనో వేసేయమను. శేఠ్ గారికి పట్టిన ధనపిశాచం వదిలి మామూలు మనిషై పోతాడు. లేదంటే ఇంట్లో వరుసగా అందరూ పిచ్చివాళ్లయి బట్టలు చింపుకుని రోడ్లమీద పడతారు. అప్పుడు ఆ దొరికింది అనుభవించడానికి ఎవరూ మిగలరు."
"ముందు నిన్ను మెంటల్ హాస్పిటల్ లో వేసి కరెంట్ షాక్ లు పెట్టిస్తే బావుంటుందనిపిస్తుంది. లేకపోతే శుభ్రంగా మెడిసిన్ చేసి ఎరుకలి గద్దెచెప్పేవు."
"అన్నయ్య మాటలు నిజమో కాదో తెలుసుకుంటే పోలా?"
"సరే! ఒక్క నిముషం ఆగరా! నువ్వుండగానే ఈ విషయం తేల్చేస్తాను" అంటూ ఫోన్ అందుకున్నాడు రాజేంద్ర.
"హలో.... ఎవరూ ఘనశ్యామా! మీ ఇంట్లో ఇటీవల చెప్పుకోదగిన సంఘటన ఏదైనా జరిగిందా? అంటే మీ ఫాదర్ మెంటల్ కాకముందు ఏం జరుగలేదా? జరిగింది చూడండి. మీకు లంకెబిందెలు దొరికాయి. జోక్ కాదు. నిజంగానే. ఇక్కడొక జ్ఞాని చెబుతుంటే, కన్ ఫం చేసుకుందామని ఫోనే చేశాను. ఓ. కె. వుంటాను " రాజేంద్ర ఫోన్ పెట్టేసి సూర్యకేసి తీక్షణంగా చూశాడు.
"లంకెబిందెలు గింకెబిందెలు ఏం దొరకలేదు. ఇకపై ఇలా పిచ్చి పిచ్చిగా వాగడం మానేయ్. అసలు నీకేమైంది? పిచ్చెక్కిందా? లక్షణంగా వుండేవాడివి. చదువులో మాకంటే ముందుండేవాడివి. ప్రొఫెసర్లచేత ఎన్నో సందర్భాలలో జీనియస్ అనిపించుకున్నావు. నిన్ను చూస్తూ నీ బాటలో నడిచేవాళ్లం మేము. నిన్ను చూస్తే బాధఘా వుంది లెటర్స్ కి రిప్లయ్ ఇవ్వనప్పుడే వాడికేదో అయిందని అనుకున్నాం. సుమీత్ ని పిలుస్తాను. ఇద్దరం కలిసి ఆలోచించి నీ విషయంలో ఒక నిర్ణయానికి వస్తాం. నీ పిచ్చి కుదిర్చే మార్గం అన్వేషిస్తాం."
"నేను చెప్పాల్సింది చెప్పాను. ఇహ నీ ఇష్టం. స్నేహితుడిగా నా బాధ్యత నిర్వర్తించానన్న తృప్తి నాకుంది. వస్తాను. వస్తానమ్మా!'
పాతకాలంనాటి డొక్కుజీపులో కూర్చుని సెలవు తీసుకుని వెళ్లిపోతున్న సూర్యని జాలిగా చూశాడు రాజేంద్ర.
ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు.
రాజేంద్ర డ్రైవ్ చేస్తున్న కారు క్రింద ఒక పిల్ల పడింది. ఆ పిల్ల రక్తపు మడుగులో కొట్టుకుంటుండగానే రాజేంద్ర కారును మెరుపులా పోనిచ్చాడుత. ఒక్క నిముషం ఆగినా కోపోద్రిక్తులైనా జనాల చేతుల్లో అతడి కారు పచ్చడి అయిపోయేది. అతనిని కొట్టేవాళ్లు. ఆ ప్రమాదం వూహించి వెంటనే కారును పోనిచ్చాడు.
కానీ ప్రమాదం తప్పిపోలేదు. అతడి వెన్నెంటే వచ్చింది.
మూసివున్న తలుపుల్ని దబదబా బాదారు. ఇంటి ముందు ఆగిన కారు అద్దాలు పగులగొట్టి డొక్కుకింద మార్చారు. ఫోన్ చేసి పోలీసుల్ని పిలిచే లోగానే తలుపుల్ని విరగ్గొట్టుకుని లోపలికి జొరబడి రాజేంద్రనీ చుట్టుమూట్టారు.
వాళ్ల చేతుల్లో అతడు రక్తపుముద్దగా మారిపోతుంటే, సులోచన అడ్డువెళ్లింది. ఆమెను ఒక్కతోపు తోసేసారు. బోర్లాపడింది. అప్పుడామెకి అయిదోనెల గర్బం ఎవరో పిండాన్ని కసిగా పెకిలించి వేసినట్లుగా కడుపులో బ్రహ్మాండమైన నొప్పి ప్రారంభమయింది. తన కళ్లముందే తన భర్త నేలకొరుగుతుంటే కడుపు చించుకుని కడుపులోని పిండం బయటకు వస్తున్నట్లుగా నొప్పి వస్తుంటే గిలగిల్లాడుతూ స్పృహ తప్పుతున్నట్లుగా అనిపిస్తుంటే "అన్నయ్యా! జయసూర్య అన్నయ్యా" అని కేక పెట్టింది గావుకేక.
* * * * *
ఒక గంట తరువాత ఒళ్లంతా బేండేజీతో హాస్పిటల్ బెడ్ మీదున్నాడు రాజేంద్ర.
సులోచనకి అబార్షన్ అయ్యి ఆమే అదే హాస్పిటల్ లో బెడ్ మీదుంది.
ఎంతకీ ఆగని రక్తస్రావం.
డాక్టర్లు చేసే ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. వాళ్లు ఆశ వదిలేశారు.